తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సమాజానికి ఏమివ్వగలం?

  • 581 Views
  • 18Likes
  • Like
  • Article Share

‘దిల్లే ఇండియా... ఇల్లే ఇండియా’ అంటూ ‘నాపేరు సూర్య’ ద్వారా సైనికుడి గొప్పదనానికి సెల్యులాయిడ్‌ సెల్యూట్‌ చేసిన దర్శకుడు వక్కంతం వంశీ. సాహితీ కుటుంబం నుంచి వచ్చిన ఈయన సినీ కథా రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రతిభను చాటుకుంటున్నారు. వంశీ ఇప్పుడేం చేస్తున్నారు? ఆయన మాటల్లోనే...
ఒక్కటని కాదుగానీ, రకరకాల వ్యాపకాలతో మమేకమవుతున్నాను. సినిమాలు, డాక్యుమెంటరీలు చూస్తున్నాను. నా సినిమా కోసం స్క్రిప్ట్‌ పని చేసుకుంటున్నాను. దర్శకుడు సురేందర్‌ రెడ్డి సినిమా కోసం కథ రాస్తున్నాను. ఈ మధ్యలో పలు పుస్తకాలు చదువుతున్నాను. మా నాన్నగారు వక్కంతం సూర్యనారాయణరావు మంచి రచయిత. ఆయన రాసిన ‘మృత్యుంజయుడు’ నవల చదువుతున్నాను. అలాగే మార్క్‌ డాసన్‌ ‘ద క్లీనర్‌’ నవల కూడా వెళ్తూ ఉంది. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.
అయినా వినడంలేదు!
బాగా చదివితేనే చక్కగా రాయగలవని నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవారు. పుస్తక పఠనాన్ని ఆయనే అలవాటు చేశారు. రచయితగా బిజీ అయ్యాక చదవడం తగ్గింది. అది తలచుకుంటే బాధగా ఉంటుంది. అందుకే ఇప్పుడు సమయం కేటాయించుకుని వీలైనంత వరకు పుస్తకానికి దగ్గరవుతున్నాను. గతంలో చదివిన ‘మిథునం’ లాంటివి మళ్లీ తిరగేశాను. బాగా నచ్చిన మాయాబజార్‌ సినిమా మళ్లీ మళ్లీ చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఒకసారి చదివిన పుస్తకాన్ని మళ్లీ చేతుల్లోకి తీసుకున్నా అలాగే ఉంటుంది. పదిహేనేళ్లకి ముందు మిథునం చదివాను. జీవితంలో కొంత అనుభవం వచ్చాక మళ్లీ దాన్ని చదివితే ఇంకా చాలా నిగూఢ విషయాలు తెలిశాయి. ఇన్నేళ్లయినా ఆ కథలోని తాజాదనం అలాగే ఉంది. ఆ పాత్రలూ అంతే హృద్యంగా అనిపిస్తున్నాయి. 
 ‘గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్‌’ అన్నాడు నన్నయ. ప్రపంచం గతంలో ఉన్నంత ప్రశాంతంగా రానురాను ఉండటం లేదు. మనిషే దీనికి ఎన్నో ఉపద్రవాలు తెచ్చిపెడుతున్నాడు. నిజానికి, ప్రకృతి విషయంలో కవులు, రచయితలు ఎప్పుడూ మనల్ని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ‘నీ జీవన విధానాన్ని గమనించుకో, ప్రకృతితో జాగ్రత్తగా ఉండు’ అని హితబోధ చేస్తూనే వస్తున్నారు. కళలు కూడా మన పొరపాట్లను పట్టిచూపిస్తూనే ఉన్నాయి. కానీ, ఎవరూ వినే పరిస్థితి లేదు.
అదే పెద్ద సేవ 
మొన్నటి వరకూ ఏదన్నా సాధిస్తేనే సమాజానికి ఏదో చేసినట్లు. కానీ, ఇవాళ ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చోవడమే సమాజానికి చేసే పెద్ద సేవ. మనకోసం బయట ఎందరో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ల గురించి ఆలోచించైనా మనం బయట అడుగుపెట్టకూడదు.  
ఈ కరోనా వైరస్‌ కొన్నాళ్లకి వెళ్లిపోతుంది. అయితే ఆ తర్వాత మనం మళ్లీ మన పాత జీవన విధానంలోకి వెళ్లిపోకూడదు. దీన్నుంచి ఎంతో కొంత గుణపాఠం నేర్చుకోవాలి. మన జీవన విధానంలో, తోటి మనుషుల గురించి ఆలోచించే తీరులో మార్పు రావాలి. జీవితం చాలా చిన్నదని, మనిషి చేతుల్లో ఏమీ లేదని కరోనా గుర్తు చేసింది. బతికినన్ని రోజులూ ఎంత పద్ధతిగా జీవితాన్ని గడపమని, సమాజానికి ఏమివ్వగలమని ఆలోచించాలని తేల్చిచెప్పింది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం