తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పుస్తకానికే అంకితం

  • 906 Views
  • 25Likes
  • Like
  • Article Share

పాటకు తెలుగు లాలిత్యపు మధుర పదనిధి చంద్రబోస్‌. ‘‘ఎంత సక్కగున్నవే లచ్చిమి..’’ అంటూ పల్లె పలుకులకి పట్టం కట్టినా, ‘‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా..’’ అని జననికి జోతలు పట్టినా.. పాట పాటకూ భావ పుప్పొళ్ల పరిమళం ఆయన కలం. పాటనే జీవన ప్రవాహంగా చేసుకున్న చంద్రబోస్‌ అక్షర చెలిమి ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఎలా సాగుతోంది? ఆయన మాటల్లోనే.... 
దాశరథి
తెలుగులోకి అనువదించిన గాలీబ్‌ గీతాలు, సినీ గీత రచయిత ఆత్రేయ ‘కదంబం’ పుస్తకాలు చదివాను. అలాగే దశావతారాలు, మహాభక్తుల గురించి ముళ్లపూడి వెంకటరమణ రాసిన రమణీయ భాగవత కథలు రెండోసారి చదివాను. ఆయన శైలి అమోఘం. ఈ పుస్తకం మళ్లీ చదువుతూ జీవితానికి సంబంధించిన కొత్త పార్శ్వాలు తెలుసుకున్నాను. 
ఎన్ని జీవన సత్యాలో!
గాలీబ్‌ సృజనాత్మకత, సమాజం గురించి ఆయన దృష్టికోణం, ప్రేమ, విరహం లాంటి వాటి గురించి ఆయన చెప్పే విషయాలు చాలా ఆకట్టుకుంటాయి. ‘‘నాదు గుండె గాయము కుట్టు సూది కంట - అశ్రు జలధార దారమై అవతరించె’’ అంటాడు ఒక గీతంలో. గుండె గాయాన్ని కుట్టే సూదిలో కన్నీరే దారంగా మారిందట. ఎంత గొప్ప అభివ్యక్తి ఇది! మరోచోట ‘‘దేవీ నాతోడు బంధంబు తెంచబోకు - ప్రేమలేకుండ ఉండనీ ద్వేషమేమీ’’ అంటాడు. ప్రేమలేకపోయినా పర్లేదు, కనీసం ద్వేషబంధమైనా ఉండనివ్వు అనడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అలాగే ‘‘స్వీయ లోపంబులు ఎరుగుట పెద్దవిద్య - లోపమెరిగిన వాడె పూర్ణుడగు నరుడు; వేరులో నుంచి కొమ్మలు వెలసినట్లు - అన్ని శబ్దములు నిశ్శబ్దమందె పుట్టె’’ లాంటివి బాగా నచ్చాయి.  
ఆత్రేయ పేరు చెప్పగానే గొప్ప గొప్ప సినిమా పాటలు గుర్తొస్తాయి. కానీ, జీవిత సత్యాల గురించి ఆయన చెప్పిన మాటలు ‘కదంబం’లో కనిపిస్తాయి. ఇందులో ఒకచోట ‘‘నేను తలదాచుకుంటి నీ నీడలోన నీడమారునున్న నిజం ఎరుగక’’ అంటారు. ఇందులో ఎంత జీవన తాత్వికత దాగుందో! అలాగే ‘‘చావులేని బ్రతుకు శవమల్లె బరువౌను... మృతియె బ్రతుకు యొక్క జీవకణము; నీవు నా పాలి దీపమై నిలచియున్న పురుగునై పుట్టి మరణింతు మరల మరల; లేనినాడు నాకు లేనిది ధనమొక్కటె... ఉన్ననాడు లేనివెన్నియో గదా; వచ్చునప్పుడు కొత్తవి వత్సరములు... పాతబడిపోవు మన పాత పనుల వలన; అనుకున్నవెన్నియో జారిపోయినవి, అనుకోనివెన్నియో జరిగిపోయినవి, అందుకే రేపన్న ఆశ మనకు అది కూడ నిన్నగా మారు వరకు’’ లాంటి వాటిలో ఎన్ని భావాలు, ఎన్నెన్ని జీవన సత్యాలు దాగున్నాయో కదూ! 
లాక్‌డౌన్‌ కాలంలో దాదాపుగా పుస్తక పఠనానికే అంకితమయ్యాను. సాహిత్యాన్ని అవలోకిస్తూ మస్తిష్కంలో భావ సుమాలు విరబూయించుకున్నాను. ఈ మధ్యలో కరోనా గురించి ఒక పాట రాశాను. వైరస్‌ కల్లోల కాలంలో పోలీసులకు మద్దతుగా ఇంకో గీతం సృజించాను.


వెనక్కి ...

మీ అభిప్రాయం