తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

భాష ఆకర్షిస్తుంది ప్రేమలో పడేస్తుంది!

  • 367 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఇంజినీరింగ్‌లో డాక్టరేట్‌ చేసినా తెలుగు సాహిత్యాన్ని లోతుగా చదివిన ఆయన, అప్పట్లో అధ్యాపకుడిగా పిల్లలకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు హాస్యనటుడిగా తెలుగువారందరికీ నవ్వులు పంచుతున్నారు. ‘‘బూతు జోకులతో విరిసే నవ్వులు కాసేపే గుర్తుంటాయి. ఆరోగ్యకరమైన హాస్యమే పదికాలాలపాటు నిలబడుతుంది’’ అనే ఆయనే ‘గుండు’ సుదర్శన్‌గా సుప్రసిద్ధులైన సూరంపూడి సుదర్శన్‌ రావు. ‘అమ్మ ఎలాంటిదో అమ్మభాష కూడా అలాంటిదే’ అనే సుదర్శన్‌తో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..  
నాటకాల మీద ఆసక్తి ఎలా మొదలైంది?
 
మాది ప.గో.జిల్లాలోని చిన్న పల్లెటూరు. పక్కనే ఉన్న కొంచెం పెద్ద ఊరు అత్తిలి. నాటకాల మీద ఆసక్తి నాకు చాలా విచిత్రంగా మొదలైంది. చిన్నప్పుడు ఇంట్లో కథలు చెబుతుండేవారు. పేదరాసి పెద్దమ్మ, చందమామ, కాశీమజిలీ కథలు చెబుతుంటే శ్రద్ధగా వింటుండేవాణ్ని. ఆ కథల్లోని పాత్రలకు తగినట్లు ఇంట్లో ఉన్న బట్టలు, కాటుక, కుంకుమతో వేషం వేసి సరదాగా పిల్లలతో ఆడుకునే వాణ్ని. అలా తెలియకుండానే తెలియని వయసులోనే నాటకం మీద ఆసక్తి పుట్టింది. ఓ రోజు మా మాస్టారు పాఠశాలలో ‘మొండి గురువు- బండ శిష్యుడు’ అనే హాస్య నాటకం తయారుచేశారు. మా తరగతి పిల్లల్లో కొందర్ని ఎంపిక చేసి అత్తిలిలో బహిరంగవేదిక మీద వేయించారు. అందులో నాది బండశిష్యుడి పాత్ర. ఆ పాత్ర భలే పేలింది. జనం చప్పట్లు నాలో తెలియని ఉత్సాహాన్ని కలిగించాయి. తర్వాత ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిల్లో ఎన్నో నాటకాల్లో నటించాను. మంచి ప్రశంసలు, బహుమతులు వచ్చేవి. కళాశాలలో అధ్యాపకులను అనుకరించి స్నేహితులకు వినోదాన్ని పంచేవాణ్ని. నాటకాల్లో కూడా నన్ను ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రలకు తీసుకునేవారు. అధ్యాపకుణ్ని అయిన తర్వాత పిల్లలతో నాటకాలు వేయించేవాణ్ని. 
నాటక రంగానికి సంబంధించి మరచిపోలేని జ్ఞాపకాలు?
మద్దాల రామారావు, షణ్ముఖ ఆంజనేయరాజు, కాళిదాసు కోటేశ్వరరావుల పౌరాణిక నాటకాలు చూస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగేది. వాళ్ల పద్యాలు, నటన అద్భుతంగా అనిపించేవి. ముఖ్యంగా మద్దాల రామారావును తాడేపల్లిగూడెంలో వాళ్లింటికి వెళ్లి కలిసేవాణ్ని. ఎన్టీఆర్‌ తెరపై ఎన్ని పాత్రలు వేశారో అలాంటి పాత్రలనే ఈయన రంగస్థలం మీద వేశారు. మూడు గంటల నాటకాన్ని కంఠస్థం చేసి అద్భుతంగా రక్తికట్టించేవాళ్లు. అన్ని గంటలపాటు ఎలా పాడతారోనని నాకు అబ్బురంగా అనిపించేది. హైదరాబాదులో బుర్రా సుబ్రమణ్యశాస్త్రి, గుమ్మడి గోపాలకృష్ణలతో మాట్లాడుతుండేవాణ్ని. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడితే తెలుగు పట్ల వాళ్లకున్న మక్కువ తెలిసేది. ప్రతి నటుడు అద్భుతంగా తెలుగు నేర్చుకుని పాడేవారు. వాళ్లందరూ తెలుగు మాస్టార్లు కాదు. తెలుగులో డిగ్రీలూ చేయలేదు. ఆ రోజుల్లో పదో తరగతి కూడా పాసవని నటులు చాలా మంది ఉండేవారు. కానీ రంగస్థలంలో వారి పేరుప్రతిష్ఠలు ఎంతో గొప్పగా ఉండేవి. డిగ్రీలు, పీజీలు చేస్తే తెలుగు రాదు. భాష పట్ల ఇష్టం ఉంటే వస్తుంది. పౌరాణిక, సాంఘిక.. ఏ నాటకమైనా భాష స్పష్టంగా ఉండేది. సంభాషణల్లో పరిపుష్టి ఉండేది. అన్ని భావోద్వేగాలనూ పండించేవారు. రచయితలందరూ మంచి భాషావేత్తలు. జనానికి దూరంగా ఉండే భాషలో రాసేవారు కాదు. పౌరాణిక నాటకాల్లో చాలా గ్రాంథికం ఉంటుంది. అయినా జనాలు చప్పట్లు కొట్టేవాళ్లు. అర్థం కాకపోయినా ఆ రాగానికి, తాళానికి చప్పట్లు కొట్టేవాళ్లు, నెమ్మదినెమ్మదిగా ఆ భాషను అర్థం చేసుకోడానికి ప్రయత్నించేవాళ్లు.  
మీరు నాటకాలు రాశారా?
కథలను కొన్ని దృశ్యాలుగా మలిచి, సంభాషణలు రాసేవాణ్ని. ఆసక్తి గల తోటి విద్యార్థులతో కలిసి వేసేవాణ్ని. ‘మంచం మీద మనిషి, అంతా మన మంచికే, త్రివేణి, నైటింగేల్‌’ ఇలాంటి చిన్నచిన్న నాటకాలు వేశాను. కానీ పరిషత్‌ నాటకాలు వేయలేదు. 
పెద్ద పెద్ద నాటక రచయితల్లాగా రాసినవి ఏవీ లేవు. చదివినవే ఎక్కువ. వాటిల్లో కాళ్లకూరి వారి వరవిక్రయం లాంటివి నాకు చాలా ఇష్టం. మంచి నాటిక రాయకూడదా అని ఎవరైనా అడిగితే... ఆత్రేయ అనే వారట ‘ఏనాటికైనా’ రాస్తానని. అంటే ఎలాంటి నాటికనైౖనా రాస్తానని ఓ అర్థం. ఎప్పటికైనా రాస్తానని మరో అర్థం. అలాంటి ఆత్రేయను భీమవరంలోని మా కళాశాలలో కలుసుకున్నా. ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తుండేవాణ్ని. అప్పుడే ఆయనతో గడిపే అదృష్టం దొరికింది. నాటకాల్లో పాటలు రాసిన వ్యక్తి ఆత్రేయ. అలతి అలతి పదాలతో చాలా శక్తివంతమైన భావాలను చెప్పగల వ్యక్తుల్లో ఒకరు. మా కళాశాల పత్రికలో ‘తేటతెలుగు గీతాచార్య ఆత్రేయ’ అని రాశా. మనస్విని ట్రస్ట్‌ పేరుతో జగ్గయ్య.. ఆత్రేయ సమగ్ర సాహిత్య సంకలనాలు వేశారు. మా కళాశాలకు వచ్చినప్పుడు వాటిని నాకు బహుమతిగా ఇచ్చారు. అందులో ఆత్రేయ ఆత్మకథ కూడా ఉంది. పద్యాల్లో తన జీవితాన్ని ఆవిష్కరించుకున్న వ్యక్తి ఆత్రేయ. అది చదువుతుంటే కన్నీళ్లొస్తాయి. 
తెలుగు నాటకం ఏ స్థితిలో ఉంది?
