తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

జీవన విధానం మార్చుకోవాలి!

  • 536 Views
  • 21Likes
  • Like
  • Article Share

తెలంగాణ ఉద్యమంలో బలమైన మహిళా గళం, విస్తృత రచనా కలం తిరునగరి దేవకీదేవి. కవయిత్రిగా ప్రసిద్ధులైన ఈవిడ జానపద సాహిత్యం మీదా లోతైన పరిశోధన చేశారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా సేవలందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. లాక్‌డౌన్‌లో దేవకీదేవి ఏం చేశారు? ఆవిడ మాటల్లోనే...   
పి.సత్యవతి,
ముదిగంటి సుజాతా రెడ్డి కథలు చదివాను. వాటిమీద సమీక్షలు రాస్తున్నాను. ఇంకా కొన్ని వ్యాసాలు కూడా రాస్తున్నా. సత్యవతి కథల్లో ప్రేరణాత్మక అంశం ఉంటుంది. ‘నేనొస్తున్నాను’ అని ఒక ప్రతీకాత్మక కథ ఆమె రాశారు. అందులో ఒకామె పాటలు పాడుకుంటూ తన అభిరుచుల్ని, రకరకాల అనుభూతుల్ని సంచుల్లో నింపుకుని వెళ్తుంటుంది. ఒక పడవతను పిలిచి ఆమెని పడవ ఎక్కించుకుంటాడు. ఆ వ్యక్తి రకరకాల యంత్రాలని పడవలో తీసుకెళ్తుంటాడు. కొంత దూరం వెళ్లేసరికి పడవలోకి నీరొస్తుంది. ఆ అమ్మాయి జ్ఞాపకాల సంచులన్నీ మునిగిపోతుంటాయి. అప్పుడామె అనవసరమైన యంత్రాలను విసిరిపారేస్తే పడవ మునగదు కదా అనుకుంటుంది. అనవసరమైనవన్నీ పక్కన పెట్టి మనకు కావాల్సిన ప్రేమలు, అభిమానాలు, ఇతరులకు సహాయం లాంటివన్నీ దాచుకోవాలనే అంశంతో రాసిన కథ ఇది.
ఆర్భాటాలు తగ్గాయి 
లాక్‌డౌన్‌లో సామాన్యులు పడుతున్న ఇబ్బందుల్ని తలచుకుంటే శ్రీశ్రీ రాసిన ‘‘ఆ సాయంత్రం../ ఇటు చూస్తే అప్పుల వాళ్లూ/ అటు చూస్తే బిడ్డల ఆకలి!/ ఉరిపోసుకు చనిపోవడమో/ సముద్రమున పడిపోవడమో../ సమస్యగా ఘనీభవించిందొక సంసారికి..’’ అన్న కవిత గురొస్తోంది. అలాగే కాళోజీ మాటలూ స్ఫురణకొస్తున్నాయి. కూటికోసం కోటి విద్యలు అంటారు కదా! కోటి విద్యలు కూటికేల చీకటమ్మకు అని అంటారాయన. 
లాక్‌డౌన్‌ చాలా మార్పుల్ని తెచ్చింది. జనాలకి వంటల్ని నేర్పించింది. ఆర్భాటాలు తగ్గాయి. ఇప్పుడు మనం మురికి వాడలు, వలస కూలీల గురించి ఆలోచించాలి. దయార్ద్ర హృదయులు వాళ్లకి సాయం చెయ్యాలి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి. కరోనా వెంటనే పోయేది కాదు. ఇది మరింత ప్రబలకుండా అందరం జాగ్రత్తలు తీసుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం