తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మళ్లీ కవిగానే పుడతా... తెలుగు దేశంలో మాత్రం కాదు!!

  • 2184 Views
  • 17Likes
  • Like
  • Article Share

    అన్వర్‌

  • హైదరాబాదు
  • 8008709985

వెండితెరపై తనికెళ్ల భరణిని చూస్తే... 
కావాల్సినన్ని నవ్వులు! 
నిజ జీవితంలో భరణిని కదిలిస్తే... 
సమాధానాలు లేని ప్రశ్నలు!
ఆయన బాధ, ఆవేదన.. అచ్చంగా మన భాష కోసం.
అక్షరంతో స్నేహం చేసి, భాషను ప్రేమించి, పుస్తకంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి భరణి. కవిగా, రచయితగా, ఓ భాషాభిమానిగా భరణిని కదిలిస్తే... ఇలా తన సాహితీ ప్రపంచంలోకి తీసుకెళ్లారు.  

      ‘‘పుస్తకం నాకు ప్రాణవాయువు లాంటిది. అది లేకపోతే బతకలేను. పుస్తకాల్లేని గదిలో ఒంటరిగా నన్ను ఒక వారం వదిలేస్తే... బహుశా చచ్చిపోతానేమో?  
      అక్షరంతో స్నేహం, పుస్తకాలతో నా ప్రయాణం ఇప్పటిది కాదు. ఊహ తెలిసినప్పుడే మొదలైంది. మా ఇల్లు మారువేషం వేసుకున్న గ్రంథాలయంలా కనిపిస్తుండేది. సాహితీ చర్చలు జరిగే సభలా తోచేది.  
      ఇప్పటికీ పెద్దన్నయ్య ఎప్పుడు ఫోన్‌ చేసినా ‘‘ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావ్‌’’ అని అడగడు. 
      ‘‘ఫలానా పుస్తకం చదివావా? ఈ రోజు పేపర్లో ఫలానా విషయం మీద వార్త రాశారు. కత్తిరించి జాగ్రత్తగా పెట్టుకో..’’ అంటాడు. 
      నా గురించి చెప్పే ముందు మా కుటుంబం గురించి చెప్పాలి. మేం ఏడుగురు అన్నదమ్ములం. నాన్న సాహితీ ప్రియులు. ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ‘కుమార సంభవం, మేఘసందేశం’ కావ్యాలను పెద్దగొంతుతో రాగయుక్తంగా బయటికి చదివేస్తుండేవారు. అవి కాస్తా చెవికెక్కేసేవి. అప్పట్లో అర్థం తెలియకపోయినా ఆ శ్లోకాలన్నీ కంఠతా వచ్చేసేవి. వయసొచ్చాక, కాస్త జ్ఞానం ఆర్జించాక ఆ కావ్యాలను మళ్లీ చదివి అర్థం చేసుకున్నప్పుడు, ‘వార్నీ వీటిలో ఇంత విషయం ఉందా?’ అనిపించేది. 
      పెద్దన్నయ్య గది నిండా పుస్తకాలే. తనకో సొంత గ్రంథాలయం ఉండేది. రెండో అన్నయ్య కమ్యూనిస్టులకు ఇష్టుడు. ఆయన దగ్గరున్నవన్నీ ఎర్ర పుస్తకాలే. అన్నయ్య దయవల్ల లెనిన్‌లాంటి మహానుభావుల పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. మూడో అన్నయ్య ఆంగ్ల సాహిత్య ప్రియుడు. ఆ భాష మీద ఎంత పట్టంటే... చదువుతూ చదువుతూనే తెలుగు అనువాదం కూడా రాసేసేవాడు. అలా రెండు నేర పరిశోధన నవలల్ని అనువదించాడు. పుస్తకం అంటే పిచ్చి. పొట్లాలు కట్టిన పేపర్ని కూడా వదిలేవాడు కాదు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? సైకిల్‌ తొక్కుతూ తొక్కుతూ కూడా పుస్తకం చదివేవాడు. వాడెక్కడ పడిపోతాడో అని భయపడి చచ్చేవాళ్లం. ఇంకో అన్నయ్యకు కవిత్వం అంటే మక్కువ. వేటూరి భావజాలానికి ఆయన శైలి దగ్గరగా ఉండేది. మా ఇంటికెదురుగా మలయాళీ కుటుంబం ఉండేది. పొద్దుటే కుటుంబమంతా చంద్రశేఖర అష్టకం చదివేవారు. ఓ చెవి అటేసేవాణ్ని. అవీ నాలో ఇంకిపోయాయి. భోజనాల వేళ ‘మునక్కాడ కూర ఎలా ఉంది? మాగాయ పచ్చడెలా కుదిరింది’ అని కాకుండా పుస్తకాల గురించే మాట్లాడుకునేవాళ్లం. అందుకే బ్రహ్మానందం ఇప్పటికీ అంటుంటాడు  
- ‘మీ అన్నదమ్ములంతా కలిసి కూర్చున్నప్పుడు నన్నూ కాస్త పిలు’ అని. 
      ఎందుకంటే మా మధ్యెప్పుడూ సాహితీ కబుర్లే. తిరుపతి వేంకట కవుల్లో తిరుపతి శాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, విశ్వనాథ సత్యనారాయణ... మాకు దగ్గరి బంధువులే. కుటుంబంలో సాహిత్యం అంతర్వాహినిగా మారిపోయింది. 
‘చందమామ’కోసం గొడవలు
తెల్లవారు జామున తెలుగు పాఠాలతో నా రోజు మొదలయ్యేది. పరబ్రహ్మశాస్త్రిగారని మా దూరపుబంధువు. ప్రతిరోజూ పొద్దుటే వచ్చి సంస్కృత పాఠాలు చెప్పేవారు. ‘అమరకోశం’ పుటలు తిరిగేసే అవకాశం అలా వచ్చింది. ‘అమరం రానివాడికి నేనమరను’ అని సాక్షాత్తూ సరస్వతీదేవే చెప్పిందట. అంత గొప్ప గ్రంథమది. నానార్థాలు, పర్యాయపదాలు కంఠతా వచ్చేయడం ‘అమరకోశం’ పుణ్యమే. చందమామ, బాలమిత్ర పుస్తకాలు చిరిగిపోయేలా చదివేసేవాళ్లం. ఇంటికి చందమామ వస్తే.. ఎవరు ముందు చదవాలి అనే విషయంపై పెద్ద గొడవే జరిగేది. చందమామ నా దృష్టిలో అతి గొప్ప బాల సాహితీ పత్రిక. ప్రతీ కథలోనూ ఓ నీతి.. ఓ సూక్తి ఉండేవి. పత్రిక కూడా పలక సైజులో ముద్రించేవారు.  
      ‘ఎందుకూ...’ అని చక్రపాణి గారిని అడిగితే ‘పలకతోపాటు బడికి తీసుకెళ్లేంత సంస్కారం ఉన్న పత్రిక కాబట్టి’ అన్నారోసారి. అది అక్షరసత్యం.  
      హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల్లో నేను అడుగుపెట్టని గ్రంథాలయం లేదు. చూస్తే సినిమా, లేదంటే పుస్తకం.. ఇవే నా ప్రపంచాలు. గ్రంథాలయానికి వెళ్తే ‘మీరు చదవని పుస్తకం లేదండీ.. కొత్త పుస్తకాలొచ్చినప్పుడు మేమే కబురంపుతాం..’ అంటూ బయటినుంచే పంపేసేవారు.  
అదే స్ఫూర్తి
ఇక నా రచనా వ్యాసంగం విషయానికొస్తే.. ఏడో తరగతి నుంచే కవిత్వం ముక్కలు ముక్కలుగా రాసి, పత్రికలకు పంపేవాణ్ని. అలా కొన్ని ‘ఈనాడు’కీ పంపా. అచ్చు కాలేదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆపద్ధర్మ రచయితగా మారాల్సి  వచ్చింది. ఆ రోజుల్లో నాటకాలు వేసేవాళ్లం. ‘అద్దె కొంప’ అనే నాటిక రాయాల్సొచ్చిందోసారి. అది నా తొలి రచన. దానికి నాటకపోటీల్లో మొదటి బహుమతి వచ్చింది. అదే నాలో ‘రాయాలి..’ అన్న స్ఫూర్తిని నింపింది. అప్పుడప్పుడూ కవి సమ్మేళనాలకీ వెళ్తుండేవాణ్ని. నా తొలి కవి సమ్మేళనం బాగా గుర్తు... సికిందరాబాదు జేమ్స్‌ స్ట్రీట్‌ దగ్గర. వందమంది యువకవుల సమ్మేళనం అది. వరస క్రమంలో నేను 98వ వాణ్ని. కవి అంటే ఓ లాల్చీ పైజామా వేసుకోవాల్సిందే అనుకొనేవాణ్ని. నేను లాల్చీ, జీను ప్యాంటు వేసుకెళ్లా. అప్పటినుంచీ నాకు ఆ వస్త్రధారణ అలవాటైంది. కవిపై రాసుకున్న కవిత్వం అది. తొలి పంక్తులు గుర్తులేవుగానీ.. 
      ‘‘కలం తప్ప దమ్మిడీ/ బలం లేనివాడు/ హలం తప్ప అంగుళం/ పొలం లేనివాడు/ గడ్డం మాసినవాడు/ గుడ్డలు మాసినవాడు/ తలమాసినవాడుగా/ సమాజం వెలివేసిన వాడు’’ అంటూ ఉద్వేగంగా చదివేశా. కవిత పూర్తవగానే చప్పట్లు మార్మోగిపోయాయి. శాలువాలూ, ఫొటోలూ.. పొగడ్తలూ వెరసి ‘కవిత్వం ఇంత కిక్కు ఇస్తుందా?’ అనిపించింది. 
‘‘అయితే.. కవే అవ్వాలి’’ అనిపించింది. ‘తనికెళ్ల భరణి- కవి’ అనే బోర్డు పెట్టుకోవాలి అని అప్పుడే గట్టిగా అనుకున్నా.  
      శ్రీశ్రీ చనిపోయాక ‘మరో ప్రపంచానికి శ్రీశ్రీ మహాప్రస్థానం’ శీర్షికతో ఓ వ్యాసం రాశా. అది అచ్చులో చూసుకొన్నాక నాకు నేనే వీరతాళ్లు వేసుకొన్నా. బీకాం థర్డ్‌ క్లాస్‌లో పాసైనవాడికి ఉద్యోగాలేమొస్తాయి? అందుకే రాయడం, చదవడం తప్ప వేరే వ్యాపకం పెట్టుకోలేదు. ఏదో మనసుకు తోచింది రాసి, పత్రికలకు పంపేవాణ్ని. అచ్చయిందేమో అనే ఆశతో ప్రతీరోజూ దినపత్రికలన్నీ తిరగేసేవాణ్ని. అలా నేను రాసిన కవిత ‘అగ్గిపుల్ల ఆత్మహత్య’...  
      ‘‘అగ్గిపెట్టె పుల్లల్ని/ కడుపులో దాచుకొంది/ ఒకొక్కటీ బయటకెళ్లి/ భగ్గుమన్నాయి/ ఒక పుల్ల మాత్రం/ ఓపెన్‌ అయిన బాటిల్‌/ అంచున నిలబడి/ ఒళ్లుమండి లోపలికి దూకింది -/ బుస్స్‌స్స్‌స్స్‌ మంటూ/ వెలిగిన ఆ బ్లూ మంటలో/ డెవిల్స్‌ని తోలేస్తూ తూలిపోయింది’’... ఆంధ్రజ్యోతిలో ఇది అచ్చయిందని తెలిసింది. కానీ కొనడానికి డబ్బుల్లేవు. పత్రిక మాత్రం పాన్‌ షాపుకి వేలాడుతూ కనిపించింది. ఆ కొట్టువాడితో ‘అన్నా నా కవిత అచ్చయిందట.. ఉంటే కొంటా’ అని అభ్యర్థనగా అడిగా. అతను జాలిపడి ‘సరే’ అన్నాడు. పేజీలు గబగబా తెరిచిచూస్తే.. కవిత కనిపించింది. కింద తనికెళ్ల భరణి అన్న పేరుని తాకా. భూగోళాన్ని కబ్జా చేసినంత ఆనందం.  
నెలకో పుస్తకం రాయాలి
ఉద్యోగ నిరుద్యోగ విజయాల్లో భాగంగా అమృతవాణి కమ్యూనికేషన్‌ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. అందులో ధర్మవిజయం అనే విభాగంలో పనిచేసేవాణ్ని. నా పనేంటంటే.. సామాజిక అంశంపై నెలకో పుస్తకం రాయాలి. వీరేశలింగం, గురజాడ, గాంధీ ఇలాంటి మహనీయులపై చిన్న చిన్న పుస్తకాలు రాశా. ‘గొయ్యి’ అనే నాటికా అక్కడ రచించిందే. అది అక్కడ ఏడంతస్తుల భవనం. రెండో అంతస్తులో పెద్ద గ్రంథాలయం. ఎవరూ వచ్చేవాళ్లుకారు. అన్ని పుస్తకాలూ నాకే సొంతమన్నమాట. పొద్దుటే వెళ్లి సంతకం పెట్టి ఓ పుస్తకం అందుకొనేవాణ్ని. మధ్యాహ్నం భోజనానికి గంట విరామం. మళ్లీ మరో పుస్తకం. అక్కడే ఆముక్తమాల్యద లాంటి ప్రబంధాలన్నీ తిరగేసే అవకాశం దక్కింది. క్రమంగా చదవడం వ్యసనంగా మారింది. బస్సులో వెళ్తూ.. విజయవిలాసం చదవడం నాకు గుర్తు. నన్నంతా ఆశ్చర్యంగా చూసేవాళ్లు.  
      చదివిన వేలాది పుస్తకాల్లో ‘ఏడు తరాలు’ బాగా కదిలించింది. దాన్ని బ్లాక్‌ బైబుల్‌ ఎందుకంటారో చదివిన తర్వాతే తెలిసింది. చదువుతూ చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చేశాను. అదిచూసి నా పక్కాయన ‘‘ఏం సార్‌... అట్టా ఏడుస్తున్నారు పుస్తకం బాగాలేదా’’ అని అడిగాడు అనుమానంగా. 
      ‘‘బాగా లేకపోవడం ఏమిటి? చాలా బాగుంది’’ అన్నాన్నేను కళ్లు తుడుచుకొంటూ. 
      ‘‘బాగుంటే ఏడవడం మొదటిసారి చూస్తున్నానండీ’’ అన్నాడు. 
      అర్ధరాత్రి రెండింటికి రెండోసారి ఆ పుస్తకం తెరిచి.. ఇంకోసారి చదివా. ఈసారి ఏడుపు ఇంకా ఎక్కువైంది. 
      మా అమ్మ బయటికి వచ్చి.. ‘‘ఏంట్రా ఏడుస్తున్నావ్‌?’’ అంది కంగారుగా. 
      ‘‘ఏడు తరాలు చదువుతున్నా... ఎందుకో ఏడుపొచ్చేస్తోంది’’ అన్నాను. 
      ‘‘ఏడు... అది కచ్చితంగా ఏడవదగిన పుస్తకం’’ అని వెళ్లి పడుకొంది. నన్ను బాగా కుదిపేసిన నవల అది. మనిషన్నవాడు చదవాల్సిన నవల కూడా అదే. ఓసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడో ఆఫ్రికన్‌ కుటుంబం పరిచయం అయింది. మాటల మధ్యలో ‘ఏడు తరాలు’ ప్రస్తావన వచ్చింది. ‘మీరు మాకోసం రాసిన పుస్తకాలూ చదువుతారా’ అన్నాడొకాయన. నేనేమో ఆ పుస్తకం విశిష్టత చెప్పా. నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాడు.  
లాలస కోసం భీమిలి వెళ్లా
కొన్ని పుస్తకాలు నన్నెంత ప్రేరేపించాయంటే.. కొంతమంది మనుషుల్ని ప్రేమించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి తీసుకెళ్లిపోయాయి. చాలామంది హిట్లర్‌ అనగానే ఛీ కొడతారు. నేను మాత్రం అతని సమాధి చూడ్డానికి జర్మనీ వెళ్లా. ఎందుకంటే నామట్టుకు నాకు హిట్లర్‌ ‘పరిశీలించదగిన ఓ అద్భుతం’ అనిపిస్తుంది. వేలమందిని చంపినా, వాడొక విచిత్ర అద్భుత శక్తి. 
      ‘జీవితాదర్శం’ నవలలో లాలస స్నానం చేసిన తీరు అద్భుతంగా వర్ణిస్తారు చలం. అది చదివి నేనెంత ప్రేరణ తెచ్చుకున్నానంటే.. లాలస నీళ్లాడిన ప్రదేశం చూడ్డానికి భీమిలి వెళ్లా. అది కల్పన అని తెలుసు. లాలస లేదనీ తెలుసు. కానీ.. అదో పిచ్చి. 
      ‘గులాబి అత్తరు’ కూడా నన్నంతే కదిలించింది. దిల్లీ నుంచొచ్చిన సాయిబు కోటగోడకు కొట్టిన అత్తరు బుడ్డీ వాసన కోసం ఆ కథలో వర్ణించిన ప్రాంతానికి వెళ్లానంటే నమ్ముతారా? ప్రతి పుస్తకంతోనూ, ప్రతి రచయితతోనూ ఇలాంటి అనుభవాలూ అనుబంధాలే ఉన్నాయి. 
      ఈ దశాబ్దంలో చదివి తీరాలి అనిపించే కథ ఎవరూ రాయలేదు. చూసి తీరాల్సిందే అనే సినిమా కూడా ఎవరూ తీయలేదు. కవిత్వం ఇక పట్టించుకోనక్కర్లేదు. ఇప్పటికీ శ్రీశ్రీ ‘ప్రస్థానం’, తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకాలే దిక్కు.
నాటక రచనలోనే సంతృప్తి
ఓ దర్శకుడు మా ఇంటికొచ్చి నా గ్రంథాలయం చూశాడు. ‘‘సినిమా రచయిత కావాలంటే ఇవన్నీ చదవాలా?’’ అని అడిగాడు. ‘‘అప్పుడు మేం చదవాల్సివచ్చింది నాయనా, మీకు పుస్తకాలు అక్కర్లెద్దు సీడీలు చాలు’’ అన్నాను నేను. 
      ఏ సినిమా చూసినా అంతే కదా? నాలుగైదు ఇంగ్లీషు డీవీడీలు చూసి కథలు, సన్నివేశాలూ అల్లేస్తున్నారు. నా వరకూ నేను యాభై సినిమాలకు రచన చేశా. అయితే.. నా కోసం నేను రాసుకోవడం వేరు, సినిమాలకు రాయడం వేరు అనిపించింది. సినిమా అంటే అనుక్షణ అష్టావధానమే. నేను నా కోసం బతకడానికి, ఇంకొకళ్ల కోసం బతకడానికి ఎంత తేడా ఉందో.. నేను నా కోసం రాసుకోవడానికి, సినిమాకి రాయడానికీ అంతే తేడా ఉందనిపించింది. 
      నేరం సినిమాపై ఆపాదించను. సినిమా అనేది కోట్ల వ్యవహారం. నాకిష్టం వచ్చినట్టు రాస్తానంటే కుదరదు. వాళ్లకు ఇష్టం వచ్చినట్టు రాయాలి. సినిమాలకంటే నాటక రచనే ఎక్కువ సంతృప్తినిచ్చింది. నా ‘గార్దభాండం’ నాటకాన్ని లెనిన్‌ భవన్‌లో వేశాం. భోజనాల వేళలో నాటకం మొదలెట్టాం. అందుకే ఇద్దరో ముగ్గురో ఉన్నారు. చివర్లో పైనున్న కంచాల చప్పుడు వినిపించింది. ‘ముగింపు లేని కథ’కెన్ని సన్మానాలో ఇంకెన్ని సత్కారాలో. తొంభై ఎనిమిదిసార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించాం. కృష్ణశాస్త్రి చూసి ‘కిటికీలోంచి జీవితం చూసినట్టు ఉందండీ’ అన్నారు. ‘నాకు తెలిసి తెలుగునాటక చరిత్రలో అంత సహజమైన నాటకం చూడలేద’ని పొగిడేశారు. ‘కొక్కొరొక్కో, గోగ్రహణం, చల్‌చల్‌గుర్రం’.. ఇలా గుండెల్ని తీపి గుర్తులతో నింపేశాయి. 
      నాకు మూడే మూడు కోరికలు. అందులో ఒకటి.. నాకంటూ ఓ సొంత గ్రంథాలయం ఉండాలని. అది తీరిపోయింది. మా ఇంట్లో ఓ పెద్దహాలు.. పుస్తకాలతో నిండిపోయింది. ఇప్పుడు కోరికలు లేవు. ఆశయాలే. తెలుగు సినిమా.. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైతే పంచె కట్టుకుని తెలుగులో మాట్లాడాలి. అదెప్పటికి తీరుతుందో! 
ఇక్కడే ఆ దుస్థితి
రచయితగా నా మీద చాలామంది ప్రభావం ఉంది. కానీ ఎవరినీ అనుకరించలేదు. నా శైలి చూసి ‘భరణి కవిత్వంలో అక్షరాలకంటే చుక్కలు, ఆశ్చర్యార్థకాలు’ ఎక్కువగా ఉంటాయని ఒకావిడ చమత్కరించారు. నాకు నిశ్శబ్దం అంటే ఇష్టం. ఎందుకంటే నేను మైమ్‌ నేర్చుకొన్నా. పిల్లలకు పాఠాలూ చెప్పా. నేను తీసిన ‘ఇంక్‌’ అనే లఘుచిత్రంలో ఒకట్రెండు తప్ప మాటలుండవు.  
      ‘‘అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం’’ అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.  
      వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు. 
      గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే.. తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే.. ‘అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు.. ఆయనేనా?’ అని అడుగుతారు. మనకు అంతే తెలుసు. 
      కవులు బతికుండగా చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.. వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి.. పార్లమెంటుకు కూడా పంచె కట్టుకొనే వెళ్తారు.  
తెలుగుకు ఆ శక్తి ఉంది...
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటుచేశారు. అందులో ఓ రచయిత ‘‘తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్‌’’ అని ఆవేదన వ్యక్తం చేశారట.
      ‘‘తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది’’ అన్నారట పీవీ. 
      అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం  ఎదురుచూద్దాం’’ 


వెనక్కి ...

మీ అభిప్రాయం