తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మానవత్వాన్ని మిగుల్చుకుందాం

  • 470 Views
  • 11Likes
  • Like
  • Article Share

గంటేడ గౌరునాయుడు అనగానే ఉత్తరాంధ్ర మట్టి భాష, నాగావళి అలల ఘోష, బడుగుజీవుల జీవన శ్వాస మదిలో మెదులుతాయి. ప్రజా చైతన్యమే ఊపిరిగా మూడు దశాబ్దాలుగా సన్నజీవాల జీవన వెతలను అక్షరబద్ధం చేస్తున్నారాయన. ‘నాగేటి చాలుకు నమస్కారం, నదిని దానం చేశాక’ అనే కవితా సంపుటులను వెలువరించారు.  ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు’ పేరుతో కథలు, ‘ప్రియ భారతి.. జనని!’ అంటూ గేయాలు రాశారు. ఈ విలక్షణ సాహితీవేత్త లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేశారు? ఆయన మాటల్లోనే... 
గతంలో
చదవాలనుకున్న పుస్తకాలకి సమయం కుదిరింది. ‘పర్వ’ చదివాను. గోపీనాథ్‌ మహంతీ రాసిన ‘అమృత సంతానం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘జాజిపూల పందిరి’, బండి నారాయణస్వామి ‘శప్తభూమి’ పూర్తిచేశాను. కొల్లూరి భాస్కరం రాసిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనదే’ పుస్తకం చదువుదామనుకుంటే, కరోనా సంక్షోభంలో అది నా దాకా చేరలేదు. 
      చాలా తీరిక దొరికింది కాబట్టి రాత మీద ఎక్కువగా దృష్టిపెట్టాను. ‘సేద్యగాడు’ అనే శీర్షికతో ఫేసుబుక్‌లో ప్రతిరోజూ ఉదయం ఏడుగంటలకి ఒక పద్యం రాసి పోస్టు చేస్తున్నాను. ఉత్తరాంధ్ర మాండలికంలో సీస పద్యాలు రాస్తున్నాను. దేశంలో కరోనా ప్రవేశించి నాలుగు రోజులకు అటూ ఇటూగా రాయడం మొదలుపెట్టి ఇప్పటి వరకూ 70కి పైగా పద్యాలు రాశాను. సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నాను. ‘స్నేహ కళా సాహితి’ అని మాకొక సంస్థ ఉంది. ఫోన్ల ద్వారానే చెయ్యాల్సిన కార్యక్రమాలు, చదవాల్సిన పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం. కథలు రాయాల్సి ఉంది కానీ కుదరడం లేదు. సగంలో ఉన్నాయి కొన్ని. పూర్తి చేయాలి. సాయి పాపినేని సూచన మేరకు గిడుగు రామమూర్తి పంతులు జీవిత విశేషాలను కథగా మలిచే ప్రయత్నంలో ఉన్నాను. 
పాటలూ రాశా
ఉత్పాతాల గురించి చాలామంది రాస్తున్నారు. పాటలు బాగా వస్తున్నాయి. నేను కూడా కరోనాకి సంబంధించి పాటలూ, కవితలూ రాశాను. ప్రజా గాయకుల కోసం ప్రత్యేకంగా కొన్ని పాటలు రాశాను. ‘‘ఎంత ఘోరం.. విధి ఎంత క్రూరం.. ఎందుకయ్యిందిలా వీళ్లకు మోయలేని బతుకుభారం.. ఏమి నేరం చేసినారని ఇలా ఈ నడకెంత దూరం’’ ఇలా.. వలస కార్మికుల వ్యథల మీద జన చైతన్య మండలి కోసం కొన్ని పాటలు రాశాను. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ రాసిన పాటలు మరికొన్ని ఉన్నాయి. దాశరథి రాసిన ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో’’ పాట నాకు చాలా ఇష్టం.
      ప్రతి ఒక్కరూ ప్రకృతికి విధేయంగా ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమతో ప్రవర్తించాలి. సాటి మనుషుల పట్ల ప్రవర్తించే తీరు ఎలా ఉండాలో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి వలస కార్మికుల పరిస్థితి మీద సమాజం స్పందించిన తీరుతో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలిసింది. ఈ కరోనా సంక్షోభంలో సాటి మనిషి మీద చూపుతున్న ప్రేమ, స్పందన గతంలో కన్నా బాగున్నాయి. ఈ కాలం దాటిపోయిన తర్వాత కూడా ఈ మానవత్వం మిగిలే ఉండాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి