తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఏం మాయ చేసిందో... తెలుగు అలా వచ్చేసింది

  • 146 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సురేశ్‌ రావివలస

  • శ్రీకాకుళం.
  • 8008024444

స్వచ్ఛమైన అమెరికా దేశీయుడు... అయినా, అచ్చమైన తెలుగు మాట్లాడతారు. సాహిత్యాన్ని స్వాగతిస్తారు. కథలంటే చెవికోసుకుంటారు. భారత, రామాయణాల్ని ఆకళింపు చేసుకుంటారు. స్వదేశంలో తెలుగువాళ్లు కనిపిస్తే చాలు... మాట కలిపేస్తారు. కలివిడిగా ముచ్చట్లు పెట్టేస్తారు. ఆయనే చార్లెస్‌ నకల్స్‌.
వేమన పద్యాలు... చలం, శ్రీశ్రీ రచనలంటే చెవి కోసుకుంటారాయన. ఎంతో ఇష్టంగా చదివి కొన్నింటిని నేర్చుకున్నారు.  పురాణేతిహాసాలు, బొబ్బిలి యుద్ధం, పంచతంత్ర కథలంటే అమితమైన ఆసక్తి. ఆవకాయ పెరుగన్నమన్నా, తెలుగు పాటలన్నా ప్రాణంపెడతారు. విశాఖ జాలరిపేట వాసులు, కృష్ణా జిల్లా పాలకాయతిప్ప గ్రామస్థులకు సన్నిహితులైన ఆయన... అమెరికాలోని బ్రిగమ్‌ యంగ్‌ విశ్వవిద్యాలయ మానవశాస్త్రం (ఆంత్రోపాలజీ) విభాగం, భారతీయ భాషల అధ్యయన కేంద్రం సంచాలకులు.  ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నకల్స్‌ ‘తెలుగు వెలుగు’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
నా మాతృభాష ఆంగ్లం. అయినా తెలుగంటే ఎంతో మమకారం, ఇంకెంతో అభిమానం. ఈ భాష ఏం మాయ చేసిందో...! కానీ ఇక్కడే ఉండి నేర్చుకోవాలనిపించింది. పున్నమి చంద్రుడి వెలుగులాంటి తెలుగు నన్ను కట్టిపడేసింది. తెలుగు పదాలు, పలుకులు, నిండుగా, కమ్మగా అనిపిస్తాయి. ఇక్కడి సంస్కృతి బాగుంటుంది. భాష వినేందుకు హాయిగా ఉంటుంది. ఇక్కడి వంటలు, కూరలు, పప్పు, సాంబారు, చక్కని సంగీతం ఇవన్నీ ఎందుకో తెలియని సంతోషాన్నిస్తాయి. బహుశా అందుకేనేమో తెలుగు నేర్చుకోవాలనిపించింది.
      మత్స్యకారుల జీవన విధానంపై పరిశోధన చేయడానికి 1978లో తెలుగునేలపై అడుగు పెట్టాను. తెలుగు నేర్చుకోవడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు డిప్లమో కోర్సు ఉందని తెలియడంతో వెంటనే చేరా. మూడు రోజుల్లోనే తెలుగు అక్షరమాల నేర్చుకున్నా. అయినా తనివితీరలేదు. ఏదైనా తెలియకపోతే వెంటనే అందుబాటులో ఉన్నవారు అదీ ఆచార్యులనైనా, జాలరులనైనా సందేహాలు అడిగి ఎలా పలకాలో, ఎలా రాయాలో తెలుసుకున్నా. మత్స్యకారులతో ఎక్కువగా గడపడం వల్ల రోజూ కొన్ని పదాలు నేర్చుకునేవాణ్ని. విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాచార్యులు     ప్రభాకరశాస్త్రి, కృష్ణమాచార్యులు, జోగారావు గార్లు నాకు భాష నేర్పినా... ఒక విధంగా జాలరులూ నా గురువులే. భాషపై పట్టుపెంచుకోవడానికి వారెంతో సాయం చేశారు. ఇకపోతే ఏటా ఇక్కడికొచ్చే మా విద్యార్థులకు వేంకటేశ్వర శాస్త్రి, కనకమహాలక్ష్మి గార్లు నేర్పిస్తున్నారు.
      తెలుగు నేర్చుకోవడం చాలా కష్టమని ఎంతోమంది అంటుంటారు. కానీ ఇష్టంగా నేర్చుకుంటే అదంతా ఉత్తిదేనని అనిపించింది. తెలుగు నేర్చుకోవడానికి ఏ సమస్యలూ ఎదురుకాలేదు. నాతో పాటు మా విద్యార్థులు సుమారు 20-30మంది ఏడాదికి నాలుగుసార్లు పరిశోధనాంశాల్లో భాగంగా ఇక్కడికి వస్తుంటారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం అయిదుగురు విద్యార్థులు వచ్చారు. వారిలో ఒకరు నృత్యం, ఇంకొకరు భగవద్గీత, ఇక్కడి జీవనవిధానం వంటి అంశాలపై పరిశోధన చేస్తున్నారు. వారికి ఆంధ్రవిశ్వవిద్యాలయం ‘సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూసివ్‌ అండ్‌ ఇన్‌క్లూసివ్‌’లో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కూడా కల్పిస్తోంది.
      వ్యక్తిగతంగా నేను విశాఖపట్నంలోని మత్స్యకారుల జీవన విధానం, వారి స్థితిగతులపై పరిశోధన చేశా. వారి కట్టుబాట్లు, అలవాట్లు, వ్యక్తిగత శ్రద్ధలను పరిశీలించా. కుటుంబ విధానంలో బంధాలు వారికి అంత లోతుగా లేవు. వీరంతా ఒకే ఇంట్లో.. ఒకే పొయ్యిపై వండుకుంటున్నా కష్టాల   సమయంలో ఒంటరైపోతున్నారు. వారి సమస్యలను ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోలేకపోతున్నారు. అలాగే పురాతన గ్రీకు- దక్షిణ భారతదేశ సంస్కృతి సారూప్యత మీదా పరిశీలన చేశా. 
      ఈ రాష్ట్రంలో పరిశోధన చేస్తున్నపుడు.... కొన్ని రోజులు విశాఖలో, మరికొన్ని రోజులు కృష్ణాజిల్లా దివిసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్నా. దివిసీమ ఉప్పెన సమయంలో నేనక్కడే ఉన్నా. నా కళ్లముందే ఎంతోమంది కొట్టుకుపోయారు, చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే. ఆ దెబ్బ నుంచి దివిసీమ ఎప్పటికి కోలుకుంటుందో అర్థం కాలేదప్పట్లో. ఎప్పటికీ మర్చిపోలేని విషాదమది! 
      ఇక పరిశోధనల విషయానికొస్తే ఎప్పుడూ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. స్థానికులతో కలిసిపోయేవాణ్ని. ఇక్కడ అందరూ బాగా సహకరించేవాళ్లు. ఇలా వెళ్తే చాలు! నా చుట్టూ కనీసం పదిమంది జాలర్లు చేరి పలకరిస్తారు. ప్రస్తుతం వీరి జీవన విధానంలో ఆధునిక మార్పులు కనిపిస్తున్నా.. వాటి ప్రభావం వ్యక్తిగతంగా వారిపై అంతగా కనిపించడం లేదు. చాలామంది అలవాట్లు, జీవనశైలి మారలేదు. ముప్ఫై ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నా...  నా మీద వాళ్లకున్న ప్రేమాభిమానాలు ఇసుమంత కూడా తగ్గలేదు. విద్య సౌకర్యాలు పెరగడంతో వాళ్ల పిల్లలిప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 
      నేనొక్కడినే తెలుగు నేర్చుకొని ఆపేయలేదు. నాతో పాటు సుమారు యాభైమందికి నేర్పాను. ఇంట్లో నా భార్య జానిస్‌తో అప్పుడప్పుడు తెలుగులోనే మాట్లాడతా. ఆమె ఫర్వాలేదు, అర్థం చేసుకుంటుంది. 
      ఈ 37 ఏళ్లలో తెలుగు రచనలెన్నో చదివాను. శ్రీశ్రీ రచనలంటే ఇష్టం.  మహాప్రస్థానాన్ని ఎన్నిసార్లు చదివానో...! తెలుగు నేర్చుకున్న వెంటనే ముందు చదివిన సాహిత్యం ఆయనదే. తరువాత చలం సాహిత్యం, కథల పుస్తకాలు. లోతైన అర్థం, నీతిబోధలతో సాగే వేమన పద్యాలూ నేర్చుకున్నా. వీటితో పాటు రామాయణ, మహాభారత, భగవద్గీతలు, బొబ్బిలి యుద్ధం చదివా. వీటిలో బొబ్బిలి యుద్ధం చాలాబాగా నచ్చింది. ఎందుకంటే అది నిజంగా జరిగింది. స్థానికత ఉంది. తాండ్ర పాపారాయుడి పౌరుషం, తెగువ గగుర్పాటు కలిగిస్తాయి.
      తెలుగు భాషపై ఆంగ్ల పదాల ప్రభావం ఉంది. అందుకు కారణం ఆంగ్లేయుల పాలనే. ఈ విషయంలో జాలరిపేట వాసులతో నాకు వాగ్వాదం జరిగింది. రోడ్డు ఆంగ్ల పదమని నేనంటే... కాదు తెలుగు పదమని వాళ్లన్నారు. బస్సు, రైలు, పెన్ను తదితరాలు ఆంగ్లపదాలైనా వాటిని వాళ్లు సొంతం చేసుకోవడంతో అవి పూర్తిగా తెలుగు పదాలయిపోయాయి. అవి తెలుగు మాటలు కాదంటే వాళ్లు ఒప్పుకోరు!
మీ భాషను మీరే మర్చిపోతారా!
ప్రస్తుతం ఇక్కడ పిల్లలకు తెలుగు నేర్పడంపై ఎక్కువమంది తల్లిదండ్రులు శ్ర‌ద్ధ‌ చూపట్లేదు. ఆంగ్ల మాధ్యమంలో చేరుస్తున్నారు. ఆంగ్లం అవసరమే అయినా ఎవరికైనా మాతృభాష ముఖ్యం. అమ్మభాష నేర్చుకుంటే అమ్మ పక్కన ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఆమె తోడుంటే భయముండదు కదా! అమ్మభాషా అదే భరోసానిస్తుంది. చిన్నారులకిప్పుడు భాషను దూరం చేస్తే ఒక తరం తరువాత తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త!


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి