తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఒంట‌రిత‌నం నుంచి బ‌య‌ట‌ప‌డాలి

  • 481 Views
  • 7Likes
  • Like
  • Article Share

తెలుగు కథా ‘సీమ’లో గతి తార్కిక భౌతిక వాద స్వరం సింగమనేని నారాయణ.  ప్రపంచీకరణ కోరల్లో చిక్కి కుదేలైపోతున్న కృషీవలుని దైన్యాన్ని కళ్లకుకట్టిన నిప్పుల కలం ఆయన. కాల్పనికతను పక్కన‌పెట్టి సీమ ప్రజల బతుకు చిత్రాన్ని బలంగా చిత్రించిన సింగమనేని అక్షర ప్రయాణం ప్రస్తుతం ఎలా సాగుతోంది? ఆయన మాటల్లోనే.... 
ఈ విరామంతో
నచ్చిన పుస్తకాలను మరొక్కసారి చదివే అవకాశం కలిగింది. ముఖ్యంగా సుదీర్ఘ నవలలు చదవడానికి తీరిక దొరికింది. టాల్‌స్టాయ్‌ ‘రిజరెక్షన్‌’ నవలకు తెలుగు అనువాదం ‘నవజీవనం’ మళ్లీ చదివాను. అపరాధ భావన నుంచి బయటపడటానికి ఒక వ్యక్తి ప్రయత్నం ఇందులో ప్రధాన ఇతివృత్తం. అపరాధ భావనకు సంబంధించిన కథాంశాలన్నింటికీ ఇదే ఆధారం. ‘యుద్ధం-శాంతి’ కూడా మరోసారి చదువుతున్నాను.
అది ఆవశ్యకం
ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించేవి, నాకెప్పుడూ గుర్తుండిపోయే నవలలు ఉప్పల లక్ష్మణరావు ‘అతడు-ఆమె’, మహీధర రామమోహనరావు ‘కొల్లాయి గట్టితేనేమి?’. జాతీయోద్యమ నేపథ్యంలో విరిసిన కుసుమాలివి. అలాగే వాస్తవికత, వాదవిమర్శనాత్మక రచనలను తెలుగు పాఠక లోకానికి అందించిన కొడవటిగంటి కుబుంబరావు రచనలనూ వీలైనప్పుడల్లా తిరగేస్తున్నాను. 
క్రీడాకారుడికి తన ఆటలో సాధన ఎంత అవసరమో, అలాగే రచయితకు కూడా పుస్తక పఠనం, సాహితీ శోధన, రచన అంతే ఆవశ్యకం. అందుకే ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూ ఉంటాను. అయిదు కథలు, ఆరు సాహిత్య వ్యాసాలు, 16 సమీక్షలతో ‘పరిమితం’ అనే పుస్తకాన్ని తెచ్చేందుకు ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని ఉపయోగించుకున్నాను. ప్రతిఘటన సినిమాలోని ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాట నాకు బాగా నచ్చుతుంది. మగవారిని మేల్కొలిపే సంస్కారవంతమైన పాట ఇది.  
వీలైనంత సాయం
ప్రస్తుత కల్లోలాన్ని తలచుకుంటే... ‘‘ఈ ధాత్రీ వదనాన్ని వికృతం చేసే, ఈ మనుగడని భారం చేసే/ దుస్సహ పరిస్థితి అనారోగ్య మనస్థితి అసంతృప్తి అవాప్తి/ అవివేకులు స్వార్థపరులు కలిగించిన ఫలితం/ తమని తాము బంధించుకున్న సూత్రాలలోంచి నమ్మకాలలోంచి/ తప్పించుకోలేని మనుషుల నిస్సహాయ జనితం...’’ అన్న తిలక్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒంటరితనం బాధపెడుతుంది. దాన్నుంచి బయట పడాలి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధ పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో అభాగ్యులకు వీలైనంత సాయం చేయాలి. అందరూ ధైర్యంగా ఈ కష్టాన్ని ఎదుర్కోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం