తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అర్థంలేని అంత్యప్రాసలెందుకు?

  • 525 Views
  • 2Likes
  • Like
  • Article Share

తెలుగులో లలిత గీతాల ఘల్లుఘల్లుల సిరి వడ్డేపల్లి కృష్ణ. వెయ్యికి పైగా లలితగీతాల కర్తగా, సినిమా పాటలు, గేయ నాటికల రచయితగా, సినీ దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. లలిత గీతాల మీద ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని కూడా వెలువరించారాయన. అభిరుచి కలిగిన సంగీత దర్శకులుంటే ఇప్పటి సినిమాల్లో సైతం లలిత గీతాల గుబాళింపులు సాధ్యమే అంటున్న వడ్డేపల్లితో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి....
లలిత గీతాల ప్రత్యేకత ఏంటి?  

లలిత గీతానికి భావం ప్రధానం. సరళ సాహిత్యం, సంగీతంతో కూడుకున్నది కాబట్టి లలిత గీతం అన్నారు. సినీ గీతానికైనా, లలిత గీతానికైనా జానపదమే మూలం. అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ కృతులు రాగ నిర్దేశితాలు. అవి రైలు పట్టాల్లాంటివి. పక్కకి జరపడానికి లేదు. సినిమా గీతాలు వివిధ వాద్యాలతో కూడిన సన్నివేశ ప్రధానాలు. వాటిలో ఒక్కోసారి భావం ఉండకపోవచ్చు. కానీ, లలిత గీతానికి భావం ముఖ్యం. ఇందులో పరిమిత సంగీత వాద్యాలే ఉంటాయి. లలిత గీతం కారు నడకలాంటిది. కృతులు, సంకీర్తనలతో పోలిస్తే దీనికి ఒక స్వేచ్ఛ ఉంది. భావానికి అనుగుణంగా లలిత గీతానికి సంగీత దర్శకుడు ఏ బాణీని అయినా ఎంచుకోవచ్చు. అయితే, రచయిత ఏ గతిలో రాశాడో అందులో పాడితేనే బాగుంటుంది. లేకుంటే విరిచినట్లుంటుంది. 
లలిత గీతాలకి ఆకాశవాణి గొప్ప సేవ చేసింది కదా? 
అసలు ఆకాశవాణి లలిత సంగీతం ద్వారానే లలిత గీతాలకి ఆ పేరొచ్చింది. లలిత గీత లతకు పందిరిలా ఆకాశవాణి నిలిచింది. అప్పట్లో ఇంత విస్తృత మీడియా, ఇన్ని ఛానళ్లు లేవు. రేడియోనే ప్రధాన మనోరంజన సాధనం. సిలోన్‌ నుంచి ప్రసారమయ్యే ‘వివిధ భారతి’ పాటలకు ప్రజలు ఎక్కువ మొగ్గుచూపేవారు. మన భాషా సాహిత్యాన్ని పెంపొందింపజేయడానికి ఆకాశవాణి అప్పటి వరకూ గీతావళి, సుగమ్‌ సంగీత్‌ అంటూ ప్రచారంలోకి వచ్చిన లలిత గీతాల్ని 1954 నుంచి ప్రత్యేక లలిత సంగీత శాఖగా మార్చింది. మద్రాసు కేంద్రంలో బాలాంత్రపు రజనీకాంతరావు, విజయవాడలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హైదరాబాదులో పాలగుమ్మి విశ్వనాథం గార్లని లలిత సంగీత ప్రయోక్తలుగా నియమించారు. అప్పటి నుంచి వాటికి విస్తృత ప్రచారం వచ్చింది. ఎందరో గొప్ప కవులు లలిత గీతాలు రాశారు. 
లలిత గీతాల మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది?
మొదట్లో కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి లలిత, సినీ గీతాల్ని రేడియోలో వింటుండేవాణ్ని. ప్రారంభంలో సినిమా పాటలు రాయాలన్న ఆసక్తితో సినారెని కలిశాను. ముందు మాత్రా ఛందస్సు నేర్చుకుని గేయాలు, లలిత గీతాలు రాసి పత్రికలు, రేడియోకి పంపమని ఆయన చెప్పారు. ఆ సలహా మేరకు చాలా గ్రంథాలు చదివాను. మా గురువు కనపర్తి గారి ద్వారా మాత్రా ఛందస్సు మీద పట్టు సాధించాను. ఆ తర్వాత గేయాలు, లలిత గీతాలు రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో సబ్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూ లలిత గీతాల్ని రేడియోకి పంపించేవాణ్ని. ‘ఇవి మీ ప్రతిభకి తగ్గట్టుగా లేవు’ అంటూ తిరుగుటపాలో వచ్చేవి. చాలా కోపమొచ్చేది. అయినా, పట్టు వదలని విక్రమార్కుడిలా రాసి పంపిస్తూనే ఉండేవాణ్ని. 1968లో ఒకేసారి నావి రెండు గీతాలు ఎంపికైనట్టు చెప్పారు. చాలా ఆనందం కలిగింది. వాటిలో ఒకటి ‘కనరా నీ దేశం... వినరా సందేశం’ అనే దేశభక్తి గీతం, మరొకటి ‘వర్షించవె మేఘమా వరిచేలు ఫలించగా..’ అంటూ సాగే ప్రకృతి గీతం. ఇవి రేడియోలో ప్రసారమయ్యాక నాకు ఆసక్తి ఇంకా పెరిగింది. ఎలా రాయాలో కూడా అవగాహన వచ్చింది. అప్పట్లో ‘ఈ మాసపు పాట’ పేరుతో ఒక గీతాన్ని ఎంపిక చేసి నెల రోజుల పాటు ప్రసారం చేసేవారు. ‘జగతి రథం జైౖకొడుతూ ప్రగతి రథం పైకూని’ అంటూ నేను రాసిన లలిత గీతం దానికి ఎంపికవ్వడం చాలా సంతోషం కలిగించింది. 
లలిత గీతాల మీద పరిశోధన చేశారు కదా? 
ప్రబంధాలు, జానపద సాహిత్యం, ఇంకా ఇతర సాహితీ ప్రక్రియల మీద ఎందరో పరిశోధన చేశారు. కానీ, నా అదృష్టం కొద్దీ ఎవరూ లలిత గీతాల్ని ముట్టుకోలేదు. లలిత గీతం వినడానికి తేలిగ్గానే ఉన్నా దిగితేగానీ అదెంత భారమైందో తెలియదు. లలిత గీతం లక్షణం గురించి చెప్పడానికే నాకు చాలా కష్టమైంది. ఆరుద్ర, బాలాంత్రపు, తొలితరం నేపథ్య గాయకులు సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి లాంటి వారందరినీ ముఖాముఖి చేసి చివరికి, ‘తాళం, లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావ గీతం లలిత గీతం’ అన్న నిర్వచనం ఇవ్వగలిగాను. రాగ నిర్దేశితాలైన అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ కృతులను లలిత గీతాల్లోకి చేర్చలేదు. ‘అవతరణం, వికాసం, విస్తారం, ప్రసారం, ప్రచారం’ లాంటి విభాగాల్లో లలిత గీతాలని విభజించాను. 1910లో వచ్చిన గురజాడ ‘దేశభక్తి’ గీతాన్ని తొలి లలిత గీతంగా నిరూపించాను. లలిత గీత వికాస కర్తలుగా కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు లని పేర్కొన్నాను. మల్లవరపు విశ్వేశ్వర రావు, బాలాంత్రపు, బోయి భీమన్న, దాశరథి, సినారె లాంటి వాళ్లని విస్తార కర్తలుగా చెప్పాను. ప్రసారం విభాగంలో అందరివీ వచ్చాయి. ప్రచారంలో గ్రామ్‌ఫోన్‌లో వెలువడిన వాటి గురించి చెప్పాను. 1910లో వచ్చిన ‘దేశభక్తి’ గీతం నుంచి 2000 వరకు వచ్చిన లలిత గీతాల మీద పరిశోధన చేశాను.  
పద్యాల్లో కూడా ప్రయోగాలు చేసినట్టున్నారు? 
‘పాటవెలదులు’ అని ప్రయోగ పద్యాలు రాశాను. ‘మనసా తెలుసా’ అన్నది గేయ ముక్తకాల ప్రయోగం. ‘పాటవెలది’లో పాట అన్నది మాత్రా ఛందస్సుకు, ‘వెలది’ అన్నది ఆటవెలదికి సంబంధించినవి. హంస పంచకం అనేది ఆటవెలది లక్షణం. ఆటవెలది రెండు, నాలుగో పాదాల్లో హంసపంచకం పాటిస్తూ అయిదు సూర్యగణాలుంటాయి. ఒకటి నాలుగో పాదాల్లో మూడు సూర్య, రెండు ఇంద్రగణాలుంటాయి. తేటగీతిలో అన్ని పాదాలు ఒకే గణాలతో సాగుతాయి. ఆటవెలదిలో కూడా తేటగీతి పద్ధతిలో అన్ని పాదాల్ని అయిదు సూర్యగణాలతో నడిపించాను. ఒక్కో సూర్యగణానికి మూడు మాత్రల చొప్పున ఒక్కో పాదంలో మొత్తం పదిహేను మాత్రలుంటాయి. మాత్రా ఛందస్సు పాట లక్షణం. దీనికే ‘పాటవెలదులు’ అని పేరుపెట్టాను. ‘‘చిగురు మేసినట్టి చిట్టి పికము/ గళము ఎత్తినంత గానమాయె/ కాగితాల మేసి గాడిదేమె/ గొంతు ఎత్తినంత గోలయాయె’’; ‘‘పల్లెలందు వీచు పైరగాలి/ పట్నమందు లేచు పాడుగాలి/ ప్రియముగాను మనిషి పీల్చుగాలి/ కలుషితమ్ము ఆయె ఖర్మగాలి’’ ఇలా రెండొందల యాభై వరకు పాటవెలదులు రాశాను. ఆంధ్రప్రభలో అయిదారు నెలలు ఇవి వచ్చాయి. ‘మనసా తెలుసా’ ముక్తకాలు సినారెకి చాలా నచ్చాయి. ‘మనసా’ అంటూ సంబోధించడం, చివర్లో ‘తెలుసా’ అని చెప్పడం వీటిలోని ప్రయోగం. ‘ఒడ్డు చేరేదాక ఎవడైన గాని తెడ్డు వేయంటాడు మనసా... ఏరుదాటంగనే ఏమిటోగానిమరి ఎవరు నీవంటాడు తెలుసా’; ‘దేవుడున్నాడంటు రాయిరప్పలలోన దేవులాడెదవేల మనసా... దయగలిగి ఉన్నట్టి ధర్మ హృదయములోనె దైవత్వమున్నదని తెలుసా’ ఇలా సాగుతాయివి. వీటితో 1994లో పుస్తకం తెచ్చాను. పాటవెలదులని 2007లో పొత్తంగా వెలువరించాను. 
సినిమా పాటల్లో మీరు చూపిన వైవిధ్యం?
‘అమృతకలశం’ సినిమా కోసం ఒక శృంగార గీతం రాయాల్సి వచ్చినప్పుడు జావళీ రాశాను. జావళి అనేది సంప్రదాయ శృంగార గీతం. ‘‘సిగ్గాయె సిగ్గాయెరా స్వామి బుగ్గంత ఎరుపాయెరా... సద్దుమణిగిన వేళ నీ ముద్దు సరసాల నాకెంత సిగ్గాయెరా...’’ ఇలా సాగుతుందిది. నేను దర్శకత్వం వహించిన ‘ఎక్కడికెళ్తుందో మనసు’ సినిమా కోసం తెలుగు భాష గొప్పదనం తెలియజేస్తూ ‘‘తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు... రాజహంసల కులుకు తళుకు నా తెలుగు... అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు. అమృత ధారల కురియు అమ్మ నా తెలుగు’’ పాట రాశాను. అయితే, సినిమా పాటలు తక్కువే రాశాను. సినీ పరిశ్రమలోని ఆశ్రిత పక్షపాతం దీనికి కొంత కారణం. అయినా, సినీ గీతాలకు అవకాశం రాలేదని అలాగే ఉండిపోలేదు. అయిదు వందల భక్తిగీతాలు రాశాను. వాటి మీద అరవై ఆడియో ఆల్బమ్‌లు వచ్చాయి. మంగళంపల్లి నుంచి వర్ధమాన గాయనీ గాయకుల వరకూ అందరూ ఆ పాటలు పాడారు. వెయ్యి లలిత గీతాలు రాశాను. గేయ నాటికలు, సంగీత రూపకాలు కూడా రచించాను. టీవీ సీరియళ్ల రచనతో పాటు సినిమాలకి దర్శకత్వం కూడా వహించాను. 60 ఏళ్ల తెలంగాణ సంఘర్షణ, అలాగే ప్రత్యేక రాష్ట్ర సాధన మీద 20 పాటల్లో 60 నిమిషాల నృత్య రూపకం రచించాను. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రదర్శింపజేసింది. సినీ గీతాల రాసి ఎక్కువగా లేకపోయినా వాసిగల పాటలే రాశాననుకుంటాను. సినారె, వేటూరికి సమంగా నిలిచే పాటల్ని రాయగలిగానన్న సంతృప్తి ఉంది. 
లలిత గీతాలు రాసేవారు ఇప్పుడెందుకు తగ్గిపోయారు?
ఇప్పుడంతా సౌఖ్యాలకి అలవాటుపడ్డారు. పద్యాల కోసం వృత్తాలు, ఛందస్సు నేర్చుకోవాలి. దాన్ని కష్టంగా భావిస్తున్నారు. ఇక గేయమంటే మధ్యస్థం. మాత్రా ఛందస్సులు నేర్చుకోవాలి. అది పెద్ద కష్టమేమీ కాదు. దానికి కూడా సిద్ధంగా లేరు. వచన కవిత్వంలోనే ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద ప్రముఖంగా లలిత గీతాలు రాస్తున్నవాళ్లు దాదాపు 20 మంది వరకు ఉన్నారంతే. 
ఇప్పటి సినిమాల్లో లలిత గీతాలు మళ్లీ వినిపించే అవకాశం ఉందా?
ప్రస్తుత సినిమాల్లో అంతా బీటు ప్రధాన పాటలైపోయాయి. దాంతో అన్యభాషా పదాలు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. అయినా, అడపాదడపా కొన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. లలిత సంగీతంలో పరిమితమైన వాద్యాలే ఉంటాయి. గతంలో మల్లీశ్వరి, ఏకవీర లాంటి సినిమాల్లో పాటలని లలిత గీతాల పరంగానే పలికించారు. వీటి మీద అభిరుచి ఉన్న సంగీత దర్శకులు ఎవరైనా వస్తే మళ్లీ వినబడే అవకాశం ఉంది. వైవిధ్య బాణీ సమకూరిస్తే లలిత గీతం కూడా అద్భుతంగా వస్తుంది. దూరదర్శన్‌ కోసం నండూరి సుధీర్‌కుమార్, రాగసుధ ఇందిరామణి, నేను కలిసి లలిత గీతాల్ని సినిమా పాటల్లా పాపులర్‌ చేద్దామని కొత్త బాణీల్లో చేశాం. అవి మంచి ఆదరణ పొందాయి.   
ఇన్నేళ్ల లలిత గీతాల ప్రయాణంలో మీరు మర్చిపోలేని అనుభూతి?
ఆకాశవాణి జాతీయ సామూహిక బృందగానం కోసం 1995లో ఒక లలిత గీతం రాశాను. అప్పుడు చాలా మంది పేరున్న రచయితలు రాసినా, అదృష్టంకొద్దీ నా గీతం ఎంపికైంది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి మొదటిసారి ఒక లలిత గీతానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ‘మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి/ జగమంతా ఒక్కటనే మంచి రోజు రావాలి/ బిందువు బిందువును చేరి సింధువుగా పారునుగా/ సింధువు సింధువును చేరి సంద్రముగా మారునుగా/ మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందునుగా/ మాలను మలచేందుకు ఒక దారమె ఆధారముగా...’’ ఇలా సాగుతుందిది. 1995 సెప్టెంబరు నెలంతా అన్ని రాష్ట్రాల్లో అనువాదాలతో ఈ గీతం ప్రసారమైంది. 
మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చిన లలిత గీతం? 
‘ఈ మాసపు పాట’కు ఎంపికైన ‘‘జగతి రథం జై కొడుతూ ప్రతిగ పథం పైకూని/ ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలై రానీ/ స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి/ అదియే దేశాభ్యుదయపు అందమైన పునాది..’’ గీతమంటే నాకు చాలా ఇష్టం. అలాగే ‘‘మనమంతా బంధువులం మానవతా సింధువులం/ భారత పద్మంలో ఉదయించిన తీయని తేనియ బిందువులం..’’ లలిత గీతమన్నా ప్రీతి. ఇది చాలా సార్లు దేశభక్తి గీతంగా దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఈ గీతానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా 1996లో సన్మానం కూడా అందుకున్నాను.
తెలుగులో మీకు నచ్చిన రచయితలు?
సి.నారాయణరెడ్డి, దాశరథి. పూర్వ కవుల్లో పోతన అంటే ఇష్టం. ఎంత శబ్దాలంకార ప్రియుడైనా ఆయన రచనల్లో భావ సౌందర్యం గొప్పగా ఉంటుంది. అటు శబ్దం, ఇటు భావం సమతూకంలో నడిపించిన మహా భక్తకవి. అందుకే ఆయన మీద అభిమానంతో ‘భక్తకవి పోతన’ టీవీ సీరియల్‌ రాశాను. ఇప్పటికీ అది దూరదర్శన్‌లో పునఃప్రసారం అవుతూనే ఉంది. ఇక నాకు బాగా నచ్చిన లలిత గీతాల రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన గీతాల్లో పదలాలిత్యంతో పాటు మంచి భావ సౌందర్యం ఉంటుంది.
సమకాలీన కవిత్వం చదువుతుంటారా? 
ఇప్పటివారు పత్రికల్లో వస్తున్న తమ కవితలు చూసుకుని మురిసిపోతున్నారు తప్ప ఇతర కవుల రచనలు చదవట్లేదు. అందువల్ల వాళ్లకి శబ్ద, భావ సౌందర్యాలు అలవడట్లేదు. పొడిపొడి పదాలతో, అర్థంలేని అంత్యప్రాసలతో రాస్తున్నారు. అయితే, కండపుష్టి కలిగిన కవితలు కూడా బాగానే వస్తున్నాయి. సమర్థులైనవారు రాస్తున్నారు. పుస్తక పఠనం ప్రతి రచయితకూ తప్పనిసరి. వీలైనన్ని గ్రంథాలు చదివితేనే మన భాష పరిపుష్టమవుతుంది. భావ సంపద పెరుగుతుంది.
ప్రస్తుత తెలుగు భాష స్థితిగతుల గురించి...
నా దృష్టిలో తెలుగు భాషకి ఎప్పటికీ ఢోకా లేదు. కృష్ణదేవరాయలంతటి వాడే దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడు. మన భాష ఎప్పటికీ చవులూరిస్తూనే ఉంటుంది. అవధానం, పద్యం మనకే దక్కిన అమృత ఫలాలు. అవెప్పటికీ వాడవు, చెడవు. ‘ఎవడురా పద్యమ్ము చచ్చింది అన్నవాడు’ అని విశ్వనాథ ప్రశ్నించినట్టు.. పద్యం పాతుకుపోయి మామిడి వృక్షంలా ఎదుగుతూ ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. తెలుగు భాషకు అప్పుడప్పుడూ మబ్బులు పట్టి ఉండొచ్చు, కానీ సూర్యునిలా ప్రకాశిస్తూనే ఉంటుంది. తెలుగు భాష అభ్యున్నతికి రామోజీరావు గొడుగు పడుతున్నారు. మిగిలిన మీడియా అధినేతలు కూడా భాషాభివృద్ధికి కృషిచేయాలి. 
ఇప్పుడు తెలుగులో విద్యాబోధన అవసరం లేదంటున్నారు కదా? 
తెలుగుని మర్చిపోతే మనం మన ఉనికిని కోల్పోతాం. నవతరం ఇంగ్లీషు మీడియంలో కొట్టుకుపోతూ తెలుగు రాయలేక, చదవలేకపోతోంది. ఏడో తరగతి వరకైనా తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలి. అప్పుడు పిల్లలకు భాషలో ప్రాథమిక సూత్రాలు పట్టుబడతాయి. అవి ఇతర భాషలు నేర్చుకోవడానికి దోహదపడతాయి. చిన్నప్పటి నుంచే అంతా ఇంగ్లీషులో చదువుకోవాల్సిన అవసరం లేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం