తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

క్రమశిక్షణ లోపమే సమస్య!

  • 2160 Views
  • 28Likes
  • Like
  • Article Share

స్వరంలో అమృత ఝరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాట వింటే ఆబాలగోపాలం ఆనంద పరవశంలో మునిగితేలాల్సిందే. అందుకే గాన గంధర్వుడిగా ఖ్యాతికెక్కారు బాలు. పదకొండు భాషల్లో నలభై వేలకుపైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. పెద్ద సంఖ్యలో చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. లాక్‌డౌన్‌లో ఈ పాటల రారాజు ఏం చేశారు? ఆయన మాటల్లోనే...
నా దగ్గర
పెద్ద గ్రంథాలయమే ఉంది. కానీ, నేను ఎక్కువగా చదవట్లేదు. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు ఇస్తారు. పదిరోజుల్లోనే వాటి గురించి అభిప్రాయాలు అడుగుతారు. ఒక పుస్తకం తీసుకుంటే చాలా క్షుణ్నంగా చదవాలని నేననుకుంటాను. నా దగ్గరున్న పుస్తకాలన్నీ చదవడానికి ఆ భగవంతుడు నాకు ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటాను. మొత్తానికి వాటన్నింటినీ చదువుతాను. ఈ మధ్యకాలంలో వివిధ భాషల్లో వస్తున్న సినిమాలు, సీరియళ్లను బాగా చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీల్లో వచ్చే టెలీ సీరియళ్లు చాలా గొప్పగా తీస్తున్నారు. సినిమాలు కూడా చాలా మంచివి వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతిభ ఉంటే వ్యాపారాత్మక సినిమాల్ని కూడా అందంగా తీయవచ్చు.
      ఈ లాక్‌డౌన్‌లో ఎస్పీబీ ఫ్యాన్స్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ తరఫున ఫిబ్రవరి 28న నుంచి 52 రోజుల పాటు ‘శ్రోతలు కోరిన పాటలు’ పేరిట కార్యక్రమం నిర్వహించాం. పాటకు రూ.వంద ఇచ్చినా సరే, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అభిమానులు కోరిన పాటలు వినిపించాను. పాటకు రూ.లక్ష వరకూ ఇచ్చిన వారూ ఉన్నారు. చాలామంది పాత పాటలు అడగటంతో పుస్తకాల్లో ఉన్న వాటిని వెతికి పట్టుకుని, సాధన చేసి ఆలపించాను. దీనికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. కానీ, దీని ద్వారా లభించిన తృప్తి మాటల్లో చెప్పలేను. ఇలా 52 రోజుల్లో దాదాపు 20 లక్షల రూపాయలు పోగయ్యాయి. వీటితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళల్లో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న సంగీత కళాకారులు, ముఖ్యంగా వేదికల మీద పాడుతూ పొట్ట పోసుకునే రెండొందల మందికి సాయం చేస్తున్నాం. 
      హైదరాబాదులో వీడియో, కెమెరామెన్‌ సంఘం వాళ్లకి దాదాపు 30 మందికి సాయం అందించాం. ఈ సేవను ఫొటోలతో ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రణామాలు. ప్రతి పైసాకు అయిన ఖర్చును నా ఫేస్‌బుక్‌ ఖాతాలో పెడతాను. అలాగే మా ఫౌండేషన్‌ తరఫున దాదాపు 25 మంది సంగీతకారులకు చెన్నైలో ప్రతినెలా రూ.2 వేలు పింఛను ఇస్తున్నాం. దాన్ని ఇంకా పెంచి, ఎక్కువ మందికి విస్తరింపజేసేందుకు నిధులు సమీకరించబోతున్నాం. వీటితో పాటు వ్యక్తిగతంగా రూ.5 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధికి అందించాను. అలాగే మా నాన్నగారి పేరిట ఏర్పాటు చేసిన ఎస్పీస్‌ ఫౌండేషన్‌ తరఫున ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నన్నేదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నిర్వాహకులు అందించే ధనాన్ని బాలల విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాను. 
పాటలు రాయించాను
కరోనా సంక్షోభానికి సంబంధించి ఎందరో పాటలు రాశాను. ఎన్నో కోణాల్లో వచ్చిన ఈ పాటలు చాలా అద్భుతంగా అనిపించాయి. నేను కూడా కొన్ని పాటలు రాయించుకుని ఎక్కడెక్కడో ఉన్న సంగీతకారులను అడిగి, వారి సహకారంతో వాటిని అన్ని భాషల్లో రికార్డు చేశాను. అయితే కరోనా నేపథ్యంగా వచ్చిన పాటల్లో చాలా వరకు కష్టాలు, ఇబ్బందులకు సంబంధించినవే తప్ప ధైర్యం చెప్పేవి తక్కువగా ఉన్నాయి. ఇటీవల ఇలాంటివి బాగా వస్తున్నాయి.  
      ఏ జబ్బు కంటే భయంకరమైందీ కరోనా? క్షయ, పోలియో, కుష్ఠు, స్వైన్‌ఫ్లూ లాంటివి ప్రబలినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. వాటన్నింటినీ మనం అధిగమించాం. ప్రజల్లో క్రమశిక్షణ లోపించడం వల్లే ఈ సమస్యలన్నీ. అంగళ్ల దగ్గర ఒకరి మీద ఒకరు పడటం, నెట్టుకోవడం లాంటివి ఉండకూడదు. శుచి, శుభ్రత మొదటి నుంచీ ఉండాలి. అలాగే ప్రకృతి మీద మనకి అవగాహన లేదు. ఇష్టమొచ్చినట్లు చేస్తున్నాం. ఎవరైనా చెప్పినా పట్టించుకునేవాళ్లు లేరు. నేను ఏ అవకాశమొచ్చినా ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెబుతుంటాను. తర్వాతి తరాల క్షేమం కోసం ఇది చాలా అవసరం.


వెనక్కి ...

మీ అభిప్రాయం