తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సాయం చేసే చేతులే మిన్న!

  • 507 Views
  • 50Likes
  • Like
  • Article Share

‘కవిసంగమం’ ద్వారా తెలుగు కవితా వనంలోకి నవ కోయిలను ఆహ్వానించిన కవి యాకూబ్‌. ‘ప్రవహించే జ్ఞాపకం, సరిహద్దు రేఖ, ఎడతెగని ప్రయాణం, నదీ మూలం లాంటి ఆ ఇల్లు’ తదితర కవితా సంపుటాలతో పాటు పలు సాహితీ విమర్శ గ్రంథాలనూ వెలువరించారు. పలు పొత్తాలకి సంపాదకత్వమూ వహించారు.  కవిత్వాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకున్న యాకూబ్‌ లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లోనే... 
నా యాభై ఎనిమిదేళ్ల జీవితమంతా ఉరుకులూ పరుగులే. ఈ లాక్‌డౌన్‌ రెండు నెలలూ నన్ను నేను అవలోకించుకుని, నాకు నేను తెలిసేలా చేసింది. ఈ సమయంలో ‘సలాం హైదరాబాద్‌’ నవలకు రెండో భాగంగా వచ్చిన పరవస్తు లోకేశ్వర్‌ ‘కల్లోల కలల కాలం’, కుం.వీరభద్రప్ప ‘అంతఃపురం’ నవలలు చదివాను. 1970 నుంచి 90వరకు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితులు, తన జీవితానుభవాల్ని ‘కల్లోల కలల కాలం’లో లోకేశ్వర్‌ బొమ్మకట్టారు. ‘అంతఃపురం’ వైవిధ్యమైన చారిత్రక నవల. 
కొత్త విషయం
ప్రస్తుతం ఒడియా కవి సౌభాగ్య కుమార మిశ్రా అనువాద కవిత్వం ‘ద్వాసుపర్ణా’ చదువుతున్నాను. ఈయన కవితల్ని వేలూరి వేంకటేశ్వరరావు, వెనిగళ్ల బాలకృష్ణరావు అనువదించారు. ఈ కవితలు చదువుతుంటే ఠాగూరు ‘గీతాంజలి’తో సాగుతున్న అనుభూతి కలుగుతుంది. ఫేస్‌బుక్‌లో నిర్వహిస్తున్న ‘కవిసంగమం’లో కరోనా మీద వచ్చిన కవితలన్నీ ఒకచోట చేర్చి ఏయే కోణంలో రాశారన్న దాని మీద నోట్సు రాసుకుంటున్నాను. అలాగే ఫేస్‌బుక్‌లో ‘అర్థమవుతుందా!’ శీర్షికతో దాదాపు పదిహేను కవితలు రాశాను.  
      ప్రస్తుత పరిస్థితిని తలచుకుంటే జాషువా గుర్తొస్తున్నారు. అలాగే ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌ సింగ్‌ రచనలు నాకు బాగా నచ్చుతాయి. కె.శివారెడ్డి కవిత్వం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. వారిద్దరూ ఈ సమయంలో జ్ఞప్తికొస్తున్నారు. ‘నా ఆటోగ్రాఫ్‌’ సినిమా కోసం చంద్రబోస్‌ రాసిన ‘మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది... ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది...’’ పాటంటే నాకు చాలా ఇష్టం. అదీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మదిలో మెదులుతోంది. 
      మనకు కరోనా లాంటి విపత్తులు వస్తుంటాయి. వాటిని తప్పకుండా గెలుస్తాం. కానీ, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. అలాగే సాటి మనిషిని మనిషిగా చూడాలి. వీలైనంతలో తోటి వారికి సాయపడాలి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులే మిన్న అనేది నాకిష్టమైన మాట.  


వెనక్కి ...

మీ అభిప్రాయం