తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

లేకుంటే విధ్వంసమే

  • 516 Views
  • 19Likes
  • Like
  • Article Share

సామాజిక అసమానతల మీద కణకణ మండిన దిగంబర కవితా అగ్నికణం నిఖిలేశ్వర్‌. సమాజం కప్పుకున్న మాయా తెరలని తొలగించి చూపిన కలం ఆయనది. కవిగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా నిఖిలేశ్వర్‌ ప్రతి అక్షరమూ వాస్తవాల పక్షమే. నాలుగు దశాబ్దాలుగా సాహితీ, ప్రజా ఉద్యమాలతో మమేకమై సాగుతున్న ఆయన ప్రస్తుత కరోనా కాలంలో ఏం చేస్తున్నారు? ఆయన మాటల్లోనే... 
అమెరికన్‌
సామాజిక శాస్త్రవేత్త ఆల్విన్‌ టాఫ్లెర్‌ రాసిన ‘ఫ్యూచర్‌ షాక్‌’ మళ్లీ చదివాను. సాంకేతికాభివృద్ధి పెరిగితే వచ్చే పరిణామాలేంటో, మనిషి సుఖలాలసుడై తన ఉనికికి ఎలా ముప్పుతెచ్చుకుంటాడో అయిదు దశాబ్దాల కిందట అల్విన్‌ ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే మాక్సిమ్‌ గోర్కి ‘విశ్వవిద్యాలయాలు’ కూడా చదివాను. ఒకప్పటి రష్యన్‌ సమాజంలోని అవిద్య, వెనుకబాటుతనం, దారిద్య్రాలను ఇందులో చిత్రించాడు. ప్రస్తుతం ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత్వం తిరగేస్తున్నాను.
వారు గుర్తొస్తున్నారు
‘ఫ్యూచర్‌ షాక్‌’ నన్ను బాగా ఆకర్షించింది. ప్రస్తుత కరోనా విజృంభణకు కారణాలు కొన్ని ఇందులో కనిపిస్తాయి. విపరీతమైన సాంకేతికాభివృద్ధి వల్ల మనిషి కృత్రిమ జ్ఞానానికి బానిసైపోతున్నాడు. ప్రకృతిని మరచిపోయి తాను కనిపెట్టిన వాటికి జీ హుజూర్‌ అంటున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర కష్టాలు తప్పవని చెబుతుందిది. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ‘శరీరమే శత్రువైతే, కరోనా వార్‌’ అనే రెండు కవితలు రాశాను. నా జీవితానుభవాలనూ, జ్ఞాపకాలనూ సమీకరించి ‘నిఖిలలోకం’ పేరుతో రాయడం మొదలుపెట్టాను.
శరత్‌బాబు జీవితాన్ని విష్ణుప్రభాకర్‌ అనే రచయిత చాలా కళాత్మకంగా రాశారు. దాన్ని జ్వాలాముఖి ‘దేశదిమ్మరి ప్రవక్త శరత్‌బాబు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దాన్నొక్కసారి తిరగేస్తే ఒక మహా రచయిత జీవిత కాలంలో ఎదురైన అనుభవాలు కనిపిస్తాయి. ప్రస్తుత కల్లోలంలో ఆ పుస్తకం బాగా గుర్తొస్తోంది. అలాగే శ్రీశ్రీ, శివసాగర్, ఇంకా మిగిలిన సాహితీ మిత్రులు కూడా స్ఫురణకొస్తున్నారు. నాకు మొదటి నుంచీ హిందీ గాయకుడు కిషోర్‌ కుమార్‌ పాటలంటే చాలా ఇష్టం. ‘దూర్‌ గగన్‌ కి ఛావ్‌ మే’ సినిమాలో ‘ఆకాశం అనే నీడలో ఎక్కడైతే కన్నీళ్లులేవో అక్కడికి తీసుకెళ్తాను...’ అంటూ ఒక తండ్రి నేపథ్యంగా సాగే పాటను గుర్తొచ్చినప్పుడల్లా పాడుకుంటూ ఉంటాను. 
      కరోనా వైరస్‌ మానవాళికి ఒక హెచ్చరిక. దాన్ని ఎదుర్కోవడానికి ఈ లాక్‌డౌన్‌ అవసరమే. తప్పకుండా దాన్ని అందరూ పాటించాలి. మన స్వార్థం, సౌఖ్యం కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం మానుకోవాలి. లేకపోతే మానవాళి విధ్వంసం తప్పదు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం