తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

దుఃఖాన్ని దాటడమే కర్తవ్యం!

  • 287 Views
  • 7Likes
  • Like
  • Article Share

సాహితీ విమర్శలో పేరెన్నికగన్న పండితులు కోవెల సుప్రసన్నాచార్య. పద్యం, వచనం, గేయం ఏవైనా అలవోకగా ఆయన కలంలో ఒదిగిపోవాల్సిందే. ‘భావుకసీమ, భావసంధ్య, కావ్య ప్రమితి, సాహిత్య వివేచన, పరిక్రమ’ లాంటి యాభై వరకూ పొత్తాలను ఆయన వెలువరించారు. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం హించారు. ఎనభై ఏళ్లు పైబడిన ఈ సాహితీ మేరువు లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లోనే...
గ్లకోమా
కారణంగా ఈ ఫిబ్రవరిలో నా కంటికి శస్త్రచికిత్స జరిగింది. నెమ్మదిగా అద్దాలు పెట్టుకునేసరికి మార్చి ఆఖరు వచ్చేసింది. చిన్న అక్షరాలు చదివే పరిస్థితి లేదు. అందువల్ల లాక్‌డౌన్‌ సమయంలో చదివానని చెప్పడం అబద్ధం అవుతుంది. అయితే, అద్దాలు పెట్టుకున్న తర్వాత కొన్ని పుస్తకాలు చూశాను. ఫోనుల్లో మిత్రులతో సాహితీ చర్చలు సాగాయి. మా మాతామహులు ఠంయాల లక్ష్మీనృసింహాచార్యుల గ్రంథాల పరిష్కరణ కొంత నడిచింది. 
చైతన్యం ఒక్కటే
నాకు వాల్మీకి అంటే చాలా ఇష్టం. సుందరకాండ చాలాసార్లు పారాయణం చేశాను. తన కావ్యంలో చాలా విషయాల్ని ధ్వనియమంగా చెప్పాడు వాల్మీకి. శిల్పం దృష్ట్యా వాల్మీకి రామాయణం అద్భుత కావ్యం. ఆ తర్వాత ఆ స్థాయిలో రాసిన వ్యక్తి మహాకవి కాళిదాసు. వారి రచనలు ఎప్పుడూ మదిలో మెదులుతుంటాయి. అలాగే రాయప్రోలు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి పద్యాలన్నా చాలా ఇష్టం. వాటిని కూడా ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాను.
కరోనా లాంటి ఆపదలు సమష్టి దుఃఖాన్ని తెస్తాయి. అందరినీ బాధిస్తాయి. ఈ శరీరం పరిణామపేశలమైంది. రోజులు గడిచే కొద్దీ మార్పులు పొందుతుంది. శైథిల్య స్థితికి చేరుకుంటుంది. జబ్బులు, ఇబ్బందులు వస్తాయి. ఈ మందులు, మాకులు ఎందుకయ్యా? కృష్ణుడనే పేరే మందు, దాన్ని వాడుకో అన్నాడు ముకుందమాల కర్త. అది ఆయన మార్గం. ఎవరి మార్గం వారిది. కానీ అందరిలో ఉండే చైతన్యం, ఆత్మపదార్థం ఒక్కటే.
      జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం... అంటారు కదా పెద్దలు. ఈ సంసారంలో దుఃఖం సహజం. దాన్ని ఎంతోకొంత అనుభవించని వాళ్లుండరు. గడచిన కొన్నేళ్లలో నా ఆప్తులు చాలామంది దూరమయ్యారు. అవన్నీ దుఃఖకరమైన అంశాలే. ఆ దుఃఖం వల్ల వాళ్లని స్మరిస్తూ ఉంటాను. అయితే దుఃఖాన్ని దాటడమే జీవుడి కర్తవ్యం. కరోనా లాంటి విపత్తుల్ని దాటడానికి ఆత్మనిబ్బరంతో మనిషి ముందుకు సాగాలి.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం