తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సంగీత ప్రియులకు వాద్య నైవేద్యం

  • 271 Views
  • 0Likes
  • Like
  • Article Share

ద్వారం వెంకటస్వామి నాయుడు గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరు. తన వాద్య పటిమతో తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనుడు ఆయన. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వయొలిన్‌ వాద్యంలో తనదైన ముద్రవేసిన మూడోతరం ప్రతినిధి ద్వారం దుర్గాప్రసాదరావు. ఆయన్ను ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా తెలుగునాట సంగీతం, సాహిత్యం తదితరాల మీద ఆయన ‘తెలుగువెలుగు’తో పంచుకున్న అభిప్రాయమాలిక... 
కర్ణాటక సంగీతంలో వయొలిన్‌ విశిష్టత ఏంటి? 

ఇందులో వయొలిన్‌ ప్రధానంగా గాత్ర సహకార వాద్యం. దీని పూర్వ రూపం రావణహత్త (రావణ హస్తవీణ). ఇది ఉత్తర భారతదేశ జానపద కళకు సంబంధించిన వాద్యం. దీన్ని అరబ్బులు, జిప్సీలు ఐరోపా దేశాలకు తీసుకెళ్లారు. అక్కడే ఇది వయొలిన్‌గా రూపాంతరం చెందింది. కుడిచేతితో ధనువు పట్టుకొని ఎడమచేతి వేళ్లతో దీన్ని వాయిస్తారు. ఇది చైనా, కొరియా, జపాన్, భారత్‌లలో పరిణామం చెంది, ఐరోపాలో సంపూర్ణరూపం దాల్చింది. వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన పోర్చుగీసు వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ దేశస్థులు ఈ ఆధునిక వయొలిన్‌ను తమ వెంటబెట్టుకొచ్చారు. మద్రాసు సెయింట్‌ జార్జ్‌ కోటలో ఈస్ట్‌ఇండియా కంపెనీ సైన్యంలో ఈ వాద్య బృందాలు ఉండేవి. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామిదీక్షితులు తన క్షేత్రపర్యటనలో భాగంగా 1800 ప్రాంతంలో మద్రాసు వెళ్లారు. అప్పుడే ఆయన వయొలిన్‌ గురించి తెలుసుకున్నారు. తర్వాత దాంతో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తన సోదరుడు, శిష్యుడూ అయిన బాలుస్వామి దీక్షితులకు నేర్పించారు. అంటే కర్ణాటక సంగీతానికి అనుకూలంగా వయొలిన్‌లో అవసరమైన మార్పులు చేసి, ముఖ్యమైన వాద్యంగా మార్చింది వాళ్లే. వాటినే కొద్ది మార్పులతో మనం ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నాం. ఇది కర్ణాటక సంగీతంలో, లలిత, సినిమా వంటి శాఖల్లో తప్పనిసరిగా ఉపయోగించే వాద్యం. తర్వాత కాలంలో వయొలిన్‌ త్రిమూర్తులుగా ప్రసిద్ధులైన తిరుక్కొడికావల్‌ కృష్ణయ్యర్, తిరుచ్చి గోవిందస్వామిపిళ్లై, ద్వారం వెంకట  స్వామినాయుడులు దీన్ని సోలో వాద్యంగా తీర్చిదిద్దారు. మానవ   గాత్రానికి అతి సన్నిహితమైన ఒకే ఒక వాద్యం వయొలిన్‌. 
సోలో వయొలిన్‌ కచ్చేరీలకు ఇప్పుడు ఆదరణ ఎలా ఉంది? 
కర్ణాటక సంగీతంలో ముఖ్యస్థానం గాత్ర సంగీతానిదే. వీణ, వేణువు, వయొలిన్‌ ఏవి వాయించినా, కచ్చేరీ చేసే గాత్ర విద్వాంసులు పాడేవి త్యాగరాజస్వామి కీర్తనలే. అన్నమయ్య, క్షేత్రయ్య పదాలే. రాగాలాపన, స్వరకల్పన అనే అంశాలు ఎవరి ప్రతిభతో వాళ్లు పాడినా, వాయించినా కర్ణాటక సంగీతంలో పాటదే ప్రధానపాత్ర. వయొలిన్‌ పక్క వాద్యంగా తప్పనిసరి అయినందువల్లే దాన్ని వాయించేవారికి అవకాశాలు మెండు అని తృప్తిపడాలి. సోలోగా రాణించాలంటే అసాధారణ ప్రతిభ కలిగినవారికి మాత్రమే సాధ్యం.
వయొలిన్‌ కళలో మీ కుటుంబ వారసత్వ గొప్పతనం గురించి ఏమనిపిస్తుంది?
వెంకటస్వామినాయుడుగారు 1893 నవంబరు 8న దీపావళి రోజున జన్మించారు. అంతకు రెండుతరాల ముందునుంచే మా ఇంట్లో వయొలిన్‌ సాధన ఉండేది. మా తాతలు బెంగళూరులో ఆంగ్లేయ సైన్యంలో చిన్న ఉద్యోగాల్లో ఉండేవాళ్లు. అక్కడే వయొలిన్‌ నేర్చుకున్నారు. అయితే వాళ్ల వాద్యం రామ మందిరాల్లో భజనలకే పరిమితం. వెంకటస్వామి నాయుడుగారి అన్న వెంకట కృష్ణయ్యనాయుడు మాకు ఆదిగురువు. మాకు తాతగారు అవుతారు. ఆయన విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం ఆస్థాన విద్వాంసులు. ఆయన వయొలిన్‌ను నందిగామ వెంకన్నపంతులు దగ్గర అభ్యసించారు. ఆ విద్యను వెంకటస్వామి నాయుడుకు ధారపోశారు. వెంకటస్వామినాయుడు గొప్పతనం తెలుగువాళ్లందరికీ తెలిసిందే. మా వరకు ఆయనే గురువు. అంత గొప్ప విలువలు గల సంప్రదాయ వారసత్వం మా తండ్రి తాతల ద్వారా లభించడం మా అదృష్టం. ద్వారం సంప్రదాయంలో ప్రధాన లక్షణం సంప్రదాయం, ఆధునికతలను మేళవించి రసజ్ఞులను ఉత్సాహపరచడం. ఇంకా ఏ ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా ఉండటం. మా తాతవాళ్లు ఇతర విద్వాంసులకు వాద్య సహకారం అందించే పరిస్థితి ఉంటే మితిమీరకుండా ప్రతిభను ప్రదర్శించేవారు. ఈ విలువలు, సుఖభావం, రంజకత్వం లక్ష్యంగా పెట్టుకున్ననాడు ఈ వారసత్వం నిలుస్తుంది. ఇది శిష్యుల్లోనే కాదు శిష్య ప్రశిష్యుల్లో కూడా నిలవడం వల్లే ద్వారం శైలి ఒక సంప్రదాయంగా పరిణమించింది. 
మీ నాన్నగారూ మంచి విద్వాంసులు కదా... మీరు ఆయన దగ్గరే నేర్చుకున్నారా?
మొదట తాతగారు వెంకటకృష్ణయ్య, తర్వాత పదేళ్లప్పటి నుంచి మా నాన్న దగ్గర విద్య అభ్యసించాను. మా నాన్న నర్సింగరావుగారు ఎంత అసాధారణమైన విద్యనైనా చక్కగా బోధించి అందులో విద్వాంసుడిగా తీర్చిదిద్దగలరు. ఆయన రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు సాధన చేసేవారు. విద్యార్థుల వసతిగృహానికి తెల్లవారుజామున 4 గంటలకే వెళ్లి వారిని నిద్రలేపి సాధన చేయించేవారు. ప్రతిభ గల విద్యార్థులైతే వారి గాత్రానికి తాను సహకారం అందించి కచేరీలు చేయించేవారు. ఆయనలాంటి సాధకుడు, అన్వేషకుడు ఎక్కడా ఉండరు. వయొలిన్‌ వాయిద్యంలో పరిశోధన చేసి కొత్త టెక్నిక్స్‌ను సాధనచేసి ప్రజారంజకంగా ప్రయోగించగలిగిన విద్వాంసుడు మా నాన్నగారు. ఆయన మాకు నిత్య ఆదర్శం.
విజయనగరం సంగీత కళాశాలతో మీ అనుబంధం ఎలా మొదలైంది?  
చిన్నతనం నుంచి మేం ఇంట్లోనే విద్య నేర్చుకున్నప్పటికీ, మా బాల్యం అంతా సంగీత కళాశాల ప్రాంగణంలోనే గడిచింది. తర్వాత అదృష్టవశాత్తూ ఆ కళాశాలలో 22 ఏళ్లు అధ్యాపకునిగా, 18 ఏళ్లు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం దక్కింది. ఆ కళాశాల చరిత్ర హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, సంగీత కళానిధి వెంకటస్వామినాయుడు, ఆచార్య డొక్కా శ్రీరామమూర్తి, వాసా  వెంకటరావు, ద్వారం నర్సింగరావు వంటి గొప్ప గురువుల జీవితాలతో ముడిపడి ఉంది. వారి ఆదర్శాలు అందరూ అందుకోగలరా? ఏ సంస్థ అయినా నిత్య జీవితంతోను, యాజమాన్య పద్ధతులతోను కొంతవరకైనా ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుల ప్రతిభ, వాళ్ల గుణగణాలు ఎంతగొప్పవైనా, జీవితంలో మార్పు చెందుతున్న విలువలు సంస్థ మీద ప్రభావం చూపుతాయి. మా పూర్వులైన మహానుభావుల వ్యక్తిత్వాలను, విలువల్ని, వారి సాధన బోధన పద్ధతులను మేము ఎప్పుడూ మరవలేదు. వాళ్లను ఆరాధించుకుంటూనే ఉంటాం. మా దగ్గర చదువుకున్న చాలామంది విద్యార్థులు విద్వాంసులుగా పేరుతెచ్చుకున్నారు. అలా వాళ్ల గౌరవ అభిమానాలూ పొందగలిగాం. ఇదంతా పెద్దల ఆశీస్సుల వల్ల కలిగిందే. 
ఆ కళాశాల అభివృద్ధికి ఇంకా ఎలాంటి తోడ్పాటు అవసరం? 
కర్ణాటక సంగీతం అంటే ఉన్న ప్రేమతోను, గొప్ప ఆదర్శంతో విజయనగరం మహారాజులు 1909లో పుంభావ సరస్వతివంటి ఆదిభట్ల, ద్వారం, వాసా వంటి విద్వాంసులతో ఈ కళాశాల ప్రారంభించారు. విద్యార్థులకు వసతి కల్పిస్తూ, మూడు పూటలా భోజనం పెట్టి సంగీతం నేర్పించిన మొదటి దక్షిణ భారతదేశ కళాశాల ఇది. తెలుగు సంగీత రంగంలో మణిపూసలాంటి విద్వాంసులను తయారుచేసిన ఘనత దీనిది. మరో రెండేళ్లలో ఈ కళాశాల శత వార్షికోత్సవం చేసుకోనుంది. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు అధ్యాపకుల వేతనాలు పెరిగాయి. వారిలో అభ్యసనం రెట్టింపైంది. కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కేవలం రెండున్నర, మూడు గంటల కాలంపాటు విద్య నేర్చుకున్నా వాళ్లు అధ్యాపకుల పట్ల భక్తిని ప్రదర్శించడం విశేషం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ సంగీత కళాశాల స్థానం ఇప్పుడు 9, 10కి చేరింది. ఇప్పటికీ సంగీత విద్యపట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం, ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే కళాశాల ఇంకా మంచిస్థాయికి చేరుకుంటుంది. 
మీ సంగీత ప్రస్థానంలో మరచిపోలేని అనుభవాలు, అనుభూతులు... 
వెంకటస్వామినాయుడు, మా నాన్న నర్సింగరావునాయుడు నిత్య సాధకులు. రోజూ సాయం సమయాలలోను, రాత్రిళ్లు ఇంట్లో సహకార వాద్యాలతో శిష్యులతో కచేరి రూపంలో సాధన చేసేవారు. ఊళ్లో ఉండే కొంతమంది రసికులు శ్రోతలుగా ఉండేవాళ్లు. పబ్లిక్‌ కచేరీలకన్నా ఎక్కువ ప్రతిభతో ప్రయోగాలతో ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇళ్లలో ఆనందంగా ప్రదర్శనలు ఇచ్చేవాళ్లు. అలా వాళ్లతో కలిసి నేను వాయించే సందర్భాల్లో విన్న గొప్ప సంగీతం ఇంకెక్కడా దొరకని దివ్యమైన ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చేది.
మీ తరం వారి మాదిరిగానే నేటితరమూ సాధనలో శ్రమిస్తోందా?
ఒకరోజు సాధన మానితే మీ తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ తప్పులు శ్రోతలకు తెలుస్తాయని అనేవారు. ద్వారం వెంకటస్వామినాయుడు. జీవితంలో ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. ఈనాటి విద్యార్థుల గురించి చెప్పాలంటే ప్రతిభ, నేర్పరితనం, సాధన, అధ్యయనం పూర్వంకన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రొఫెషనల్‌ విద్వాంసులుగా రాణించాలన్న కృషి, పట్టుదల ఉన్న విద్యార్థులూ ఎక్కవమందే ఉన్నారు. అన్ని రంగాల్లోనూ యువత పూర్వంకన్నా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ముందంజ వేస్తున్నారు. సహజంగా విద్యార్థుల అభిరుచి, కుటుంబ, విద్యాసంస్థల నేపథ్య విలువలు కొరవడిన కారణంగా అన్ని ప్రతిభలు వ్యర్థం అవడానికి నేటి సమాజంలో చాలా అవకాశం ఉంది. మన సాంఘిక స్థితిగతులు, సంస్థలు బాగుపడకపోతే వాళ్ల దురదృష్టమనుకోవాలి. ఏ తప్పు అయినా యువతమీద రుద్దే కంటే మనం ఆత్మపరిశీలన చేసుకోవడం భవిష్యత్తుకు మంచిది.
తెలుగునాట మొత్తంగా చూస్తే సంగీతాన్ని, నృత్యాన్ని అభ్యసించేవారు తగ్గిపోతున్నారు కదా? 
ఉపాధి లేకుంటే ఏ విద్యపట్లా ఎవరూ ఆసక్తి చూపరు. ఇది సహజం. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేకున్నా ప్రదర్శన వల్ల ఉపాధి కలగాలి. అలాంటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే సంగీత విద్యపట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఏ విద్యకైనా ఉపాధి, ఉద్యోగం మాత్రమే ఆధారాలు. దాని గురించి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టకుంటే ఆదర్శాలు మాటల్లో మాత్రమే నిలుస్తాయి. సామాన్య ప్రజల్లోను, యువతలోను, బాలబాలికల్లోను లలిత కళలపట్ల అభిరుచి బాగానే ఉంది. జీవనశైలి బాగాలేకుంటే ఇది నీరసించి... ప్రజల దృష్టి తేలిక వినోదాల వైపు మళ్లుతుంది. పూర్వం కంటే ఎక్కువమంది సంగీతం, ఇతర కళలు నేర్చుకుంటున్నారు. వారి అభిరుచిని కాపాడుతూ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. 
కళలు పల్లెలకు చేరాలంటే ఏం చేయాలి? 
ఒకప్పుడు ఈ సంప్రదాయ కళలన్నీ గ్రామాల్లోనే పుట్టి పెరిగాయి. అగ్రహారాల్లో వేదశాస్త్రాలు, ఆలయాల్లో నృత్య సంగీతాలు ఉండేవి. గ్రామాలే మనదేశ అంతరాత్మ. ఈ రోజు నిజమైన గ్రామ జీవితం దూరమవుతోంది. నగరాలకు విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం గ్రామాలన్నీ వలస వెళ్తున్నాయి. వీటితోపాటే సంగీత, నృత్య నాటకాలు, సాహిత్యం తమ ఉనికిని కాపాడుకోవడానికి నగరాలను ఆశ్రయిస్తున్నాయి. గ్రామాల్లో విద్యను అందరికీ అందుబాటులో ఉంచేందుకు పాఠశాలలు, కళాశాలలు విస్తృతంగా స్థాపిస్తున్నారు. వాటిలో సంగీతం, నృత్యం లాంటి కళలకు చోటు కల్పిస్తే కళలు మళ్లీ పల్లెల్ని చేరుకుంటాయి.
ప్రస్తుతం తెలుగు భాషా స్థితిగతుల మీద మీ అభిప్రాయం? 
తెలుగు భాష బలంగా, ఆరోగ్యంగా పది కాలాలపాటు పచ్చగా ఉంటుంది అనడానికి ప్రజలు, పత్రికలే కారణం. మామూలు జనం, పసిపిల్లలు, మహిళలు మాట్లాడుతున్న తెలుగే దీనికి నిదర్శనం. ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో భాషలో మార్పులు రావడం సహజం. అయితే దేశాలు స్వయం పోషకంగా ఉంటే భాషలు కూడా స్వయం పోషకంగా ఉంటాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం