తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఏది మిగిలింది మనిషికి?

  • 194 Views
  • 4Likes
  • Like
  • Article Share

నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణ ప్రజా సామాజిక ఉద్యమానికి కవితా శక్తినిస్తూ నడిపిస్తున్న కవి జూకంటి జగన్నాథం. కవనంలో విలక్షణ శైలి ఈయన సొంతం. ‘పాతాళ గరిగె, బొడ్డుతాడు, గంగడోలు, వాస్కోడిగామా.కామ్, దోసెడు కన్నీళ్లు’ లాంటి కవితా సంపుటాలతో ప్రజల కడగండ్లను కళ్లకుకట్టారీయన. కవిత్వమే ఊరటగా బాసటగా సాగుతున్న జూకంటి లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లోనే...
‘రాదుగా’ ప్రచురణల నుంచి సోవియట్‌ యూనియన్‌ వాళ్ల పుస్తకాలు నా చిన్నతనంలో ఎక్కువగా వచ్చేవి. అవి కొన్ని నా దగ్గరున్నాయి. లాక్‌డౌన్‌లో వాటిని మళ్లీ చదివాను. చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ నవల ‘తల్లి భూదేవి’ ఈ మధ్యనే చదివాను. కేవలం చదవడమే కాకుండా రచనలు కూడా చేశాను. రాయడమనేది కవుల, రచయితల బాధ్యత. ఒక్క కరోనా మీదనే కాకుండా ఇతర విషయాల మీద కూడా కవిత్వం రాశాను.
కదిలించిన పాట 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన సాహిత్యమంతా మనిషికి ఆత్మస్థైర్యాన్ని కలిగించిందే. ‘తల్లి భూదేవి’ నవల ఆ కాలం నాటి యుద్ధ పరిస్థితులనూ, సామాన్యుల జీవనాన్ని తెలియజెబుతుంది. ఇందులో కొడుకులూ, భర్తా యుద్ధంలో చనిపోతారు. తల్లి, కోడలు మాత్రమే మిగులుతారు. ఆ కష్టకాలంలో వారి జీవన పోరాటానికి దర్పణం ఈ నవల. టాల్‌స్టాయ్‌ ‘యుద్ధము- శాంతి’ కూడా ఆనాటి పరిస్థితుల్ని వివరిస్తుంది. కరోనా లాంటి కల్లోల సమయంలో ఇలాంటి పుస్తకాలు చదివితే మనిషికి మానసిక స్థైర్యం అలవడుతుంది. 
      ‘‘బస్సులొద్దు బండ్లు వద్దు అయ్యో సారూ.. ఇడిసిపెడితే నడిసి నేనూ పోతాసారూ.. ఇంటికాడ పిల్లా జెల్లా ఎట్లున్నరో... నా ముసలితల్లి ఏమి పెట్టి సాకుతుందో’’ అంటూ లాక్‌డౌన్‌లో వలస కార్మికుల దయనీయ స్థితి నేపథ్యంగా ఆదేశ్‌ రవి రాసిన పాట నన్ను కదిలించింది. ఈ పాటను తలచుకుంటే చాలు కళ్లు చెమ్మగిల్లుతాయి. 
      నా జీవితకాలంలో కరోనా లాంటి మహమ్మారిని చూడలేదు. మనం ఇన్నాళ్లూ అభివృద్ధి అని అనుకుంటున్నదంతా డొల్ల అని కరోనా తేల్చేసింది. ప్రకృతి విధ్వంసమే అభివృద్ధి అనుకుంటున్న మనిషికి ఇప్పుడీ ప్రకృతే గొప్ప పాఠం నేర్పింది కదా! ప్రస్తుతం నీరు, గాలి అన్నీ కలుషితమైపోయాయి. అడవి లేకుండా పోయింది. అసలు ఏది మిగిలింది మనిషికి! ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులే ప్రకృతి సమతుల్యత దెబ్బతినడానికి కారణం. కరోనా లాంటి వాటి నుంచి ప్రభుత్వాలు ఏం నేర్చుకుంటాయో ఏమో గానీ, ప్రజలు మాత్రం మేల్కొనాల్సిన అవసరముంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం