తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు బాగా చదివేదాన్ని!

  • 582 Views
  • 19Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం

  • పెదపాడు, పశ్చిమగోదావరి shanti.rfc@gmail.com

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో...’’ అంటూ గళంలో అమృతపు జల్లులు ఒలికించినా, ‘’మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగం ఎన్నినాళ్లు’’ అంటూ పాటల పూదోటలో కొత్త వసంతాన్ని చిగురింపజేసినా, ‘‘వెళ్లవయ్యా.... వెళ్లూ...’’ అంటూ గాత్రదానంతో అందరినీ మంత్రముగ్ధం చేసినా సునీత ప్రత్యేకతే వేరు. మూడు వేలకు పైగా పాటలు, 750 చిత్రాలకు గాత్రదానం, ఇంకా ఎన్నో టీవీ కార్యక్రమాలు సునీత గళ మాధుర్యానికి నిదర్శనాలు. గొంతులో అమృతం, ఉచ్చారణలో స్పష్టత నింపుకున్న ఈ గాన కోయిల సినీ రంగానికొచ్చి పాతికేళ్లవుతున్న సందర్భంగా ఆమెతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...
తెలుగులో మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు?

ఒక్కో సందర్భంలో ఒక్కో రచయిత స్ఫూర్తినిస్తూ వచ్చారు. చాలా భావయుక్తంగా ఉండే దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు నాకు బాగా నచ్చుతాయి. మా తాతగారు మల్లాది శివరామశాస్త్రి తెలుగులో రామాయణం రాశారు. ఆయన రచనలు చిన్నప్పటి నుంచీ చదివాను. తాతగారి ప్రభావం నామీద ఎక్కువుంది.
ఎలాంటి సాహిత్యం బాగా ఇష్టం?
ఇటీవల కాలంలో ముళ్లపూడి వెంకటరమణ భాగవతం చదివాను. బాగా నచ్చింది. అలాగే పాటల సాహిత్యమన్నా నాకు చాలా ఇష్టం. కథలు కూడా కొన్ని నచ్చుతాయి. పద లాలిత్యంతో ఉండే కవితలంటే ఇష్టం. నా ప్రయాణం చాలా వరకు పాటలతోనే సాగింది కాబట్టి గీత సాహిత్యం నామీద చూపించిన ప్రభావమూ ఎక్కువే. ఇక రచన విషయానికొస్తే మనసులోని భావాలను నాకోసం నేను రాసుకుంటాను. వాటిని పదిమందికీ చూపించడం అంతగా ఇష్టముండదు.
మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్నెలా సాధించారు?
ఎవరికైనా వాచకం ముఖ్యం. చిన్నప్పటి నుంచీ భాషని ప్రేమించేదాన్ని. పాట పాడటమంటే చక్కటి సాహిత్యాన్ని సంగీతం రూపంలో చెప్పడమేనని నా భావన. అలా నేర్చుకునే క్రమంలో ఈ ఉచ్చారణ అలవడి ఉండొచ్చు. అలాగే డబ్బింగ్‌ చెప్పడం వల్ల భాషకు సంబంధించి చాలా విషయాలు తెలిశాయి.
భాష పరంగా గాయకులకు ఉండాల్సిన లక్షణమేంటి? 
మనకంటూ ఒక భాషా సంపద ఉంది. పాటల్లోగానీ, మాటల్లోగానీ అది స్పష్టంగా, నిర్దుష్టంగా ఉండాలి. అందుకే గాయనీ గాయకులు ఎవరికి వారు బాధ్యతగా తాము పాడే పాటల్లోని భాషా విషయాల గురించి తెలుసుకోవాలి. ఒత్తులు, పొల్లులు లాంటి వాటి మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల లాంటి గాయకులని మనం ఇంత గొప్పగా, గౌరవంగా చూస్తున్నామంటే కారణం వాళ్ల గళంలోని మాధుర్యంతో పాటు భాషకు సంబంధించిన స్పష్టత కూడా. గాయకులు శ్రుతి, లయతో పాటు ఆ పాటలోని భాషా సౌందర్యాన్ని కూడా గుర్తించాలి. అప్పుడే వాళ్ల పాటలు పదికాలాలూ గుర్తుంటాయి.
పాటలద్వారా మంచి భాషని సమాజంలోకి తీసుకెళ్లొచ్చు కదా?
మూడేళ్ల పాటు ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమం చేశాము. దీని తర్వాత వేర్వేరు దేశాల్లో మన తెలుగు వాళ్ల పిల్లల్ని గమనించాను. వాళ్లు అన్నమయ్య కీర్తనల్ని పాడటమే కాదు, కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నారు. వాటికి అర్థాలు తెలుసుకుంటున్నారు. సంగీతం నేర్చుకోవడం ద్వారా ఎంతో మంది కవులు, వారి ఆలోచనలు, మాండలికాలని పిల్లలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అన్నమయ్య ఆనాటి భాషను ఉపయోగించారు. ఈ సంకీర్తనలు నేర్చుకోవడం ద్వారా పిల్లలకి ఆనాటి భాష ఎలా ఉండేదో తెలుస్తుంది. ముఖ్యంగా పాటల ద్వారా పిల్లలు భాషని నేర్చుకునే క్రమంలో దాన్ని ఒక భారంగా భావించరు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు.
పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం తెలియాలంటే ఏం చెయ్యాలి?
మనకి రకరకాల మాండలికాలు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో రకమైన సంప్రదాయాలు, సంస్కృతి ఉన్నాయి. అయితే, నా దృష్టిలో సంప్రదాయాలు అంటే విలువలు. తోటి మనిషితో ఎంత సంస్కారవంతంగా ఉండాలి, నొప్పించకుండా ఎలా మాట్లాడాలి అన్నవి ప్రధానం. సంస్కృతి సంప్రదాయం అంటే చక్కగా పరికిణీ ఓణీ వేసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. సంస్కారం అనేది గొప్ప ఆభరణం. భయపెట్టి పిల్లలకు దాన్ని నేర్పలేం. సంస్కారం విలువని వాళ్లకి తెలియజెప్పాలి. అప్పుడే పిల్లలు ఆచరణలోకి తెచ్చుకుంటారు. సమాజంలో పరిస్థితులు మారాయి. కాలంతో పాటు ఎవరైనా ప్రయాణం చెయ్యాల్సిందే. కాకపోతే ప్రతి దశలో అందుబాటులో ఉన్న వనరుల్ని వాడుకుంటూ పిల్లల్లో మంచిని పెంచాలి. 
గొప్ప దర్శకులు, సాహితీవేత్తలతో కలిసి పని చేశారు కదా?
రకరకాల సభల కోసం వేర్వేరు దేశాలకు వెళ్లినప్పుడు, ఇక్కడా జొన్నవిత్తుల, వేటూరి, సామవేదం షణ్ముఖశర్మ, సిరివెన్నెల లాంటి చాలామంది స్వయంగా పాటలు పాడటం విన్నాను. ఆయా అంశాలకు సంబంధించి అప్పటికప్పుడు వాళ్లు చాలా బాగా మాట్లాడతారు. సాహితీవేత్తల మధ్యలో ఉంటే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది. ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. వాళ్లు బోలెడంత చదివి ఆ స్థాయికి వచ్చి ఉంటారు కదా. వాళ్లలో సమక్షంలో ఉంటే నాకు గ్రంథాలయంలో ఉన్నట్లే ఉంటుంది. చంద్రబోస్, అనంత శ్రీరామ్‌లతో మాట్లాడుతున్నా సాహిత్యానికి సంబంధించి చాలా విషయాలు తెలుస్తాయి.
మీరు ఎన్నో దేశాల్లో పర్యటించారు.  భాషా సంస్కృతుల పరంగా అక్కడ మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?
ఇతర దేశాల్లో చూస్తే వాళ్లు తమ సంస్కృతీ సంప్రదాయాల్ని బాగా పరిరక్షించుకుంటున్నారు. వాళ్లు పండగలు జరుపుకునే తీరు నాకు బాగా నచ్చుతుంది. మారిషస్‌ని సందర్శించినప్పుడు ఒకప్పటి మన అచ్చతెలుగు ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఒక్క ఆంగ్లపదం లేకుండా వాళ్లు మన భాష మాట్లాడటం చాలా ఆనందం కలిగించింది. 
ప్రస్తుతం తెలుగు స్థితిగతులు.. ఆంగ్ల మాధ్యమంలో చదువుల గురించి మీరేమంటారు?
పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. తెలుగు బాగా చదివేదాన్ని. అయితే తెలుగు మాస్టారు కంటే సంగీతం మాస్టారు దగ్గరే ఎక్కువ సమయం గడిపాను. తెలుగుని మర్చిపోతే మనం మన ఉనికిని కోల్పోయినట్టే. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ఆంగ్లం నేర్చుకోవాలి. అంత మాత్రాన అమ్మభాషా మాధ్యమంలో చదువు అవసరం లేదనడంలో అర్థం లేదు.
పరభాషా గాయకుల వల్ల సినీ గీతాల్లో ‘తెలుగు’కు నష్టం జరుగుతోందని అంటుంటారు కదా? 
అలా ఏమీ లేదు. శ్రేయాఘోషల్‌ తెలుగులో స్పష్టంగా పాడతారు కదా. మనవాళ్లు కూడా ఇతర భాషల్లో పాటలు పాడారు. పాడుతున్నారు. వాళ్లతో సరిగా పాడించుకునే బాధ్యత మనది. ఇతర భాషలో పాట పాడేటప్పుడు దానికి సంబంధించి అవగాహన పెంచుకుంటే సమస్య ఉండదు. లేకుంటే, రామ్మా చిలకమ్మకి, రామ చిలకమ్మకి తేడా ఉండదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం