తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అమెరికాలో అన్నమయ్యకు అగ్రపూజ

  • 149 Views
  • 2Likes
  • Like
  • Article Share

    జె.కళ్యాణ్‌ బాబు

  • అమరావతి
  • 8008771075

అవిడ అమెరికాలో అన్నమయ్య సంకీర్తనల్ని జలతారు పల్లకిలో ఊరేగిస్తున్నారు. ప్రముఖ వాగ్గేయకారుల పాటలకు పట్టం కడుతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు వెలుగు దివ్వెలా నిలుస్తున్నారు. ఆవిడ తెలుగు, సంస్కృత భాషల్లో పండితురాలు, రచయిత్రి, గాయని, సాహితీవేత్త, విద్యావేత్త, తత్వవేత్త, బహుగ్రంథకర్త. మూడు దశాబ్దాల కిందటే ‘శ్రీ అన్నమయ్య ప్రాజెక్ట్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (సప్నా)’ పేరుతో సంస్థను నెలకొల్పి అమెరికాలోని దాదాపు ప్రతి నగరంలో అన్నమాచార్యుల సంకీర్తనామృతాన్ని పంచిన ఆవిడే శొంఠి శారదాపూర్ణ. తన ‘పూర్ణమిదం’ గ్రంథావిష్కరణకు భర్త, ప్రముఖ నేత్ర వైద్యులు శొంఠి శ్రీరాంతో కలసి తెలుగునాడుకు వచ్చిన ఆవిడతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖీ..
భాషా సాహిత్యాల మీద ఆసక్తి ఎలా కలిగింది?

నాన్న సుసర్ల గోపాలశాస్త్రి, అమ్మ సీతాదేవి. పద్దెనిమిదో శతాబ్దిలో తెలుగులో మొదటి నాటకం రచించిన కోరాడ రామచంద్రకవి మా అమ్మ పూర్వీకులు. తిరుపతిలో పుట్టాను. ప్రాథమిక విద్యాభ్యాసం ఆక్కడే చేశాను. ఆ తర్వాత నాన్న ఉద్యోగ రీత్యా మకాం మద్రాసుకి మారింది. అప్పట్లో మా ఇల్లు ఓ సరస్వతీ నిలయం. మా తాతగారు సుసర్ల సూర్యభగవత్‌ శంకరశాస్త్రి, ఖండవల్లి లక్ష్మీరంజనం, విశ్వనాథ సత్యనారాయణ, గంటి జోగిసోమయాజి లాంటి మహామహులు మా ఇంట్లో సాహితీ చర్చలు జరిపేవారు. పూర్వీకుల వారసత్వం, నేను పెరిగిన వాతావరణంతో సహజంగానే నాకు భాష, సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి, అనురక్తి పెరిగాయి. ఆంధ్రవిశ్వకళాపరిషత్‌లో తెలుగులో ఎమ్మే చేశాను. కర్ణాటక, లలిత సంగీతం, నృత్యం నేర్చుకున్నాను. వాసా కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కొమండూరి కృష్ణమాచార్యులు దగ్గర సంగీతం నేర్చుకునే వరం నాకు లభించింది. ఆకాశవాణిలో లలిత సంగీతం, నండూరివారి ఎంకిపాటలు పాడేదాన్ని. పెళ్లయ్యాక మావారితో కలసి 1975లో అమెరికా వెళ్లాను. మేం మొత్తం ఏడుగురు పిల్లలం. అందరం సంగీతం నేర్చుకున్నాం. కుటుంబంలో విదేశాలకు వెళ్లిన మొదటిదాన్ని నేనే. నాతో పాటే నేను నేర్చుకున్న సంగీత, సాహిత్య, నృత్య, సారస్వత, ఆధ్యాత్మిక అంశాల్నీ అమెరికా తీసుకెళ్లాను. 
అమెరికాలో అన్నమాచార్య సంకీర్తనలు గానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
1970-75 ప్రాంతంలో అన్నమాచార్యుల సాహిత్యం విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చింది. అంత వరకు తాళ్లపాక అరల్లో నిక్షిప్తమై ఉన్న తామ్ర పత్రాలను వెలికి తీసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి లాంటి దిగ్గజాలు అన్నమాచార్యులవారి సాహిత్యాన్ని పుస్తకాలుగా ప్రచురించారు. బాలాంత్రపు రజనీకాంతరావు, మంచాల జగన్నాథరావు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ లాంటివారు వాటిలోని శృంగార, ఆధ్యాత్మిక ప్రధానమైన సంకీర్తనల్ని ఆకాశవాణిలో పాడుతుండేవారు. అప్పటికే లలిత సంగీత సాధన చేస్తున్న నేను, ఆ క్రమంలో అవి అన్నమాచార్యుల సంకీర్తలని తెలియకుండానే కొన్ని నేర్చుకున్నాను. అన్నమాచార్యుల కీర్తనలపై మరింత పరిశోధనలు జరిగి అవి ప్రాచుర్యంలోకి వచ్చాక... నాకు మరింత ప్రేరణ కలిగింది. అమెరికా వెళ్లిన మొదట సంవత్సరం 1976లో బోస్టన్‌లోని ఎంఐటీ ఆడిటోరియంలో దసరా ఉత్సవాల సందర్భంగా అన్నమయ్య కీర్తనలు పాడాను. రికార్డుల్లో నమోదైన సమాచారం ప్రకారం అమెరికాలో మొదటిసారి అన్నమాచార్య కీర్తనలు గానం చేసింది నేనే. నాకంటే ముందు కూడా కొందరు అమెరికాలో అన్నమాచార్య కీర్తనలపై చర్చించి ఉండొచ్చు. పాడినవాళ్లూ ఉండొచ్చు. కానీ డాక్యుమెంటేషన్‌ లేదు. అక్కడి నుంచి నా భర్త సహకారంతో ఒక్కో అడుగూ వేసుకుంటూ అన్నమాచార్య సంకీర్తన యజ్ఞాన్ని కొనసాగించాం. మహా వీణా విద్వాన్‌ చిట్టిబాబు 1978లో బోస్టన్‌ వచ్చారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ, కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు అదే సమయంలో అక్కడికి విచ్చేశారు. ఆ మహామాన్యుల సాంగత్యంలో ఉండే అదృష్టం కలిగింది. వారందరితో అన్నమాచార్యుల భాష, సారస్వతం, వేద, నృత్య, సంగీత ధర్మాలను వ్యాప్తి చేయాలన్న అంశంపై చర్చలు సాగించేదాన్ని. 
అన్నమాచార్య సంస్థ ఏర్పాటు ఎలా జరిగింది? 
1980లో బోస్టన్‌ నుంచి చికాగో వెళ్లాను. అప్పటికి నాకు ఇద్దరు పసిపిల్లలు. చికాగోలో తెలుగు సంస్థలు అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నాయి. తానా సంస్థకు 1981లో అంకురారోపణ జరిగింది. అప్పటికి అక్కడున్న తెలుగువారే తక్కువ. తెలుగు నేర్చుకున్నవారు తక్కువ. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లుగా ఆయా రంగాల్లో నిపుణత కలిగిన వారే తప్ప... తెలుగు భాషా సాహిత్యాల్లో పట్టు ఉండి దాన్ని ముందుకు నడిపించాలని వచ్చిన వారు లేరు. పైగా వారంతా నిత్య జీవన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండేవారు. వారు నిర్వహించే వృత్తులూ అలాంటివే. ఆ పరిస్థితుల్లో భాషకు పునాదులు వేయడం, నిలబెట్టడం చాలా కష్టమైన పని. అన్ని ప్రతికూలతల మధ్య ఉన్న కొద్దిమందినే కూడగట్టుకుని... కొద్ది కొద్దిగా సంఘాలు ఏర్పాటు చేయడంలో ప్రధాన  పాత్ర వహించాను. అక్కడ తెలుగు, భాషా సంస్కృతుల వ్యాప్తి, పరిరక్షణల్లో నా వంతు పాత్ర పోషించాను. 1987లో మొట్ట మొదటిసారిగా అన్నమాచార్య సంస్థ పెడదామన్న సంకల్పం కలిగింది. సుసర్ల గోపాలశాస్త్రి, పీవీఆర్‌కే ప్రసాద్‌లతో మొదటి సమావేశం నిర్వహించాం. 1989 నాటికి అన్నమాచార్య సంస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటైంది. 1990లో సిరి, సీత అని ఇద్దరు యువ నర్తకీ మణులతో 40 అన్నమాచార్య సంకీర్తనలకు నాట్య ప్రదర్శన చేయించాం. అప్పటి వరకు అన్నమాచార్య సంకీర్తనలన్నీ.. భాషకి, మతానికి, కళకి, సామాజిక వ్యవస్థకి, సంగీతానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఆయన కీర్తనల్లో నృత్యాంశముందన్న ఒక సిద్ధాంతాన్ని తీసుకువచ్చి, అది విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చాం. ఈ 32 ఏళ్లలో అమెరికాలోని 50 నగరాల్లో నాలుగు వేల కార్యక్రమాలకు పైగా నిర్వహించాం. ఒక చికాగోలో మాత్రమే కాకుండా, 8 నగరాల్లో అన్నమాచార్య సంస్థలు ఏర్పాటు చేశాం.  1990లో పీవీఆర్‌కే ప్రసాద్‌ తిరుపతి దేవస్థానం నుంచి అన్నమాచార్య గ్రానైట్‌ విగ్రహాన్ని చెక్కించి ఇస్తే, దాన్ని తీసుకెళ్లి స్థాపించాం. నిత్య పూజలు, ఉత్సవాలు జరిపిస్తున్నాం.


‘‘స్త్రీ జనోద్ధరణ, స్త్రీని అధిష్ఠాన దేవతగా కొలవాలన్న, సమానహక్కుల కల్పించాలన్న భావనలకు మొట్ట మొదట విత్తనం నాటిన, మనకు తెలిసిన తెలుగు కవి అన్నమయ్యే. తన భార్య తాళ్లపాక తిమ్మక్క కూడా తనతో సాహితీ చర్చలు చేస్తూ ఉండేవారని అన్నమయ్య చెప్పారు. ఆమెతో ఆయన చక్కని గ్రంథాలు రాయించారు. వ్యక్తి, దేశం, జాతి ధర్మం.. బాగుండాలంటే భాష బాగుండాలి. మాండలికమైనా, గ్రాంథికమైనా, శిష్ట వ్యవహారమైనా భాషను కాపాడుకోవాలి. అన్నమాచార్య మనకు అందించిన స్ఫూర్తి అదే’’


‘‘స్త్రీ జనోద్ధరణ, స్త్రీని అధిష్ఠాన దేవతగా కొలవాలన్న, సమానహక్కుల కల్పించాలన్న భావనలకు మొట్ట మొదట విత్తనం నాటిన, మనకు తెలిసిన తెలుగు కవి అన్నమయ్యే. తన భార్య తాళ్లపాక తిమ్మక్క కూడా తనతో సాహితీ చర్చలు చేస్తూ ఉండేవారని అన్నమయ్య చెప్పారు. ఆమెతో ఆయన చక్కని గ్రంథాలు రాయించారు. వ్యక్తి, దేశం, జాతి ధర్మం.. బాగుండాలంటే భాష బాగుండాలి. మాండలికమైనా, గ్రాంథికమైనా, శిష్ట వ్యవహారమైనా భాషను కాపాడుకోవాలి. అన్నమాచార్య మనకు అందించిన స్ఫూర్తి అదే’’


అన్నమాచార్యుల సారస్వతంలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలేంటి?

ఆయన అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో రచనలు చేశారు. దేశీయాలు, చిన్న చిన్న కుటుంబాల్లో ఉండే భాషల తీరు కూడా ఆయన సంకీర్తనల్లో కనిపిస్తుంది. రాయలసీమ, విశాఖ, శ్రీకాకుళం, కదిరి, అహోబిలం... ఇలా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వాళ్ల ఊళ్లల్లో మాట్లాడుకునే భాషల్లో అన్నమయ్య కీర్తనలు రాశారు. ఎన్ని జాతీయాలు, మాండలికాలు, దేశీయాలు ఉన్నాయో అన్నింటా ఆయన రచనలు సాగించారు. భరతుణ్ని ఆదర్శంగా చేసుకుని నృత్యానికి సంబంధించిన కీర్తనలు రాస్తున్నానని ఆయన చెప్పారు. పాల్కురికి సోమన, నన్నెచోడుడు చెప్పిన 16 రకాల దేశీయ నృత్యాలకు ఆయన పాటలు రాశారు. తుమ్మెద పాటలు, ప్రభాత పాటలు, గొబ్బెళ్ల పాటలు, శోభనపు పాటలు.. ఇలా అనేక రచనలు చేశారు. అవే కాకుండా ఆయన రచించిన శృంగార, ఆధ్యాత్మిక సంకీర్తనలు మనకు తెలిసినవే. ఆ కాలంలో గృహాల్లోనే కాకుండా, వీధుల్లో చిన్న చిన్న బృందాలుగా నృత్యాలు చేసే నర్తకీమణుల్ని వెలుగులోకి తెచ్చి, కీర్తనలు రాసి, వాటికి వారితో నృత్యం చేయించి, అగ్రహారాలు దానం చేశారు. నెల్లూరు శాసనాల్లో ఆ విషయాలు ఉన్నాయి. 40 మంది నర్తకీమణుల పేర్లు వాటిలో కనిపిస్తాయి. స్త్రీ జనోద్ధరణ, స్త్రీని అధిష్ఠాన దేవతగా కొలవాలన్న, సమానహక్కుల కల్పించాలన్న భావనలకు మొట్టమొదట విత్తనం నాటిన, మనకు తెలిసిన తెలుగు కవి అన్నమయ్యే. తన భార్య తాళ్లపాక తిమ్మక్క కూడా తనతో సాహితీ చర్చలు చేస్తూ ఉండేవారని అన్నమయ్య చెప్పారు. ఆమెతో ఆయన చక్కని గ్రంథాలు రాయించారు. ఆమెతో పాటు, తన కుటుంబంలోని ప్రతి స్త్రీతో చిన్న చిన్న పదాలు, సంకీర్తనలు, రచనలు చేయించి ఒక చోట పొందుపరిచారు. వ్యక్తి, దేశం, జాతి ధర్మం.. బాగుండాలంటే భాష బాగుండాలి. జాతీయమైనా, మాండలికమైనా, గ్రాంథికమైనా, శిష్ట వ్యవహారమైనా భాషను కాపాడుకోవాలి. అన్నమాచార్య మనకు అందించిన స్ఫూర్తి అదే. దాన్ని అన్నమాచార్య సంస్థ ద్వారా ముందుకి తీసుకెళ్తున్నాం.  
మీ కృషికి అక్కడి వారి స్పందన ఎలా ఉంది?
అమెరికాలో మా తరంలో స్థిరపడినవారి తర్వాత... మరో రెండు తరాలు వచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో 46 లక్షల భారతీయులుంటే వారిలో సంఖ్యాపరంగా రెండో స్థానంలో తెలుగువారున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను అందిపుచ్చుకోవడానికి, భాష, సంగీత, సాహిత్యాలను అభ్యసించడానికి వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. యువతరం అన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు. పిల్లలకు మూడేళ్ల వయసు వచ్చేసరికి ఎలా పాఠశాలలకు పంపిస్తున్నామో.. అలాగే అక్కడ ప్రతి తల్లీ వాళ్ల పిల్లల్ని సంగీతం, నాట్యం నేర్చుకోవడానికి పంపిస్తోంది. మన భాష, సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కృతి, సంప్రదాయాలు అమెరికాలోని ప్రతి నగరంలో చక్కగా స్థిరపడుతున్నాయి. ప్రతి చోటా తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, తెలుగు నేర్పించడం, ప్రదర్శనలు ఇప్పించడం, పోటీలు పెట్టడం, బహుమతులు ఇవ్వడం రోజువారీ జీవన వ్యవహారంలో భాగమయ్యాయి. ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నప్పుడు అమెరికా వచ్చారు. అప్పట్లో ఆరేళ్లు అతిథి ఆచార్యురాలిగా పనిచేశాను. అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు నేర్పించేందుకు అవసరమైన ప్రాతిపదిక ఏర్పాటుకి ప్రయత్నాలు చేశాం. అదింకా పూర్తిగా కార్యరూపం దాల్చకపోయినా... అక్కడి పిల్లలు పాఠశాలల్లో పరీక్షలు రాసే స్థాయికి తెలుగు నేర్చుకుంటున్నారు. మద్రాసులో ప్రతి డిసెంబరు మాసాన్ని ‘మ్యూజిక్‌ సీజన్‌’గా పరిగణిస్తారు. ఆ నెలలో ఎక్కడ చూసినా సంగీత ప్రదర్శనలు, పోటీలు జరుగుతుంటాయి. వాటిలో పాల్గొని ఉజ్జ్వలంగా వెలుగుతోంది అమెరికా నుంచి వస్తున్న సంగీతకారులే. శుద్ధమైన శ్రుతి, లయ జ్ఞానాలతో వారు సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది గర్వించాల్సిన అంశం. అమెరికాలో అన్నమాచార్య సారస్వతమే కాకుండా, తెలుగు భాషలోని ఇతర అంశాల్ని కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. కాపాడుకుంటున్నారు. వీరశైవం అని ఒక శాఖ ఉంది. అమెరికాలో ఉంటున్న ఆరు వేల వీరశైవ కుటుంబాలు తానా, ఆటాల్లానే ప్రత్యేక సంఘం ఏర్పాటు చేసుకుని ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటికి పదివేల మంది హాజరవుతున్నారు. వారికి బసవేశ్వరుడు ఆరాధ్యనీయుడు. బసవ సాహిత్యం పూర్తిగా మాండలిక భాషలో ఉంటుంది. అలాంటి పాటల్ని కూడా అక్కడ చాలా వృద్ధిలోకి తెస్తున్నారు. ఎవరైనా పరిశోధన చేసినవాళ్లు వాటిని చూస్తే వాటికంత సమగ్రత, పరిపూర్ణత ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయే స్థాయిలో వారు కృషి చేస్తున్నారు. 


‘‘36 మంది ప్రముఖ వాగ్గేయకారుల తైలవర్ణ చిత్ర పటాల్ని భారీ పరిమాణంలో వేయించాం. 25 ఏళ్లగా ప్రతి సంవత్సరం ఒక్కో వాగ్గేయకారుడిని తీసుకుని, వారి కీర్తనలు, పాటలల్ని పెద్ద పెద్ద కళాకారులతో పాడించాం. అన్నమాచార్య సంస్థ 32 ఏళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలతో ‘సప్నా ఎట్‌ 32’ గ్రంథాన్ని తెచ్చాం. ప్రణబ్‌ముఖర్జీ భారత రాష్ట్రపతిగా ఉండగా ఆయనకు ఆ పుస్తకాన్ని అందజేస్తే... ఆయన మా కృషిని ప్రశంసిస్తూ బహుమానం ఇచ్చారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా పలువురు సెనేటర్లు, ప్రముఖులు ఇచ్చిన ప్రశంసా పత్రాల్ని దానిలో పొందుపరిచాం. అన్నమాచార్య సాహిత్యంపై పరిశోధన చేసేవారికి... విదేశాల్లో అన్నమాచార్యుల సారస్వతానికి లభించిన గుర్తింపు, వ్యాప్తి గురించి తెలుసుకునే విషయంలో సహకరించే పరిశోధన గ్రంథం వంటిది ఇది‘‘


వీణా వాద్యంలోను మీకు ప్రవేశం ఉంది కదా?
మన జాతీయ సంగీత వాద్యం వీణ. ప్రొఫెసర్‌ జాన్‌ హికిన్స్‌ భాగవతార్‌ 1970 ప్రాంతంలో ఒక వీణను కనెక్టికట్‌ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు. దాన్ని ఆయన అక్కడ వాయించేవారు. అక్కడ తీవ్రమైన చలి, మంచు వల్ల మేళం పాడైపోయి, వాద్యం పనికిరాకుండా పోయేది. వీణా వాదనలో నాకున్న ఆసక్తి, అభిలాష వల్ల వీణను ఎలాగైనా అక్కడ వ్యాప్తిలోకి తేవాలని 2000లో మొదటి కార్యక్రమం నిర్వహించాం. అప్పుడు చికాగో నగరంలో కేవలం 8 వీణలు ఉన్నాయి. ఇన్నేళ్లలో మేం చేసిన కృషి వల్ల ఇప్పుడు ఒకే వేదికపై 200 వీణలతో సంగీత కార్యక్రమం నిర్వహించగలిగాం. ప్రస్తుతం అమెరికాలోని దాదాపు ప్రతి నగరంలోను 200కి పైగా వీణలు ఉన్నాయి. భారతీయ సంగీత, కళా సంప్రదాయం అక్కడ చక్కటి స్థానం ఏర్పాటు చేసుకుంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, ఐరోపా, దక్షిణాఫ్రికా ల్లోను ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
అమెరికాలో  పిల్లలకు వేదం నేర్పిస్తున్నారు కదా?
దానికోసం వేదపరిషత్‌ నెలకొల్పాను. సూక్తాలు చెబుతున్నాను. పఠన, పాఠనాలు మాత్రమే కాకుండా, సంస్కృత లిపిలో వారికి వేదం నేర్పుతున్నాను. తెల్ల పిల్లలు, అక్కడే పుట్టిన పిల్లలూ చక్కగా వేదం నేర్చుకుంటున్నారు. మా తరంలో అమెరికాలో స్థిరపడివారి పిల్లలు చాలా మంది అక్కడ శ్వేతజాతీయుల్ని పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలు శ్వేతజాతీయులుగానే ఉన్నప్పటికీ... వారు సాంస్కృతిక, భాష, జాతీయ, వ్యక్తిత్వ గుర్తింపు కోసం తపనపడుతున్నారు. తాము ఏ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారమన్న ఊగిసలాట ధోరణి, సందిగ్ధావస్థ వారిలో లేవు. నేను, నా సంస్కృతి అన్న దృఢ నిశ్చయం వారందరిలో ఉంది. హార్వర్డ్, బర్కిలీ, బ్రౌన్‌ యూనివర్సిటీల్లో సంస్కృతాన్ని ఇంగ్లిషులో నేర్పుతున్నా... క్షుణ్నంగా, శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. క్రొయేషియాలో నేను రెండేళ్ల కిందటే చూశాను.. అక్కడ పుట్టిన పిల్లలు 200 మంది కృష్ణయజుర్వే దంలో 32 పన్నాలు.. పుస్తకాలేమీ లేకుండా నేర్చుకుని, చక్కగా చెబుతు న్నారు. జర్మనీ విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం నేర్పిస్తున్నారు. వేదం చదవడం, వల్లెవేయడం, నేర్వడం ఆ దేశాల్లో విస్తృతంగా జరుగుతోంది. అమెరికాలో ప్రతి ఊరిలో శివరాత్రి వచ్చిందంటే రుద్రం, నమకం, చమకం చదువుతారు. 500 మంది కూర్చుని ఏకధాటిని 11 సార్లు రుద్రం చెబుతారు. భారతీయులే కాకుండా, శ్వేతజాతీయులూ పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న ఎందరో మహానుభావులు దానికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. 
ఇప్పటి వరకూ 24 గ్రంథాలు రాశారు. మీ రచనానుభవాలు, విశేషాలు...
ఇప్పటి వరకు 24 గ్రంథాలు రాశాను. మొదట అచ్చువేసింది శరణ్ణిక్వాణం. అది కవితలు, వ్యాసాల సమాహారం. ఆకాశవాణిలో  మహాకవుల గురించి ఉపన్యాసాలు ఇచ్చేదాన్ని. పంచకావ్యాల్ని నాటకాలుగా రూపొందించి, ప్రసారం చేశాను. వాటిని వీటిలో పొందుపరిచాను. శరద్యుతి, శరఝ్ఝరి రెండు మూడు గ్రంథాలు. మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన మేఘదూతం కావ్యాన్ని మా గురువు రామవరపు శరత్‌బాబుతో సంయుక్త రచనగా అనువాదం చేశాను. చాణక్యుడి 1116 సూక్తుల్ని నీతి సహస్రి పేరుతో అనువదించాను. అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత పేరుతో పరిశోధన గ్రంథాన్ని ప్రచురించాను. సంస్కృతంలో పరిశోధన గ్రంథాన్ని నాదానందం పేరుతో వెలువరించాను. సంగీత శాస్త్రం, భావ ప్రకటన, లలిత కళల విలసనం, పుట్టుపూర్వోత్తరాలను మూడో పరిశోధన గ్రంధంగా రాశాను. ప్రతీచి పేరుతో... పడమర దేశంలో భారతీయమైన సంప్రదాయాలు ఏవిధంగా విరాజిల్లుతున్నాయో చెప్పాను.  ప్రతీచి నైమిషం, ప్రతీచి లేఖలు, ప్రతీచి అధ్యారోపం రాశాను. శ్రీరాములు గడియపాట... ఆంగ్లంలోకి తర్జుమా చేశాను. ‘సునాదసుధ’ పేరుతో ప్రత్యేక సంస్థను స్థాపించాం. 36 మంది ప్రముఖ వాగ్గేయకారుల తైలవర్ణ చిత్ర పటాల్ని భారీ పరిమాణంలో వేయించాం. 25 ఏళ్లగా ప్రతి సంవత్సరం ఒక్కో వాగ్గేయకారుడిని తీసుకుని, వారి కీర్తనలు, పాటలల్ని పెద్ద పెద్ద కళాకారులతో పాడించాం. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఒక పుస్తం తీసుకొచ్చాను. అన్నమాచార్య సంస్థ 32 ఏళ్లుగా నిర్వహించిన కార్యక్రమాలతో ‘సప్నా ఎట్‌ 32’ గ్రంథాన్ని తెచ్చాం. ప్రణబ్‌ముఖర్జీ భారత రాష్ట్రపతిగా ఉండగా ఆయనకు ఆ పుస్తకాన్ని అందజేస్తే... ఆయన మా కృషిని ప్రశంసిస్తూ బహుమానం ఇచ్చారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా పలువురు సెనేటర్లు, ప్రముఖులు ఇచ్చిన ప్రశంసా పత్రాల్ని దానిలో పొందుపరిచాం. ఇది ఒక చరిత్ర గ్రంథం వంటిది. అన్నమాచార్య సాహిత్యంపై పరిశోధన చేసేవారికి... విదేశాల్లో అన్నమాచార్యుల సారస్వతానికి లభించిన గుర్తింపు, వ్యాప్తి గురించి తెలుసుకునే విషయంలో సహకరించే పరిశోధన గ్రంథం వంటిది ఇది. ‘పూర్ణమిదం’ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించాం. ‘నైమిశం’ ‘వాగాంభృణి’ ‘స్వైరిణి’ పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి. 
మీ భవిష్యత్‌ కార్యక్రమాలేంటి?
అన్నమాచార్యుల సారస్వాతాన్ని, సంగీతాన్ని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని నలు దిశలా వ్యాపింపచేయడం, ఆ అపూర్వమైన సంపదను భావితరాలకు అందుబాటులో ఉంచడం ప్రధాన లక్ష్యాలు. సప్న ఎట్‌ 32 పుస్తకాన్ని పెద్ద పెద్ద నగరాలకు తీసుకెళ్లి ఆవిష్కరిస్తున్నాం. ఇతర దేశాల్లో భారతీయ కళలు, సంప్రదాయాలు ఎలా విరాజిల్లుతున్నాయో చెప్పడానికి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నాం. గ్లోబల్‌ వీణ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ వీణ కాన్ఫరెన్సెస్‌ పేరుతో 13 ఉత్సవాలు నిర్వహించాం. ఈ సంవత్సరం 14వ ఉత్సవం చేస్తున్నాం. ఆ సందర్భంగా వీణ ఏకాహం జరుగుతుంది. అంటే 24 గంటలపాటు ఒక్క క్షణం కూడా వీణ మీటు ఆగకుండా సంగీతకారులు వాయిస్తూనే ఉంటారు. వచ్చే మేలో అన్నమాచార్యులవారి సంకీర్తనలతో ఏకాహం నిర్వహిస్తున్నాం. మల్లాది సోదరులు, గుండేచా సోదరులు లాంటివారు వస్తున్నారు. కర్ణాటక, హిందుస్థానీ సంప్రదాయ సంగీతాలతో జుగల్బందీ ఏర్పాటుచేస్తున్నాం. ప్రముఖ వాగ్గేయకారుల చిత్ర పటాలు, సంకీర్తనలు, సారస్వతంతో సునాదసుధ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం