తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆ అవగాహన రావాలి!

  • 894 Views
  • 19Likes
  • Like
  • Article Share

ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ కాస్త ఆగి అలుపు తీర్చుకోవడం అవసరమే! ఆ అవకాశం ఇప్పుడు నిర్బంధంగా వచ్చింది. అయితే ఇవి ఎవరూ కోరుకోని విరామ సమయాలు. ఇరవై నాలుగు గంటలూ నాలుగు గోడల మధ్యే గడపాల్సిన సుదీర్ఘ సమయాలు. కరోనా కల్లోలానికి వీధితలుపులు మూసుకుపోయిన వేళ.. తలపుల తరువులకు నీరుపెట్టేదెలా? అదే మాటను సాహితీవేత్తలు, సినీ రచయితలను అడిగితే.. ‘అక్షరమే తోడు’గా మది మడుల్లో వెలుగుపూల సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే... 
గుండె లయనే కవిత్వంగా చేసుకుని మానవ జీవన పార్శ్వాలను శక్తిమంతంగా ఆవిష్కరిస్తున్న కవి కె.శివారెడ్డి. అణువణువూ మానవత్వం నిండిన మనిషిని ఆవిష్కరించడం, దోపిడీలు, అసమానతలు లేని సమాజానికి బాటలు వేయడమే లక్ష్యమైన ఈ కవన ప్రవాహి ప్రస్తుత నిర్బంధంలో అక్షరంతో ఎలా మమేకమవుతున్నారు? ఆయన మాటల్లోనే...
ఈ నెల పూర్తిగా పఠనానికి కేటాయించాను. నాలుగు నవలలు చదివాను. బండి నారాయణస్వామి ‘శప్తభూమి’ మళ్లీ చదివాను. అద్దంకి శాసనం నేపథ్యంగా కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లై రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’, కుం.వీరభద్రప్ప కన్నడ నవలకి తెలుగు అనువాదం ‘అంతఃపురం’ పూర్తిచేశాను. థామస్‌ మన్రో కడప కలెక్టర్‌గా ఉన్నకాలం నుంచి ఇది మొదలవుతుంది. అప్పటి ప్రజల జీవన విధానం, పాలెగాళ్ల వ్యవస్థ ఇందులో కనిపిస్తాయి. ‘శప్తభూమి’లో కూడా పాలెగాళ్ల గురించి ఉంటుంది. అయితే, రెండింటి కాలాలు వేరు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘ఒంటరి’ కూడా చదివాను. ప్రకృతికి ఎలా దూరమైపోతున్నామో చెప్పే గొప్ప నవల ఇది. ఇవన్నీ ప్రతి ఒక్కరూ దీక్షగా, జాగ్రత్తగా చదవాల్సిన నవలలు. ప్రస్తుతం ఇజ్రాయెలీ రచయిత యువల్‌ నోఆ హరారీ ‘సేపియన్స్‌’ చదువుతున్నాను. మానవ పరిణామ క్రమం గురించి చెప్పే అద్భుత పుస్తకం ఇది. 
అది ఓ బాధ్యత
మధ్య మధ్యలో కవిత్వం కూడా తిరగేస్తున్నాను. గ్రీకు కవి కేవసీ, స్పానిష్‌ కవి పాబ్లో నెరూడా, పాలస్తీనియన్‌ కవి మహమ్మద్‌ దార్వీష్, హిందీ కవి కున్వర్‌ నారాయణ్‌లను మళ్లీ చదివాను. కవిత్వాన్ని మళ్లీ మళ్లీ తిరగేస్తుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అందులోని అసలు అందం అర్థమవుతుంటుంది. చరిత్రను కవిత్వంగా ఎలా మలచవచ్చో తెలియజెప్పిన కవి దార్వీష్‌. చరిత్ర కోణంలో నవలలు, కథలు మనం చదివాం. దాన్ని కవిత్వంలోకి తేవడం అంత తేలిక కాదు.
నేను కవిత్వాన్ని పాఠకుడిగా కాకుండా కవిలా చదువుతాను. వస్తువును ఎలా గ్రహిస్తున్నారు? దాన్ని కవిత్వంగా ఎలా మలుస్తున్నారు? ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు? నేనెలా చూస్తున్నాను? ఇలా ఎన్నో నేర్చుకుంటాను. ముప్పైల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు బాగా రాస్తున్నారు. తగుళ్ల గోపాల్, సిరికి స్వామినాయుడు, బాలసుధాకర్‌ మౌళి లాంటి వారి నుంచి మంచి కవిత్వం వస్తోంది. ఈ ప్రపంచం మనిషిని సర్వ చలనాలకి దూరం చేస్తుంది. మనిషిలోని మృదుత్వాన్ని చంపేస్తుంది. అయినా కవిగా తనని తాను బతికించుకోవడం ఒక బాధ్యత. ఈ మధ్య కాలంలో బాల్యానుభవాల నేపథ్యంగా ‘వరాహమిహిరుడు’ కవిత ఒకటి రాశాను. స్వతహాగా నేను గాయకుణ్ని. ఎంకి పాటలంటే చాలా ఇష్టం.
ఆ తరుణమిది 
కరోనా వల్ల ప్రజల్లో కనిపించని భయం పెరిగింది. ఇది వెళ్లిపోయిన తర్వాత మనిషి గతంలోలా ఉండగలడా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. అయితే, మనిషికున్న పరిమితుల్ని, మానవుడి అల్పత్వాన్ని కరోనా తెలియజెప్పింది. మన అస్తిత్వం అస్థిరత్వమని వివరించింది. ఖగోళంలోకి వెళ్లి చూస్తే ఈ భూగోళం ఒక బంతి. దానిలో నేనెక్కడున్నాను? నా ఉనికి ఎంత? ఆ మాత్రందానికి ఈ గర్వాలెందుకు? అహంకారాలెందుకు? అగ్రరాజ్య ఆధిపత్యాలెందుకు? లాంటి అవగాహన మనిషిలో వస్తే కరోనా మనకి మంచి చేసినట్లే. మనిషి మనిషిగా బతకడానికి ప్రయత్నిస్తూ అవసరమైన వాళ్లకి సాయం చెయ్యాల్సిన తరుణమిది. మానవ జన్మ ఏంటి? ఎన్నాళ్లు ఈ సుఖాలు? ఈ స్పృహతో మనిషి మనిషిగా బతికితే అతనికీ, ఈ ప్రకృతికీ మంచిది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం