తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పికాసో కంటే గొప్పవాణ్ని...

  • 66 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.నాగరత్న

  • హైదరాబాద్
  • 9490315051

ప్రసిద్ధ కళా విమర్శకుడు ఏఎస్‌ రామన్‌ 1967లో లండన్‌ వెళ్లారు. అక్కడి ప్రఖ్యాత కళా సాహిత్య పత్రిక ‘ద లండన్‌ మ్యాగజైన్‌’ సంపాదకుడు అలెన్‌ రాస్‌ని కలిశారు. రాస్‌ మాటలమధ్యలో తమ పత్రిక తాజా ప్రతిని రామన్‌ ముందుంచి, ఓ చిత్రం చూపారు. శీర్షికని చేత్తో మూసేసి ‘‘ఈ చిత్రం ఎవరిదో చెప్పగలరా?’’ అని అడిగారు. రామన్‌ ఓ క్షణం పరిశీలించి ‘‘పికాసో’’ అన్నారు. ‘‘ఊహూ.. కాదు. ఇది మీ దేశ కళాకారుడు రామారావు వేసిన చిత్రం’’ అంటూ చిరునవ్వు చిందించారు. ఆ రామారావు మరెవరో కాదు, కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టి, పెరిగిన శిరందాసు వెంకట రామారావు. అంతర్జాతీయ చిత్రకారులకు, చిత్రకళాభిమానులకు ‘ఎస్వీ రామారావు’గా సుపరిచితులు. మరోవైపు కవిగా కూడా ఆయన ప్రసిద్ధులే. ఇటీవల ‘రామోజీ ఫౌండేషన్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆ తెలుగుతేజంతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 
బొమ్మలవైపు ఎలా ఆకర్షితులయ్యారు?

మా నాన్న గంగయ్యగారు చెక్కతో అనేక రూపాలను రూపొందించే వడ్రంగి. అంటే కళాకారుడే కదా! అందుకేనేమో మొదట్నించీ కళలపట్ల ఆసక్తి, అభిరుచి ఉన్నాయి. చదువుపట్ల పెద్దగా శ్రద్ధ ఉండేది కాదుగానీ రవీంద్రుడి శాంతినికేతన్‌లో చదువుకోవాలని ఉండేది. కొన్ని డబ్బులు పట్టుకుని, ఇంట్లో చెప్పకుండానే శాంతినికేతన్‌కి బయల్దేరిపోయాను కూడా. రైల్వేస్టేషన్లో ఒకావిడ ఏడుస్తూ కనిపించేసరికి మా అమ్మ గుర్తొచ్చింది. నేనెళ్తే అమ్మ కూడా ఇలాగే బాధపడుతుంది కదా అనిపించి తిరిగొచ్చేశాను. అప్పుడు అమ్మ ‘నీకు రెక్కలొచ్చాయి కాబట్టి వెళ్లావు. మరి చెల్లెళ్ల సంగతేంటి?’ అంది. నిజమే పెద్ద కొడుకుని కాబట్టి వాళ్ల బాధ్యత నాదే మరి! 
మీ నాన్నగారేం అన్నారు?
ఆయనకు నేను బాగా చదువుకోవాలని ఉండేది. ఇంటికెవరొచ్చినా ‘అరేయ్‌ రాముడూ! మనుచరిత్ర చదవరా’ అనేవారు. నేను గడగడా చదువుతుంటే భలే సంతోషించేవారు. అప్పట్లో మన పాలకులు ఆంగ్లేయులు కాబట్టి నాకు ఆంగ్లం రావాలి, అందులో అనర్గళంగా మాట్లాడాలి అనుకునేవారు. అతిథుల ముందు ఆంగ్ల దినపత్రిక చదివించి ‘చూశారా మావాడి ఇంగ్లీషు’ అంటూ సంబరపడేవారు. ముందు డిగ్రీ పూర్తిచేస్తే చిత్రలేఖనం నేర్చుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. దాంతో వాణిజ్య శాస్త్రం, అర్థశాస్త్రాల్లో డిగ్రీలు చేశాను.  
తర్వాత మీకిష్టమైన చిత్రలేఖనంలోకి వచ్చారన్న మాట!
శాంతినికేతన్‌లో చదివిన ఎస్‌.కృష్ణ అనే ఆయనతో మా నాన్నగారు ‘రాముడు ఆర్టంటున్నాడు, సినిమాల్లో ఏమైనా పనికొస్తాడేమో చూడమ’ని చెప్పి నన్ను మద్రాసు పంపారు. ఆయన కుర్చీలు, మంచాలూ అన్నింటినీ బొమ్మలు గీయించేవారు. వాటిని వాహినీ స్టూడియో కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేకి చూపించమంటే, ఆ బొమ్మల కట్టలు తీసుకెళ్లి చూపించాను. ‘బాగా వేస్తున్నావు. మద్రాసులోని జీడీ ఆర్టు స్కూల్లో చదివితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారు గోఖలే. నాన్న ఒప్పుకోరని చెప్పాను. వెంటనే నాన్నగారిని పిలిపించారు గోఖలే. ‘మేం హైస్కూల్‌ చదువుతో ఆర్టిస్టులమయ్యాం. స్వాతంత్య్రం వచ్చింది. చదువుకున్న వాళ్లు ఆర్టిస్టులయితే మరింత ప్రయోజనం ఉంటుంది’ అన్నారు. నాన్న ఏమీ మాట్లాడలేక సరేనన్నారు. ఆయన ముఖంలో కాంతి లేకపోవడం చూసి చాలా బాధేసింది. అప్పుడే ఆర్టిస్టవ్వాలి, డబ్బు సంపాదించాలి, చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నాను. చేశాను కూడా.
మరి ఖండాంతరాలకు వెళ్లిన వైనం?
మద్రాసు ఆర్ట్‌ స్కూల్లో చేరి డ్రాయింగు, పెయింటింగులు నేర్చుకున్నాను. ఆ సమయంలోనే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 1960-62 సం।।ల్లో ప్రభుత్వ ఉపకారవేతనం అందుకున్నాను. ప్రపంచంలో పేరెన్నికగన్న బ్రిటిష్‌ ప్రభుత్వ కామన్వెల్త్‌ ఫెలోషిప్‌కి ఎంపికై లండన్‌ వెళ్లాను. అక్కణ్నుంచి అమెరికా.. ప్రస్తుతం అక్కడే మకాం.
ప్రపంచ స్థాయి పోటీని ఎలా తట్టుకున్నారు?
పాశ్చాత్య శైలి చిత్రలేఖనం వేణుగోపాల్‌గారి దగ్గర నేర్చుకున్నాను. పికాసో ఇష్టం. రవివర్మ ఇష్టం. వీళ్లందరి స్ఫూర్తితో ముందుకు సాగాను. ఎప్పుడైతే ఆర్ట్‌ స్కూల్లో చేరానో అప్పుడే విస్తృతి పెరిగింది. పరిధి పెరిగేకొద్దీ నాలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం, దేశం కాదు, ప్రపంచంతోనే పోటీపడాలనుకున్నాను. అలా నెగ్గితేనే కదా మజా! లండన్‌లోని స్టేట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌ అంటే చాలా గొప్పసంస్థ. అందులో చదివాను. ‘బొమ్మలంటే కదలకుండా కూర్చుని వేళ్లతో వేయడం కాదు నిలబడి చేతులు బారచాపి వేయాలి. పెయింట్‌ చేస్తే బ్యాలే డ్యాన్స్‌ చేస్తున్నట్లుండాలి’ అని మా గురువుగారు చెప్పిన మాటలు పాటించాను. ప్రపంచస్థాయి చిత్రకారులు సర్‌ విలియం కోల్డ్‌స్ట్రీమ్, విలియం రాగర్స్, బెర్నార్డ్‌ కోహెన్‌ల దగ్గర చిత్రలేఖనం అభ్యసించాను. స్టాన్లీ జోన్స్‌ దగ్గర లిథోగ్రఫీ నేర్చుకుని 1966లో ‘ద మోస్ట్‌ ఔట్‌స్టాండింగ్‌ లిథోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించుకున్నాను. ఓ ఒరవడిలో కొట్టుకుపోవడం నాకు సరిపడదు. నిరంతరం ప్రయోగాలు చేయాలి. ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధించాలి. నాకంటే బాగా వేసేవాళ్లింకెవరూ లేరు అనిపించుకోవాలి. అదలా ఉంచితే... నేను బాగా చదువుతాను. ఇంట్లో వంటల దగ్గర్నుంచి జీవితచరిత్రల వరకూ వేల పుస్తకాలున్నాయి.
పుస్తక పఠనంపట్ల ఆసక్తి ఎలా పెరిగింది?
సహజంగా కళాహృదయం కాబట్టి సాహిత్యంవైపు దృష్టి దానంతటదే పడింది. ‘భారతి’ లాంటి సాహితీ పత్రిక ఆ ఆసక్తిని ఇంకా పెంచింది. అందులో వ్యాసాలూ రాశాను. నార్ల వెంకటేశ్వరరావుగారి లాంటి సాహితీవేత్తలతో దగ్గరగా మెలిగేవాణ్ని. స్నేహితుల్నిబట్టి మనం తయారవుతాం కదా! అప్పట్లో బెంగాలీ సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉండేది. టాగోర్, శరత్‌చంద్ర తదితరుల రచనలు చదివేవాణ్ని.
బొమ్మల్లో మనదేశానికి, ఇతర దేశాలకీ ఉన్న తేడా ఏంటి?
మన దగ్గర- కుండ పట్టుకున్న అమ్మాయి.. కుండ తీస్తే చేపలు.. ఇదీ వరస.. రాజ్‌పుత్‌ కళనుంచి తెచ్చుకున్నాం అంటారు. ఆ స్థాయినుంచి ఎదగొద్దా? మనవాళ్లేసే బొమ్మల్లో పెద్ద కళ్లు, సన్నటి చేతులు.. అస్సలు ప్రపోర్షన్‌ ఉండదు. అదంతా ఉండేది పాశ్చాత్య బొమ్మల్లో. అంకాల వెంకటసుబ్బారావు, వరదా వెంకటరత్నం.. వీళ్లందరిదీ బెంగాలీ శైలి. పద్యాల్లో ఆటవెలది, సీసం లాంటివి ఉన్నట్లే చిత్రలేఖనంలో ఎన్నో శైలులు (స్కూల్‌ ఆఫ్‌ థాట్స్‌) ఉన్నాయి. ఛందస్సు అర్థమైతేనే పద్యాలు అర్థమైనట్లు చిత్రలేఖన శైలి తెలిస్తేనే చిత్రాలు అర్థమవుతాయి. మనవన్నీ రూపంతో ఉంటాయి. పశ్చిమ దేశాల్లº రూపాతీతంగా, ఊహాను గుణంగా ఉంటాయి. చూడగానే అర్థమయ్యేవి చాలానే ఉన్నాయి. నైరూప్య చిత్రాలను అర్థం చేసుకోడానికి కొంత నేర్చుకోవాలి. కృషిచేయాలి. లేకుంటే అర్థంకావు. 
మీరు నైరూప్య చిత్రాల్లోకి ఎలా వచ్చారు?
మాధవపెద్ది గోఖలే, ‘కళాక్షేత్ర’ కళాదర్శకుడు కె.శ్రీనివాసులు, ప్రభుత్వ చిత్రకళాశాల ప్రధానాచార్యులు డి.పి.రాయ్‌ చౌధరి, గురువులు కె.సి.ఎస్‌.పణిక్కర్, ఎస్‌.ధనపాల్, హెచ్‌.వి.రాంగోపాల్‌ తదితరుల సాయంతో చిత్రలేఖనంలో అనేక రీతులు నేర్చుకున్నాను. తొలిదశలో రూపాలనే వేసేవాణ్ని. రూపం ఎంత గొప్పదైనా పరిమితులు ఉంటాయి. నైరూప్యం అలా కాదు. మేధస్సుకు అనుగుణంగా ఎంతైనా ఊహించుకోవచ్చు. అందుకే దాని వైపు దృష్టి మళ్లించాను. 
నైరూప్యచిత్రాలను అర్థం చేసుకోవడం కష్టం కదా? 
రష్యన్‌లో ఏదైనా చదవాలంటే ముందు ఆ భాష నేర్చుకోవాలి. నైరూప్య చిత్రాలైనా అంతే.. వాటిగురించి తెలుసుకుంటే అవి అర్థమవుతాయి. ఓ కళాఖండాన్ని ఎలా చూడాలనేది కూడా కళే. అర్థం చేసుకోడానికీ మేధస్సు ఉండాలి. నేను అర్థం కానిదే నా చిత్రాలు అర్థంకావు. బాపూ బొమ్మల్లా నావెందుకు అర్థమవుతాయి!? నైరూప్య చిత్రకళను అర్థం చేసుకోవాలంటే ముందు రాజ్‌పుత్, మొఘల్, లేపాక్షి ఇవన్నీ అర్థంచేసుకోవాలి. ఓ కళాఖండాన్ని మనసు, మేధస్సు రెంటితో నిశితంగా అర్థంచేసుకోవాలి. చిత్రలేఖన పుస్తకాలను చదవడంవల్ల కూడా గ్రహింపు శక్తి పెరుగుతుంది. భావనకు రూపాన్నిచ్చుకుని, కలగంటున్నట్లు చూడాలి. నేనెలా ఊహించి బొమ్మలేశానో చూసేవాళ్లు కూడా అలాగే భావన చేయాలి.
మామూలు వాళ్లకు ఇదంతా సాధ్యమా?
ఏ మేధోస్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయి చిత్రాలు అర్థమవుతాయి. చిత్రాన్ని విమర్శనాదృష్టితో చూడాలి. కవిత్వమైనా అంతే! పుస్తకాలు చదవాలి. మేధావులని కలిసి మాట్లాడాలి. చదవడం, వినడంవల్ల మేధస్సు, విశ్లేషించే గుణం పెరుగుతుంది. మునుపు చాలామందికి సొంత గ్రంథాలయాలు ఉండేవి. ఇప్పుడు పుస్తకాలు చదివేవాళ్లు లేరు. అందువల్ల బతకడానికే తప్ప చిత్రకారుడిలా ఆలోచించే సమయం, అవకాశం లేవు. 
చిత్రలేఖనంలో మీ శైలి ఎలాంటిది?
నేను వాడే రంగులు ప్రస్ఫుటంగా వెల్వెటీ కలర్స్‌లా ఉంటాయని, రంగులు ప్రవహిస్తున్నట్లుగా విలక్షణంగా ఉంటాయని అంటారు. సెన్సిబుల్‌ కలరిస్టుననే కితాబు తెచ్చుకున్నాను. తెలుపు, నలుపు అనేవి అస్సలు వాడను. ఒకవేళ తెలుపు అవసరమైతే ఆ ప్రదేశంలో కాన్వాస్‌ని తెల్లగా ఉంచేస్తాను. నలుపు కావాలంటే ఇతర రంగులతో నలుపు లాంటి షేడ్‌ తెస్తాను. బాగా వేయడం కాదు, కొత్తగా నాదైన పద్ధతిలో వేస్తాను. అలాగని వేసిందే వేయను. నా చిత్రం చూసి బాగుందంటే నాకు తృప్తిలేదు. ‘వావ్‌.. ఎలా వేశాడబ్బా?’ అని సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాలి. ఆయిల్‌ పెయింట్స్‌తో వాటర్‌ కలర్స్‌ని తలపించేలా వేసి ముక్కుమీద వేలేసుకునేట్టు చేశాను. 
కళాకారుడిగా లండన్‌లో....
పికాసో ఒక్కడే గొప్పవాడా? నేనంతకంటే గొప్పవాణ్ని అనిపించేది. అలా అనుకోక పోతే ముందుకెళ్లలేను. గొప్పతనం ఏ ఒక్కరి సొత్తో కాదుగదా! ఇది అహంకారం కాదు. జీవితంలో పైకి రావాలంటే ఇలాగే ఆలోచించాలంటాను. సరే, 20వ శతాబ్దంలో సాటిలేనివాడనిపించుకున్న పికాసో కంటే గొప్పవాణ్ని అనిపించుకోవాలంటే అంతకంటే గొప్పగా, ప్రయోగాత్మకంగా వేయాలి. మయసభలా మాయ చేయాలనిపించేది. ఆసియా సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకుని నా శైలిలో వేస్తే గుర్తింపు వస్తుందనుకున్నాను. అలాగే వచ్చింది. అందరూ కాన్వాస్‌ మీద వేస్తే అప్పట్లో నేను చెక్కమీద పెయింట్‌ చేశాను. లిథోగ్రఫీలో బోల్డన్ని ప్రయోగాలు చేశాను. ఆర్ట్‌ ఎగ్జిబిషన్లకు వెళ్లి ప్రతి చిత్రం గురించీ నోట్సు రాసుకునేవాణ్ని. ఆ చిత్రాల గురించి మర్నాడు పత్రికల్లో పెద్ద విమర్శకులు రాసిన సమీక్షలను చూస్తే, నేను రాసుకున్న అంశాలే కనిపించేవి. భారత్‌ నాకు చదువునిచ్చింది, లండన్‌ నన్ను చిత్రకారుణ్ని చేసింది. 
అప్పటికీ, ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు?
రంగులకు ప్రసిద్ధిగా ఉన్న పూలు, కాయలు, కొండల్ని వదిలి గ్రహాంతరాళాల్లోకి వెళ్లి పాలపుంతల్లాంటివన్నీ వేస్తున్నాను. ఇవన్నీ ముదురు రంగుల్లో ఉంటాయి. అప్పుడు పికాసోని సవాలు చేయాలనుకున్నాను. ఇప్పుడు నన్ను నేను గెలవాలనిపిస్తుంది. అవును నన్ను నేను జయించుకోవాలి. మోనాలీసా ఇప్పటికీ సజీవంగా ఉంది, దాన్ని చిత్రించిన లియోనార్డో లేడు. వాంగో చూడండి ఆయన బతికుండగా ఒక్క బొమ్మ కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు వాటినే వందలకోట్లు పెట్టి కొంటారు. అంటే వాంగో అంత గొప్పవాణ్ని అని కాదు. ఎవరైనా నా బొమ్మలు అర్థం కాలేదంటే పట్టించుకోను. మీకు నా బొమ్మలు అర్థం కావాలంటే ముందు నా దృష్టి అర్థం చేసుకోవాలి. లేదంటే నావి అర్థంకావు. అతిశయం అనుకోకండి, సరదాగా అంటున్నాను. నా చిత్రాలు అర్థం కాలేదు అన్నవాళ్లున్నారు కానీ బాగాలేవన్నవారు మాత్రం లేరు. 
చిత్రలేఖనం రోజూ చేస్తారా?
కవిత్వమైనా, చిత్రమైనా రోజూ చేయను. నేనేమైనా వాటికి బానిసనా? 22 ఏళ్లు అసలు కుంచె పట్టుకోలేదు. కొందరు అలవాటు తప్పిపోతుందేమో అన్నారు. అలాంటిదేం ఉండదు. తర్వాత మళ్లీ చిత్రాలు వేసినప్పుడు ఆధునిక ట్రెండుతో అద్భుతంగా వచ్చాయంటూ ఎందరెందరో చిత్రకళా విమర్శకులు మెచ్చుకున్నారు. కవిత్వమైనా అంతే, రాయకుండా ఉండలేననుకున్నప్పుడు రాస్తాను. అదే నాతో రాయించుకుంటుంది.
మంచి కళాకారుడు కావాలంటే..?
బాగా చదవడంవల్ల మన పరిధి విస్తృతమవుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. వైవిధ్యం కోసం ప్రయత్నించాలి. అనుకరణ కాదు, కొత్తదనాన్ని సృజించాలి. చెప్పాలనుకున్న దాన్ని కొత్తగా చెప్పడంవల్ల మనమేంటో రుజువవుతుంది. నేను మద్రాసులో ఉండగానే బొమ్మలు గొప్పగా వేయడంకాదు, ప్రయోగాలు చేయాలనుకున్నాను. అప్పట్నించీ చేస్తూనే ఉన్నాను. కొత్త ప్రయోగంలో నాలుగైదు చిత్రాలు అమ్ముడవగానే ఇక ఆపేస్తాను. ఒకచోట ఆగిపోకూడదు. పాతబడకూడదు. ఎప్పటికప్పుడు మార్పు కావాలి. ఒక్కొక్కరూ ఒక్కోలా భావవ్యక్తీకరణ చేస్తారు. కళాఖండాన్ని కొని చిత్రకారుణ్ని ప్రోత్సహిద్దాం అని ప్రజలూ అనుకోవాలి. పుస్తకాలు, పాత్రికేయులు, రచయితల సాంగత్యం లేకపోతే నాకీమాత్రం గుర్తింపు వచ్చేది కాదు. సంగీతం, నృత్యంకంటే సాహిత్యం చాలా చాలా ముఖ్యమైంది. అదే నాకు భూమిక, ఆధారం. 
సాధారణంగా ఎలాంటి కవిత్వం రాస్తారు?
భార్య భర్త అన్న తమ్ముడు లాంటి బంధాల్లో భయాలు, దాపరికాలు ఉంటాయి. అన్నీ చెప్పం. కానీ స్నేహంలో భయం లేకుండా ఏ విషయాన్నయినా పంచుకుంటాం. కాబట్టి నేను దేవుణ్ని స్నేహితుడిగా భావిస్తూ కవిత్వం రాస్తాను. మా ఆవిడ పోరు పడలేక గుడికి వెళ్తూంటాను. కానీ పదిలో ఎనిమిది సార్లు విగ్రహాన్ని చూట్టానికి వెళ్లను. ఎందుకంటే- ‘స్వామీ నేనొచ్చినప్పుడు నీకు భంగమౌతుందేమో.. నిలబడి ఉంటావు, అలసిపోయివుంటావు.. ఒకవేళ నేనొచ్చినప్పుడే నువ్వు కునుకు తీస్తావేమో.. కాళ్లకి దిళ్లు కట్టుకుని వస్తాను చడీచప్పుడూ లేకుండా, వచ్చి చూసి వెళ్తాను.. నీ రూపాన్ని, సౌందర్యాన్ని చూట్టానికే వస్తాను. ఏమీ కోరను. నా కోరికలేంటో నీకు తెలుసు కదా? దుష్టశిక్షణ అంటూ ఎప్పుడంటే అప్పుడు రాకు. మా సర్దుబాట్లేవో మేం చేసుకుంటాం.. నువ్వు ఎప్పుడు వద్దామనుకున్నా ఒక్కరోజు పోస్ట్‌పోన్‌ చేసుకో’ అంటూ రాస్తాను. భిన్నంగా ఆలోచించడానికి ప్రాధాన్యం ఇస్తాను. నాకు అధివాస్తవిక కవిత్వం అంటే ఇష్టం. ఊహించని పరిణామాలను చిత్రించే ఆ కవిత్వం సమ్మోహపరుస్తుంది. అలాగే కవిత్వంలో ఓ లయ ఉండాలి. అందుకే ఎంకి పాటలు ఇష్టపడతాను. దేశదేశాలు తిరిగిన అనుభవాలు, ఎందరెందరినో కలిసిన అనుభూతులు ప్రతిఫలించేలా కవిత్వం రాస్తాను.  
అసలు కవిత్వంవైపు ఎప్పుడు వచ్చారు? 
కళాశాల రోజుల్లోనే కవిత్వం రాశాను. కానీ చిత్రలేఖనం మీద ఎక్కువ కృషి పెట్టాను. ఎన్నో చదవడం, ఎందరో రచయితలను కలిసి మాట్లాడటం వల్ల కవిత్వమన్నా చాలా ఇష్టం. దానివల్ల నా చిత్రాల్లో పరిపక్వత కనిపిస్తుంది. 
చిత్రకారులకి ఆదరణ ఉందా?
లేదు. కళాకారుడు బతకాలంటే మీకు నచ్చే బొమ్మలేసి బతుకుతాడు. అంతే తప్ప తనకు నచ్చిన బొమ్మలేసి బతకలేకపోతున్నాడు. చిత్రకారులకి కాన్వాసు, రంగులకి చాలా ఖర్చవుతుంది. ప్రదర్శించాలంటే గ్యాలరీకి బోల్డంత డబ్బు చెల్లించాలి. తీరా ఎవరూ కొనరు. పైగా ‘ఏమయ్యా పాతవేనా?’ అంటారు. పాతవే కొనకుంటే కొత్తవేం వేస్తారు? ఖర్చే తప్ప పైసా రాదు.. ఒకవేళ పెయింటింగులు అమ్ముడైతే కేటలాగులు అచ్చేసినందుకు సగం ఇవ్వమంటారు. అమ్ముడే కాలేదంటే నాలుగు పెయింటింగులు ఇచ్చేయమంటారు.. ఆర్థిక ఇబ్బందుల్లేవు కాబట్టి నాకు నచ్చినవి వేస్తున్నాను. లేదంటే ప్రజలకి నచ్చేవే వేసి బతికేవాణ్ని.
మీ ధ్యేయం?
నా చిత్రాలైనా, కవిత్వమైనా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. వాటిలో నా ఎదుగుదల ప్రతిఫలించాలి. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. నిన్నటి చిత్రంలాగే ఇవాళ్టిదీ ఉంటే ఇక కొత్తగా వేసి ఏం లాభం?! చిత్రాల్లో కూడా అధివాస్తవికత రావాలి. నేనలాంటి ప్రయోగాలు చేస్తున్నాను. కళ విస్తృతమైంది. ఎంత కృషి పెడితే అంత లోతుల్లోకి వెళ్లొచ్చు. 
ఈ తరంవాళ్లకి మీరిచ్చే సలహాలు... 
ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమని తాము నిరూపించు కోవాలి. ఏం కావాలనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేయండి. విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం తపించాలి. మనల్ని మనం సవాలు చేసుకుంటే గొప్ప తృప్తి. ఇంకేదో చేయాలి అన్న ఆలోచనతో ఉండాలి. ఆ చేసేది పరిపక్వతతో చేయాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది.


ఎస్వీ... యశస్వీ
అంతర్జాతీయ చిత్రకళా యవనికపై తెలుగుజాతి ఖ్యాతిని రెపరెపలాడిస్తోన్న ఎస్వీ రామారావు 1936లో జన్మించారు. 1962లో లండన్‌ వెళ్లారు. 1965- 69 మధ్య లండన్‌ కౌంటీ కౌన్సిల్లో విద్యార్థులకు డ్రాయింగు, పెయింటింగుల్లో తర్ఫీదునిచ్చారు. బోస్టన్, సిన్‌సినాటి, వెస్ట్రన్‌ కెంటకీ విశ్వవిద్యాలయాల్లో చిత్రలేఖనం బోధించారు. లండన్‌లో జరిగిన ‘ఆల్ఫబెట్‌ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌’ చిత్ర ప్రదర్శనలో పికాసో, బరాఖ్, మీరో, డాలీమాక్స్‌ ఎర్న్‌స్ట్, జాక్సన్‌ పొలాక్‌ లాంటి అతిరథ మహారథులైన చిత్రకారులతోబాటు ఆయనవీ ప్రదర్శితమయ్యాయి. న్యూయార్క్‌ మ్యూజియం ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్, లండన్‌ విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియం, బోస్టన్‌ ఫాగ్‌ ఆర్ట్‌ మ్యూజియం, న్యూజిలాండ్‌ నేషనల్‌ గాలరీ, లండన్‌ యూనివర్సిటీ, బ్రిటిష్‌ కౌన్సిల్, ఫోర్డ్‌ ఫౌండేషన్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలు రామారావు చిత్రాలను కొనుగోలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో కళాప్రేమికులు ఆయన చిత్రాలను అపురూపంగా భద్రపరచుకున్నారు. అబ్దుల్‌ కలాం హయాంలో రాష్ట్రపతి భవన్‌కు అతిథిగా వెళ్లిన ఘనత రామారావుది. 2001లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో పాటు దేశవిదేశాల్లో ఎన్నో సత్కారాలను అందుకున్నారు.

- ఎస్వీ రామారావు, siramdasu@hotmail.com


 


వెనక్కి ...

మీ అభిప్రాయం