బెంగాలీ, మరాఠీ రంగస్థలాలతో పోలిస్తే అంతటి వైభవం మన నాటకానికి లేదు. రాసేవారు, చేసేవారు ఉన్నా చూసేవారు పలచబడ్డారు. అయితే ప్రేక్షకుల్లో కూర్చొని చూస్తున్నప్పుడు కళాకారులంతా కళ్ల ముందే కనిపిస్తుండటంతో ఒక సజీవమైన అనుభూతిని కలిగిస్తుంది. కానీ, అందరూ సినిమాలు చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే, ఇప్పుడు వినోదం కోసం యూట్యూబ్‌కి అలవాటుపడ్డారు. అంతా వేగంగా జరిగిపోవాలని ఆరాటపడుతుంటారు. అయితే వేగంగా మనం పుట్టలేదు. వేగంగా సూర్యుడు ఉదయించలేడు. వేగంగా మొక్క మొలకెత్తదు. ప్రతీదానికి కాలవ్యవధి ఉన్నప్పుడే దాని తాలుకూ సృష్టి జరుగుతుంది. వేగం అనేది సహజత్వానికి వ్యతిరేకం. వేగపు ఒరవడిలో నాటకమనేది కొట్టుకుపోతున్న మాట వాస్తవం. దానాదీన నాటకం పరిస్థితి దీనంగానే ఉంది. బెంగళూరులో కొన్ని ప్రదర్శనలను టికెట్లు కొని థియేటర్లలో చూశాను. అలాగే ఉత్తరదేశం నుంచి వచ్చి హిందీలో ప్రదర్శించినవి కూడా చూశా. వాళ్లు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని చాలా ప్రభావవంతంగా వాడారు. సమకాలీన సమాజం మీద వ్యంగ్యాస్త్రాలన్నీ బాగా పేలాయి. బహుశా మనం కూడా ఆ ధోరణిలో అలాంటి రచనలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే నాటకం బాగుంటుంది. 
మీరు పుస్తకాలు బాగా చదువుతారు కదా..?
గురజాడ, రావిశాస్త్రి, చలం, ముళ్లపూడి వెంకటరమణ, బీనాదేవి, పురాణం సీత, మొక్కపాటి, పానుగంటి, కాళ్లకూరి నుంచి కేశవరెడ్డ్డి, శ్రీరమణ, కల్పనా రెంటాల, కుప్పిలి పద్మ వరకు నా గ్రంథాలయంలో ఉన్నారు. ఎప్పుడు ఏ పుస్తకం చదవాలనిపిస్తే అది తీసి చదువుకుంటాను. కవిత్వంలో తిలక్, సి.నారాయణరెడ్డి, విన్నకోట రవిశంకర్, కొప్పరపు వెంకటరమణమూర్తి, ప్రసాదమూర్తి, షాజహాన్‌ వరకు అందరి రచనలూ ఇష్టం. నానీల మీద ప్రత్యేక అభిమానం. అలాగే సినీ సాహిత్యంలో ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల పాటలను ఇష్టంగా వింటాను. 
సినీ సంభాషణల్లో మీ ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. ఆ స్పష్టత ఎలా సాధించారు?
అది గురువుల భిక్ష... పుస్తక పఠనంతో నా మాటల్లో స్పష్టత వచ్చి ఉంటుంది. చాలా మంది నన్ను ‘మీరు తెలుగు మాస్టారా?’ అని అడుగుతారు. నిజానికి నేను ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకుణ్ని. పుస్తక పఠనంతో సమకూరిన భాషా పరిజ్ఞానం నాది. భాష మాట్లాడే స్థాయి నుంచి సాహిత్యాన్ని చదివి ఆనందించే స్థాయి వరకు మన అభిరుచి ఎదగాలి. చదువుకునే రోజుల్లో నా రెండో భాష హిందీ. కానీ సరదాగా శ్రీనాథుడి పద్యాలు చదివేవాణ్ని. అలా భాషమీద మక్కువ పెరిగింది. ఆ క్రమంలోనే స్పష్టమైన మాట వచ్చింది. స్పష్టంగా మాట్లాడితే ఎదుటి వారికి వినాలనే ఉత్సాహం కలుగు తుంది. భాష ఆకర్షిస్తుంది, ప్రేమలో పడేస్తుంది. చాగంటి కోటేశ్వరరావు స్పష్టంగా ప్రవచనాలు చెబుతారు కాబట్టి చాలామంది వింటుంటారు. ఆకాశ వాణిలో ఉషశ్రీ భారతం, రామాయణం చెప్పేటప్పుడు ప్రతి ఇంట్లో చెవులొగ్గి వినేవారు. భాషకున్న మహిమ అది.
జంధ్యాల లాంటి వారు సినిమాల్లో మంచి హాస్యం పండించారు. ప్రస్తుతం హాస్య మంటే ద్వంద్వార్థం అయిపోయింది కదా..!
జంధ్యాల మన చుట్టూ ఉండే వ్యక్తులను పరిశీలించి రాశారు. సంభాషణలను చాలా సహజంగా రాసుకుంటూ వెళ్లేవారు. అందులో నుంచే పుష్కలమైన హాస్యాన్ని పండించేవారు. ఏ పాత్ర కూడా అశ్లీలాన్ని ఆశ్రయించిన సందర్భం కనిపించదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫాస్ట్‌ ఫుడ్, జంక్‌ ఫుడ్‌ లాగే హాస్యం విషయంలోనూ జరుగుతోంది. ఇప్పుడు ద్వంద్వర్థాల స్థాయి కూడా దాటిపోయింది. రెండు అర్థాల్లో రెండోదాన్ని అర్థం చేసుకునే ఓపిక జనానికి ఉండదేమో అని ఏకంగా నేరుగా ఒకటే అర్థంలో బూతుని వాడేసి ప్రేక్షకులకి శ్రమ తగ్గిస్తున్నారు! సినిమా ఓ వ్యాపారాత్మక కళ. ఒక సినిమాలో బూతు జోకు వేస్తే ఎక్కువ మంది నవ్వారంటే అదే ప్రమాణం అయిపోతోంది. మంచి హాస్యాన్ని రాసే రచయితలున్నారు. కానీ ఇతర సినిమాల ప్రభావం, ఒత్తిడితో వాళ్లు ద్వంద్వార్థాలతో రాయాల్సి వస్తుంది. ఆ నవ్వులు కాసేపే గుర్తుంటాయి. ఆరోగ్యకరమైన హాస్యమే పదికాలాలపాటు నిలబడుతుంది. ప్రజలను అలరించాలంటే హాస్యానికి బూతును జోడించాల్సిన పనిలేదు. 
సినిమా సంభాషణలు, శీర్షికల్లో ఆంగ్లం పెరిగిపోవడం గురించి ఏమంటారు?  
సినిమా తరం మారింది. స్వరం మారింది. అందులో భాగంగా యువత కోసం యువత తీస్తున్న సినిమాల సంఖ్య పెరిగింది. బాగా చదువుకున్న యువ దర్శకులు, రచయితలు వస్తున్నారు. వాళ్లు చదువుకున్న నేపథ్యం, ఇంగ్లిష్‌ సినిమాల ప్రభావంతో వాళ్ల సినిమాల్లో ఆంగ్లం కనిపిస్తోంది.. వినిపిస్తోంది. వాటికి యువత కూడా ఆకర్షితమవుతోంది. సినిమాలో ఓ తెలియని తెలుగు పదం రాస్తే ఇదేంట్రా అంటున్నారే కానీ ఆంగ్ల పదాలు వస్తే అడ్డు చెప్పట్లేదు! తెలిసో తెలియకో రోజు వారీ భాషలో ఎన్నో ఆంగ్ల పదాలు వాడుతున్నాం. అంతమాత్రాన మనకు తెలుగు భాషంటే మమకారం లేదని కాదు కదా. సమకాలీన సమాజాన్ని బట్టి సినిమాల్లో ఆంగ్లం వాడుతున్నారు కానీ మరీ పెరిగిపోవట్లేదు.  
బాపు సినిమాల్లో మీరు ఎక్కువగా నటించారు కదా. భాష పరంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు?
దాదాపు బాపుగారి అన్ని సినిమాలకు ముళ్లపూడి వారే రచయిత. ఆయన్ని హాస్య రచయిత అంటారు కానీ, అద్భుతమైన రచయిత. ఆయన రాసిన సంభాషణల్లో బాపుగారు ఒక్క అక్షరం కూడా మార్చకుండా నటీనటులతో చెప్పించేవారు. రమణగారి రచనల్లో వ్యంగ్యం, పదును, విరుపు అన్నీ ఉంటాయి. అవన్నీ ఒక ప్రవాహంలో వెళ్లిపోతాయి. కథా నేపథ్యంలో పాత్రలు ఎలా మాట్లాడతాయి, మాట్లాడాలో, ఆ పదాలతోనే సంభాషణలు రాసేవారు. వాటినే యథాతథంగా చెప్పమనేవారు. ఒకసారి నేను భాగవతం టీవీ సీరియల్‌ చేస్తున్నప్పుడు.. రమణగారు ‘సకల విద్యలు’ అని రాశారు. నేను ‘సమస్త విద్యలు’ అని చెప్పా. అప్పుడు బాపుగారు ‘‘సకల, సమస్త అన్నా ఒకే అర్థం వస్తుంది. కానీ రమణగారు రాసిన డైలాగ్‌ ఏముంది? సకల విద్యలు అని ఉంది. అలానే చెప్పండి’’ అని అన్నారు. సమర్థుడైన రచయిత ఓ పదం రాసినప్పుడు ఎందుకు రాసి ఉంటారో మనకు తెలియకపోవచ్చు. కానీ పూర్తి సినిమాలో దానికో అర్థం ఉంటుంది. సకల, సమస్త ఒకటే అనుకున్న మనకు... సకల విద్యలు, సమస్త లోకాలు అనే వివరణ తెలియగానే ఆ రచయిత, దర్శకుడి విజ్ఞానం ఎంతటిదో తెలుస్తుంది. అందుకే గొప్ప రచయితలు రాసినప్పుడు అక్షరం కూడా మార్చకూడదు. మామూలు మాటలైతే ఏదైనా మార్చొచ్చు. ‘ఏరా బాబాయ్‌... ఏంటీ, మందుకొట్టి వస్తున్నావా?’ అని డైలాగ్‌ ఉంటే..  ‘ఏంట్రా బాబాయ్‌ మందుకొట్టి వస్తున్నావా’ అని చెప్పొచ్చు. ఇలాంటి వాటిలో పెద్ద చర్చేమీ ఉండదు. 
సినిమా ద్వారా తెలుగు భాషని ఎంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు?
సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. సినిమాలో ఏంది బాబాయ్‌ అంటే బయట ఏంది బాబాయ్‌ అంటున్నారు. సినిమా సంభాషణల ద్వారా ఏం అలవాటు చేస్తున్నారో జనం కూడా ఆ మాటలనే వాడుతున్నారు. సినిమాలో స్నేహితుల మధ్య ఎలాంటి మాటలుంటాయో బయట స్నేహితుల మధ్య ఇంచుమించు అవే మాటలుంటాయి. అయితే.. మంచి సినిమాకు మంచి భాష కూడా అవసరం. హృదయాన్ని తాకే మాటలు రాస్తే అవే జనానికి అలవాటవుతాయి. భాషను, పుస్తకాన్ని అలవాటు చేస్తే అవే పెరుగుతాయి. లేకపోతే నీళ్లు పోయని మొక్కలా, ఎరువు వేయని పంటలా వాడిపోతాయి. నిజానికి తెలుగు భాష కోసం పరిశ్రమించడం అనేది సినిమా చెయ్యదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భాషా సంఘాలు, తెలుగు అకాడమీ లాంటివి నిత్య చైతన్యవంతంగా ఉండి సమర్థులైన వారి నేతృత్వంలో భాషా పరిరక్షణను ఓ యజ్ఞంలా కొనసాగించాలి. 
మీరు ఓ టీవీ కార్యక్రమానికి 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్‌ రాశారు. టీవీ, సినిమా రచనను ఎందుకు దూరం పెట్టారు?
