తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మానవత్వం పరిమళించాలి!

  • 702 Views
  • 2Likes
  • Like
  • Article Share

మానవత్వాన్ని మేల్కొలిపే మేలిమి కథలు రాసిన రచయిత్రి డా।। ముక్తేవి భారతి. మహిళల  సమస్యలు, మధ్యతరగతి జీవితాల్లోని కలతల్ని తన కథలు, నవలల్లో సహజంగా బొమ్మకట్టారీవిడ.  పలు నవలలు, మోనోగ్రాఫులు, సాహితీ వ్యాసాలు రాశారు. బాల సాహిత్యంలోనూ కృషి చేశారు. ‘పురాణకథలు’తో అంతర్జాలంలో అందరికీ చేరువయ్యారు.  లాక్‌డౌన్‌ సమయంలో పుస్తకంతో ముక్తేవి భారతి స్నేహం ఎలా సాగుతోంది? ఆవిడ మాటల్లోనే...
బయటికెళ్లి
పుస్తకాలు తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఉన్న గ్రంథాలే మళ్లీ తిరగేస్తున్నాను. నా దగ్గర చాలా పుస్తకాలున్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’, అబ్బూరి ఛాయాదేవి ‘తనమార్గం’ కథానికలు నాకు చాలా ఇష్టం. నా అభిమాన రచయిత్రి మాలతీ చందూర్‌. ఆమె రాసిన ‘హృదయ నేత్రి’ నవలంటే నాకు మక్కువ. రంగనాయకమ్మ నవలల్లో ‘చదువుకున్న కమల’ బాగా ఇష్టం. చదువుతో వ్యక్తిత్వంలో వచ్చే మార్పులను రచయిత్రి బాగా చెప్పారు ఇందులో. ఓల్గా ‘స్వేచ్ఛ’ నవల బాగుంటుంది. ప్రాచీన సాహిత్యాన్ని కూడా చదువుతుంటాను. పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి యథాతథంగా అనువాదం చేశారు. దాన్ని కూడా చదువుతున్నాను. విశ్వనాథ సత్యనారాయణ ‘ఆంధ్ర ప్రశస్తి’ కూడా బాగా ఇష్టం. మునిమాణిక్యం నరసింహారావు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. ఆయన రాసిన కాంతం కథలు, శంకరమంచి సత్యం అమరావతి కథలు... ఆలోచింప చేసి మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తాయి. ఈ పుస్తకాలన్నింటినీ మళ్లీ ఓమారు తిరగేస్తున్నాను.
సాటి వారికి సాయపడాలి!
ఇప్పటి వరకూ 350 కథలు రాశాను. కొన్ని సంపుటాలు వచ్చాయి. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌ నేపథ్యంగా రచన చేయాలనే ఆలోచన ఉంది. నిజానికీ కుటుంబాల్లో పిల్లల బాధ్యత తల్లుల మీదే ఎక్కువగా ఉంటుంది. బళ్లో తల్లిదండ్రుల సమావేశం అంటే తల్లులే వెళ్తారు. పరీక్షలప్పుడు పిల్లల్ని వాళ్లే చదివిస్తారు. ఈ నేపథ్యంలో ఆడవాళ్లు సమర్థులని తెలియజెబుతూ కథ రాయాలనుకుంటున్నా.
 ఒకప్పుడు పిల్లలు ఎండలో ఆడుకుంటుంటే లోనికొచ్చి ఆడుకోమనేవారు తల్లులు. ఈ కరోనా కల్లోలంలో ఇళ్లలోంచి అనవసరంగా ఎవరూ బయటికి రాకుండా, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ఎవరికి వారు అలవరచుకోవాల్సిన అలవాట్లు. కరోనా వల్ల ఎందరో జీవితాలు తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిలో మానవత్వం పరిమళించి సాటివారికి సాయపడాలి. వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం