తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆశావాదంతో సాగాలి

  • 2319 Views
  • 15Likes
  • Like
  • Article Share

రంగస్థలం మీదగా సినీ రంగంలోకొచ్చి ప్రజాదరణ పొందిన చిత్రాలను తెరక్కించిన దర్శకుడు హరీష్‌ శంకర్‌. ‘షాక్, మిరపకాయ్, గబ్బర్‌సింగ్, దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేశ్‌’ లాంటి చిత్రాలతో తనదైన ముద్ర చాటుకున్నారాయన. ‘తెలుగు లేకపోతే నేను లేను’ అని చెప్పే హరీష్‌ ప్రస్తుత లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? ఆయన మాటల్లోనే... 
ఈ నిర్బంధ కాలంలో
ముళ్లపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం, వంశీ ‘మాపసలపూడి కథలు’, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ‘కథలు గాథలు’, యండమూరి వీరేంద్రనాథ్‌ ‘ప్రేమ, ఆనందోబ్రహ్మ’, ఓషో ‘క్రియేటివిటీ’, ఇకీగై పుస్తకాలు చదివాను. నిజానికి ఆకలిగా ఉన్న పిల్లాణ్ని ఐస్‌క్రీం షాపునకు తీసుకెళ్లినట్టు లాక్‌డౌన్‌ వల్ల చదువుకోడానికి భలే సమయం దొరికింది కదా అనిపించింది. గతంలో చదివినవి, కొత్త పుస్తకాలతో మమేకం అయ్యాను.
కవిత రాశాను
‘ఇకీగై, క్రియేటివిటీ’ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. రోజువారీ పనుల్లో మనకి తెలియని ఎన్నో విషయాల్ని ‘క్రియేటివిటీ’లో ఓషో తెలియజెబుతారు. లాక్‌డౌన్‌లో ఈ పుస్తకం నాకు చాలా ప్రీతిపాత్రమైంది. అలాగే ‘ఇకీగై’ అనేది జపనీయుల సుదీర్ఘ, ఆనందమయ జీవనం వెనుక ఉన్న రహస్యాల్ని చెప్పే పుస్తకం. ఇది కూడా చాలా ఆకట్టుకుంది. యండమూరి పుస్తకాలు కొన్ని మళ్లీ తిరగేశాను.
      లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలు చూసి చాలా బాధ కలిగింది. వాళ్ల ఆవేదనల గురించి ఒక కవిత రాశాను. 
బండరాళ్లను పిండి చేసిన చేతులు
ఎడమ పక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి
పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వంచిన వేళ్లు
మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి
మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే
బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము
చచ్చేలోపు ఊరెళ్తే చాలనుకుంటూ
ఆకలి అడుగులతో... 
పేగుల అరుపులతో...
కాళ్లూ, కడుపూ ఒకేసారి కాలుతుంటే...
మమ్మల్ని చూసే లోకులకు 
బాధేస్తోంది... జాలేస్తోంది
కానీ మాకు మాత్రం ‘ఆకలేస్తోంది’!!

      మన పెద్లోళ్లు కీడెంచి మేలెంచమన్నారు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాని వల్ల వచ్చే నష్టాలు, ఇతర పర్యవసానాలు గ్రహించి ఆ తర్వాతే దాని ప్రయోజనాల గురించి ఆలోచించాలని అర్థం. ఇలా ప్రతిదాంట్లో ఎలా ప్రతికూలతల్ని బేరీజు వేస్తామో, అలాగే ప్రతి ప్రతికూలతలోనూ అనుకూలతని వెతుక్కోవాలి. మనిషన్నవాడు సహజంగా ఆశావాది కాబట్టి ఏం జరిగినా ఆ ఆశావహ దృక్పథాన్ని వదులుకోకూడదు. సృజనాత్మకతకి పదును పెట్టుకుని, మనిషిలో తనకి తెలియని కోణాల్ని అన్వేషించుకుని లాక్‌డౌన్‌ పర్యవసానాల్ని అధిగమించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం