తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆ మార్పుల్ని కొనసాగించాలి!

  • 139 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు’ లాంటి వైవిధ్య సినిమాల రచయితగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు నివాస్‌. పుస్తకాల్ని అమితంగా ప్రేమించే ఆయన ప్రస్తుత లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? తన మాటల్లోనే...
దర్శకుడు
తేజ కొత్త సినిమా కోసం రచన చేస్తున్నాను. కథానాయకుడు మంచు విష్ణు మరో సినిమా పని కూడా చూస్తున్నాను. ఒక రచయితగా అవసరమైతే తప్ప బయటికెళ్లే అవసరం నాకు పెద్దగా ఉండదు. పొద్దున్నే బజారుకెళ్లి అవసరమైన కూరగాయలు, పాలు లాంటివి తెచ్చుకోవడం, మళ్లీ రచనలో మునిగిపోవడం నా అలవాటు. అందువల్ల ఈ లాక్‌డౌన్‌ పెద్ద ఇబ్బంగా ఏమీ అనిపించలేదు. 
యాక్షన్‌ సినిమాలు తీయొచ్చు
నేను పుట్టిందీ పెరిగిందీ రాజమహేంద్రవరంలో. మా ఇంట్లో సాహితీ వాతావరణం ఉండేది. మా అమ్మ, పిన్ని నవలలు, కథలు చదువుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, ఓల్గా, యండమూరి, కొమ్మూరి, మల్లాది పుస్తకాలు చదివాను. అయితే మధుబాబు సాహిత్యం జోలికి ఎప్పుడూ పోలేదు. ఆ రచనలన్నీ క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్లు కాబట్టి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఆ మధ్య విజయవాడ వెళ్లినప్పుడు మధుబాబు పుస్తకాలన్నీ తెచ్చుకున్నాను. ఈ లాక్‌డౌన్‌లో సినీ రచన చేస్తూ మధ్య మధ్యలో మధుబాబు పుస్తకాలు చదువుతున్నాను.
మధుబాబు నవలలు ఇప్పుడు చదువుతుంటే వాటిని నిన్న మొన్న రాసినట్లే అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా అవి చాలా తాజాగా ఉన్నాయి. మరో ఇరవై ఏళ్ల తర్వాత చదివినా ఇలాగే ఉంటాయి. మా అబ్బాయితో కూడా వాటిని చదివిస్తున్నాను. నా చిన్నప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ‘శివ’ చిత్రం తర్వాత యాక్షన్‌ సినిమాలు బాగా పెరిగాయి. మధుబాబు నవలలకి కొద్దిగా మార్పులు చేసి మంచి యాక్షన్‌ సినిమాలు తీయొచ్చని అనిపిస్తోంది.
అధిగమిస్తాం  
మా అమ్మవాళ్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కలరా వచ్చి ఎంతో మందిని పొట్టన పెట్టుకుందట. ఎబోలా, జికా, నిఫా వైరస్‌లు, హుద్‌హుద్‌ లాంటి తుపాన్లు చాలా వాటిని మనం చూశాం. ఇలాంటి ఉపద్రవాలు మనకి కొత్తేం కాదు. వాటన్నింటినీ ధైర్యంగా దాటుకుంటూ వచ్చాం. అవి వచ్చిన మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత అవే జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఈ కరోనాని కూడా మనం అధిగమిస్తాం.  
నా చిన్నప్పుడు మా నాయనమ్మ రాత్రిళ్లు పక్కన పడుకోబెట్టుకుని పురాణాలు, ఇతిహాసాల గురించి చెబుతూ ఉండేది. మన పద్ధతుల్ని వివరించేది. చావింటికి, శ్మశానం దగ్గరికి వెళ్తే బయటే స్నానం చేసి ఇంట్లోకి రావడం, బయటికెళ్తే కాళ్లు కడుక్కుని రావడం లాంటి చాలా ఆచారాలు మనకి ఉన్నాయి. కరోనా వల్ల ఇలాంటి శుభ్రతల్నే ఇప్పుడు మనం పాటిస్తున్నాం కదా!
కరోనా పరిస్థితుల్ని చూస్తే ప్రకృతి తనని తాను పునరుద్ధరించుకుంటోందేమో అనిపిస్తుంది. మనిషి విధ్వంసాలు పెరిగిపోతున్న ప్రతిసారీ ఇలాంటివి వస్తున్నాయి. అయితే, ప్రకృతితో ఆటలాడటం ఎంత ప్రమాదమో మనిషి గుర్తించాలి. ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి ఇన్నాళ్లూ కోల్పోయినవన్నీ కరోనా మళ్లీ మనకి ఇస్తోందని నాకనిపిస్తోంది. గతంలో సినిమా చూడ్డానికి వెళ్తే టిక్కెట్ల కోసం క్యూలో గుంపులుగా తోసుకునేవారు. షాపుల దగ్గర కూడా ఒకరి మీద ఒకరు ఎగబడేవారు. కరోనా వల్ల ఇలాంటి వాటిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ మార్పుల్ని ఇలాగే కొనసాగించాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం