తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

గుండియే నిజమైన గుడిరా!

  • 151 Views
  • 1Likes
  • Like
  • Article Share

తెలుగు పాటల ప్రవాహంలో లలిత గీతాల లాలిత్యపు సవ్వడి వడ్డేపల్లి కృష్ణ. సినీ, లలిత గీతాల రచయితగా, కథకుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభ ఆయన సొంతం. తెలుగులో దాదాపు వెయ్యి లలిత గీతాలు రాసిన కృష్ణ, వాటి మీద సిద్ధాంత గ్రంథాన్ని కూడా వెలువరించారు. మృదు మధుర పదాలతో గేయ మాలలల్లే కృష్ణ ప్రస్తుత అక్షరంతో ఎలా మమేకమౌతున్నారు? ఆయన మాటల్లోనే...
వాల్మీకి
రామాయణాన్ని మరోసారి తిరగేశాను. ప్రస్తుత యువతలో తల్లిదండ్రులు, గురువుల మీద భక్తిప్రపత్తులు లోపిస్తున్నాయి. వాటిని పెంపొందింపజేసేందుకు ‘రాగరామాయణం’ అనే రచన చేశాను. మనం ఏం రాసినా ఎలాంటి దోషాలూ లేకుండా ప్రామాణికంగా ఉండాలి. అందుకే, వాల్మీకి రామాయణాన్ని మరోసారి చూశాను. అలాగే మన సాహిత్య చరిత్ర, కృష్ణశాస్త్రి ‘అమృతవీణ’, దాశరథి ‘నవ మంజరి’, నారాయణరెడ్డి ‘విశ్వంభర’లను మరోసారి చదివాను. కరోనా మీద అందరిలో అవగాహన కలిగించడానికి కవితలు, గీతాలు కూడా రాస్తున్నాను.
ఆయనే నడిపారు
‘అమృతవీణ’లో మంగళ శైలిలో సాగే ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి...’ గీతం రవీంద్రుని జనగణమనలా అనిపిస్తుంది. ఈ స్ఫూర్తితో నేను ‘‘భరతభూమి నా దేహం భరతజాతి నా దేహం మంచిని పరిపాలించే మానవతకి దాసోహం’’ అనే లలిత గీతం రాశాను. సి.నారాయణ రెడ్డి గేయ కావ్యాల ప్రభావం నామీద చాలా ఉంది. ‘కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయడు, నాగార్జున సాగరం’ కావ్యాలు వేటికవే వైవిధ్యం. ఆయన రచనా సంవిధానం అద్భుతం. నన్ను గేయ మార్గంలోకి నడిపింది ఆయనే. పూజాఫలం చిత్రం కోసం సినారె రాసిన ‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా’ పాటన్నా నాకు చాలా ఇష్టం. 
      దాశరథి ‘నవమంజరి’ 1959లో ప్రచురితమైంది. అందులో ‘‘నీలో దీపం వెలిగించు/ నీవే వెలుగై వ్యాపించు...’’ గేయమంటే నాకు చాలా ఇష్టం. ‘‘శాంతి మంత్రమున/ ప్రేమ తంత్రమున/ జనకల్యాణం సాగించు/ దైన్యము మాని ధ్యానము పూని/ దైవ సన్నిధిని జీవించు/ హృదయంలో అమృతంతో పథికుడివై విహరించు/ సుఖములో దుఃఖములో దేవదేవుడిని ధ్యానించు/...’’ ఇలా సాగుతుందది. నీలో జ్ఞానదీపం వెలిగించి మనిషిలా జీవించు అని చెప్పడమే ఇక్కడ కవి ఉద్దేశం. ఈ కష్టకాలంలో రిస్కులేని మాస్కులతో సామాజిక దూరంతో గృహావాస యోగ్యంగా గూఢంగా పోరాడుతూ కరోనాని అణిచేద్దాం. కష్టాలను తొలగిద్దాం. ఆపదలో ఆదుకునే అందరికీ అభివాదాలు అందిద్దాం. మహమ్మారిని బంధిద్దాం. నదులకు నామాలు ఎన్నున్నా కడలిని కలిసే వరకే. జనులకు మతాలు ఎన్నున్నా జాతీయత నిలపడానికే. ‘గుండియే నిజమైన గుడిరా.. మానవతయే మంచి మడిరా’. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ఆ ధైర్యమే ఆయుధంగా కరోనా మీద మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు మాధవుడు లేడు. మానవుడే మాధవుడై కరోనాసురుణ్ని అంతం చెయ్యాలి. అదే మన పంతంగా భావించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం