తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ధైర్యంగా ఎదుర్కోవాలి!

  • 174 Views
  • 11Likes
  • Like
  • Article Share

చిత్రకారుడిగా, కవిగా, కథా, నవలా రచయితగా బహుముఖ సృజన సాంగత్యంతో తెలుగు నేల మీద తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు శీలా వీర్రాజు. ఈయన పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నవల ’మైనా’. దీంతోపాటు ‘వెలుగు రేఖలు, కాంతిపూలు, కరుణించని దేవత’ నవలలు, దాదాపు ఎనిమిది చొప్పున కథా, కవితా సంపుటాలు వెలువరించారు. లాక్‌డౌన్‌లో వీర్రాజు ఏం చేశారు? ఆయన మాటల్లోనే...
గతంలో చదివిన పాలగుమ్మి పద్మరాజు, ఆర్‌.వసుంధరా దేవి కథలు, జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి ‘ది డెత్‌ ఆఫ్‌ లాస్ట్‌ ఇండియన్, నూటొకటో మార్కు’ కథా సంపుటాలు మళ్లీ చదివాను. అలాగే యాకూబ్‌ ‘తీగల చింత, నిజం, నివురు’ కవితా సంపుటాలు, ఇబ్రహీం నిర్గుణ్‌ ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటి, దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’, ఇంకా అనిల్‌ డ్యాని, మెర్సీ మార్గరెట్‌ కవిత్వం చదివాను. ఇంకా చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. లాక్‌డౌన్‌లో చదవడానికే సమయం కేటాయించాను. ఏమీ రాయలేదు. అయితే, లాక్‌డౌన్‌కి మూడు వారాల ముందు ఒక కవిత రాశాను. దాదాపు రెండేళ్ల తర్వాత రాసిన కవిత అది. 
అదే గుర్తొచ్చింది
లాక్‌డైన్, క్వారంటైన్‌ అనే మాటలు నా జీవితంలో కొత్తగా వింటున్నాను. మేము కొంతకాలం హైదరాబాదు నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి పక్క సందులో ఉండేవాళ్లం. ఆ ఆస్పత్రిని కోరంటీ దవాఖానా అని అంటుండేవారు. క్వారంటైన్‌ మాట విన్నప్పుడు నాకు ఆ కోరంటీ దవాఖానా అన్న పేరు గుర్తొచ్చింది. 
      ఏమీ తోచనప్పుడు, మనసు చికాకుగా ఉన్నప్పుడు ఎంకి పాటలో, లలిత సంగీతమో, అన్నమాచార్య సంకీర్తనలో వింటాను. మా ఆవిడ, రచయిత్రి శీలా సుభద్రాదేవి కూడా నాతో పాటు కూర్చుని ఇష్టంగా వాటిని వింటుంటుంది. 
      ప్రస్తుత కరోనాని తలచుకుంటే రాబోయే రోజుల్లో మనిషి పరిస్థితి మరీ భయంకరంగా ఉంటుందేమో అనిపిస్తోంది. కానీ, మానవుడు మనుగడ సాగించాలంటే ఇలాంటి విపత్తుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే సమయంలో పర్యావరణానికి సంబంధించిన స్పృహను కూడా కలిగి ఉండాలి.    


వెనక్కి ...

మీ అభిప్రాయం