అది యాదృచ్చికంగా జరిగింది. నా దగ్గర కొన్ని హాస్య సన్నివేశాలు, ఆలోచనలు ఉండటంతో రాశాను. వాటికి మంచి ఆదరణ లభించింది. ఎల్బీ శ్రీరాం, కృష్ణభగవాన్, సిరివెన్నెల, వేటూరి లాంటి ఎందరో రచయితలు నన్ను ప్రోత్సహించారు. పరిశ్రమ వైపు ఎందుకు దృష్టిసారించట్లేదని ప్రశ్నించారు. అదంతా నా మీద వాళ్లకున్న అభిమానం. నా మానసిక ఆనందం కోసమే రచనలు చేస్తుంటాను. అభిరుచిని వృత్తిగా మార్చుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మసంతృప్తి ఉండదేమోనని రాయట్లేదు.  
హాస్య ప్రదర్శనల కోసం చాలా దేశాలకు వెళ్లారు. అక్కడున్న మనవాళ్లు తెలుగు కోసం పడే ఆరాటాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?
విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లకు తెలుగు మీద ఆసక్తి ఉండటానికి కారణం పురిటిగడ్డకు, అమ్మభాషకు దూరంగా ఉండటమే. ఏది దూరంగా ఉంటే అదే ఆసక్తి. ఇది మానవ సహజ స్వభావం. మన చుట్టూ ఆంగ్లం మాట్లాడుతుంటే ఒక్కరు తెలుగులో మాట్లాడేవాడు కనిపిస్తే చాలు ఎక్కడా లేని ఆనందం వస్తుంది. అందుకే మాతృభాష అన్నారు. అంటే అమ్మ మాట్లాడే భాష అని కాదు అర్థం. అమ్మ ఎలాంటిదో భాష కూడా అలానే అని. అందుకే ఎక్కడికి వెళ్లినా మన అంతరాంతరాల్లో భాష మీద మమకారం గూడుకట్టుకునే ఉంటుంది. భాష మనుషులను కలుపుతుంది. మాతృభాష ఒక్కటైనవాళ్లు ఎక్కడున్నా అన్నదమ్ములు, మిత్రుల్లాగా ఉంటారు. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా... అనేక దేశాల్లో ఉంటున్న తెలుగువారు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాతి తరం తెలుగుకి దూరం కాకుండా కాపాడుకుంటున్నారు. 
మీరు కళాశాలలకు వెళ్లి హాస్యప్రదర్శనలు, ఉపన్యాసాలు ఇస్తుంటారు. తెలుగు భాషా, సాహిత్యం మీద నవతరానికి ఎంత వరకు అవగాహన ఉంది?  
తెలుగు మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడితే సరిపోదు. నీ భావాలను వ్యక్తీకరించడానికి నీ దగ్గర భాషా భాండాగారం ఉండాలి. నాకు కోపం వచ్చింది, అంటే అది కోపమా, ఉద్రేకమా, ఉద్వేగమా అని తెలిసుండాలి. ఏ రకమైన కోపం.. దుఃఖంలోంచి వచ్చిన కోపమా, ఉక్రోషంలోంచి వచ్చిన కోపమా... ఇన్ని పదాలున్నాయి మనకు. వీటన్నింటిని వాడగలగడమే భాష. ఇవి ఎంతవరకు పిల్లలకు నేర్పిస్తున్నారో తెలియదు. తెలుగులో పీజీ చేస్తున్న విద్యార్థులు కొందరు ఒకసారి నన్ను కలవడానికి వచ్చారు. వాళ్లని కొంతమంది రచయితలు, కవుల గురించి ప్రశ్నిస్తే తెల్లముఖం వేశారు. ప్రాచీన కవులు తెలియదు. సమకాలీన రచయితలు తెలియదు. వారి రచనలు అంతకంటే తెలియదు. పోనీ యువతరం కదా అని శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తే నోళ్లు వెళ్లబెట్టారు. శ్రీశ్రీ అనే తరం పోయి స్త్రీస్త్రీ అనే తరం వచ్చిందా అనిపించింది! ఎక్కడో గాడితప్పిన విద్యావ్యవస్థలో ఉన్నామనిపిస్తోంది. నిజానికి భాషాభిమానానికీ చదువులకు, ఉద్యోగాలకు సంబంధం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లం నేర్చుకున్నా కూడా ప్రతి తెలుగువాడూ వ్యక్తిగత అభిరుచితో తన తెలుగును పెంపొందించుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం