తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఉగాది మా జాతీయ పండుగ

  • 1581 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.ఆదినారాయణమూర్తి

  • బెంగళూరు
  • 9972513029

విక్రమ్‌ అప్పిగాడు, ప్రదీన అప్పడు, షీనా సన్యాసి, స్వాతి తిమ్మడు, ప్రీతి నీలయ్య, ధర్మరాజ్‌ అప్పయ్య... ఎవరు వీళ్లంతా? పేర్లని బట్టి చూస్తే అచ్చమైన తెలుగువాళ్లలానే కనిపిస్తున్నారు! కానీ, ఇప్పుడు ఇలాంటి ‘తెలుగు’ పేర్లు పెట్టుకునేవారు తెలుగునాట ఉన్నారంటారా? ఇక్కడైతే లేరు! కానీ, ఎక్కడో ఆఫ్రికా ఖండానికి సమీపంలో హిందూ మహాసముద్రంలోని మారిషస్‌ దీవుల్లో మాత్రం ఉన్నారు. ఎప్పుడో నాలుగు తరాల కిందట అక్కడికి వలస వెళ్లిన మనవాళ్ల వారసులు వాళ్లు. వారిలో ఒకరు నారాయణస్వామి సన్యాసి. అక్కడి ‘తెలుగు సాంస్కృతిక నిలయం’ వ్యవస్థాపక నిర్వాహకులైన ఆయన, ‘మారిషస్‌ తెలుగు మహాసభ’ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. మారిషస్‌లో ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించాలనే సదాశయంతో దేశవ్యాప్త తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు ఇటీవల ఆయన ఇక్కడికి వచ్చారు. ‘‘సొంతగడ్డను వదిలిపెట్టి శతాబ్దాలు గడిచిపోయినా, మేము సొంతభాషను, సంస్కృతిని మాత్రం మర్చిపోలేదు’’ అనే నారాయణస్వామితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: మారిషస్‌కు తెలుగువాళ్ల పయనం ఎలా జరిగింది?
స్వామి
: 1721లో మారిషస్‌ ఫ్రెంచ్‌ వలస దేశమైంది. తర్వాత బ్రిటిష్‌వారి చేతుల్లోకి వచ్చింది. నగరాలు, భవనాల నిర్మాణానికి 1735లో భారతీయ కళాకారుల్ని, వృత్తినిపుణుల్ని రప్పించారు. చెరకుతోటల్లో పనిచేయడానికి 1803-1810 మధ్య మన దేశం నుంచి ఆరువేల మంది కూలీలను, ఎనిమిదివేల మంది సైనికులనూ అక్కడికి తరలించారు. 1835లో మారిషస్‌లో బానిస వ్యవస్థ రద్దయింది. దాంతో ఆఫ్రికన్ల స్థానంలో భారతీయుల్ని ఒప్పంద కూలీలుగా రంగంలోకి దించారు. ఇలా వెళ్లిన వారంతా బొంబాయి, కలకత్తా, మద్రాసు ఓడరేవుల పరిధుల్లోని వారు. దక్షిణాది నుంచి వెళ్లినవారిలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాళ్లు ఎక్కువ. కేవలం మారిషస్‌కే కాదు... దక్షిణాఫ్రికా, ఫిజి, మలేషియా, సింగపూర్‌, రీయూనియన్‌ దీవులకూ అప్పట్లో మనవాళ్లు వలసవెళ్లారు. ప్రస్తుతం మారిషస్‌లో లక్షా ఇరవైవేల మంది (మొత్తం జనాభా 13 లక్షలు) తెలుగువాళ్లు ఉన్నారు.
అక్కడ తొలితరం తెలుగువాళ్లకు ఎదురైన అనుభవాలు...
తొలినాళ్లలో చాలా కఠినాతి కఠినమైన జీవితం గడిపారు. ఒక్కసారి వూహించండి... కట్టుబట్టలతో, పెళ్లాం బిడ్డలతో మన భాష, సంస్కృతులే లేని, స్థానిక జీవన విధానాలూ తెలియని దేశానికి ఓడల్లో వెళ్లినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో!! అయినా వారికి తిరుపతి వేంకటేశ్వరుడు, సింహాద్రి నరసింహస్వామి, భద్రాచలం రాములవారిపైన ఎనలేని విశ్వాసం. దూరతీరాల్లో వాళ్లే మనల్ని గట్టెక్కిస్తారనే ప్రగాఢ నమ్మకంతో రేయింబవళ్లు పరిశ్రమించారు.
ప్రస్తుత తరం సామాజిక, ఆర్థిక స్థితిగతులు?
1880 నాటికే తెలుగువాళ్లు బాగా కుదురుకున్నారు. రెండో తరంలోనే న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, వైద్యులు వచ్చారు. ఇప్పుడు ఆచార్యులు, డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంటు స్థాయిలో ఉన్నారు. మారిషస్‌ జాతీయ స్థూలోత్పత్తిలో తెలుగువారి వాటా పాతిక శాతం కంటే ఎక్కువే. సాధారణ వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. మారిషస్‌లో తొలి నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్‌ పైడయ్య, తొలి మహిళా న్యాయమూర్తి విద్య నారాయణ, ప్రస్తుత ఆర్థిక మంత్రి సీతన్న లక్ష్మీనారాయుడు, హృద్రోగ వైద్యనిపుణుడు ఆచార్య బాలిగాడు... అందరూ మనవాళ్లే. అటార్నీ జనరల్‌గా రవి ఎర్రిగాడు పనిచేస్తున్నారు. చక్కెర, జౌళి కర్మాగారాలూ తెలుగువారి యాజమాన్యంలో నడుస్తున్నాయి. చెరకుతోటల్లో కూలీలుగా వచ్చిన వారి సంతతి స్వాధీనంలో ఇప్పుడు వేల ఎకరాల చెరకు తోటలున్నాయి. తెలుగువాళ్లందరికీ సొంత ఇళ్లు- బంగళాలున్నాయి. బాగా స్థిరపడ్డారు. ఇతరులకంటే ఎక్కువగా పనిచేస్తారు. పని తప్ప ఇతర వ్యాపకాల మీద దృష్టి లేదు. అవినీతికి ఆమడ దూరంలో ఉంటారు. ఎంత సంపాదించినా నిరాడంబరంగా జీవిస్తారు. నిర్మొహమాటంగానూ వ్యవహరిస్తారు. అందుకే అక్కడెవరూ మనవాళ్లని వేలెత్తి చూపరు. అన్నట్టు ఇక్కడి తెలుగువాళ్లందరూ నూటికి నూరు శాతం అక్షరాస్యులే, కనీస విద్యార్హత డిగ్రీ.
మరి మహిళల పరిస్థితి?
భేషుగ్గా ఉంది. మా దేశంలో ప్రతి తెలుగు మహిళా విద్యావంతురాలే. ఉద్యోగస్థురాలే. భార్యాభర్తలిద్దరూ పొద్దున్నే విధులకు వెళ్తే, పిల్లలు విద్యాలయాలకు వెళ్లిపోతారు. తిరిగి సాయంత్రమే అందరూ కలుసుకోవటం. దంపతులిద్దరూ పనిచేస్తారు కాబట్టి ఆర్థికంగా ఎలాంటి లోటూ ఉండదు.
రాజకీయాల్లోనూ రాణిస్తున్నారా?
మా దగ్గర లేబర్‌, కన్జర్వేటివ్‌ పార్టీలున్నాయి. తెలుగువాళ్లలో ఎక్కువమంది కన్జర్వేటివ్‌ పార్టీలో ఉన్నారు. ప్రతి అయిదేళ్లకోసారి జాతీయ శాసనసభ(ఇక్కడి పార్లమెంట్‌ లాంటిది)కు ఎన్నికలు జరుగుతాయి. పార్టీలు తెలుగు కుటుంబాలకు వంతుల వారీగా టిక్కెట్లు ఇస్తాయి. స్వాతంత్య్రం లభించాక జరిగిన మొదటి ఎన్నికల్లో వీరాస్వామి కుటుంబానికి చెందిన వ్యక్తికి టిక్కెట్టు లభించింది. ఆయన గెలిచి మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వ ఛీఫ్‌విప్‌గా గదిలి కుటుంబ సభ్యుడు ఎన్నికయ్యారు. భారత ప్రధానిగా వాజపేయి ఉన్నప్పుడు ఇక్కడ నలుగురు తెలుగువాళ్లు శాసస సభ్యులు(ఇక్కడి ఎంపీల మాదిరి)గా పనిచేశారు. ఛీప్‌విప్‌గా ఉచ్ఛన్న, ఆర్థికమంత్రిగా వీరాస్వామి, పార్లమెంటరీ సెక్రటరీగా మరొకరు పనిచేశారు. ఆ సమయంలోనే మారిషస్‌ రాజధాని పోర్ట్‌లూయి మేయరుగా బాలిగాడు ఉండేవారు. తెలుగువాళ్లందరూ ఎంతో గర్వపడిన కాలమది.
అక్కడి పేర్లు కాస్త భిన్నంగా ఉన్నాయి...?
బాలిగాడు, ఎర్రిగాడు, ఈరిగాడు తదితరాలు మారిషస్‌కు వెళ్లిన తొలి తరం వ్యక్తుల పేర్లు. వాళ్ల అసలు పేర్లు బాలయ్య, ఎర్రయ్య, వీరయ్య మొదలైనవి. నిరక్షరాస్యులు, కూటి కోసం నానా తిప్పలు పడిన పేదలు కావటంతో సమాజం వాళ్లని బాలిగాడు, ఈరిగాడు అంటూ పిలిచి చులకన చేసింది. ఇక్కడినుంచి మారిషస్‌కు వాళ్లని తరలించినప్పుడు సంబంధిత పత్రాల్లో అధికారులు అలాగే రాశారు. దాంతో మారిషస్‌ రికార్డుల్లోకి అవి అలాగే వెళ్లిపోయాయి. వాటిని మార్చుకోవాలని, తమ అసలు పేర్లు నమోదు చేయించుకోవాలని వాళ్లకి అప్పట్లో ఆలోచన రాలేదేమో! అలా అక్కడ స్థిరపడిన తొలితరం వ్యక్తుల పేర్లే తర్వాత తరానికి ఇంటిపేర్లుగా మారాయి.
సంభాషణల్లో తెలుగు ఎంత వరకూ వినిపిస్తుంది?
ఇప్పటికీ పాతిక శాతం కుటుంబాల్లో సంభాషణ పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. ఉత్తరాంధ్ర యాస. మిగిలిన కుటుంబాల్లో తెలుగు, ఫ్రెంచి పదాల మిశ్రమంతో సంభాషణ సాగుతుంది. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మూడు గంటలపాటు తెలుగు కార్యక్రమాల్ని ప్రసారం చేస్తుంది. తెలుగు సంభాషణల్ని ఇతరులు అర్థం చేసుకునేందుకు ఆంగ్లంలో సబ్‌టైటిల్స్‌ వేస్తారు. సప్తగిరి వాహిని అందుబాటులో ఉంది. దినపత్రిక పరిమాణంలో పది, పన్నెండు పేజీలతో ‘తేజం’ అనే మాసపత్రికనూ వెలువరిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాలను అందులో ప్రచురిస్తున్నాం. సభలు, సమావేశాలు, పర్వదినాలప్పుడు అందరం కలిసినప్పుడు కచ్చితంగా తెలుగులోనే మాట్లాడుకుంటాం. తగిన పదాలు తట్టకపోతే అక్కడున్న తెలుగు పండితులు సాయం చేస్తారు. అలా తెలుగులో మాటామంతి నిరాటంకంగా సాగిపోతోంది.
అమ్మభాషను ఎలా కాపాడుకుంటున్నారు?
ఇప్పుడు ఉండేది నాలుగో తరం వాళ్లం. అయినా మేం ఆ సమాజంలో తెలుగువాళ్లుగానే సముచిత స్థానాన్ని సాధించాం. ప్రభుత్వం కూడా మా సమర్థతను గౌరవించింది. ఇదంతా మూడు అక్షరాలు- తెలుగువల్ల లభ్యమైందే. అయిదో తరం చిన్నారులు కూడా తెలుగును చాలా ఇష్టపడతారు. అసలు భాషే అంతరించి పోతే జాతికి మనుగడ ఎక్కడ ఉంటుంది? అందుకే భాష పరిరక్షణకు పరిశ్రమిస్తున్నాం. దీన్ని ముమ్మరం చేస్తాం.
మన పండగల్ని ఘనంగా చేసుకుంటున్నారు కదా?
తెలుగు ఉగాది అక్కడ జాతీయ పర్వదినం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు. శ్రీరామ నవమినాడు రామభజన చేస్తాం. నరసింహ పూజ, అమ్మోరు పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. శ్రీవేంకటేశ్వర స్వామి మహామండల వ్రతదీక్ష మహోత్సవాన్ని నలభై రోజులపాటు చేస్తాం. దీక్ష తీసుకున్నవారు ఉపవాసం ఉంటారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం- నవంబరు 1 కూడా మాకు పండగ రోజే. తెలంగాణ, నవ్యాంధ్ర రాష్ట్రాలు ఏర్పడిన దినోత్సవాల్నీ జరుపుకున్నాం. మాకు వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మనమంతా తెలుగువాళ్లమనే భావన మాది.
పెళ్లి పేరంటాలు... ఆహారపుటలవాట్లు?
మా తరం వరకూ పెళ్లిళ్లు తెలుగువాళ్ల మధ్యే జరిగేవి. ఇప్పుడు అయిదారు శాతం మంది ఇతర భాషీయులను- వాళ్లూ హిందువులే- పెళ్లి చేసుకుంటున్నారు. ఒకటికంటే తక్కువ శాతం కుటుంబాల వాళ్లు స్థానికులు, ఇతర మతాల వారితో వియ్యమందుతున్నారు. ఇక ఆహారమంటారా... అన్నం, పులుసు, చారు, పప్పు, తాలింపులు, సాంబారు, గొజ్జు, పచ్చడి, వడియాలు, అప్పడాలు, పులిహార, దద్దోజనం తప్పనిసరి. ఇడ్లీ, దోసెలు, ఉప్పిండి తదితర అల్పాహారాల రుచులూ ఇక్కడ ఘుమఘుమలాడతాయి.
విద్యారంగంలో తెలుగు స్థితిగతులేంటి?
మారిషస్‌లో ఏ భాషీయులైనా సరే, తమ సొంతభాషను ప్రాథమిక విద్యలో భాగంగా అభ్యసించాల్సిందే. అంటే నిర్బంధ భాషా బోధన అమల్లో ఉంది. అలా తెలుగు చిన్నారులు ప్రాథమిక పాఠశాలల్లో విధిగా అమ్మభాషను నేర్చుకుంటారు. ఉన్నత పాఠశాలకు వచ్చాకే తెలుగు విద్యార్థులు... తెలుగు నుంచి ఇతర విషయాలకు మళ్లుతారు. అక్కడా తెలుగునే అభ్యసించాలనుకునే వారు దాన్నే కొనసాగించవచ్చు. స్నాతక పూర్వ (పీయూసీ), స్నాతక(డిగ్రీ), స్నాతకోత్తర (పీజీ) కళాశాలల్లోనూ తెలుగు బోధన జరుగుతోంది. మొత్తమ్మీద నూటయాభై మందికి పైగా తెలుగు పండితులు, ఆచార్యులు, ఉపన్యాసకులు ఉన్నారు. మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌లో స్నాతకోత్తర విద్యా బోధన సాగుతోంది.
ప్రభుత్వ పరంగా లభించే ప్రోత్సాహం..?
దేశంలోని అన్ని భాషల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు మారిషస్‌ ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ‘తెలుగు సాంస్కృతిక కేంద్రం’, తెలుగువాళ్ల రోజువారీ వ్యవహారాల్లో అమ్మభాషా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘తెలుగు సంభాషణ కేంద్రాన్ని’ స్థాపించింది. ఏడాదికి రూ.50లక్షల వరకూ నిధులను ఇస్తోంది. వీటి ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎన్ని తెలుగు సంఘాలు ఉన్నాయి?
మారిషస్‌ దేశం కొన్ని దీవుల సముదాయం. వివిధ ప్రాంతాల్లో పది తెలుగు సంస్థలు ఉన్నాయి. అన్నీ ‘మారిషస్‌ తెలుగు మహాసభ’ ఛత్రం కిందే పనిచేస్తున్నాయి. అన్ని సంస్థలకూ కలిపి తొంభై శాఖల వరకూ ఉన్నాయి. ‘తెలుగు మహాసభ’ ప్రభుత్వ గుర్తింపు పొందింది.
తెలుగు మహాసభను ఎవరు స్థాపించారు?
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు మారిషస్‌లోని తెలుగువారికీ ఓ విధమైన స్వేచ్ఛ లభించింది. అదే 1947లో కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చిన వీరాస్వామి, గదిలి, రామస్వామి, అప్పలస్వామి, ఉచ్ఛన్న, వెంకటస్వామి, గౌరీశం, ఈరిగాడు, బాలిగాడు, లక్ష్మీనారాయుడు కుటుంబాల సభ్యులు కలిసి ‘మారిషస్‌ ఆంధ్ర మహాసభ’ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి తెలుగు పండితుడు గుణయ్య ఒట్టు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి మన భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, కళల్ని అధ్యయనం చేశారు. 1960 నుంచి 1974 వరకూ తెలుగుగడ్డ మీదే ఉన్నారాయన. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎంతో అనుభవాన్ని గడించాక తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. అప్పటివరకూ మావాళ్లు ఆచరిస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను చక్కబెట్టారు. ఒక దారికి తెచ్చారు. ‘ఆంధ్ర మహాసభ’లో చేరి దాని కార్యకలాపాల్ని వేగవంతం చేశారు. ఆయన చొరవ వల్లే మారిషస్‌ ప్రభుత్వం తెలుగు ఉగాదిని జాతీయ పర్వదినంగా ప్రకటించింది. ఇటీవల రాష్ట్ర విభజన తర్వాత ‘మారిషస్‌ తెలుగు మహాసభ’గా పేరు మార్చాం.
భాషా సంస్కృతుల పరిరక్షణకు ఏం చేస్తున్నారు?
తెలుగునాట నుంచి నాయకులు ఎవరు మారిషస్‌ను సందర్శించినా... అమ్మభాష, సంస్కృతుల పరిరక్షణకు మేం తీసుకుంటున్న చర్యలను చూసి ఆశ్చర్యపోతారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు మారిషస్‌కు వచ్చారు. ఆయన్ను రామదాసు కీర్తనల ఆలాపన, రామభజన కార్యక్రమానికి తీసుకెళ్లాం. ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీరు ఇప్పుడు పాడుతున్నవి మేం చిన్నప్పుడు పాడిన భజనలు. మా తాతగారు నేర్పించారు. అంతే! ఆ తర్వాత అవి అంతరించి పోయాయి. ఇప్పుడు ఇవి దేశం మొత్తమ్మీద కలికానికీ వినపడవు, కనపడవు. కానీ ఇప్పటికీ మీరు వాటిని పాడుతున్నారు. నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది’ అన్నారు. భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాల మీద తరచూ సదస్సులు, చర్చా గోష్ఠులు జరుగుతాయి. రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నాం. వీటి నిర్వహణకు అక్కడి ప్రభుత్వం సాయపడుతోంది. మారిషస్‌ దీవులతోపాటు బోట్సా్వన, ఫిజి, దక్షిణాఫ్రికా, సింగపూరు, మలేషియా తదితర దేశాల్లోని తెలుగు వాళ్లం రెండేళ్లకోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నాం. భాషా సంస్కృతుల పరిరక్షణతో పాటు విద్య, వాణిజ్యం, వ్యాపారాల గురించి అనుభవాల్ని పంచుకోవటం ద్వారా ఆర్థిక, సామాజిక, విద్యారంగాల్లో మరింత ప్రగతి సాధించదలచాం. ఇప్పుడు అనేక తెలుగు సంస్థలు ఆయా ప్రాంతాల్లో వారంలో ఒక రోజు... ముగ్గులు వేయటం, అల్లికలు, కుట్టుపనుల్లో మెలకువలు బోధించడంతో పాటు అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు కీర్తనలు, క్షేత్రయ్య పదాల గానంలో శిక్షణ ఇస్తున్నాయి. వీణ, ఘటం, కంజర, మృదంగం, తబలా, హార్మోనియం తదితర వాద్యసంగీతాన్నీ నేర్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నిరంతరం కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, జానపద కళల మీద శిక్షణ ఇచ్చే ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలు?
ఏటా మారిషస్‌కు తెలుగు పండితులు, అధ్యాపకులు, ఆచార్యుల్నీ, సాంస్కృతిక బృందాల్నీ పంపేవారు. దాన్ని తిరిగి ప్రారంభించాలి. జానపద కళాకారులు, కర్ణాటక సంగీత విద్వాంసులు, కూచిపూడి నాట్యాచార్యులు వచ్చి అక్కడి వారికి మరికొన్ని మెలకువల్ని నేర్పించాలి. దానివల్ల వాళ్లు బాగా రాణించగలుగుతారు. వాళ్లను చూసి నవతరమూ కళలపట్ల ఆకర్షితులవుతారు. తెలుగు సాంస్కృతిక ట్రస్టు, తెలుగు మహాసభ భవనాల కోసం అక్కడి ప్రభుత్వం పెద్ద స్థలాల్ని కేటాయించింది. వాటి నిర్మాణాలను చేపట్టాలి. త్వరలోనే మారిషస్‌ తెలుగు ప్రతినిధి బృందం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంది. సాయం కోరుతుంది. 2004లో చంద్రబాబు నాయుడు మారిషస్‌ను సందర్శించినపుడు తెలుగు సాంస్కృతిక ట్రస్టు భవనానికి పునాదిరాయి వేశారు. రాష్ట్రం తరఫున భవన నిర్మాణానికి విరాళం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల్నీ మారిషస్‌కు ఆహ్వానిస్తాం. పరాయిగడ్డలో తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ చాలా కష్టమైన విషయం. ఈ పవిత్ర యజ్ఞానికి ఇద్దరు ముఖ్యమంత్రుల అండదండలు అవసరం, అనివార్యం కూడా.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి