తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగువారి ఇంటి నృత్యం కూచిపూడి

  • 326 Views
  • 2Likes
  • Like
  • Article Share

    బొండ్ల అశోక్,

  • విజయవాడ
  • 8008272762

తెలుగు వారి కళారూపమైన కూచిపూడిని విశ్వవ్యాప్తం చేసిన కళాకారులెందరో. సిద్ధేంద్రయోగి, క్షేత్రయ్యలు నడయాడిన నేల నుంచి ఉద్భవించిన ప్రతిభావంతులెందరో తమ జీవితాలను నాట్యమే సర్వస్వంగా ధారపోశారు. అలా కూచిపూడి కళకే అంకితమై జీవిస్తున్న వేదాంతం రాధేశ్యామ్‌..  దిల్లీలో కేంద్రసంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఆ సందర్భంగా ‘తెలుగు వెలుగు’తో ఆయన పంచుకున్న అభిప్రాయాలు, అనుభవాలు..
కూచిపూడి నృత్యానికి, తెలుగు సాహిత్యానికి మధ్య అనుబంధం ఎలాంటిది?

తెలుగు సాహిత్యం నుంచి పుట్టిందే కూచిపూడి. భాష శబ్ద ప్రధానమైంది. నృత్యంలో శబ్దాలు, కృతులు, పదాలకు అనుగుణంగానే శరీర లయ, భంగిమ, కదలిక, అభినయం ఉంటాయి. రెంటినీ వేరు చేసి చూడలేం. క్షేత్రయ్య, త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు కృతులకు కళారూపాలుగా ఎంతటి ప్రాశస్త్యం ఉందో.. సాహిత్యపరంగానూ అంతే ప్రాధాన్యముంది. భాగవతం లేనిదే.. భామాకలాపం, పారిజాతాపహరణం లేవు. కాబట్టి తెలుగు భాషే కూచిపూడికి ఆలంబన. ముఖ్యంగా నృత్యశాస్త్రంలో అనేక శాఖలు ఉన్నా.. తెలుగు భాషకు, తెలుగు వారి నృత్యమైన కూచిపూడికి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సులువుగా ఉచ్చరించడానికి, పాడటానికి, ప్రదర్శించడానికి అనువైన భాష మనది. దక్షిణా పథాన్ని ఏలిన కృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అందుకే అన్నారు. ముఖ్యంగా ‘కన్నడ కస్తూరి.. తెలుగు తేట’ జంట ప్రవాహాలు. ఇవి ఎన్నోచోట్ల మిళితమై.. మళ్లీ విడిపోయినట్లుగా పారుతాయి. ఆనందభైరవి, కూచిపూడి ఈ రెండూ ఆయా భాషల్లోంచి ఉద్భవించినవే.. 
కూచిపూడి నాట్యం సమాజంలోని అన్ని వర్గాలకు చేరువైందని భావిస్తున్నారా? 
తప్పకుండా... తెలుగునాటే కాదు, విశ్వవ్యాప్తంగా కూచిపూడి కళకు ఆదరణ పెరుగుతోంది. పూర్వం కూచిపూడి అగ్రహారం లాంటి కొన్ని గ్రామాల్లోని కొన్ని వర్గాల కుటుంబాలు ఈ కళను సాధన చేసి, ఔపోసన పట్టి, ప్రదర్శించేవి. నాట్యమే జీవనాధారంగా నమ్ముకున్న కుటుంబాలు ఎన్నో.. కానీ నేడు ఉపాధిగా కాకుండా, అభిరుచితో నేర్చుకుంటున్న వారు కోకొల్లలు. అందుకే ఈ నాట్యం ప్రాంతాలు, వర్గాలు, మతాలకు అతీతంగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. సమాజంలోని అన్ని వర్గాలకూ చేరువవుతోంది. గిరిజన కుటుంబాల నుంచీ కళాకారులు వస్తున్నారు. నవతరం నృత్య కళాకారుల నేపథ్యాన్ని తరచి చూస్తే మనకీ విషయం అవగతమవుతుంది. తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రవేశం తీసుకునే విద్యార్థుల సర్టిఫికెట్లు చూసినా రూఢి అవుతుంది. 
కూచిపూడిలో సమకాలీన సమాజ స్థితిగతులు ఏ మేరకు ప్రతిబింబిస్తున్నాయి? నాట్యసాహిత్యంపై కొత్తగా రచనలు, పరిశోధనలు ఎలా సాగుతున్నాయి?
ఒకప్పుడు ఇతిహాసాలు, పురాణాలు, భాగవతంలోని కథా వస్తువే ఆధారంగా నృత్య రూపకాలు తయారుచేశారు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులపై, మారుతున్న సంప్రదాయాలు, కట్టుబాట్లు, జీవన శైలిని సందేశాత్మకంగా, వ్యంగ్యంగానూ కూచిపూడి ద్వారా ప్రదర్శనలిస్తున్నారు. సినిమా తెరమీద ఎన్నో సన్నివేశాల్లోనూ కూచిపూడి ఓ భాగమైంది. వాణిజ్య ప్రకటనల్లోనూ వాడుకుంటున్నారు. ఇదంతా కళా వ్యాప్తే. సమకాలీనత ఉంది కాబట్టే కాలపరీక్షకు నెగ్గి నిలవగలిగింది. ఇంకో ఉదాహరణ.. కూచిపూడి నాట్యానికి తలమానికం ‘భామాకలాపం’ అయితే, దానికి తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్నది ‘గొల్లకలాపం’. మానవ జీవన క్రమాన్ని కళ్లకు కట్టే నృత్యరూపకమిది. ఓ గొల్ల యువతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్రాహ్మణుడు తనను తాను ఆవిష్కరించుకునే అద్భుత నాటకం. ఇందులో గొల్ల యువతికి, బ్రాహ్మణుడికి మధ్య భేదం చూపలేదు. వర్గతారతమ్యం ఎక్కడా కన్పించదు. 
‘గొల్ల కలాపం’కు పూర్వవైభవం తీసుకువచ్చింది మీరే కదా!
మా పెద్దలు ఆరేడు దశాబ్దాల కిందట రూపొందించిన గొల్లకలాపం మధ్యలో తెరమరుగైంది. నేను పసివాడిగా ఉన్న సమయంలో పెద్దల నుంచి విన్నవీ, కన్నవీ కలిపి, నా సొంత ఆలోచనలు జోడించి ఓ రోజు మా ఊళ్లోనే ప్రదర్శన ఇచ్చాను. ఇది చూసిన మా గురువు పసుమర్తి కృష్ణమూర్తిగారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘రాధా.. మా చిన్నతనంలో అచ్చం ఇలాగే ఆడేవారురా.. ఎలా నేర్చావురా..?’ అంటూ తన్మయత్వంతో హత్తుకుని అభినందించారు. అలా దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధించాను. ఇది రెండు భాగాలు. ఒకటి పిండోత్పత్తి. రెండోది ఆత్మయజ్ఞం. 
      మనిషి మరణించిన తర్వాత భౌతికంగా క్రియాహీనంగా మారుతాడు. ఆత్మ ఎలా సంచరిస్తుంది? తిరిగి స్త్రీ గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది? తల్లి గర్భంలో శిశువు పడే ఆవేదన (గర్భ నరక యాతన) ఏంటి? ఆ సందర్భంలో పరమేశ్వరుడితో ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు? వరకు పిండోత్పత్తిలో భాగంగా ప్రదర్శిస్తారు. మనిషి భూమిపై పడ్డాక బాల్య, కౌమార, యవ్వన, ప్రౌఢ, వార్ధక్య దశలను ఎలా అనుభవిస్తాడు. ఈ మాయా ప్రపంచంలోని భౌతిక సుఖాలకు అలవాటు పడి.. పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ఎలా తప్పుతాడు? అరిషడ్వర్గాలకు(కామ, క్రోధ, లోభ, ధన, మద, మాత్సర్యాలు) లోనై ఎలాంటి జీవితం గడుపుతాడు? పుత్ర, మిత్ర, భ్రాతృ, కళాత్రాదులతో వాత్సల్యాన్ని పెంచుకొని స్వార్థజీవిగా ఎలా మారుతాడు అన్నది ఓ విప్రుడు గొల్ల యువతికి ఇచ్చే సందేశమే రెండో భాగమైన ఆత్మయజ్ఞం. జీవాత్మ, పరమాత్మతో విలీనం కావడానికి పడే తపనే ‘గొల్ల కలాపం’ సారాంశం. దీన్ని వెలుగులోకి తెచ్చింది మా ముత్తాత భాగవతుల రామయ్య. అయితే మూలభావనకు భంగం కలగకుండా నేటి సమాజానికి అద్దం పట్టేలా మరింత విస్తృతంగా నేను రూపొందించాను. 
మీరు స్వయంగా రూపొందించిన ఇతర నృత్య రూపకాలు ఏంటి? 
కృష్ణదేవరాయలు ‘భువనవిజయం’లో అష్టదిగ్గజాలను పోషించినట్లుగానే లలితకళలనూ పోషించాడు. ఆయన స్వయంగా సాహితీవేత్త, కళా ప్రియుడు కావడం ఇందుకు కారణమేమో! రాయల కళాతృష్ణ, కళామతల్లికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ నేను స్వయంగా రాసుకున్నదే ‘కృష్ణదేవరాయ నాట్యవిలాసం’. రాయల పట్టాభిషేకానికి 500 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల కిందట అనంతపురం జిల్లా పెనుగొండ, లేపాక్షి, కర్ణాటకలోని హంపీ, బళ్లారి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రాయల ఉత్సవాల్లో దీన్ని ప్రదర్శించాను. నేను స్వయంగా రాజనర్తకి పాత్రలో నర్తించాను. పెనుగొండలో జరిగిన ఈ వేడుకలో నాటి సభాసదులు తన్మయానికి లోనై.. మరోసారి ప్రదర్శన ఇవ్వాల్సిందిగా కోరడం గొప్ప అనుభూతి. 
ఇక ‘భక్త ప్రహ్లాద’ బాగా ప్రసిద్ధి చెందిన కూచిపూడి నృత్య రూపకం. దీన్ని ‘ప్రహ్లాద విజయం’గా మార్చి మరింత విస్తృతంగా తయారు చేశాను. ఉదాహరణకు.. మూలకృతిలో ‘సనక సనందనాదులు వచ్చిరి’ అని ఏకవాక్యంలో తేల్చేశారు. కానీ వీక్షకులకు కనువిందు కావాలంటే.. ఆ సన్నివేశాన్ని కళ్లముందు కదిలేలా చేయాలి. అందుకే కొత్తగా రూపొందించిన రూపకంలో సనక సనందనాదులు ప్రహ్లాదుణ్ని పరీక్షించేందుకు వచ్చే సన్నివేశాన్ని అంచెలంచెలుగా వర్ణిస్తూ సాగింది. కూచిపూడి సృజనాత్మక ప్రక్రియ. ఇందులో సాహిత్యానికి తగ్గట్టుగా రసం, రసానికి తగ్గట్టుగా రాగం, రాగానికి తగ్గట్టుగా అభినయం ఉండి తీరాలి. అన్నీ సమపాళ్లలో సమకూరితేనే.. ప్రేక్షకుల చప్పట్లు.. విమర్శకుల ప్రశంసలు.
ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు మూలం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? 
సంస్కృత భాగవతంలో లేని ఎన్నో వర్ణనలను పోతన తెలుగు భాగవతంలో స్పృశించారు. గజేంద్ర మోక్షం, వామనావతారం అలాంటివే.. వామనుడు మూడు అడుగుల్లో ముల్లోకాలను ఆక్రమించిన వైనాన్ని సంస్కృతంలో ఒక వాక్యంలో తేల్చేశారు. ఇదే సన్నివేశాన్ని పోతన ‘ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై.. బ్రహ్మాండాంత సంవర్ధియై’ అంటూ నేటి త్రీడీ యానిమేషన్‌ సినిమాలోనూ చూపించలేనంత గొప్పగా దృశ్య సాక్షాత్కారం చేశాడు. విజ్ఞులైన వీక్షకులు, విమర్శకులు వేలెత్తి చూపనంత వరకూ ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛను తీసుకోవడం ఏ కవికైనా, రచయితకైనా, కళాకారుడికైనా అవసరమే. ‘ఆర్య వ్యవహార దృష్టంబు గ్రాహ్యంబు’ అన్నారు పెద్దలు. శ్రేష్ఠులైన వారి రచనలు అనుసరించడం కద్దు. వక్రభాష్యం చెప్పనంత వరకూ సమస్యేమీ లేదు.
భరతముని నాట్యశాస్త్రంలో కూచిపూడి, భరతనాట్యం, కథక్, మణిపురి, ఒడిస్సీ.. ఇలా పేర్లు పెట్టలేదు. వీటి మూలాలు ఒక్కటేనా..? వేర్వేరా?
తొలి నాట్యాచార్యుడు భరతుడు భావ, రాగ, తాళాల్ని.. భక్తి, రక్తి, తన్మయత్వంగా ఆనాడు మనకు అందించాడు. భరత వర్షమంతా ఆ కళాబీజాలు చల్లాడు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా కళారూపాలు ప్రసిద్ధి చెందాయి. అలా కృష్ణా నది ఒడ్డున కూచిపూడి గ్రామాన సిద్ధేంద్రయోగి పుణ్యాన పురుడుపోసుకున్నది తెలుగు వారి ఇంటి నృత్యం కూచిపూడి. తమిళనాట ప్రసిద్ధి అయిన భరతనాట్యం, నట్టువాంగం, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందిన కథక్, ఒడిస్సీ, మణిపురి.. అన్నింటికీ మూలం భరతముని నాట్యశాస్త్రమే. వేదాలు బ్రాహ్మణులకు, రుషులకే పరిమితమైన నాటి రోజుల్లో.. పండిత పామర జనరంజకంగా చతుర్వేద సారాన్ని రంగరించి రచించిందే నాట్యశాస్త్రం. ఇందులో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబించే లక్షణాలున్నాయి కాబట్టే ఎక్కడివారు అక్కడ తమకు అనుగుణంగా మలుచుకొని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకుంటున్నారు. 
కూచిపూడి నృత్య సంప్రదాయం, యక్షగానం ఒకే కళా రూపాలా? 
వీటి మధ్య పెద్ద భేదం లేదన్నదే నా అభిప్రాయం. ఈ రెండూ తెలుగులో వచ్చినవే.. కూచిపూడి అంటే నృత్యం.. సంగీతం అన్న అర్థంలో వాడతాం. యక్షగానం ఉత్సవాల సమయంలో ప్రదర్శించే సుదీర్ఘ నృత్యరూపకం. ఇది యంత్ర, గాత్ర, సంగీత, నృత్య సమ్మేళనం. అంటే ‘ఉత్సవ సంగీత గోష్ఠి’గా చెప్పొచ్చు. ఇక నట్టువాంగం తమిళ కళ. దీనికి తెలుగులో ‘హంగు’ అనే పదం సమానార్థకం. ఈ కళ ప్రదర్శించే వాళ్లను హంగుదారుడు, సూత్రధారుడు అని పిలుస్తారు. జరగబోయే సన్నివేశాన్ని వర్ణిస్తూ రాగయుక్తంగా పలకడం ఇందులో కీలకాంశం. నట్టువాంగం ప్రదర్శించే కళాకారుడికి వచనశక్తి, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉండాలి. నేను రూపొందించిన ‘ప్రహ్లాద భక్త విజయం’లో నేనే సూత్రధారుడిగా 2008లో అమెరికాలో ప్రదర్శన ఇచ్చాను. 
కూచిపూడికి తెలుగునాడు కంటే విదేశాల్లోనే ఆదరణ ఎక్కువ కదా!
నిజమేననిపిస్తుంది. విదేశాల్లో కంటే తమిళనాడులో బాగా ఆదరణ ఉందన్నది వాస్తవం. మిగతా విషయాల్లో తమిళనాడులో తెలుగు వారిపట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పలేను కానీ, కూచిపూడి పట్ల మాత్రం వారి ఆదరణ అద్భుతం. మనం నీటి గట్టున ఉన్నాం కాబట్టి నీటి విలువ తెలియదు. ఎడారిలో ఉన్నవారికే దాని విలువ తెలుస్తుంది. భారతీయ కళలు, సంప్రదాయాల పట్ల ప్రవాస భారతీయుల భావనా అలాంటిదే. కూచిపూడికి ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాల్లో విశేష ఆదరణ ఉంది. విదేశాల్లో మన ప్రదర్శనలకు వచ్చే కళాభిమానుల్లో ఉత్సుకత, అభినందనల్లో నిష్కల్మషత నన్ను ఆశ్చర్చపరుస్తాయి. మాస్కో, లండన్, అమెరికాలోని పలు నగరాల్లో కూచిపూడి అకాడమీలు నెలకొల్పడం వారి కళాతృష్ణకు సంకేతం. అక్కడి తెలుగు సంఘాలు ఆర్థికపరమైన సహకారాన్ని అందిస్తూ, కళాపోషణకు కంకణం కట్టుకున్నాయి. వారికి మనం కృతజ్ఞులం.
మన దగ్గరా కళలకు ఆదరణ పెరగాలంటే ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి?
రాజపోషణ ఉండాలి. పోషకులు లేనిదే ఏ కళా బతికి బట్టకట్టదు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానిక పండగలకు ప్రాధాన్యం పెరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు దయతలచాయి కాబట్టే. కళలనూ అలాగే ప్రోత్సహించాలి. కళాకారులకు గుర్తింపునివ్వాలి. ప్రతి ప్రాథమిక పాఠశాల స్థాయిలో లలితకళలు బోధించే ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రత్యేకంగా పీరియడ్లు ఉండాలి. పిల్లలకు అవసరమైతే సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించైనా నేర్పాలి. ఇందులో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలి. ఇదేదో.. కళాకారులకు ఉపాధి కోసం కాదు.. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచడానికి. 
నృత్యం శారీరక, మానసికోల్లాసానికి ఎలా దోహదపడుతుంది? 
శారీరక, మానసికోల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కళ మంచి టానిక్కు. ప్రదర్శనకారులే కాదూ.. వీక్షకులూ ఎంతో ఉల్లాసానికి, ఉత్సాహానికి లోనవుతారు. కాకతీయ రాజులు యుద్ధానికి బయల్దేరే ముందు తమ సేనల్ని ‘పేరిణి’ నృత్యరూపకం ద్వారా కార్యోన్మున్ముఖుల్ని చేసేవారు. అంటే శారీరక దారుఢ్యానికి మించిన శక్తిని.. మానసికంగా కళారూపంలో సైనికుల్లో ప్రోది చేసేవారన్నమాట. రెస్టారెంట్లలో మందస్వరంలో సాగే సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కారులో వెళ్తూ ఎఫ్‌ఎం రేడియో వింటుంటే అలసట రాదు. అలాంటిది ఎంతో శాస్త్రీయత గల కూచిపూడి నృత్యం ద్వారా శరీరంలోని ప్రతి అవయవమూ కదులుతుంది. ముఖంలోని ప్రతి కణమూ భావాలను పంచుతుంది. అభినివేశంతో చేసే అభినయం తన్మయత్వానికి లోనుచేస్తుంది. 
కూచిపూడి కళకు, కళాకారులకు ఎలాంటి భవిష్యత్తు ఉందంటారు? 
ప్రభుత్వం సహకరిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇది ‘అస్తినాస్తి విచికిత్స’ అన్నట్లుగా అంతటా ఉన్నట్లుగానే కన్పిస్తుంది. ఒక్కోసారి ఎక్కడుందబ్బా? అన్న నిర్వేదం కలిగిస్తుంది. కడలి కెరటంలా పడుతూ లేస్తూ వస్తుంది. కళామతల్లి సేవలో జీవితాన్ని అంకితం చేసిన వారికి కేవలం సన్మానాలు, శాలువలతో సరిపోదు. బతుకుదెరువు చూపాలి. పరిశోధనకు అవకాశాలు కల్పించాలి. నిధులు కేటాయించాలి. ఇంగ్లండ్‌లో నేటికీ షేక్స్‌పియర్‌ నాటకాలు చూడటానికి జనాలు విరగబడి వస్తుంటారు. మరి విజయవాడలోనో, హైదరాబాద్‌లోనే పోతన భాగవతంపై ప్రదర్శన ఉందంటే ఎంతమంది వస్తారు? యూరప్, అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా భారీ ఆడిటోరియంలు ఉంటాయి. కళా ప్రదర్శనలు నిత్యకృత్యం. కళాభిమానుల ఆదరణా అలాగే ఉంటుంది. మన దగ్గరా అలాంటి పరిస్థితుల్ని కల్పించాలి. పర్యాటక, సందర్శక క్షేత్రాలు, నగరాలు ఇందుకు వేదిక కావాలి. 
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శన గిన్నీస్‌ బుక్‌ రికార్డులకూ ఎక్కింది. దీనిపై స్పందన?
చాలా సంతోషకరం. అలాంటి ప్రదర్శనలు మరిన్ని సాగాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌ కూచిపూడిలో నాట్యారామం నిర్మాణానికీ పూనుకున్నారు. ఆయన సంకల్పం సాకారం కావాలని ఆశిస్తున్నాను.
దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. మరిచిపోలేని అనుభూతులు?
1984లో మా గురువు వెంపటి చినసత్యం గారు పోర్టోరికాలో ఓ ప్రవాస తెలుగు సంఘం ఆహ్వానం మేరకు మమ్మల్ని తీసుకెళ్లారు. అందులో భక్త ప్రహ్లాద నాట్యం ప్రదర్శించారు. ఇందులో నారదుడి పాత్ర వేయడానికి కళాకారులెవరూ లేరు. అప్పటికి నా వాయసు 29 ఏళ్లు. ఆ పాత్ర గతంలో వేసిన అనుభవమూ లేదు. పాత్ర వేయకపోతే గురువుగారి పరువుకు భంగం.. అప్పటికప్పుడు పాత్రల క్రమాన్ని ఓ కాగితం మీద రాసిచ్చారు. నేనెప్పుడెప్పుడు తెర ముందుకు వెళ్లాలో చెప్పారు కాని ఏం నర్తించాలో, ఏం సంభాషించాలో కూడా తెలియదు. అయినా సమయస్ఫూర్తి, సందర్భశుద్ధితో నెట్టుకొచ్చాను. తర్వాత బహుమతి ప్రదానోత్సవ సమయంలో కృష్ణమూర్తి గారు కళాకారులను పరిచయం చేస్తుంటే.. సభాసదులంతా ‘ఆ నారదుడి పాత్రధారుడేడి? ఎవరతను? అతని గురించి చెప్పండం’టూ ఈలలు వేశారు. ఆ సన్మానం, ఆ అభినందన మరిచిపోలేనిది. ఇక 2008లో న్యూజెర్సీలో జరిగిన సన్మానం కూడా గొప్ప అనుభూతిని ఇచ్చింది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకోవడమూ గొప్ప అనుభూతే. ఆ సందర్భంగా కూచిపూడి ప్రదర్శనకు 15 నిమిషాల సమయం ఇవ్వగా.. మా బృందం అరగంటకు పైగా సమయం తీసుకున్నాం. నిర్వాహకులు, ప్రేక్షకులు ఇంకా.. ఇంకా అంటూ ప్రోత్సహించడం కూచిపూడి కళకు దక్కిన గౌరవంగా భావిస్తాను. పాతికేళ్ల కిందట హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రహ్లాద పాత్రలో నేను మెప్పించిన వైనానికి ముగ్ధుడైన ఆరుద్ర.. దగ్గరికి తీసుకొని ముద్దెట్టుకున్నారు. ‘నీవు కూచిపూడి కొండవు.. ఇక్కడ పాములు, తేళ్లు ఉంటాయి. వేటికీ వెరవక సాధన చేయ్‌.. పైకొస్తావ్‌’ అంటూ దీవించారు. హైదరాబాద్‌ నాటక అకాడమీ వారు గతేడాది వార్షిక కాలెండర్‌పై నా చిత్రాలు ముద్రించి ప్రచురించుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నాకు ఇంటర్‌నెట్‌పై అవగాహన లేదు. కాని నా శిష్యులు వేదాంతం రాధేశ్యాం ప్రొఫైల్‌ అంటూ ఎప్పటికప్పుడు నెట్‌లో అప్‌డేట్‌ చేస్తున్నామని చెబుతుంటారు. ఇతర వృత్తులకు భిన్నంగా ఓ కళాకారుడికి దక్కిన గౌరవంగా భావిస్తాను. 
కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం రావడం ఎలా అనిపిస్తోంది?
కూచిపూడి కళను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేసిన ఎందరో మహానుభావులు నాకంటే ముందుతరాల వారున్నారు. వారికి దక్కని గౌరవం నాకు దక్కినా.. ఇది వారి దగ్గర నేర్చుకున్న శిక్షణ, వారసత్వంగా వచ్చిన కళ కాబట్టి ఈ పురస్కారం వారికే చెందుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ విరమణ పొంది స్వగ్రామంలో కూచిపూడి సేవలో తరిస్తున్నాను. శ్వాస ఉన్నంత వరకూ నిత్యవిద్యార్థిగా సాధన చేస్తూనే.. కొత్త కళాకారులను తయారు చేయడంలో నిమగ్నమవుతాను. చివరి శ్వాస వరకూ కూచిపూడిలోనే ఉంటాను.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి