తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి

  • 211 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సూగూరు రవీందర్‌రావు

  • అనంతపురం
  • 8008102323

సీమ నేలలో చినుకు రాలదు. నోళ్లు తెరచిన బీడు భూములు, ఆకలితో మెలిపెడుతున్న పేగులు, గోడు పట్టని పాలకులు... ఈ వ్యధాభరిత దృశ్యాల్ని తన కథలు, నవలల్లో కళ్లకు కట్టారు బండి నారాయణస్వామి. ఉపాధ్యాయుడిగా చరిత్రను బోధించిన ఆయన చరిత్రలో సీమ ఎదుర్కొన్న కష్టాలను, కరవు కరాళ నృత్యాన్ని తన రచనల్లో అక్షరబద్ధం చేశారు. రాయలసీమ చారిత్రక నేపథ్యంలో నారాయణస్వామి రాసిన ‘శప్తభూమి’ నవల ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆయనతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి... 
‘శప్తభూమి’కి అకాడమీ పురస్కారం రావడం ఎలా అనిపిస్తోంది?

చాలా సంతోషంగా ఉంది. పురస్కారాల మీద నాకు అంతగా అవగాహన లేదు. ‘శప్తభూమి’ నవలను చదివిన చాలా మంది దీనికి తప్పకుండా ఏదో ఒక పురస్కారం వస్తుందని అన్నారు. పురస్కారం వచ్చాక రాయలసీమ ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. 
ఈ నవలను ఎందుకు రాయాలనిపించింది? 
నేను రైతు బిడ్డను. వృత్తిరీత్యా పనిచేసిందంతా పల్లెటూళ్లలోనే. రాయలసీమలో పుట్టి పెరిగిన నేపథ్యమే నన్ను రచయితగా మార్చింది. ఇక్కడి రైతుల నీటి సమస్యను దగ్గర నుంచి చూశాను. ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలి, వారి కష్టాలను లోకానికి తెలియజెప్పాలనే రచనలు చేశాను. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘శప్తభూమి’ నవలకు అంకురారోపణ జరిగింది. తెలంగాణ పోరాటంలో ఆ ప్రాంత భాష, చరిత్ర, సంస్కృతి పునరుజ్జీవం చెందాయి. అదే క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు రాయలసీమ ప్రజలు తమిళనాడు నుంచి ఆంధ్రరాష్ట్రంలో కలవడానికి ఒప్పుకోలేదు. 1936లోనే అలాంటి ప్రతిపాదనలను ఇక్కడి పెద్దలు వ్యతిరేకించారు. శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కృష్ణాజలాలు అందిస్తామని, సీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని, రాజకీయపరమైన ప్రాధాన్యం ఇస్తామని ఒప్పించారు. తర్వాత విశాలాంధ్ర పేరుచెప్పి రాజధానిని హైదరాబాదుకు మార్చారు. ఆంధ్రరాష్ట్రంలో చేరి కృష్ణాజలాలు పోగొట్టుకుంటే, విశాలాంధ్రలో చేరి రాజధానిని కోల్పోయాం. ఇన్ని కోల్పోయిన రాయలసీమ అస్తిత్వం ఏమిటన్న ప్రశ్న తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్లీ తలెత్తింది. అలాంటి సందర్భంలో రాయలసీమ భాష, సంస్కృతిని ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రచన సాగించాను. 
ఈ నవలా రచనలో మీ ఆలోచన క్రమం ఎలా సాగింది?
ఓ మనిషి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే వర్షం కురుస్తుందనే రాజస్థాన్‌ ప్రాంత విశ్వాసం మూలకథగా ఆర్‌కే నారాయణ్‌ ‘ద గైడ్‌’ నవల రాశారు. వ్యవసాయానికి మూలమైన నీటి సమస్యను పతాక స్థాయికి తీసుకెళ్లిన నవల అది. దాన్ని చదివాక రాయలసీమలో నీటి కరవు, క్షామాలు, ఇక్కడి దారిద్య్ర పరిస్థితులను అందరికీ తెలియజెప్పాలనే ఆలోచన మదిలో మెదిలింది. తెలంగాణ పోరాటం నేపథ్యంలో అది మరింత బలపడింది. నా కలను కలంతో నిజం చేసుకున్నాను. వర్షాలు లేక పంటలు పండవు. పన్నులు వసూలు కావు. దాంతో అనంతపురం హండే రాజు టిప్పు సుల్తానుకు కప్పం చెల్లించలేడు. ఈ నేపథ్యంలో బిల్లె ఎల్లప్ప అనే పాలెగాడు ఆలోచనలో పడతాడు. శ్రీశైలం వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటే వర్షాలు విస్తారంగా కురిసి పంటలు పండుతాయని ఆశిస్తాడు. ఆ తర్వాత కప్పం కూడా చెల్లించవచ్చని భావిస్తాడు. నీటి సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి చేసే ఆత్మబలిదానాన్ని చిత్రించాను. 
ఈ నవల పూర్తవడానికి దాదాపు దశాబ్దం పట్టింది కదా..? 
ఓ ఏడాది పాటు 18వ శతాబ్దంలోని క్రీడలు, పెళ్లిళ్లు, పేరంటాలు, పరసలు, వస్త్రధారణ తదితర విషయాల మీద అధ్యయనం చేశాను. నవలలోని పాత్రలు, నేపథ్యం, వాటి మధ్య సంభాషణలు లాంటి వాటిని ఒక కొలిక్కి తెచ్చాను. ఇవన్నీ పదేళ్ల పాటు మనసులో నలిగి అక్షరరూపం పొందాయి. అధ్యయనానికి ఏడాది, రాయడానికి మరో సంవత్సరం, ఇదంతా ఓ రూపు దాల్చడానికి ఇంకో ఏడాది పట్టాయి.
ఇన్నేళ్ల సాహితీ ప్రస్థానంలో మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు.. 
మనుషుల్లో ప్రతి ఒక్కరికీ స్పందనలుంటాయి. కొందరిలో ఆ మోతాదు ఎక్కువ. అలాంటి వారు రచయితో, కళాకారుడో అవుతారని పెద్దలంటారు. నాకూ స్పందించే గుణం ఎక్కువ. అదే నన్ను రచయితగా మార్చింది. మర్చిపోలేని జ్ఞాపకాలంటే నాకొచ్చిన అవార్డులు, రివార్డులు కాదు. నన్ను సంతోషపెట్టే జ్ఞాపకాలన్నీ నా రచనలే. సంఘ పశువు, కల్లుమడి... ఇంకా ఇలాంటి రచనలను ఎలా చేశానా అని గుర్తు చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. 
రచయితగా మీ దృక్పథం ఏంటి?  
జీవితంలో పరిస్థితులను బట్టి నా దృక్పథాలు మారుతూ వచ్చాయి. మా నాన్న ఆశయాలకు అనుగుణంగా వామపక్ష ప్రభావం ప్రారంభంలో ఎక్కువగా ఉండేది. డిగ్రీ చదివే సమయంలో ఆస్తికుడిగా మారిపోయా. కథలు రాస్తూ రాస్తూ.. 1990 కాలంలో నేను, ప్రేమ్‌చంద్‌ లాంటివాళ్లం దళిత బహుజన అంశాల్లోకి వెళ్లాం. ఎక్కడో సుదూరంలో కనిపించే లక్ష్యం చేరుకునే దానికన్నా వెనుకబడిన కులాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రధానమనిపించింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకునే సందర్భంలో రాయలసీమ అస్తిత్వంలోకి మారాను. ఒకప్పుడు నన్ను వర్గం పరిపాలిస్తే, తర్వాత కులం, ప్రాంతం పాలించాయి. ఈ మూడు అస్తిత్వాలే నన్ను రచయితగా మలచాయి. వ్యక్తుల జీవన విధానాన్ని గమనిస్తూ, వాటినే పాత్రలుగా మలచుకుని రచనలు చేశాను. చేస్తున్నాను. నావి పరిష్కారాలు లేని రచనలనే విమర్శ కూడా అప్పట్లో వచ్చింది. రాయలసీమ అస్తిత్వం వైపునకు వచ్చాక సమస్యలకు పరిష్కారం చూపేలా కథారచన ప్రారంభించాను.
ఇనాక్, సింగమనేని, చిలుకూరి దేవపుత్రలను మీ సాహిత్య గురువులుగా చెప్పుకున్నారు. మీ మీద వాళ్ల ప్రభావం? 
కథ రాయడం ఎలా? ప్రారంభం, ముగింపు ఎలా ఉండాలి? ఆ మధ్యలో కథను ఎలా నడపాలి? లాంటి మెలకువలను సింగమనేని, దేవపుత్రల నుంచి నేర్చుకున్నాను. కొలకలూరి ఇనాక్‌ నాకు డిగ్రీలో తెలుగును బోధించిన గురువు. పాఠం చెప్పే సమయంలో వర్తమాన సాహిత్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన వివరించేవారు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ చదవని వారు తెలుగువారే కాదని ఇనాక్‌ అనేవారు. ఆ మాటలు విని కళాశాల గ్రంథాలయంలో ఉన్న ఆ పుస్తకాన్ని చదివి సాహిత్యం మీద మరింత మక్కువ పెంచుకున్నాను. ఆయన నా గురువు అని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడతాను.
రాయలసీమ కథా సాహిత్యం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడెలా ఉంది? 
ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ కథా సాహిత్యం ప్రత్యేకమైంది. ఉత్తరాంధ్ర కథను విప్లవం ప్రభావితం చేసింది. తెలంగాణ కథను విప్లవంతో పాటు సాయుధ పోరాటం ప్రభావితం చేసింది. గుంటూరు ప్రాంతాల మీద చలనచిత్రాల ప్రభావం ఎక్కువగా ఉంది. రాయలసీమ ఉద్యమ శూన్య ప్రాంతం. ఇక్కడ ఉద్యమాలు ఉండవు. ఒకవేళ జరిగినా ఇతర ప్రాంత వాసుల కోసం ఉద్యమాలు చేశారే కానీ తమ కోసం తాము చేసుకోలేదు. పోరాటాలు, సిద్ధాంతాల ప్రభావం లేకుండానే ఇక్కడి ప్రజల జీవితం కథలోకి వచ్చింది. ఇక్కడి నుంచొచ్చిన నవలలు, కథల్లోని పాత్రలన్నీ సజీవమైనవి. ఇవన్నీ నిసర్గమైన పాత్రలు. గతంలో రాయలసీమలో కథ విజృంభించింది. ప్రస్తుతం కవిత్వం ఉరకలేస్తోంది.  
నవతరం కథకులకు మీ సూచనలు..
ఎవరికి వారు తమ ప్రాంతాలు, కులాలు, వర్గ మూలాల్లోకెళ్లి, ఆయా పరిస్థితుల్ని అవగతం చేసుకుని రచనలు సాగించాలి. మన చుట్టూ జరిగే సంఘటనలు, ఎదురయ్యే సమస్యలే రచనలకు బీజం అనే విషయాన్ని గుర్తించాలి.
చారిత్రక నవలకు మీ నిర్వచనం? 
చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాణ్నే కానీ చరిత్రకారుడిని కాను. ‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌... అది మోసిన బోయీలెవ్వరు’ అని శ్రీశ్రీ ప్రశ్నిస్తే.. ‘చరిత్ర అంటే రాజులు, వారి వైభోగం, విశేషాల గురించి కాదు, రాజుల చేతుల్లో అణచివేతకు గురైన ప్రజల గురించి రాయడం’ అని కోశాంబి తన రచనల ద్వారా తెలిపారు. ఇలాంటి మాటలే నా చారిత్రక రచనను శాసించాయి. తెలుగులో చారిత్రక నవలలు ఇంకా రావాలి. ఇవి పాఠకుల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు ఒకప్పటి ఎన్నో విశేషాలను వివరిస్తాయి.  
తెలుగునాట నవలలకు ఆదరణ ఎలా ఉంది? 
కవిత్వం చదవడం మానేశారు. కథలు అంతో ఇంతో చదువుతున్నారు. వందల పేజీల నవలలను ఎవరు చదువుతారనే సందేహం ఉండేది. అదంతా అవాస్తవమని ‘తానా’ నవలల పోటీల్లో శప్తభూమి, నీల, ఒంటరి నవలలు నిరూపించాయి. నవలలు చదివే ఆసక్తి తెలుగు పాఠకుల్లో ప్రస్తుతం బాగానే ఉంది. ‘శప్తభూమి’ని తానా వారు మూడో సారి ప్రచురించారు. ఇప్పటి వరకు 4 వేల ప్రతులు ముద్రించారు. రెండేళ్లలో నాలుగు వేల మంది పాఠకులు ఎలా చదివారు? పుస్తక విక్రయ కేంద్రాలు నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా విస్తరించాలి. అక్కడ పఠనాసక్తి ఎక్కువగా ఉంది. పుస్తకాన్ని పాఠకుల ముంగిటకు తీసుకెళ్లాలి. 
పిల్లలకు సాహిత్యం మీద అభిరుచిని ఎందుకు కలిగించలేకపోతున్నాం?
ఇది చాలా విచారకరం. ప్రస్తుతం విద్యాభ్యాసం ఫలితాలకే పరిమితమైంది. ఫలితాలు తగ్గితే అధికారుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రయత్నాలు జరగట్లేదు.  పాఠ్యాంశాలు పూర్తిచేశారా? ఫలితం ఎంత శాతం వచ్చిందనే ప్రశ్నిస్తున్నారు తప్ప, తరగతి గదిలో కథలు చెప్పారా? రచనలో మెలకువలు నేర్పారా? అని ఎవరూ అడగటంలేదు. ఇంకా విషాదం ఏంటంటే చాలామంది విద్యార్థులు గణితం, ఆంగ్లాల్లో తప్పుతుంటారు. దీన్ని చూపిస్తూ, తెలుగేం చదువుతావు, అది ఎలాగైనా పాస్‌ కావచ్చు, ముందు ఆంగ్లం, గణితం చదవండి అని ఉపాధ్యాయులు పిల్లలకి చెబుతుంటారు. ఈ రకంగా తెలుగును వెనక్కి నెడుతున్నారు. సృజనాత్మక రంగంలో పిల్లలు అనాథలయ్యారనేది పచ్చి వాస్తవం. 
ప్రస్తుతం తెలుగు భాష స్థితిగతులు ఎలా ఉన్నాయి?
‘కామన్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ’కి ప్రభుత్వం స్వస్తి పలికి కాన్వెంట్లకు అనుమతివ్వడం మొదలైనప్పటి నుంచి భాషా క్షీణత ప్రారంభమైంది. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు ఉంది. ఇప్పుడు తెలుగు మాధ్యమాన్ని తొలగించి ఆంగ్లాన్ని ప్రవేశపెడితే తెలుగు మరింత ప్రమాదంలో పడుతుంది. ప్రజలు ఆంగ్ల మాధ్యమం కావాలనుకున్నారు కానీ.. తెలుగును ఎవరూ తిరస్కరించట్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు మాధ్యమాలనూ కొనసాగించినప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. 
ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన మీద ఓ ఉపాధ్యాయుడిగా మీ అభిప్రాయమేంటి?  
ప్రస్తుతం ఆర్థిక యుగం నడుస్తోంది. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. పిల్లలకు తెలుగు రావాలని, సృజనాత్మక శక్తి వెలుగు చూడాలని, తమ బిడ్డ కవో, రచయితో కావాలని ఎవరూ అభిలషించడంలేదు. ఈ విషయంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని తప్పుబట్టే పనిలేదు. ప్రస్తుతం వ్యవస్థ అంతా విషవలయంలో ఉంది. సృజనాత్మక శక్తికి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సరిగా లేవనే చెప్పాలి. 
పిల్లల్లో భాషాభిమానం పెరగాలంటే..? 
ఇది ప్రజల సమస్య కాదు. ప్రభుత్వ సమస్య. భాష మీద అభిమానం ఊరకే పెరగదు. పూర్వం సంస్కృతం నేర్చుకుంటేనే రాజ్యంలో కొలువు దక్కేది. అందుకే కచ్చితంగా నేర్చుకుని బతుకుదెరువు చూసుకునేవారు. తెలుగు ప్రజల భాష. తెలుగు భాష నేర్చుకున్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగు చదువుతారు. భాషకూ, బతుదెరువుకు సంబంధం ఉండేలా ప్రభుత్వం చొరవ చూపితే తప్ప భాష బతకదు. తెలుగు నేర్చుకుంటే బతుకుదెరువుకి ఎలాంటి ఢోకా లేదు అనుకున్నప్పుడే ఆ భాషలో       
నిష్ణాతులవుతారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం