తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆ కరుణతత్వం కావాలి! 

  • 386 Views
  • 11Likes
  • Like
  • Article Share

మహిళలు ఆకాశంలో సగమని చెబుతూ.. ఏ విషయంలోనూ వారు తక్కువ కాదని, తమ హక్కుల కోసం ధైర్యంగా నినదించాలని పిలుపునిచ్చిన రచయిత్రి ఓల్గా. నదిని కలం పేరుగా చేసుకుని మహిళా సమస్యల మీద అలుపెరుగని అక్షర ప్రయాణం చేస్తున్నారావిడ. పదునైన కలంతో స్త్రీవాద సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఓల్గా ఈ నిర్బంధ కాలంలో ఎలాంటి అక్షర యాత్ర సాగిస్తున్నారు? ఆవిడ మాటల్లోనే... 
ఈ నెల రోజుల్లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవల, ఇంకా కొన్ని తెలుగు కథల పుస్తకాలు, ఆంగ్ల రచనలు చదివాను. ప్రస్తుతం హోవర్డ్‌ ఫాస్ట్‌ అనువాద నవల ‘మానధనులు’ చదువుతున్నాను. దీన్ని కె.వి.రమణారెడ్డి తెనిగించారు. రెండువందల ఏళ్ల కిందట ఓక్లహామా అనే ప్రాంతంలో రెడ్‌ ఇండియన్ల మీద అమెరికా ప్రభుత్వం జరిపిన దాష్టీకానికి అద్దం లాంటిది ఈ పుస్తకం. ప్రతి ఏటా లాగే కొ.కు. నవలలు, శ్రీశ్రీ మహా ప్రస్థానం మళ్లీ మరొకసారి తిరగేశాను. 
దూరమవుతున్నారు 
జీవ వైవిధ్యం మీద ఓ నవల మొదలుపెట్టాను. ఈ భూమ్మీద ఆధిపత్యం కోసం మనిషి సాగిస్తున్న విధ్వంసం, దాన్ని ఎవరూ ప్రశ్నించకుండా సృష్టించుకున్న వ్యవస్థల్లోని దుర్మార్గం గురించి ఇందులో చెప్పబోతున్నాను. మన జీవితంలో పర్యావరణం ప్రాముఖ్యతను కూడా వివరించబోతున్నాను. 
      ప్రస్తుత కల్లోలాన్ని తలచుకుంటే కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, శ్రీశ్రీ గుర్తుకొస్తున్నారు. ‘‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై..’’ అన్న కృష్ణశాస్త్రి సున్నిత భావాలకు మనుషులు ప్రస్తుతం దూరమవుతున్నారు. ‘‘బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?’’ అని ప్రశ్నిస్తారు ‘పుష్పవిలాపం’లో కరుణశ్రీ. ఆయన చెప్పిన కరుణతత్వం ఇప్పుడందరికీ కావాలి. ‘‘నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా? నడుమ తడబడి, సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా? మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా?’’ అన్న ‘మహాప్రస్థానం’లోని శ్రీశ్రీ పంక్తులూ పదేపదే స్ఫురణకొస్తున్నాయి. 
ముప్పు తొలిగేదాకా లాక్‌డౌన్‌ని క్రమశిక్షణతో పాటించాలి. ప్రకృతితో మనిషి సహజీవనం చేసే మంచి రోజులను ఎలా తీసుకురావాలో అందరూ ఆలోచించాలి. మనిషి సంతోషమన్నది మన చుట్టూ ఉన్న జీవులతో, ముఖ్యంగా ప్రకృతితో ముడిపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.   


వెనక్కి ...

మీ అభిప్రాయం