తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

భాషంటే ఉనికి... భాషంటే నాగరికత

  • 710 Views
  • 4Likes
  • Like
  • Article Share

సాయిమాధవ్‌ బుర్రా రాసింది నాలుగు సినిమాలకే అయినా నలభై సినిమాలకు వచ్చినంత పేరు వచ్చిందంటే కారణం ఇలాంటి సంభాషణలే. ‘‘దేవుడంటే సాయం’’, ‘‘ప్రేమంటే కలిసి ఉండటం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవ్వడం’’ లాంటి మాటలతో తెలుగువారిని ఆకట్టుకున్న రచయిత ఆయన. నాటకరంగం నుంచి ఎదిగివచ్చిన సాయిమాధవ్‌ నికార్సయిన రచయితే కాదు నిండైన భాషాభిమాని కూడా. తన రచనా ప్రస్థానంతో పాటు అమ్మభాష మీద తన అభిప్రాయాలనూ 
‘తెలుగువెలుగు’తో పంచుకున్నారు... 
మా సొంతూరు తెనాలి.
అమ్మ జయలక్ష్మి, నాన్న సుబ్రహ్మణ్యశాస్త్రి... ఇద్దరూ నాటకాలు వేసేవారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ నన్నూ, తమ్ముణ్ని రోజూ సినిమాకు తీసుకెళ్లేది. ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పద్యాలు పాడుతూ నాటకాలు సాధన చేస్తుండేవారు. మరోవైపు హార్మోనియం... ఈ వాతావరణంలో పెరిగిన నాకు ఎప్పటికైనా సినిమా రంగంలో స్థిరపడాలనే కోరిక ఉండేది. ఆరేళ్లప్పుడు నాటకం వేసే అవకాశం వచ్చింది. ‘హరిశ్చంద్ర’ నాటకంలో ఓ పాత్రధారి రాకపోయేసరికి ఆ వేషం నాకిచ్చారు. అలా రంగస్థలం మీద అడుగుపెట్టడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అప్పటినుంచి నేనూ నాటకాల మీద దృష్టిపెట్టా. ఈ క్రమంలో భాష మీద పట్టు వచ్చింది. తప్పులు దొర్లకుండా మాట్లాడటం, రాయడం అలవాటైంది. ఇలా ఓపక్క నాటకాలతో స్నేహం చేస్తూనే పదోతరగతి వరకూ బాగానే చదువుకున్నా. మార్కులు కూడా బాగా వచ్చేవి. అలాగే బడిలో ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయంటే నన్నే పిలిచేవారు. ఇంటర్‌కి వచ్చాక పరిస్థితి మారిపోయింది. అక్కడ స్వేచ్ఛ దొరకడంతో రోజూ సినిమాలకు వెళ్లడం... అల్లరిగా తయారవడంతో పరీక్షల్లో తప్పా. తర్వాత దూరవిద్యలో బీఏ పూర్తి చేశా. 
      చదువుకుంటూనే నాటకాలు వేసేవాణ్ని. చిన్నవయసులోనే ప్రజానాట్యమండలికి సంయుక్త కార్యదర్శిగా చేశా. ‘అరసం’తో కలిసి పనిచేశా. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి దగ్గరయ్యా. సమకాలీన విషయాల మీద అవగాహన పెంచుకున్నా. అదే క్రమంలో నాటకాలు రాయడం ప్రారంభించా. వాటికి నేనే దర్శకత్వం వహించేవాణ్ని. మొత్తం ఏడు నాటకాలు రాశా. వాటిలో ‘అద్దంలో చందమామ’ బాగా ఆడింది. పరిషత్తుల వాళ్లు పోటీ పడి ప్రదర్శించేవారు. నూతలపాటి సత్యనారాయణ అని ఓ రచయిత ఉండేవారు. ఆయన ఆర్టీసీలో పనిచేస్తూ సినిమాలకు ఘోస్ట్‌రైటర్‌గా చేసేవారు. నేను సినిమాలకు పనికి వస్తానని ఆయనే గుర్తించారు. నా మీద నాకు నమ్మకం పెంచారు. ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అనే విషయాల్లో అవగాహన కల్పించారు. ఆయన కల్పించిన నమ్మకం, ఇచ్చిన ధైర్యంతోనే సినిమా రంగంలోకి వచ్చా. 
‘పుత్తడిబొమ్మ’తో తొలి అడుగు
వచ్చాను కానీ, హైదరాబాదులో ఎవరూ తెలియదు. ఎక్కడికి వెళ్లాలో, ఎవర్ని కలిస్తే పని అవుతుందో తెలియదు. ఎందుకో అప్పట్లో కొంచెం ఆత్మన్యూనత కూడా ఉండేది. నాకప్పుడు పెద్దగా వయసు కూడా లేదు. ఇక ఏ రచయిత దగ్గరికి వెళ్లి అవకాశం అడగను? అలాగే తోచిన మార్గాల్లో అవకాశాల కోసం ప్రయత్నించా. ఆ క్రమంలోనే ఈటీవీ ‘పుత్తడిబొమ్మ’, ‘శిఖరం’ ధారావాహికలకు మాటలు రాసే అవకాశం వచ్చింది. ‘పుత్తడిబొమ్మ’ క్రిష్‌ నాన్నగారి నిర్మాణ సంస్థలో వచ్చిన ధారావాహిక. అప్పుడే నా పనితీరును దగ్గరగా చూసిన క్రిష్‌ ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’కు మాటలు రాయమన్నారు. అప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో అంతే సవాలుగానూ తోచింది. 
      కళాశాల, ప్రేమ, హాస్య కథలకు మాటలు రాయడం సులువే. ‘కృష్ణం వందే జగద్గురుం’ అలా కాదు. భగవద్గీత చదవాలి. అర్థం చేసుకోవాలి. పైగా నాటకాలకు సంబంధించిన కథ. సమకాలీన అంశాలను స్పృశించే పాత్రలు. అలాంటి సినిమాకు రాయడం కొంత సవాలే. పైగా అది నా తొలిచిత్రం. అయినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశా. 
      సినిమాకు మాటలు రాసేటప్పుడు కథ ముఖ్యం. పాత్ర స్వభావం, ఆ పాత్ర పోషించే నటుడు, అతని దేహభాషను బట్టి రాయాలి. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘గోపాల గోపాల’, ‘కంచె’. ఇవి సమకాలీన అంశాల నేపథ్యంలో వచ్చినవే అయినా, వాటిలో పాత్రలు మాత్రం దాదాపు తెలుగులోనే మాట్లాడతాయి. అత్యవసర సమయాల్లో తప్ప ఆంగ్లం రాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే పోసాని కృష్ణమురళి గారికి మాటలు రాయడం చాలా కష్టం. ఆయనే ఓ మహారచయిత. ఎక్కడైనా పొరబాటు దొర్లితే ఇంకేమైనా ఉందా! అందుకే ఆయనకు మాటలు రాసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. 
సమాజానికి ప్రతిబింబమే సినిమా
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. సినిమాల్లో తెలుగు తగ్గిపోతుందన్నది వందశాతం నిజం. మరి సమాజంలో తెలుగు ఉందా అసలు!! సమాజంలో తెలుగు లేకపోతే సినిమాల్లోనూ ఉండదు. సినిమా... సమాజం ఉన్నట్టే ఉంటుంది. సమాజం ఒకలా.. సినిమా మరోలా ఉండవు. మనమంతా తెలుగులో స్పష్టంగా మాట్లాడినప్పుడు సినిమాలోనూ అలాగే ఉంటుంది. కళాశాల నేపథ్యంలో వచ్చే చిత్రాల్లో ఆంగ్ల పదాల వినియోగం తప్పదు. ఎందుకంటే బయట కళాశాలల్లోనూ అవి వినిపిస్తాయి కాబట్టి. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లోని ఏ ఒక్క పాత్ర నోటి నుంచి అయినా ఒక్క ఆంగ్ల పదమన్నా వచ్చిందా? రాదు.. ఎందుకంటే ఆ రోజుల్లో ఆంగ్లం ఎవరికీ తెలియదు. అందుకే ఆ చిత్రాల్లో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు మాత్రమే ఉంటుంది. ఈ రోజుల్లో బయట యువత ఒక్క నిమిషంలో అరవై ఆంగ్ల పదాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా దర్శకుడు తన సినిమా చూసే ప్రేక్షకుడు కథలో లీనమవ్వాలని కోరుకుంటాడు. అతణ్ని ఆయా పాత్రల వెంట తీసుకెళ్లాలనుకుంటాడు. ఆ చిత్రంలోని సన్నివేశాలు, సందర్భాలు తెర ముందు కూర్చున్న వాళ్ల నిజజీవితానికి దగ్గరగా ఉండేలా చూడాలనుకుంటాడు. ఆ క్రమంలో నేటి చలనచిత్రాల్లోకి ఆంగ్లం వచ్చేస్తోంది. ఇది సినిమా రంగం తప్పు కాదు. 
      అయితే, సినిమా రంగంలోనూ భాష గురించి ఆలోచించేవాళ్లు ఉన్నారు. రచయితల విషయాన్ని అలా ఉంచితే నటీనటుల్లోనూ భాషాభిమానులు కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో నిత్యం ఎంతోమంది పరభాషా నాయికలు పరిచయం అవుతూనే ఉంటారు. వాళ్లలో చాలామంది డబ్బింగ్‌ చెప్పకపోవచ్చు. కానీ ఎవరైనా మన భాష నేర్చుకుని మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది. నటన మీద ఉన్న పవిత్రమైన అభిప్రాయంతోనే వాళ్లలా కష్టపడతారు. దాన్నే కళాతృష్ణ అంటారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో నయనతారది పాత్రికేయురాలి పాత్ర. దానికి తగ్గట్టుగా మాటల్లో గాంభీర్యం, హుందాతనం ఉండాలి. నయనతార మాటల్లో అవి ఉంటాయి. అందుకే నేనూ, క్రిష్‌గారూ ఆమెతోనే డబ్బింగ్‌ చెప్పించాలనుకున్నాం. తనకి అదే విషయం చెప్పినప్పుడు ఒప్పుకుంది. ‘‘నేను డబ్బింగ్‌  చెబుతాననీ, చెప్పాలనీ మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు’’ అంది. దాంతో మేం తనకి మాటలు ఇచ్చాం. అప్పుడు తనేమందో తెలుసా! ‘’నేను తప్పు చెబితే వెంటనే ఆపేయండి. నయనతార భాషను తప్పుగా ఉచ్చరించింది అనే మాట నాకొద్దు. ఎందుకంటే నా మాతృభాషను నేను తప్పుగా పలకను. వేరే భాషను మాత్రం ఎందుకు తప్పుగా మాట్లాడాలి. వందసార్లయినా టేకులు తీసుకుంటా. కానీ భాషలో స్పష్టత ఉండాలి. తప్పులు రాకూడదు’’ అంది. ఆ అమ్మాయి మీద గౌరవం పెరిగింది ఆ క్షణంలో. టీవీ ఛానళ్లలో చూస్తున్నాం కదా... తెలుగులో పుట్టి తెలుగులో పెరిగిన వ్యాఖ్యాతలు వాళ్ల మాతృభాషనే సరిగా మాట్లాడట్లేదు! భాష విషయంలో నయనతార నిబద్ధత గొప్పగా అనిపించింది. నిత్యామేనన్‌ కూడా అంతే. మొదటి చిత్రం నుంచీ తనే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. తోటినాయికలకూ చెబుతోంది.
ఆత్రేయ... సిరివెన్నెల
నాటకం నాకిష్టమైన ప్రక్రియ. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అంటారు. కావ్యరచనలో నాటకానిది ప్రథమ స్థానం. అన్ని రసాలూ నాట్యం నుంచి పుట్టినవే. సినిమా నాటకానికి మరో రూపం. నాటకం సాంకేతికంగా ఎదిగితే సినిమాగా రూపం దాల్చుతుంది. ఇక సినిమా రంగానికి నాకంటే ఒక్కరోజు ముందు వచ్చిన రచయితతో సహా అందరూ నాకు ఇష్టమైన వారే. ఒక్కొక్కరిలోనూ ఒక్కో ప్రత్యేకత. అలనాటి ఆత్రేయ నుంచి నేటి వరకూ సినిమాలకు పని చేసిన, చేస్తున్న ప్రతి రచయిత నుంచీ నేను స్ఫూర్తి పొందుతా. 
      సంభాషణల పరంగా మాయాబజార్, కన్యాశుల్కం, ప్రేమ్‌నగర్, మూగ మనసులు చిత్రాలంటే చాలా ఇష్టం. వీటిలో భాష ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ‘వెలుగు నీడలు’ చిత్రంలో ‘‘కన్నీళ్లు మనిషిని బతికిస్తాయనుకుంటే.. అవి కూడా ఎప్పుడో కరవయ్యేవి’’ అని ప్రభాకర్‌ రెడ్డి చెబుతారు. అలాగే ‘ప్రేమ్‌నగర్‌’లో వాణిశ్రీ ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి... మరో ఉద్యోగం కోసం ఏఎన్నార్‌ దగ్గరికి వస్తుంది. అప్పుడు వచ్చే సంభాషణలు... 
ఏఎన్నార్‌: ఆకాశంలో తిరిగేవారు నేలమీదకు వచ్చారే!
వాణిశ్రీ: నిలకడ కోసం!
ఏఎన్నార్‌: నిలకడకోసం ఏ మాత్రం నిలకడలేని నా దగ్గరకొచ్చారా!
      నాలాంటి రచయిత అయితే... ‘ఆ ఉద్యోగం మానేసి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు’ అని రాస్తాడు. కానీ అక్కడ రాసింది ఆత్రేయ గారు కదా! నాటకీయతతో కూడిన భావజాలాన్ని ఉపయోగించి రాశారు. అలాగే ఏఎన్నార్‌ తన ఎస్టేట్‌ అంత ఉంది ఇంత ఉంది అని చెప్పుకోకుండా.. తన ఎస్టేట్‌లోకి అడుగు పెట్టాక ‘‘ఇక్కడి నుంచే మన అధికారం, అహంకారం మొదలవుతాయి’’ అంటారు. చాలా సులువైన భాషలో గొప్ప అర్థం వచ్చేలా ఎలా రాశారో చూడండి! అందుకే ఆత్రేయ అందరికీ నచ్చుతారు. 
      ఈ తరం వాళ్లలో త్రివిక్రమ్, అబ్బూరి రవి సంభాషణలు బాగుంటాయి. ‘అతడు’లో మహేశ్‌బాబు ఇంట్లోంచి వెళ్లిపోతుంటే త్రిష ‘నేనూ వస్తా’ అంటుంది. అప్పుడు మహేశ్‌ ‘నేనే’ వస్తా అంటాడు. నాలుగైదు పదాల సంభాషణను రెండే రెండు అక్షరాల్లో చెప్పారు త్రివిక్రమ్‌. అందుకే ఆయన ఈతరానికి బాగా దగ్గరయ్యారు. 
      పాటల్లోనూ మనసు కవి ఆత్రేయ అంటే ప్రత్యేక అభిమానం. అయినా ఆయన నచ్చనిది ఎవరికి! ఆయన మాట పాడుతున్నట్టు ఉంటుంది. అప్పుడే మాటలు నేర్చుకునేవాడికి కూడా ఆయన పదాలూ, మాటలూ, పాటలూ అర్థమవుతాయి. ఆయన భాష చాలా సులువుగా, సున్నితంగా ఉంటుంది. ఇప్పటివాళ్లలోనైతే సిరివెన్నెలగారి గురించి చెప్పుకోవాల్సిందే. ఆయన్ని ‘భగవంతుడు’ అంటాన్నేను. ఆ భగవంతుడు మాత్రమే రాయగల భావాలను ఆయన రాస్తారు. ఆయన రాత పాట రాసినట్టు ఉండదు. జీవితం రాసినట్టుగా ఉంటుంది. ‘ఖండాలుగా విడదీసే జెండాలన్నీ... తలవంచే తలపే అవుదాం... ఆ తలపే మన గెలుపని అందాం’ అంటూ ‘రా ముందడుగేద్దాం’ అనే పాటలో రాశారు. అలాగే ‘గాయం’లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’... ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలు! రచనలో ప్రతి రసాన్నీ అద్భుతంగా పండిస్తారు. ఆయనకు సమకాలీనుడిగా ఉన్నానని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది. సిరివెన్నెల గారి కలంగా పుట్టే అవకాశం ఉంటే ఈ క్షణంలో చనిపోవడానికి నేను సిద్ధం. అంత ఇష్టం ఆయన సాహిత్యమంటే. 
అదే తిలక్‌ ప్రత్యేకత
తెలుగు సాహిత్యం విషయానికి వస్తే, ‘అమృతం కురిసిన రాత్రి’ నాకు చాలా ఇష్టం. అది విప్లవభావాలు ఉన్న పుస్తకం. తిలక్‌ విప్లవాన్ని కూడా అందంగా రాస్తారు. విప్లవాత్మకమైన కొన్ని పుస్తకాలు చదివినప్పుడు రక్తం మరిగిపోతుంది. మనసు కకావికలం అవుతుంది. కోపం వస్తుంది. విప్లవ సాహిత్యం లక్ష్యం కూడా అదే. కానీ, తిలక్‌ సాహిత్యం చదివినప్పుడు ఆగ్రహానికి బదులు ఆవేశం వస్తుంది. రెండింటికీ తేడా ఏంటంటే... ఆగ్రహం కొంతసేపటికి చల్లారుతుంది. ఆవేశం అనుకున్నది సాధించే వరకూ తగ్గదు. ఒక్కమాటలో చెప్పాలంటే... తిలక్‌ది విప్లవ సాహిత్యం మీద ఇష్టం పెంచే తత్వం. మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది ఆయన సాహిత్యం. 
      మనకు ఎంత గొప్ప సాహిత్యం ఉంటే ఏం ప్రయోజనం! నేటితరం పుస్తక పఠనానికి దూరం అవుతోంది. సాంకేతిక అభివృద్ధి పెరగడమే దీనికి కారణం. నేటి తరం చదవడమే కాదు... రాయడమూ తగ్గించింది. లాప్‌టాప్‌ల్లో రాసేస్తున్నారు. కలం, కాగితం వాడకం తగ్గించేశారు. ఒకప్పడు గృహిణులు సైతం  సాహిత్యం లోతుపాతుల గురించి మాట్లాడేవారు. రచయిత్రుల గురించి చెప్పేవారు. ఆయా విషయాల మీద ఇప్పటి వారికి కనీస అవగాహన ఉండట్లేదు. పిల్లలైతే మరీను! దేశ ప్రధాని ఎవరంటే గూగుల్‌లో కొట్టేస్తున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల మనిషి ఎంత యాంత్రికంగా మారిపోయాడో తలుచుకుంటేనే భయం వేస్తోంది. నా చుట్టుపక్కల కొందరు... ‘ఆన్‌లైన్‌లో ఫలానా పుస్తకం ఉంది చూశావా’ అంటుంటే కోపం వస్తుంది. విశాలాంధ్ర ఉంది పక్కనే కదా.. ఓ అడుగు వెళ్లి తీసుకుంటే ఏం పోతుంది అనిపిస్తుంది. 
పుస్తకాలంటే జీవితాలే
నిజానికి పుస్తకం చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎనభై ఏళ్ల జీవితంలో మనం చూసేదీ, కలిసేది చాలా తక్కువ మందిని. మరి మన ప్రపంచం ఎంత విశాలమైంది! ఏడు ఖండాలూ, వందల కోట్ల ప్రజానీకం. వాళ్లలో మన జీవిత కాలంలో ఎంత మందిని కలుస్తాం.. ఎంత ప్రపంచాన్ని చూస్తాం!? అదే పుస్తకాలు చదివితే మనకు వందల వ్యక్తిత్వాలు తారసపడతాయి. అవన్నీ మనం నిజజీవితంలో స్పృశించలేనివి. తెలియని ప్రపంచం పరిచయం అవుతుంది. మనకి జరగని, సంబంధం లేని సంఘటనలూ, వ్యక్తిత్వాలూ తారసపడతాయి. పుస్తకాలు చదివితే ఒక్క మన జీవితాన్నే కాదు.. ఇతరుల జీవితాలనూ జీవిస్తాం. పుస్తకాలు రాసే విషయంలో కూడా హద్దులు ఉండవు. అదే సినిమాలకు, ధారావాహికలకైతే పరిధులుంటాయి. వాటిని చూస్తే కాసేపు వినోదం అంతే. అదే పుస్తకం చదివితే... అందులోని అంశాలను అర్థం చేసుకుంటే... నేనూ గొప్పవాణ్ని అవుతా అనే నమ్మకం కలుగుతుంది. ఆ క్రమంలోనే కొద్దో గొప్పో ఎదుగుతామన్నది నా బలమైన విశ్వాసం. 
      వాస్తవానికి ప్రజల్లో భాషాభిమానం ఉంటేనే పుస్తక పఠనాభిలాష పెరుగుతుంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తగ్గిపోతోంది. అది ఒప్పుకోక తప్పని వాస్తవం. కానీ తమిళనాడులో తమిళం తగ్గిపోదు. కర్ణాటకలో కన్నడం తగ్గదు. కేరళలో మలయాళం ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఎవరి మాతృభాషను వాళ్లు బతికించుకుంటూనే ఉన్నారు. కేవలం మన దగ్గరే ఈ దుస్థితి. మా పిల్లలు తెలుగు మాట్లాడాలనే సంకల్పం తల్లిదండ్రుల్లో ఉండాలి. అప్పుడే భాష బతుకుతుంది. తప్ప ప్రభుత్వాలు ఏం చేసినా మార్పు రాదు. భాష అంటే అమ్మ, భాష అంటే సంస్కృతి, భాష అంటే ఉనికి, భాష అంటే నాగరికత. మనవాళ్లు రేపటికి ఇచ్చే ప్రాధాన్యం నిన్నటికి ఇవ్వట్లేదు. నిన్నటికి ప్రాధాన్యమిస్తేనే రేపు బాగుంటుంది అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవట్లేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం