తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఆ స్పృహ ఉండాలి!

  • 563 Views
  • 1Likes
  • Like
  • Article Share

సమాజంలోని అసమానతలు, పీడనల మీద పదునైన పాళీని సంధిస్తున్న కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌. ‘వర్తమానం, కొత్తగబ్బిలం, గోసంగి’ తదితర పుస్తకాలు వెలువరించారు. సామాజిక మాధ్యమాల్లో సైతం క్రియాశీలంగా ఉంటూ విలువైన సాహితీ విశేషాలు పంచుకుంటూ ఉంటారాయన. ఈ హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు లాక్‌డౌన్‌లో ఏం చేశారు? ఆయన మాటల్లోనే... 
జీవితంలో
ఎప్పుడూ దొరకనంత తీరిక లాక్‌డౌన్‌లో దొరికింది. ఈ సమయంలో గతంలో చదివిన పుస్తకాలనే మళ్లీ సింహావలోకనం చేసుకున్నాను. ముఖ్యంగా యాత్రా చరిత్రలు చదువుకున్నాను. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్రాచరిత్ర’, ఎం.ఆదినారాయణ ‘భ్రమణకాంక్ష’, జువ్వాడి దేవీప్రసాద్‌ ‘విశ్వవిహారం’ యాత్రాకవితా సంపుటి చదివాను. నాకు హిందీ, ఉర్దూ భాషలతో పరిచయం ఉంది. ఆ భాషల్లో గాలీబ్, మీర్‌ తఖీ మీర్, ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్, అహ్మద్‌ ఫరాజ్, సాహిర్‌ లుధియాన్వి, షకీల్‌ బదాయినీ, మజ్రూ సుల్తాన్‌పురీ, గుల్జార్, శైలేంద్ర లాంటి కవుల రచనల్ని కూడా చదివాను. కేవలం చదవడమే కాకుండా వారి మీద వ్యాసాలు రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాను.
‘కరోనాపై కదనం’ బాగుంది
ఇరవై ఏళ్ల కిందట ‘నజరానా’ పేరుతో దాదాపు 230 ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించాను. లాక్‌డౌన్‌లో వాటిని సామాజిక మాధ్యమాల్లో నలుగురితో పంచుకున్నాను. అలాగే ఎక్కడెక్కడో ఉన్న నా విద్యార్థులు, పరిశోధకులతో ఫోనులో మాట్లాడాను. ఇప్పుడు పాఠాలు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలు సేకరించి వాటి మీద వ్యాసాలు రాయాలని ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ విద్యార్థులకు సూచించాను.
కరోనా లాంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు సాహిత్యం పుష్కలంగా వస్తుంది. ముఖ్యంగా ‘తెలుగువెలుగు’ మాస పత్రిక సామాజిక బాధ్యతగా ‘కరోనాపై కదనం’ పేరుతో నిర్వహించిన పోటీ చరిత్రాత్మకం. ఇంకా కరోనా నేపథ్యంలో ఎందరో చిత్రకారులు బొమ్మలు గీశారు. రచయితలు గీతాలు రాశారు. గాయకులు పాటలు పాడారు. వీటన్నింటినీ నేను జాగ్రత్తగా గమనించాను. ‘తెలుగు సాహిత్యం - కరోనా ప్రభావం’ అనే అంశం మీద త్వరలో నిర్వహించబోయే వెబ్‌ సెమినార్‌లో కరోనా నేపథ్యంగా వచ్చిన మంచి కవితల్ని చదవబోతున్నాను. 
క్రమశిక్షణ వదలకూడదు
ప్రముఖ పాటల రచయిత, కవి గుల్జార్‌ అంటే నాకు చాలా ఇష్టం. కరోనా రాక మునుపే ఇలాంటి ఒక పరిస్థితిని చిత్రిస్తూ ఆయన ఒక కవిత రాశారు. ‘‘ఎందుకనవసరంగా ఇల్లు విడిచి బయట తిరుగుతావు/ ఏముంది బయట నీకు/ నువ్వు ఇంట్లో ఉంటే నీ తల్లిదండ్రులు, నీ ఆలుబిడ్డలు/ వాళ్లందరూ సంతోషిస్తారు గదా!/ బయట తిరిగి ఆవారాగా ఏం సాధిద్దామని/...’’ ఇలా సాగుతుందా కవిత. మన శతక కవులు కూడా ఇలాంటి విషయాల్లో గొప్ప ఉపదేశాలిచ్చారు.
      ‘కులదైవం’ చిత్రం కోసం జూనియర్‌ సముద్రాల రాసిన ‘‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు’’ పాటంటే నాకు మక్కువ. హిందీ, తమిళంలో కూడా ఈ పాట ఉంది. హిందీలో ‘చల్‌ ఉడ్‌ జా రే పంఛీ’ అని ఉంటుంది. మహమ్మద్‌ రఫీ పాడారు.  
      మనిషి మనసు చంచలమైంది. లాక్‌డౌన్‌ సడలించాక మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లమంటుంది. దాన్ని బంధించే శక్తి మనలోనే ఉంది. లాక్‌డౌన్‌ తీసేసిన తర్వాత కూడా క్రమశిక్షణ పాటించాలి. నేను పొరపాటు చేస్తే ఆ ప్రభావం నా కుటుంబం మీద పడుతుంది, దేశం మీద పడుతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనే స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే కరోనా మహమ్మారిని మనం జయించగలం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి