తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

చిన్నారుల నేస్తం

  • 280 Views
  • 1Likes
  • Like
  • Article Share

    తురగ రాము

  • దుగ్గిరాల, గుంటూరు జిల్లా
  • 8008573112

కోతి మూకల్లాంటి/ కుర్రాళ్ల జట్టు/ దారంట చూశారు/ నేరేడు చెట్టు! ఎత్తుగుందా చెట్టు/ ఎక్కలేరా వాళ్లు/ వేరేమి గతిలేక/ విసిరారు రాళ్లు/ గాయమైనా చెట్టు/ కార్పకనే కన్నీళ్లు/ ప్రేమతో ఇచ్చింది/ పిల్లలకు పళ్లు! ‘‘చెడు చేసినా కాని/ చెయ్యాలి మేలు’’/ అను మాట కాచెట్టె/ అగు ఆనవాలు!! మ‌నసును హత్తుకునే ఇలాంటి గేయకథలు 43... గుదిగుచ్చితే ‘స్వర్ణపుష్పాలు’! బాల గేయ కథామాల! ఈ పొత్తానికే ఈ ఏడాది  బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు అలపర్తి వెంకటసుబ్బారావు. తెలుగునాట బాలసాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న అగ్రశ్రేణి రచయితల్లో ఆయన ఒకరు.
పిల్లల కోసం
రాయడం అంత సులువు కాదు. పిల్లలతో చదివింపజేసేలా రాయడమంటే ఇంకా కష్టం. వాళ్ల అవసరాలను గుర్తించాలి. ఆలోచనలను అందుకోవాలి. దానికోసం మన పెద్దరికాన్ని పక్కనపెట్టాలి. చిన్నారిలోకంలో తనూ ఓ పసిపిల్లాడైపోవాలి. అప్పుడే ఆ రచయిత సృజన పిల్లలకు నచ్చుతుంది. ఈ విషయంలో అలపర్తి వెంకటసుబ్బారావు నేర్పు ప్రత్యేకం. మనవణ్నో, మనవరాల్నో ఒళ్లో కూర్చోబెట్టుకుని తాతయ్య చెప్పే కథ మాదిరిగా సాగిపోతుంది ఆయన రచన. అలాగని పిల్లలకు నచ్చే జానపద కథలు, సాహసవీరుల విన్యాసాలకే ఆయన కలం పరిమితం కాదు. చిన్నారుల వ్యక్తిత్వం వేయి కోణాల్లో వికసించేలా దిశానిర్దేశం చేసే అన్ని విషయాలనూ ఆయన రాస్తారు. అయితే, వాటిని పిల్లలకు అర్థమయ్యే భాషలో రాస్తారు. ‘రావే రావే ఓ జాబిల్లి/ రమ్మని పిలిచెను ముద్దుల చెల్లి..’ అంటూ రాసిన ‘పాలవెన్నెల’ పుస్తకం ఇప్పటికి మూడు ముద్రణలు పూర్తిచేసుకుంది. ‘ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు’ పథకం కింద పలు పాఠశాలలకు పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఇందులోనే... చిన్న పిల్లల్ని చీటికీ మాటికీ కొట్టకూడదంటూ ‘మంచీ చెడ్డా తెలియని వయసు, మాయా మర్మం ఎరుగని మనసు’ అంటూ పసి హృదయాలకు ఆయన దర్పణం పట్టారు.
      ‘పిల్లల మాటలు వినిపించు నాకు పిల్లనగ్రోవి పాటలుగా.. పిల్లల మనసులు అగుపించు నాకు వెన్న ముద్దలంత స్వచ్ఛముగా’ అనే అలపర్తి, గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని నందివెలుగు వాసి. అక్కడికి దగ్గర్లోనే ఉండే అంగలకుదురులో మే 15, 1934న ఆయన జన్మించారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే అలపర్తి రచనలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మరో మూడేళ్లకే తొలిపుస్తకం ‘బాలానందం’ వచ్చింది. ‘మావూరివారు, చిట్టికవితలు, పిల్లనగ్రోవి, తాయం, ఆటలపాటలు, పండుగల పాటలు, శ్రుతిలయలు, నెమలికన్నులు, బీర్‌బల్‌ వినోదాలు, నిమ్మతొనలు, ఏకలవ్యుడు, స్నేహధర్మం’ లాంటి పొత్తాలు అలపర్తి కలం నుంచి జాలువారాయి. ‘శ్రుతిలయలు’కు రాష్ట్ర బాల సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య పురస్కారంతోపాటు మరెన్నో సత్కారాలను ఆయన అందుకున్నారు.
‘మీ గేయంలో ఒక సుగంధం’
      అలపర్తి రాసిన కథలైతే కొల్లలు. ‘చిట్టికథలు’ నుంచి బొమ్మలకథల వరకూ అన్నీ రాశారు. ‘వారసత్వం’, ‘చివరికి మిగిలేది’ లాంటి నాటికలు, ‘ప్రకృతి- వికృతి’ తదితర సంగీత రూపకాలనూ రచించారు. ‘పద్యం చెడిపోదన్నా, పద్యమె భాషకు సంజీవి, పద్యమెప్పుడు చిరంజీవి’ అనిచెప్పే అలపర్తి, ‘బంగారుపాప’ పేరిట పద్యరచన కూడా చేశారు. ‘ఆటపాటలు పిల్లలకు, అచ్చటముచ్చట పెద్దలకు... ఈ రెండు పంక్తులు చాలు బాలగీతాల రచనలో మీ ముద్రను చాటడానికి’ అని సుబ్బారావు భుజం తట్టారు సినారె. ‘మీ గేయంలో ఒక సుగంధం ఉంది. మీ పదబంధాల్లో పసిపాపల బోసినవ్వులోని మధురిమ ఉంది’ విశ్లేషించారు నాగభైరవ కోటేశ్వరరావు. అలపర్తి రచనల మీద పరిశోధన చేసిన గుంటూరు జిల్లా బలిజేపల్లి వాసి రావెళ్ల శ్రీనివాసరావు, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు.
      రచనలో అనుబంధాలకు పట్టంకట్టడం అలపర్తి శైలి. ‘పాలు పోసి బువ్వపెట్టి జోలపాడి జోకొట్టి కంటి రెప్పవలె కాచిన కన్నతల్లి.. కల్పవల్లి’ అంటూ అమ్మకు ఆయన ఇచ్చిన నిర్వచనం దీనికో మచ్చుతునక. చావిట్లో కుక్కిమంచంలో ఉన్న తాత దీనావస్థను గమనించిన మనవడు ‘ఎందుకు తాతను అలా వదిలేశావు’ అని తండ్రిని నిలదీస్తాడు. ఫలితంగా దెబ్బలు తింటాడు. మనవణ్ని చావబాదుతుంటే అడ్డంపడిన ఆ తాత, మంచం కోడుకు తగిలి చనిపోతాడు. ఈ ఇతివృత్తంతో రాసిన ‘వారసత్వం’... బిడ్డలకు పెద్దవాళ్లను గౌరవించే వారసత్వాన్ని అందించాలే తప్ప బాధించే సంస్కృతిని నేర్పకూడదని చెబుతుంది. 
చిన్నారి మనసులకు ప్రతిబింబాలు
‘గణ గణ గణ గణ బడిగంట, వినిపించగనే ఉదయమున, దడ దడ దడ దడ భయమేదో, పొడసూపును మా హృదయమున..’ అంటూ పిల్లల మనసుల్లో దూరిచూసినట్టు రాసే నేర్పు అలపర్తికి మంచిపేరు తెచ్చింది. ఏ వస్తువు రూపాన్నయినా తమదైన శైలిలో గీయడం పిల్లలకు అలవాటు. దాన్నే ‘బారుగ గీత గీసి దానిని బలపం అంటాను- పలకల బిళ్లాగీసి దానిని పలకని అంటాను’ అని అక్షరీకరించారు అలపర్తి. ‘పిల్లలు ఏది గీసినా అందమే, ఎలా గీసినా అది ఒక రూపమే’ అనే ఆయన మాట అక్షరసత్యం. 
      ‘వచ్చె కృష్ణాష్టమీ వచ్చె నీ దినము- హెచ్చె సర్వాంధ్రుల హృదయాల ముదము’, ‘రమ్ము రమ్ము ఉగాది రమ్మీదరికొక్కసారి’.. ఇలా ప్రతి పండగనూ చిన్నారిలోకానికి చేరువచేశారు. ‘మమ్మీ అనే కన్నా అమ్మా అంటే ఎంత గొప్పగా, ఆనందంగా ఉంటుందో.. అలానే నువ్వు పిలవాలి’ అంటూ మాతృభాషాభిమానాన్ని అక్షరాల్లో రంగరించి పోశారు. అలపర్తి ప్రతిభను మూడు దశాబ్దాల కిందటే గుర్తించింది ప్రభుత్వం. 1984లో నాలుగో తరగతి తెలుగు వాచకం రాసే బాధ్యతను ఆయనకు అప్పగించింది. గ్రంథాలయోద్యమ పతాకధారి వెలగా వెంకటప్పయ్య ప్రోత్సాహంతో అలపర్తి దాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. ఆ వాచకం మూడేళ్లపాటు పాఠ్యపుస్తకంగా కొనసాగింది. ప్రైవేటు విద్యాసంస్థలవాళ్లు వేసిన ‘తెలుగువాణి’ నాలుగో తరగతి పుస్తకంలోనూ ఆయన రచన ‘ఏకలవ్యుడు’ ఓ పాఠ్యాంశమైంది. అలపర్తి కుమారుడు వెంకటేశ్వరరావు, తండ్రి రచనలకు తగిన బొమ్మలు వేస్తూ ఉంటారు. 
వెలకట్టలేని ‘స్వర్ణపుష్పాలు’
సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకున్న ‘స్వర్ణపుష్పాలు’లోని ప్రతి గేయకథా మధురగుళికే. ‘మరమరాలు కావాలని మనవరాలు ఏడ్వంగా, మరమరాలు తేవాలని త్వరగ తాత వెళ్లంగా..’ ఇలా సాగే ‘మరమరాలు- మనవరాలు’ గేయకథ తాతయ్యల ఆప్యాయతానురాగాలను కళ్లముందు నిలుపుతుంది. దేశ రక్షణలో అసువులు బాసిన అబ్దుల్‌ హమీద్‌ అనే సైనికుడి పోరాటాన్ని ఆవిష్కరించే గేయకథ కంటతడి పెట్టిస్తుంది. ఇక ‘చినబాబూ చేయొచ్చా చిలిపి పనులు ఇలాగా? నీళ్ల పంపులో ఎందుకు నిమ్మతొనలు వేశావు?’ అంటూ ‘నిమ్మతొనలు’లో పిల్లల అల్లరి చేష్టల్ని అందంగా చెప్పారు. ‘ఆరోగ్యమే ఆభరణము, ఆటలందుకు కారణము’, ‘కలహమాడితే కష్టం నష్టం, కలిసి ఉండుటే నా అభీష్టం’... ఇలా సందేశాత్మకంగా సాగిపోయే ఈ గేయకథలు పిల్లల్లో ఆలోచన రేకెత్తిస్తాయి.  
      ‘చిన్నారి లోకం, పొన్నారి లోకం, అందాల స్వర్గం, ఆనందమార్గం’... ఈ మార్గాన్ని నందనవనం చేసే అక్షరమాలికలను వికసింపజేయడమే అలపర్తి లక్ష్యం. ‘చదువుకో చిన్నారి చదువుకో, బాగా చదువుకుని పైపైకి ఎదిగిపో వేగ’... ఇదే ఆయన సాహితీ సందేశం.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి