తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పత్రహరితంతో చిగురించాలి

  • 537 Views
  • 8Likes
  • Like
  • Article Share

ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ కాస్త ఆగి అలుపు తీర్చుకోవడం అవసరమే! ఆ అవకాశం ఇప్పుడు నిర్బంధంగా వచ్చింది. అయితే ఇవి ఎవరూ కోరుకోని విరామ సమయాలు. ఇరవై నాలుగు గంటలూ నాలుగు గోడల మధ్యే గడపాల్సిన సుదీర్ఘ సమయాలు. కరోనా కల్లోలానికి వీధితలుపులు మూసుకుపోయిన వేళ.. తలపుల తరువులకు నీరుపెట్టేదెలా? అదే మాటను సాహితీవేత్తలు, సినీ రచయితలను అడిగితే.. ‘అక్షరమే తోడు’గా మది మడుల్లో వెలుగుపూల సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే... 

‘బొమ్మను గీస్తే నీలా ఉంది...’  లాంటి భావాత్మక గీతాలతో వేరే లోకంలోకి తీసుకెళ్లినా, ‘పెళ్లెందుకే రమణమ్మా’, ‘గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే’ అంటూ మాస్‌ పాటలతో హుషారెత్తించినా... భాస్కరభట్ల ప్రత్యేకతే వేరు. తెలుగు సినీ గీత వినీలాకాశానికి వెయ్యికి పైగా పాటలందించిన ఆయన, ఈ నిర్బంధ కాలంలో నాకు ‘అక్షరమే తోడం’టూ చెబుతున్నారిలా..
‘‘తీరిక దొరికింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా పుస్తకం పట్టుకోవడం అంటూ ఏమీ లేదు. పాటల రచయితగా నిత్య పఠనం నా అలవాటు. పాతికేళ్ల నుంచి కొనిపెట్టుకున్న పుస్తకాలన్నీ ఇంట్లో ఉన్నాయి. వాటిని ఒక క్రమంలో సర్దుకునేందుకూ ఈ సమయాన్ని వినియోగించుకున్నాను. నా దగ్గరున్న పుస్తకాలన్నిటితో ఒక జాబితా తయారుచేసి విభాగాల వారీగా అరల్లో సర్దుకున్నాను. నేను కవిత్వం బాగా చదువుతాను. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి శిఖామణి, ప్రసాదమూర్తిల కవిత్వాన్ని అధ్యయనం చేశాను. సేకరించిపెట్టుకున్న కవితా సంపుటాల్నీ తిరగేస్తున్నాను. నచ్చిన పంక్తులను నోట్‌ చేసుకుంటున్నాను. ఇలా రాసుకుంటే చాలా కాలం వరకూ ఆ కవితా పంక్తులు మస్తిష్కంలో పదిలంగా ఉంటాయని నా నమ్మకం.
అలలా ఎగసి..
కవులైనా, రచయితలైనా వారి రచనా శైలిని బట్టి బాగా ఇష్టపడతాను. అస్పష్టంగా ఉండే కవిత్వమంటే నాకంత అసక్తి ఉండదు. కవి చెప్పదలచుకున్నదేంటో పాఠకులకు స్పష్టంగా తెలియాలి. నేనూ కవితలు రాస్తుంటాను. ఓ విషయం మనసును తట్టి లోలోపలి భావాలు చురుక్కున పొడుస్తున్నప్పుడు కలం కదుపుతాను. కవిత్వం ఊహిస్తే వచ్చేది కాదు, అదో అలలా ఎగసి అక్షర రూపం సంతరించుకోవాలి. నాలుగు రోజుల కిందట ‘స్వప్నం మరణించిన రోజు’ అనే కవిత రాశాను. పాటల కన్నా ఎక్కువగా కవిత్వమే రాస్తాను. చదువుతాను. మినీ కవిత్వం ఎక్కువగా రాస్తాను. ‘‘బంధువులు మరణించినప్పుడే కాదు.. కొన్ని బంధాలు మరణించకూడద న్నప్పుడూ అవసరమే... రెండు నిమిషాల మౌనం’’ అన్నది ఇటీవలే రాశాను.
మంచి అవకాశం
ప్రస్తుత పరిస్థితుల్ని తలచుకుంటే ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాకి నేను రాసిన ‘తలదించుకు బతుకుతావా..’ పాటలోని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘దేహానికి హాని అంటె వైద్యమిచ్చుకోవా.. దేశానికి జబ్బు చేస్తె నీళ్లు నములుతావా!’ అంటూ జనాన్ని చైతన్యపరచేలా శ్రీశ్రీ ప్రభావంతో ఆ పాట రాశాను. ప్రస్తుతం ప్రపంచానికి జబ్బు చేసి బిక్కుబిక్కుమంటూ ఉంది. ఈ పరిస్థితుల్లో ‘‘ప్రజలు సహనం వహించి ధైర్యంగా ఇంటి పట్టునే ఉంటే అదే పెద్ద చికిత్స. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకూ, మానసికంగా మనల్ని మనం దృఢంగా మార్చుకునేందుకూ ఈ లాక్‌డౌన్‌ ఒక మంచి అవకాశం. మనిషి తనలోంచి తానే మళ్లీ మొలకెత్తి నిండా పత్రహరితంతో చిగురించేందుకు ఇదే మంచి తరుణం’’ 


వెనక్కి ...

మీ అభిప్రాయం