తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

క్రమశిక్షణే ఆయుధం

  • 248 Views
  • 1Likes
  • Like
  • Article Share

‘‘సమర్థులు ఇంట్లో ఉండిపోతే అసమర్థులే రాజ్యమేలుతారు’’ (గోపాల గోపాల), ‘‘దేవుడంటే సాయం’’ (కృష్ణంవందే జగద్గురుమ్‌), ‘‘సమయం లేదు మిత్రమా... శరణమా, రణమా...’’ (గౌతమీపుత్ర శాతకర్ణి) లాంటి పదునైన సంభాషణలతో తెలుగు సినిమాకు కొత్త సత్తువ అందించారు బుర్రా సాయిమాధవ్‌. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన ఈ మాటల మాంత్రికుడు లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లో...
రాయడానికి,
చదవడానికి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేనెప్పుడూ లాక్‌డౌన్‌లో ఉన్నట్టే లెక్క. అవసరమైతే తప్ప బయటికి వెళ్లను. అందుకే ఈ కరోనా నిర్బంధం ఏదో పెద్ద మార్పులాగా అనిపించలేదు.
ప్రస్తుతం ‘అసురగణం’ అనే తమిళ పుస్తకం తెలుగు అనువాదం చదువుతున్నాను. కా.నా.సుబ్రహ్మణ్యం రాసిన ఈ పొత్తాన్ని బీవీ సింగరాచార్య, పి.సభాపతి తెలుగులోకి అనువదించారు. పురాణాల్లోని ప్రతి పాత్రా ప్రస్తుతం సమాజంలో ఎవరో ఒకర్ని పోలి ఉంటుంది. ఈ పుస్తకంలో అలాంటి పాత్రలెన్నో కనిపిస్తాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం నాలుగు సినీ కథలకు పనిచేస్తున్నాను. నేను కూడా సొంతగా కొన్ని కథలు రాసుకుంటున్నాను.
ప్రస్తుత కల్లోల్లాన్ని తలచుకుంటే ఆత్రేయ, గణేశ్‌పాత్రో లాంటి రచయితలే నాకు గుర్తొస్తుంటారు. వారి ప్రతి మాటలో నిగూఢమైన భావాలుంటాయి. విశ్వశాంతి, కప్పలు, పరివర్తన... ఇలా ఆత్రేయ రాసిన అన్ని రచనలు నన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి.
మనిషి జీవితమే పోరాటమయం. నిరంతరం సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. డొక్కల కరవు నుంచి ప్లేగు దాకా ఎన్నింటినో మనం గెలిచాం. కరోనాను కూడా జయిస్తాం. అంతా మంచే జరుగుతుందన్న దృక్పథంలో ముందుకు సాగిపోవాలి. కనిపించని ఈ పురుగును జయించాలంటే క్రమశిక్షణను మించిన ఆయుధం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మనం ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతితో కలిసి జీవించాలి. అంతేగానీ దాన్ని నాశనం చేస్తూ పోతే అది మనల్నే లేకుండా చేసేస్తుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం