తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మన లోపలి చీకటి మాటేంటి?

  • 482 Views
  • 3Likes
  • Like
  • Article Share

మానవ సంబంధాల్లోని లోటుపాట్ల‌ని తాత్త్వికదృష్టితో అవలోకించే విశిష్ట కవి పాపినేని శివశంకర్‌. ‘రజనీగంధ’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కవిత్వంతో పాటు కథారచన, సాహితీవిమర్శలోనూ విశేష కృషి చేస్తున్న ఈయన ఈ కరోనా రోజుల్లో ఏం చేస్తున్నారు? ఆయన మాటల్లోనే..
దాస్తొయెవ్‌స్కీ
‘డ్రీమ్‌ ఆఫ్‌ ఏ రెడుక్యులస్‌ మేన్‌’ కథను ‘పిచ్చివాడి కల’ పేరిట నేను గతంలో తెలుగులోకి అనువదించాను. లాక్‌డౌన్‌ కాలంలో ఈ కథను మళ్లీ చదివాను. ఇది చాలా మంచి.. పెద్ద కథ! ఒకప్పుడు చాలా స్వచ్ఛంగా ఉన్న ఈ భూమి.. మనుషుల శరీర కాంక్షలు, అసూయా ద్వేషాలు, యుద్ధాలతో చాలా కల్మషమైపోయిందని ఇందులో చెబుతారు రచయిత. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ కథ ఎందుకో బాగా గుర్తొచ్చి మళ్లీ చదివాను. అలాగే, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే నవల ‘ది ఓల్డ్‌మ్యాన్‌ అండ్‌ దీ సీ’ కూడా మళ్లీ చదువుతున్నాను. జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని తట్టుకుని ముందుకు వెళ్లాలని చెబుతుందీ రచన. తెలుగులో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనల్ని మళ్లీ మళ్లీ చదువుతున్నాను. స్త్రీ పురుష సంబంధాలు, మూఢాచారాలకు సంబంధించి అయినా చాలా లోచూపుతో రాస్తారు. ఆయా విషయాల గురించి ఆలోచించడం, ఆ కథలు మళ్లీ చదువుకోవడం చేస్తున్నాను.
ప్రకృతితో సహజీవనం చేయాలనే ఇతివృత్తంతో ఓ రచన ప్రారంభించాను. కరోనా వల్ల మానవాళి మనుగడమే ముప్పు వచ్చి పడిందంటున్నారు కదా. మరి ఇన్నేళ్లు తక్కిన జీవరాసులకు మనుషులు చేస్తున్న అపకారం మాటేంటి? ఈ ఆలోచనల్లోంచి రచన సాగిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ జీవితం ఎలా అల్లకల్లోలం అయిపోయింది? ఎంత నాగరికం అనుకుంటున్నా కానీ, సమాజంలో చీకటి ఎందుకు చిక్కబడిందీ.. ఇలా ఓ దీర్ఘ కవిత రాస్తున్నాను.
అవి గుర్తుకొస్తున్నాయి
ఈ సంక్షోభిత సమయంలో బందా కనక లింగేశ్వరరావు రాసిన ‘గ్రుక్కెడు నీళ్లు’ కథ బాగా గుర్తొస్తోంది. ఇది ఎప్పుడో 1932లో ‘భారతి’లో వచ్చింది. దాంట్లో మహాలక్ష్మమ్మ అనే పాత్ర ఒకటుంటుంది. ఊరి కరణంగారి భార్య. ప్రథానపాత్ర. తను మడినీళ్లు తెచ్చుకుంటూ ఉంటే వెంకటప్ప అనే కడజాతి మనిషి దారికి అడ్డం వస్తాడు.. తనకు తెలియకుండానే. ఆమె ఆ విషయాన్ని భర్తతో చెప్పి, అతన్ని దండింపజేస్తుంది. అయితే ఆ ఊళ్లో కలరా వస్తుంది. కరణంగారు చనిపోతారు. అది అంటువ్యాధి కాబట్టి అంత్యక్రియలు చేయడానికి అయినవాళ్లతో సహా ఎవరూ రారు. చివరికి ఆ వెంకటప్పే ముందుకొచ్చి కన్నకొడుకులా ఆ కార్యక్రమం పూర్తిచేస్తాడు. తర్వాత అతనికి కలరా వస్తుంది. ఊళ్లో వాళ్లంతా వద్దన్నా.. అసహ్యించుకున్నా సరే, మహాలక్ష్మమ్మ అతనికి సేవచేసి బతికిస్తుంది. ఊరు ఆమెను వెలేస్తుంది. అయినా సరే, ఆమె భయపడదు. చివరికామె చనిపోతూ యావదాస్తిని వెంకటప్పకి అప్పగిస్తుంది. అందులో సగభాగం అస్పృశ్యతా నివారణ కోసం ఉపయోగించమని చెబుతుంది. చాలా గొప్ప కథ. జాతి, మతం, కులమనేది కాదు.. మానవత్వం చాలా ముఖ్యమంటారు రచయిత. ఇప్పుడు ఆ మానవత్వమే కావాలి. నిజానికి ఈ కులం అనేది కరోనా కంటే పెద్ద జాఢ్యం.  దాన్ని తొలగించుకోవాలి. 
      అలాగే, ‘ద ప్లేగ్‌’ అని అల్బర్ట్‌ కామూ ఓ గొప్ప నవల రాశారు. భయంకరమైన అంటువ్యాధులు ప్రబలినప్పుడు  మానవుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇందులో చెప్పారాయన. ఇలాంటివి కూడా ఈ సందర్భంలో నాకు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ తీసి చదువుతున్నాను. 
      ఇది నిజానికి చాలా భయంకరమైన సందర్భం అనుకుంటున్నాం కానీ.. మనలో ఉన్న సమస్తమైన ఆరాటాలు, ఉద్రేకాలు ఇవన్నీ సద్దుమణుగుతున్న ఒకానొక నిశ్శబ్ద, ప్రశాంత సమయం. మనింట్లో మనం కూర్చుని ఆలోచించుకోగలుగుతున్నాం... మనలోకి మనం చూసుకోగలుగుతున్నాం. దీన్నేదో చీకటిగా భావించడం కంటే.. మన గురించి, మన పక్కవాళ్లని గురించి, మనం ఇప్పటిదాకా ఎలా జీవించాం? ఎన్ని మంచి పనులు చేశాం? ఎవరెవరితో ఎలాట్లా ప్రవర్తించాం? ఇవన్నీ ప్రశ్నాంతంగా పునరాలోచించుకోవడానికి తగిన సందర్భంగా భావించవచ్చు. బయట అలముకున్న చీకటి కంటే మన లోపల ఉన్న చీకటి ప్రదేశాల్ని ఎవరికి వారు గుర్తించుకోవాలి. వాటిని వెలుగుతో నింపుకోవాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి