తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పదిభాషల్లో ప్రదర్శనలిస్తా! ఇంటికొచ్చి తెలుగులో మాట్లాడతా

  • 1010 Views
  • 14Likes
  • Like
  • Article Share

    పద్మ కంటిపూడి

  • హైదరాబాదు, padmaavasu@gmail.com

జనుమల జాన్‌ ప్రకాశ్‌రావు అంటే ఆయన స్వస్థలమైన ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ, జానీ లీవర్‌ అనగానే యావద్దేశం గుర్తుపడుతుంది. ఆ హాస్య నట చక్రవర్తి హావభావాలను గుర్తుతెచ్చుకుని మనసారా నవ్వుతుంది. దశాబ్దాల కిందటే ముంబయిలో స్థిరపడ్డ ఈ తెలుగుతేజం హిందీ చిత్ర పరిశ్రమ ద్వారా జాతీయస్థాయి గుర్తింపు పొందారు. అయినా ఆయన తన మూలాలను మర్చిపోలేదు. ‘నా పిల్లలను తెలుగులోనే పెంచా’నని గర్వంగా చెప్పుకునే జానీ లీవర్‌తో ‘తెలుగు వెలుగు’ మాట్లాడింది. ఆ సందర్భంగా ఆయన పంచుకున్న అనుభవాలు, అనుభూతులు,  అభిప్రాయాల మాలిక... ఆయన మాటల్లోనే... 
ముంబయిలో పుట్టి
పెరిగినా ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదెలా సాధ్యమవుతోందని చాలామంది అడుగుతుంటారు. మా సొంతూరు కనిగిరికి తరచూ వచ్చి వెళ్తుంటా. బంధువుల రాకపోకలూ జరుగుతూనే ఉంటాయి. ముంబయి, దిల్లీలలోని తెలుగు సంఘాల వాళ్లతో అనుబంధం కొనసాగించడం... తెలుగు నటీనటులతో మాట్లాడటం, కుటుంబసభ్యులతో కలిసి తెలుగు ఛానళ్లు చూడటం... ఒక్క మాటలో చెప్పాలంటే, బయట పది భాషల్లో ప్రదర్శనలు ఇచ్చి, సాయంత్రం ఇంటికి వచ్చాక తెలుగులోనే మాట్లాడతా. మా పిల్లలకు తెలుగునేల అంతగా పరిచయం లేదు. కానీ తెలుగులో చక్కగా, స్పష్టంగా మాట్లాడతారు. ఇంట్లో అమ్మను దేవతలా కొలుస్తున్నప్పుడు... అమ్మ నేర్పిన భాషకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి కదా!
      చాలామంది జానీ లీవర్‌ అంటే ఎవరో ఆంగ్ల నటుడనో, మరాఠీ నటుడనో అనుకుంటారు. నా పూర్తి పేరు జాన్‌ ప్రకాశ్‌రావు. నేను పుట్టకముందే మా కుటుంబం కనిగిరి నుంచి ముంబయి వెళ్లిపోయింది. అక్కడి హిందుస్థాన్‌ లీవర్‌ సంస్థలో నాన్న ఆపరేటర్‌గా పనిచేసేవారు. అమ్మ ప్రసవం కోసం మాత్రమే మా సొంతూరు వచ్చింది. నెల పిల్లాడిగా ఉన్న నన్ను తీసుకుని మళ్లీ ముంబయి వెళ్లింది. తెలుగువాళ్లం కాబట్టి తప్పకుండా పిల్లలకి తెలుగు వచ్చి తీరాలనే ఉద్దేశంతో అమ్మ...  నన్నూ, తమ్ముణ్నీ, చెల్లెళ్లనూ అక్కడి ఆంధ్రా బడిలోనే చేర్పించింది. అలా ఏడో తరగతి వరకూ చదువుకున్నా. కానీ, తర్వాత నాన్న ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టమైంది. దాంతో చదువు మానేశా. రకరకాల పనులు చేస్తూ ఇంటికి చేదోడువాదోడుగా ఉండేవాణ్ని. పదహారేళ్ల వయసులో హిందుస్థాన్‌ లీవర్‌లోనే ఉద్యోగం సంపాదించుకున్నా. అక్కడ పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో ఛలోక్తులు చెబుతూ, నటులను అనుకరిస్తూ అందర్నీ నవ్వించేవాణ్ని. మా సంస్థలో ఏ చిన్న వేడుక జరిగినా నాతో హాస్య ప్రదర్శన ఇప్పించేవారు. అలా ఓసారి వేదిక మీద నేను హాస్యం పండిస్తున్నప్పుడు చూసిన ఓ ఉన్నతాధికారి వెంటనే నా దగ్గరికి వచ్చారు. నన్ను హత్తుకొని.. ‘ఇవాళ్టి నుంచి నువ్వు జాన్‌ ప్రకాశ్‌రావువి కాదు. జానీ లీవర్‌వి’ అన్నారు. అలా నాకు నామకరణం జరిగింది. తర్వాత్తర్వాత బయట ఆర్కెస్ట్రాల వాళ్లతోనూ పరిచయాలు పెంచుకున్నా. కార్యాలయంలో పని అయ్యాక, వాళ్లతో కలిసి స్టేజి షోలు చేసేవాణ్ని. ఈ క్రమంలో నాకు కల్యాణ్‌జీ ఆనంద్‌జీ సోదరులు పరిచయమయ్యారు. వాళ్లిద్దరూ అప్పట్లో బాలీవుడ్‌ని శాసించిన సంగీత దర్శకులు. వాళ్ల సాన్నిహిత్యమే నన్ను ఇంతటివాణ్ని చేసింది. 
తొలి అడుగులు ఇక్కడే
ఇప్పటివరకూ ఎన్నో స్టేజి షోలు చేశా. కానీ, నా మొదటి ప్రదర్శన మాత్రం హైదరాబాదు రవీంద్రభారతిలోనే ఇచ్చా. దానికి మా గురువుగారు రావాల్సింది... ఆయనకు ఏదో పని ఉండటంతో నేను వచ్చా. అలా నేను పదిహేడేళ్ల వయసులో తొలిసారి హైదరాబాదును చూశా.
      పుట్టినగడ్డ మీద... నా మాతృభాషలో మొదటి ప్రదర్శన ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూనే ఉంటా. ఇలా స్టేజి షోలు చేస్తున్న క్రమంలోనే అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర, రేఖ, అనిల్‌కపూర్, జీనత్‌ అమన్‌ లాంటి ఎంతోమంది ప్రముఖులు పరిచయమయ్యారు. వాళ్లందరూ నా ప్రదర్శనలను చూడటానికి పనికట్టుకుని మరీ వచ్చేవాళ్లు. ప్రదర్శన పూర్తయ్యాక తిరిగివెళ్తూ ‘సంవత్సరానికి సరిపడా నవ్వేశాం’ అని వాళ్లంతా ప్రశంసిస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇలా కొన్నాళ్లు గడిచింది. అప్పట్లో కల్యాణ్‌జీ ఆనంద్‌జీ సోదరులు సంగీత దర్శకత్వంతోపాటు ఆడియో స్కూప్స్‌ కూడా చేసేవారు. అలా నా హాస్యంతో ఓ ఆడియో క్యాసెట్‌ చేశారు. అలా సినిమాల్లో అవకాశం వచ్చింది. ‘యే రిష్తా నా టూటే’ నా మొదటి చిత్రం. దాని నిర్మాత పి.ఆనందరావు అని తెలుగు వ్యక్తి. హైదరాబాదులోనే నా మొదటి షాట్‌ చిత్రీకరణ జరిగింది. అలా నా ప్రతి అడుగులోనూ తెలుగునేల, వ్యక్తులతో అనుబంధం ఉంది.  
      నేను చదువుకుంది ఏడో తరగతే కానీ, తెలుగుతోపాటు తొమ్మిది భాషలు మాట్లాడగలను. ఆంగ్లం, హిందీ, మరాఠీ,  మలయాళం, కన్నడం, గుజరాతీ, రాజస్థానీ, తుళు, పంజాబీ భాషలు నాకు కరతలామలకం. ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నారని అందరూ అడుగుతుంటారు. తపన ఉంటే సరిపోతుందని చెబుతుంటా. ఆయా భాషల మీద పట్టు పెంచుకోవడానికి నేనెక్కడా శిక్షణ తీసుకోలేదు. సంబంధిత రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడివాళ్లతో పదే పదే మాట్లాడటం వల్ల ఆ భాషల మీద పట్టు వచ్చింది. అంతేకాదు స్థానిక మాండలికాలు కూడా నేర్చుకునేవాణ్ని. నా ప్రదర్శనలకు వచ్చిన వాళ్లతో ఎక్కువగా మాట్లాడుతూ.. వాళ్ల హావభావాలను గమనించేవాణ్ని. ఇంటికొచ్చాక వాటిని మళ్లీ గుర్తుకుతెచ్చుకొనేవాణ్ని. ప్రత్యేకమైన అలవాట్లు, మేనరిజమ్స్‌ కనిపిస్తే... వేదిక మీద వాటిని అనుకరించేవాణ్ని.  
హాస్యమంటే బూతు కాదు
సినిమాల్లోకి వచ్చాక నిలదొక్కుకోవడానికి పన్నెండేళ్లు పట్టింది. పెద్ద నటులతో పరిచయాల వల్ల అవకాశాలైతే వచ్చేవి. కానీ కెమెరా ముందు నటించలేకపోయేవాణ్ని. వేదిక మీద ప్రదర్శనలు ఇవ్వడం... ప్రేక్షకుల్ని నవ్వించడం సులువైన పనే. కానీ కెమెరా ముందు నటించడం చాలా కష్టం. టేకుల మీద టేకులు తీసుకునేవాణ్ని. అమితాబ్, ధర్మేంద్ర లాంటి నటులు ‘అయ్యోపాపం’ అనుకునేవాళ్లు. వాళ్లంతా నా ప్రదర్శనలు చూసి చప్పట్లు కొట్టినవాళ్లే. కెమెరా ముందు నటించడం రాక నేను ఇబ్బంది పడుతుంటే జాలి పడేవాళ్లు. అలాంటి నటీనటుల సమయాన్ని నా టేకులతో వృథా చేస్తున్నందుకు బాధ కలిగేది. ఇంటికెళ్లి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఎలాగైనా నటించి తీరాలనే కసి కూడా అప్పుడే మొదలైంది. దాంతో నా మీద సన్నివేశాల చిత్రీకరణ ఏమీ లేకపోయినా సెట్టుకు వెళ్లేవాణ్ని. ప్రముఖ కథానాయకులు ఎలా నటిస్తున్నారో గమనించేవాణ్ని. నటనకు సంబంధించి పుస్తకాలు చదివేవాణ్ని. సినిమాలు చూసేవాణ్ని. అలా రకరకాల మార్గాల్లో నటన మీద పట్టు సాధించా. ఎనభైల్లో సినిమా రంగంలోకి వస్తే 1992లో ‘జానీ లీవర్‌ ఉత్తమ హాస్యనటుడనిపించుకున్నా.  
      ఈ క్రమంలో తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేకపోయా. అదీకాక అటూ ఇటూ తిరగడం సరికాదనిపించింది. అయితే, ‘క్రిమినల్‌’ (1994) చిత్రంలో బ్రహ్మన్న(బ్రహ్మానందం)గారితో కలిసి ఓ చిన్న సన్నివేశంలో నటించా. ఇప్పటివరకూ 400 సినిమాల్లో నటించా. అనేక పురస్కారాలు అందుకున్నా. తెలుగువాణ్ని అయి ఉండి.... దేశంలోనే అగ్రశ్రేణి హాస్యనటుణ్ని కావడం మాత్రం  చెప్పలేనంత సంతృప్తినిస్తుంది. ఎంత పెద్ద నటుడినైనా స్టేజి షోలను వదులుకోలేదు. ఇప్పుడు మా అమ్మాయి జామీ కూడా నాతోపాటు ప్రదర్శనలు ఇస్తోంది. అంతేకాదు సినిమాల్లోనూ హాస్యపాత్రల్లో నటిస్తోంది. నా వారసత్వాన్ని నా కూతురు అందిపుచ్చుకోవడం గర్వంగా అనిపిస్తోంది. 
      ఒకప్పటికీ, ఇప్పటికీ హాస్యం పండించడంలో చాలా తేడాలు వచ్చాయి. గతంలో హాస్యనటులు లేకుండా సినిమాలు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కథానాయకులు, ప్రతినాయకులు సైతం కామెడీ చేస్తున్నారు. హాస్య ప్రదర్శనల్లో అసభ్యత పెరిగింది. నిజానికి హాస్యనటుణ్ని చూసిన వెంటనే నవ్వు రావాలి. రాజబాబు, రమణారెడ్డి, రేలంగి, బ్రహ్మానందం వంటివాళ్లని చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు పడితే వాళ్లు హాస్యనటులుగా రంగప్రవేశం చేస్తున్నారు. వాళ్లని అలా నిలబెట్టడానికి రచయితలు భాషలో మార్పు చేస్తున్నారు. బూతు సంభాషణలు రాస్తున్నారు. అది నిజమైన హాస్యం కాదు. హాస్యం అంటే కుటుంబమంతా కలిసి ఆస్వాదించాలి. ఇప్పుడు అలా లేకపోవడం బాధాకరం.  
అచ్చమైన తెలుగు కుటుంబం
ప్రదర్శనల కోసం నేను దేశమంతా తిరిగా. ఎక్కడి వాళ్లు అక్కడి భాషలను గౌరవంగా చూసుకుంటారు. గుండెల్లో పెట్టుకుంటారు. కానీ, తెలుగువాళ్ల మాటల్లో మాత్రం ఆంగ్లం ఎక్కువగా దొర్లుతుంది. ఎందుకంటే, ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లం తప్పనిసరి అంటున్నారు. అందుకే పల్లెల్లో ఉండేవాళ్లు సైతం పట్టణాలకు వలసవచ్చి మరీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తున్నారు.  చదువుల పోటీ, కెరీర్‌లో నిలదొక్కుకోవాలనే ఆరాటంలో మాతృభాషని గౌరవించమని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పట్లేదు. నేనుమాత్రం మా పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివినా, మరాఠీ పిల్లలతో కలిసి ఆడుకున్నా... ఇంటికొస్తే తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేశా. తెలుగును మర్చిపోతే కన్నతల్లిని మరచిపోయినట్టే అని చెబుతూ వాళ్లను పెంచా. వాళ్లు ఏదైనా ఆంగ్లంలో మాట్లాడినప్పుడు, ఆ మాటలనే తెలుగులోకి అనువదించి చెప్పాలనే నియమం పెట్టా. అందుకే మా అమ్మాయికి, అబ్బాయికి చక్కటి తెలుగు వచ్చింది. నా విషయానికొస్తే, పెళ్లయ్యాక నాకింకా స్పష్టంగా తెలుగు మాట్లాడటం వచ్చింది. నా భార్య సుజాతకి తెలుగు తప్ప మరే భాషా రాదు. తనకి హిందీ నేర్పిస్తూ నేను తెలుగు మీద పట్టు పెంచుకున్నా. ఇంట్లో అందరం తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడుకుంటాం. తెలుగు టీవీ ఛానళ్లు ఎక్కువగా చూస్తాం. మా ఆవిడ తెలుగు పుస్తకాలు బాగా చదువుతుంది.
      అయితే, టీవీలో తెలుగు నటుల ముఖాముఖిలు చూస్తుంటే భలే బాధగా అనిపిస్తుంది. వాళ్లు నూటికి తొంభై అయిదు శాతం ఆంగ్లంలోనే మాట్లాడతారు. ‘‘నా మూవీలో ఆల్‌మోస్ట్‌ నేను సీరియస్‌గా ఉంటాను. ఎమోషన్స్‌ సూపర్బ్‌గా పండాయి. సమ్‌ టైమ్స్‌ ఫన్‌ కూడా ఉంటుంది’’... ఇలా మాట్లాడుతుంటే తెలుగు భాష ఏమైపోయింది అనిపిస్తుంది. టాలీవుడ్‌ హాలీవుడ్‌ అవుతుందా అని భయం వేస్తుంది! చాలావరకూ గ్రామీణ ప్రాంతాల వాళ్లే టీవీలు ఎక్కువగా చూసేది. రేటింగ్సు కూడా వాళ్ల వల్లే వచ్చేది. అలాంటప్పుడు వాళ్లని దృష్టిలో పెట్టుకుని కదా నటులు మాట్లాడాలి. ఇలా మాట్లాడితే వాళ్లకేం అర్థమవుతుంది? సినిమావాళ్లనే కాదు బయట అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 
దిల్లీ నుంచి కనిగిరి వరకూ
ముంబయి ఎన్నో సంస్కృతుల మిళితం. ఇక్కడ ఎవరికైనా స్థానం ఉంటుంది. మొదట్లో ఇక్కడ తెలుగువాళ్లని మదరాసీలుగా చూసేవారు. గొడవలూ జరిగేవి. ఇప్పుడు అలాంటివేం లేవు. నన్ను తరచూ తెలుగు సంఘం వాళ్లు ఆహ్వానిస్తారు. ‘మన జానీ.. మన తెలుగువాడు’ అంటూ వాళ్లు ఆదరిస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. దిల్లీ తెలుగు సంఘం వాళ్లూ నన్ను ప్రేమగా ఆహ్వానిస్తారు. దిల్లీ వెళ్లినప్పుడల్లా వాళ్లని కలుస్తా. తెలుగునాట బ్రహ్మన్నగారితో సత్సంబంధాలున్నాయి. ఆయనతో ఎక్కువగా మాట్లాడుతుంటా. అలీ చిన్నతనం నుంచీ నాకు తెలుసు. తరచూ కనిగిరి వస్తుంటా. మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు. నా సొంత చెల్లి హైదరాబాదులోనే ఉంటోంది. అందరం తరచూ కలుస్తాం. 
      తెలుగులో నాకు దేవదాసు, ప్రేమ్‌నగర్, పండంటికాపురం, బందిపోటు, దొంగ తదితర సినిమాలంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ట తెలుగులో మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. పదాలను ఉచ్చరించడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తప్పు పలకరు. వాళ్లు బయటికి వెళ్లి అభిమానుల్ని కలిసినా.. తెలుగులోనే పలకరించేవాళ్లు. అందుకే ప్రేక్షకులకు వాళ్లు అంతగా దగ్గరయ్యారు. అన్నగారు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కావడానికి ముందు పాదయాత్ర చేశారు. ఆ సందర్భంలో ప్రతి తెలుగువాడూ ‘అన్నా’ అంటూ వెళ్లి ఆయన్ని కౌగిలించుకోగలిగాడంటే.. ఆయన సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో మాట్లాడబట్టే. నావరకూ నేను దేశం మెచ్చిన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నా, నా మాతృభాషను మర్చిపోలేదని గర్వంగా చెప్పుకుంటా. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి