తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

కచ్చితంగా అధిగమిస్తాం!

  • 226 Views
  • 16Likes
  • Like
  • Article Share

సినీ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభా ప్రవాహి తనికెళ్ల భరణి. రంగస్థలం నుంచి సినీ రంగంలోకొచ్చిన ఈయన ప్రస్థానం ‘మిథునం’తో దర్శకత్వ స్థాయికి ఎదిగింది. ‘శబ్బాష్‌రా శంకరా’ అంటూ పరమశివుణ్ని స్తుతి పారిజాతాలతో అర్చించడంతో పాటు సమాజంలోని అవకరాల మీద ‘గార్ధభాండం’ లాంటి నాటకాలూ సంధించిన భరణి లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లోనే...   
కొన్ని
సినిమాలు చూశాను. అయితే సాధారణ ప్రేక్షకుడిలా కాకుండా అధ్యయనం కోణంలో వాటిని చూశాను. ఈ మధ్యలో ఏమీ రాయలేదు. పఠనానికే అంకితమయ్యాను. మామూలుగా నేను డైరీ రాస్తాను. ఈ యాభై రోజులుగా అదీ మానేశాను. ఎందుకనో రాయాలనిపించలేదు.
చలం, కార్ల్‌మార్క్స్, విశ్వనాథల గురించి కిరణ్‌ప్రభ టాక్‌షోలో విని విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు, రంగనాయకమ్మ క్యాపిటల్‌ మళ్లీ చదువుతున్నాను. ఒకదానికొకటి విభిన్నమైన పుస్తకాలివి. అలాగే స్పార్టకస్‌ చదివాను. పద్యాలు కంఠతా పట్టడమంటే నాకు ఇష్టం. జాషువా పద్యాలు కంఠతా పడుతున్నాను. వరవిక్రయం, కన్యాశుల్కం లాంటి పాత రేడియో నాటకాలు విన్నాను. 
జ్ఞానమొక్కటే నిలుస్తుంది
కరోనా విలయం ఎంత దుర్మార్గమైందైనా తమాషాగా అందరినీ ఏకం చేసింది. ప్రస్తుత పరిస్థితిని తలచుకుంటే ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును... దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’’  అన్న గురజాడ మాటలు గుర్తొస్తున్నాయి. పరమాద్భుతమైన మానవతా పంక్తులివి. ఎప్పటికైనా ఈ భేదాలన్నీ పోయి జ్ఞానమొక్కటే నిలుస్తుంది. మానవత్వం పరిమళిస్తుంది.  
మానవజాతి పరిణామ క్రమంలో ఇలాంటి ఆపదలు ఎన్నో దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చాం. కింద పడిపోతుంటాం. మళ్లా లేస్తుంటాం. మనిషి జీవితంలో ఆటుపోట్లు సహజమే కదా. దీన్ని కూడా కచ్చితంగా అధిగమిస్తాం. జనజీవన స్రవంతి కొనసాగుతుంది. ఆ విషయంలో ఏ ఢోకా లేదు. కాకపోతే ఇదొక గాఢమైన జ్ఞాపకంగా ఈ తరం వాళ్ల మస్తిష్కాల్లో నిలిచిపోతుంది.  


వెనక్కి ...

మీ అభిప్రాయం