తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

యువ సాహితికి గుర్తింపు

  • 49 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గాలి సురేష్‌ నాయుడు

  • అనంతపురం
  • 9949742227

మూడు పదుల వయసు.. అలుపెరగని మనసు.. సాధించాలన్న తపన, సాధించగలనన్న నమ్మకం తనను విజయ తీరాలవైపు నడిపిస్తున్నాయి. సాహిత్యంపై అభిలాష రచనలకు ప్రాణం పోస్తోంది. భావితరాలకు భాషను పదిలం చేయాలన్న తలంపుతో పాటు, వెనుకటి తరాల విజ్ఞానాన్ని, వారసత్వాన్ని పదిలపరచాలని నిశ్చయించుకుని ఆ దిశగా అడుగేస్తున్నారాయన. రచయిత, చరిత్రకారుడు, పరిశోధకుడు.. ఇలా బహుముఖ పాత్రలను పోషిస్తున్న ఆయనే అనంతపురం జిల్లాకు చెందిన యువ రచయిత అప్పిరెడ్డి హరనాథరెడ్డి. పిన్నవయసులోనే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ‘తెలుగు వెలుగు’తో మనోభీష్టాన్ని పంచుకున్నారిలా...
‘‘అనంతపురం
జిల్లా గాండ్లపెంట మండలం తాళ్లకాల్వ మా స్వగ్రామం. మధ్య తరగతి రైతుకుటుంబం మాది. ప్రాథమిక, ఉన్నత విద్య అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే. డిగ్రీ కదిరిలో, తెలుగు పండిత శిక్షణ కర్నూలు సిల్వర్‌జూబ్లీ కశాశాలలో పూర్తిచేశా. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తిచేశాక, తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించా. ప్రస్తుతం కశ్యాణదుర్గంలో ఉద్యోగం. ద్రవిడ విశ్వవిద్యాలయ ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు మార్గదర్శకత్వంలో ‘రాయలసీమ ముఠాకక్షలు- ముఠాసాహిత్యం’ అంశంపై పరిశోధన చేస్తున్నా.
సాహిత్యంతోనే సామాజిక స్పృహ
1980కి ముందు రాయలసీమ ప్రాంతంలో పచ్చదనం, ఆప్యాయతలు నిండుగా ఉండేవి. తర్వాతి కాలంలో కరవులు, విపరీతమైన వలసలు, అదే అదనుగా ఫ్యాక్షన్‌ కక్షలు, సామాజిక అంతరాలు.. ఇలా ఒక్కొక్కటి ఇక్కడి సమాజంపై ప్రభావం చూపడం మొదలైంది. ముఖ్యంగా వేరుశనగ పంట ఎండిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు సమాజం గురించి ఆలోచించేందుకు నాకు ప్రేరణ కలిగించాయి. మా తాత అప్పిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో ఉచితంగా విద్యాబోధన చేసేవారు. ఆయన దగ్గరే చదువు మొదలుపెట్టా. రామాయణం, భాగవతం వంటి గ్రంథాలను ఆయనే చదివించారు. అలా సాహిత్యం, కళలంటే అభిమానం ఏర్పడింది. చిన్నప్పటి నుంచీ విజ్ఞానశాస్త్రం అంటే ఇష్టం ఎక్కువ. దాంతోపాటే సామాజిక స్పృహ కూడా ఉండేది. గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదివేవాణ్ని. ఇక మా సైన్సు మాస్టారి ప్రోత్సాహం సైన్సుపైనా, పరిశోధనలపైనా ఆసక్తిని పెంచింది. అప్పట్లో మా ప్రాంతంలో నక్సలిజం, భూస్వామ్య ఉద్యమాల ప్రభావం ఉండేది. ఆ పరిస్థితుల్లో నక్సల్స్‌ చేతుల్లో ఆయుధాలెందుకన్న దానిపై తీవ్రంగా ఆలోచించా. తుపాకులపై అధ్యయనంతో ఎనిమిదో తరగతిలో ఆయుధాల పరిణామక్రమం గురించి ‘తుపాకీ కథ’ పేరుతో 20 పుటల పుస్తకం రాశా.
      సమాజాన్ని మార్చే శక్తిగా ఎదగాలన్న ఆలోచనతో వామపక్ష కార్యాలయాల చుట్టూ తిరిగి సభ్యత్వాన్ని పొందా. బౌద్ధం, గాంధేయాలను అధ్యయనం చేశా. మార్స్కిజం సమాజంలో వ్యత్యాసాలను తగ్గిస్తుందేమోనన్న ఆలోచనతో ఆ భావజాలంతో రాయడం, చదవడం అలవడింది. న్యాయమూర్తిగానో, పాత్రికేయుడిగానో సేవలందించాలన్న ఆసక్తితో ఉన్నా... డిగ్రీ పూర్తయ్యేనాటికి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తెలుగు పండిత శిక్షణ కోర్సులో చేరా. అప్పుడే సాహిత్య ప్రవేశానికి బీజం పడింది. చిన్నప్పటి నుంచి సాహిత్యాన్ని ఆస్వాదించడం తప్ప, రాయాలన్న ఆలోచన లేదు. కానీ అప్పటికి ఇరవై ఏళ్లు కూడా లేని నా జీవితంలో పడ్డ బాధ, వ్యథను నాలుగు వాక్యాలుగా రాశా. వాటికి మరో ఎనిమిది వాక్యాలు జోడించి కవితగా మలచడానికి రెండేళ్లు పట్టింది. అదే ‘విషాద రూపం- వికసించే స్వప్నం’. ఎస్కేయూలో చదువుతున్నప్పుడు సాహితీ ప్రక్రియల్ని అధ్యయనం చేశా. అప్పుడు వచ్చిన ఆలోచనలను 18 కవితలుగా మలిచా. రాయలసీమ కష్టాలు, వర్షాలపట్ల ఆరాధన తదితర అంశాలను వాటిలో స్పృశించా. నా కథనాలు, వ్యాసాలు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. సమకాలీన సాహిత్య పరిస్థితులపై 45 వ్యాసాలు దినపత్రికల్లో వచ్చాయి. ఇవికాక వేమన యోగభాష, రాయవాచకం- జనజీవితం, రాయలసీమ కక్షల కథలు, చారిత్రక పరిశోధకుడు గురజాడ తదితర అంశాలపై జాతీయ సెమినార్లలో ప‌రిశోధ‌న‌ పత్రాలూ సమర్పించా.
      ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశా. పరిశోధనలో భాగంగా ఒక్కో జిల్లాలో 20కి పైగా గ్రామాల్లో తిరిగా. చాలా సామాజిక, చారిత్రకాంశాలు అవగాహనలోకి వచ్చాయి. రాయలసీమపై మొఘలులు, నిజాం నవాబులు, టిప్పుసుల్తానుల దాడుల ఫలితం, పాలెగాళ్ల వ్యవస్థ బలపడటానికి కారణాలూ అవగతమయ్యాయి. భూస్వామ్య ప్రతినిధులుగా పాలెగాళ్లు గ్రామ రాజకీయాల్లో ప్రవేశించిన తీరు అర్థమైంది. కేవలం కుటుంబాల మధ్య ఉన్న విభజన కొన్ని గ్రామాలనే తుడిచి పెట్టిన తీరు, సీమపై చెడు ప్రభావాన్ని చూపిన పరిస్థితులూ నా పరిశోధనలో ప్రధానం. సీమ సంస్కృతిపై సినిమాల్లో విషప్రచారం జరిగింది. నిజానికి ఇక్కడి వాళ్లు నీతి, నిజాయతీలతో ఉంటారన్న విషయాన్ని నా పరిశోధనలో చెప్పా.
సీమలోనూ ఆధునిక సాహిత్య వికాసం...  
ఫ్యాక్షన్‌పై పరిశోధన చేస్తున్నప్పుడే గత 300 ఏళ్ల రాయలసీమ చరిత్ర కాలగర్భంలో కలసిపోయిన విషయం అర్థమైంది. అందుకే శ్రీకృష్ణదేవరాయల పాలనకు ముందు చరిత్రను వెలికితీయడానికి శాసనాలు, తాళపత్రాలు సేకరిస్తున్నా. 1950కి పూర్వం రాయలసీమలో 70 పత్రికలు వచ్చేవి. కోస్తాలో కృష్ణా, ఆంధ్ర పత్రికలు, తెలంగాణలో గోల్కొండ మాదిరే... పప్పూరు రామాచార్యులు నిర్వహణలో ‘శ్రీసాధన’ రాయలసీమ నుంచి వెలువడింది. సీమ కన్నీటికథలు, సంస్కృతీ సంప్రదాయాలు శ్రీసాధనలో ముద్రితమ య్యాయి. అనుకోకుండా ఆ పత్రికను (మొత్తం 7వేల పుటలు) ఓ గ్రంథాలయంలో చూడగానే నా కళ్లు చెమర్చాయి. మూడు సంవత్సరాల నా వేసవి సెలవులను కేటాయించి ఆ పత్రికను పరిశోధించా. అలా వచ్చిందే ‘సీమ సాహితీ స్వరం- శ్రీ సాధన  పత్రిక’. 16 వ్యాసాల ఈ పుస్తకం నేను రాయబోయే ‘రాయలసీమ చరిత్ర’లో భాగం కానుంది. పరిశోధనలో ఇది నా తొలి అడుగు. ఇంకా కౌమోదకి, విజయవాణి వంటి పత్రికలను సేకరిస్తున్నా. వాస్తవానికి ఈ పత్రికలన్నీ మూలకు చేరడంతో సీమ సాహిత్య విశిష్టతలు లోకానికి వెల్లడికాలేదు. నిజానికి సీమ సాహిత్యం ఆధునికత ఎప్పుడో సంతరించుకుని, కోస్తా, తెలంగాణలతో పాటు సమానంగా నడిచింది. స్వాతంత్య్ర పోరాటం, సంఘసంస్కరణ లాంటి అంశాల మీద సీమ రచయితలు రచనలు చేశారు. శ్రీశ్రీ కంటే ముందే వర్గదృక్పథంతో కవిత్వం వెలువడగా.. 1930లో దళిత దృక్పథం, 1927లోనే స్త్రీవాద కవిత్వం ఈ ప్రాంతం నుంచి వెలువడ్డాయి. ఆ రచయితల శ్రమను వెలికి తీయాలన్నది నా తపన. దానికి ప్రతిఫలంగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. ఇది ప్రతీ యువ రచయితకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా.
      సాహిత్య పరిశోధనతో పాటు చారిత్రక అధ్యయనంలో భాగంగా తాళపత్రాలు, ఉర్దూ ప్రతుల సేకరణకు 30 పాళెగాళ్ల కోటలు తిరిగా. ఈ అన్వేషణలో లభించిన సమాచారంతో ‘రాయలసీమ పాళెగాళ్ల చరిత్ర’ రాస్తున్నా. అనేక కైఫియత్తులూ శోధించాను. అలాగే ఆదిమానవుడి గురించీ పరిశోధిస్తున్నా. దీని కోసం ఆదిమానవుడి ఆవాసాలుగా నిరూపితమైన గుహలు, ప్రాంతాలకు వెళ్లాను. అలా 25 అరుదైన చిత్రాలను శోధించగలిగా. ద్రవిడ ప్రాంతంలోని ఆదిమానవుడే సింధూ నాగరికత వైపు అడుగు వేశాడన్నది నా పరిశోధన సారాంశం. తిరుపతి హథీరాం బావాజీ, గుంతకల్లు సేవాలాల్‌తో పాటు 17వ శతాబ్దానికి చెందిన ఇస్లావత్‌ జగన్నాథ్‌సాథ్‌ వంటి కులగురువుల జీవితచరిత్రనూ గ్రంథస్థం చేసే ప్రయత్నం చేస్తున్నా.
      రాయలసీమ వివిధ సాహితీ ప్రక్రియలకు కేంద్రం. అన్నమయ్య పదకవితా పరిమళాలు, రాయల ఆస్థానం నుంచి ప్రబంధ వైభవాలు, మొల్ల, వెంగమాంబ వంటి రచయిత్రుల చేతిలో కావ్యాలు జాలువారిన చరిత్ర సీమది. వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన వంటి సంఘసంస్కర్తలకు ఆలవాలమైంది రాయలసీమ. నాటి నుంచి నేటి వరకూ ఎందరో రచయితలు తెలుగు సాహిత్యానికి సేవ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత రాయలసీమ జీవితాన్ని రచయితలు పెద్దగా రచనల్లో పెట్టకపోవడం వెనుక అంతుబట్టని కారణాలు నాకు ఆవేదన కలిగిస్తున్నాయి.
ప్రభుత్వాలతో పాటు ప్రజలూ...
తెలుగు వెలగాలంటే ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలూ రోజువారీ వాడుకలో మాతృభాషకే పెద్దపీట వేయాలి. శుభకార్యాల్లో పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలి. తెలుగు కశారూపాలను ప్రదర్శించాలి. రచయితలను గౌరవించాలి. భాషా సాహిత్య గ్రంథాల ప్రచురణకు సాయమందించాలి. పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు కళలు, సాహిత్య  ఉత్సవాలనూ నిర్వహించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం