తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అది ఇప్పుడొచ్చింది

  • 206 Views
  • 6Likes
  • Like
  • Article Share

మూలాలు తమిళమైనా తెలుగు మీద తరగని ప్రేమతో మేలిమి పాటల సుమమాలలల్లుతున్నారు వనమాలి. ‘అరెరె.. అరెరె.. మనసే జారే...’ లాంటి పాటలతో మెలోడీ గీతాలకు చిరునామాగా మారిన ఆయన భావ విస్తృతి ఈ నిర్బంధ కాలంలో ఎలా సాగుతోంది? 
సినీ గీత రచయితగా మారడానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం సాహిత్యమే. పుస్తక పఠనం విషయంలో ఎప్పుడూ నాకు కొంత అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఎంత చదివినా, ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేసినా ఇంకా ఏదో మిగిలిపోయిందన్న భావన వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటి దిగ్బంధన సమయంలో పాటలు రాసుకుంటున్నాను. ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుకుంటున్నాను.
ఆ ప్రభావంతో... 
ప్రస్తుతం గొల్లపూడి మారుతీరావు ఆత్మకథ ‘అమ్మకడుపు చల్లగా’ చదువుతున్నాను. ఇందులో రచయిత నిజాయతీ నాకు బాగా నచ్చింది. ఆయన శైలి కూడా బాగుంటుంది. నిజానికి నేను గొల్లపూడి అభిమానిని. ఇంటర్‌లో ఆయన రాసిన ‘కళ్లు’ నాటకం చూశాను. అది 14 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. సినిమాగా కూడా వచ్చింది. గొల్లపూడి నవలలన్నా నాకు బాగా ఇష్టం. మొదట్లో నేనూ కథలే రాశాను. కొడవటిగంటి, చలం, బుచ్చిబాబు లాంటి వారి కథలు చదివాను. సి.నారాయణ రెడ్డి ప్రభావంతో కవిత్వం మీద మమకారం పెరిగింది. కవితలు రాయడం మొదలుపెట్టాను. ‘భారతి’ మాసపత్రికలో నా కవితలొచ్చాయి. 
ఇప్పటికీ పాడుతున్నా
భార్యలు తమ భర్తలతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఈ లాక్‌డౌన్‌ను ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పటి ఉరుకులూ పరుగుల జీవితం వల్ల భర్తలతో మనసారా మాట్లాడే అవకాశం ఆడవాళ్లకు ఉండటం లేదు. ఏళ్లకేళ్లు అలాగే గడచిపోతున్నాయి. అలాగని భర్తల్ని నేను తప్పుబట్టడంలేదు. ఎవరి పరిస్థితులు వాళ్లవి. కానీ, కట్టుకున్నవాడు భార్యను నగల్లో, పొగడ్తల్లో ముంచెత్తాల్సిన అవసరం లేదు. వాళ్లకోసం కాస్తంత సమయం కేటాయిస్తే చాలు. అది ఇప్పుడొచ్చిందన్నది నా భావన. 
కోకిలమ్మ సినిమాలోని ‘పల్లవించవా నా గొంతులో..’ పాటంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ గుర్తొచ్చినప్పుడల్లా ఆ పాట నా పెదాల మీద పలుకుతూనే ఉంటుంది. అందులో కథానాయకుడు గాయకుడిగా ఎదగాలనుకుంటాడు. కథానాయిక మూగమ్మాయి. కానీ, ఆమె అతనికి సాయం చేస్తుంది. నా భార్యకు కూడా ఈ పాటంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. పెళ్లికాక ముందు నుంచీ తన దగ్గర ఈ పాట పాడుతూనే ఉన్నాను. కరోనా భూతం విజృంభిస్తున్న నేపథ్యంలో మనుషుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఒక కవిత రాశాను. 
సరికొత్త ప్రపంచం!
‘ఓ మనిషీ గెలుపు నీదే 
ఓడిపోవు ఏనాడూ
భయపడితే బతుకు లేదే
ధైర్యంగా పోరాడు..
లక్ష కరోనాలనైనా
లక్షణంగా ఎదిరిద్దాం
మహమ్మారి రోగానికి
మరణశాసనం రాద్దాం!
విష క్రిములకు భయపడితే
సాగదులే మనుగడ
బతుకంటే పోరేనని
ఈ మానవుడెరుగడా?
ప్రపంచాన్ని చుట్టుముట్టి
ప్రాణాలను మట్టుబెట్టి
చావు డప్పు కొడుతున్న
చాపకింద కరోనాను
ఉరికొయ్యకు చేర్చుదాం
ఊరి తీరు మార్చుదాం!
రొమ్ము విరుచుకుంటూ.. 
అది రోగాలతో చితి పేర్చితే..
కమ్ముకున్న చీకటల్లే
ప్రతి శ్వాసను చిదిమేస్తే
మన దమ్ములు చూపిద్దాం
తన కొమ్ములు విరిచేద్దాం!
శుభ్రతనే శూలంతో
ఆ గుండెను చీలుద్దాం
భౌతిక దూరంతో 
తనకు సమాధినే కడదాం!
కోవిడ్‌ లేని ప్రపంచాన్ని
సరికొత్తగ సృష్టిద్దాం
విశ్వానికి అంతులేని
విశ్వాసం కలిగిద్దాం!
తుది గెలుపే మనదని
గొంతెత్తి చాటుదాం!
*** 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం