తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆ సాయం చేస్తుందని...!

  • 468 Views
  • 10Likes
  • Like
  • Article Share

తెలుగు కవితా వనంలో ఆర్ద్రంగా వర్షిస్తూ హృదయ తంత్రుల్ని మీటుతున్న కవి ఎన్‌.గోపి. నానీల రూపకర్తగా, వేమన మీద సాధికారిక పరిశోధకుడిగా సాహిత్య చరిత్రలో ఆయన స్థానం చెరగనిది.  కవిత్వాన్నే జీవన వాహికగా చేసుకున్న గోపి ప్రస్తుతం అక్షరంతో ఎలాంటి చెలిమి చేస్తున్నారు?  ఆయన మాటల్లోనే...  
ఈ నెల
రోజుల్లో విక్టర్‌ హ్యూగో ‘బీదలపాట్లు’, తెన్నేటి సూరి ‘ఛంఘిజ్‌ఖాన్‌’ పుస్తకాలు మళ్లీ చదివాను. డిగ్రీలో ఉన్నప్పుడు తొలిసారి ఈ పుస్తకాల్ని పఠించాను. ఇప్పుడు మళ్లీ చదువుతుంటే వాటిని అర్థం చేసుకునే వయసు ఇప్పుడొచ్చిందని అనిపిస్తోంది. మొదట్లో కాల్పనిక దృష్టిలో పుస్తకాల్ని చదువుతాం. ప్రపంచ జ్ఞానం పెరిగాక వాస్తవిక దృష్టితో అభ్యసిస్తాం. అందుకే పుస్తకం ఎప్పటికీ పాతబడదు. మనుషులూ అంతే. మనుషులు గ్రంథాల్ని మారిన దృష్టితో చదువుతారు. ఏ దృష్టితో చదివినా మన మనసుని పరిపుష్టం చేసేదే గొప్ప పుస్తకం. ఈ నెల రోజుల్లో కరోనా మీద దాదాపు 20 కవితలు రాశాను. 2016-20 మధ్య కాలంలో నేను రాసిన దాదాపు 550 కవితల్ని ఒక సంపుటిగా తెచ్చేందుకు సిద్ధం చేశాను.
అదే ఒక పుస్తకం 
ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా మూడ్‌లో ఉంది. నేను కూడా కరోనా దృష్టితోనే ప్రపంచాన్ని చూస్తున్నాను. నాకిప్పుడు 70 ఏళ్లు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మనుషుల గురించి నాకేమీ తెలియదని మొట్టమొదటిసారి కరోనా వల్ల తెలిసింది. ప్రపంచంలో మనిషెప్పుడూ ఇంతలా భయపడలేదు. ప్రస్తుత విషాద వలసల్ని టీవీలో చూసి చాలా దుఃఖపడ్డాను. గతంలో కూడా విషాదాలు, పేదరికం పట్ల అనుకంపన ఉన్నాయి. కానీ, ఇప్పుడొక అర్థంకాని పరిస్థితి. ఇది తప్పకుండా అందరి తలుపుల్ని బద్దలుకొట్టే కొత్త చూపునిస్తుంది. 
  మనం బాగుండాలంటే చుట్టుపక్కల అందరూ బాగుండాలని ఈ నెలరోజుల్లో నాకు బాగా అర్థమైంది. ప్రస్తుతం మనిషి తనను తాను తవ్వుకుంటూ చుట్టూ ఉన్నవాళ్లని అర్థం చేసుకుంటూ సాగుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల ముందు పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చిన్నగా అయిపోతున్నాయి. బాల్కనీలో నిలబడితే బయటి ప్రపంచమే ఒక పుస్తకంలా కనిపిస్తోంది. మానవత్వాన్ని, సాటి మనుషుల్ని ప్రేమించడాన్ని ప్రస్తుత పరిస్థితుల నుంచి మనిషి నేర్చుకోవాలి. ఈ కరోనా వల్ల ముందు రోజుల్లో ఒక కొత్త మనిషి వెలికి వస్తాడని నాకనిపిస్తోంది. 
ప్రపంచీకరోనా
కరోనా కారణంగా ఇప్పటి వరకూ జరిగిన నష్టానికి చాలా బాధేస్తోంది. మనకు చాలీ చాలని డబ్బులే ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులున్నాయి. అయినా, ధైర్యంగా ఈ విపత్తుని ఎదుర్కొని బయటపడాలి. ప్రపంచీకరణ వల్ల ఈ కరోనా అందరికీ వినాశంగా మారింది. గతంలో ఎబోలా లాంటివి వచ్చినా అవి ప్రపంచమంతా వ్యాపించలేదు. చైనాతో రాకపోకలు యథేచ్ఛగా సాగడం వల్ల ఈ ఆపదొచ్చింది. అందుకే నేను దీన్ని ‘ప్రపంచీకరోనా’ అంటాను.  
 పాత హిందీ సినిమా పాటలంటే నాకు చాలా ఇష్టం. ‘హమ్‌ దోనో’ చిత్రంలోని ‘మై జిందగీ క సాథ్‌ నిభాతా చలాగయా హర్‌ ఫిక్ర్‌ కో ధుయే మే ఉరాతా చలాగయా’ పాటను గుర్తొచ్చినప్పుడల్లా పాడుకుంటుంటాను. జీవితం నుంచి నేనెప్పుడూ తప్పించుకోవాలనుకోలేదన్నది దాని సారాంశం. మనం అనుభవించే జీవితం మనకి అర్థమైతే ప్రపంచ జీవితం మనకి తెలిసొస్తుంది. మనిషికి అహంకారాలు తగ్గాలి. అప్పుడుగాని సాటి మనుషుల పట్ల అనురాగం పెరగదు. కరోనా మనకు ఆ సాయం చేస్తుందని ఆశిస్తున్నాను.


వెనక్కి ...

మీ అభిప్రాయం