తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మట్టి చేతులతో చరిత్ర నిర్మాణం

  • 407 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి

  • హైదరాబాదు
  • 9000789635

పురాణాలనే చరిత్రగా భావించిన దశనుంచి, పురాసంపదను ‘కార్బన్‌ డేటింగ్‌’ వంటి ఆధునిక పద్ధతులతో తర్కించి సహేతుక చరిత్రను నిర్మించే స్థాయికి చేరుకున్నాం. ఆధార సహితంగా జాతి చరిత్రలోని మంచి చెడ్డలను, నిమ్నోన్నతాలను తెలియజెప్పేందుకు ప్రయత్నించిన అతికొద్దిమంది చారిత్రక, పురావస్తు పరిశోధకుల్లో పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి ఒకరు! నేలమాళిగల్లో దాగిన ఎన్నో శాసనాలను వెలికితీసి, చదివి, వ్యాఖ్యానం చెప్పి ఆకాశమంత చరిత్రను తెలుగువారికి పరిచయం చేసిన విఖ్యాత పరిశోధకులాయన. మెరుగైన రవాణా సదుపాయాలు, కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి హంగులేవీ లేని కాలంలోనే మారుమూల పల్లెలకు కాలినడకన వెళ్లి చారిత్రక ఆనవాళ్లను వెలికితీసిన పీబీ శాస్త్రికి భాషా సంస్కృతులతో అసాధారణ ప్రేమానుబంధం ఉంది. చరిత్రతోపాటు లిపి పరిణామ క్రమాన్నీ ఆపోసన పట్టిన పరబ్రహ్మ శాస్త్రి- శాసనాలన్నింటినీ చదవగల ఏకైక మేధావిగా గుర్తింపు పొందారు. చరిత్రను కాలగర్భంలో మలిగిపోనివ్వకుండా నేల పొరలను తవ్వి భావితరాలకు దోసిళ్ల నిండా జ్ఞానం పంచిన పీబీ శాస్త్రికి శాసనాలే లోకం!
భారతీయ లిపులను, పద స్వరూపాన్ని, వాటి అర్థాలను, అన్వయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిరంతరం చరిత్రతో సంభాషిస్తూ, శాసనాలనే శ్వాసిస్తూ బతికిన పరబ్రహ్మ శాస్త్రి జూన్‌ 27న తుది శ్వాస వదిలారు. తెలుగువాడికి సగర్వంగా నాది అని చెప్పుకోదగిన సాధికార చరిత్రను అందించిన ఆయన తుది శ్వాస విడవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు (జూన్‌ 26) ‘తెలుగు వెలుగు’కు ఇచ్చిన ముఖాముఖి ఇది... 
భారతదేశంలో మరెక్కడా లభ్యంకానన్ని శాసనాలు తెలుగు నేలమీద దొరికాయి. చరిత్ర గుండె చప్పుడుగా వినిపించే ఈ శాసనాల ద్వారా తెలుగు లిపి, భాషా వికాసాన్ని తెలుసుకోవచ్చా?
శాస్త్రి:
భాష లేనిదే జాతికి ఉనికి లేదు. అన్యభాషల ప్రభావం మితిమీరడంతో ప్రస్తుతం తెలుగు ఎన్నడూ లేనన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రతి తెలుగువాడూ భాషా మూలాల పరిరక్షణకు కంకణం కట్టుకోవాల్సిన దశలో శాసనాల ప్రస్తావన ఉత్తేజం కలిగిస్తోంది. భట్టిప్రోలు శాసనం మొదలు బెజవాడ యుద్ధమల్లుని శాసనం వరకూ లభించిన శాసనాలన్నీ తెలుగు లిపి, భాషా పరిణామ, వికాసాలకు అద్దం పడతాయి. నిజానికి పత్తిప్రోలు (పత్తిని నిల్వ చేసే ప్రాంతం) అన్న మాట క్రమంగా భట్టిప్రోలుగా మారింది. క్రీ.పూ. నాలుగో శతాబ్దానికి చెందిన ‘భట్టిప్రోలు శాసనం’ తెలుగు లిపికి సంబంధించిన మొట్టమొదటి శాస్త్రీయ ఆధారం. ఈ శాసనంలోని దాదాపు ప్రతి అక్షరంలోనూ ‘అ’కార ప్రయోగం, శబ్దం కనిపిస్తుంది. తెలుగు లిపికి ప్రాణప్రదమైన ‘తలకట్టు’ ప్రయోగాన్ని తొలిసారిగా ఈ శాసనంలోనే గమనించవచ్చు. తెలుగు ప్రాచీనత నిరూపించడంకోసం అశోకుడికి కాస్త ముందు కాలంనాటి ఈ శాసనాన్ని తరచి చూస్తే చాలు. ఉత్తరాదిలో ఎక్కడా కనిపించని ‘ళ’ అక్షరమూ ఈ శాసనంలోనే సాక్షాత్కరిస్తుంది.
‘నా విష్ణుః పృథ్వీపతి’ అని నమ్మినన్నాళ్లూ రాజులు, రాజాస్థానాల కథలే చరిత్రగా చలామణీ అయ్యాయి. రాజుల రోజుల లెక్కలు తేల్చిన మీరు- ప్రాచీనాంధ్ర గ్రామీణుల జీవనంమీదా అంతే సాధికారికంగా స్పందించారు. తెలుగు జాతి ఎలా బతికిందో తెలిపే సాంఘిక చరిత్రలు తక్కువ. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను శాస్త్రీయంగా వెలికితీసే సాధనాలేవైనా ఉన్నాయా?
మన తాత ముత్తాతలు ఎలా ఉన్నారో, ఏం తిన్నారో, ఎలాంటి విశ్వాసాలతో జీవించారో, వారి ఆటపాటలెలాంటివో, రోగాలొస్తే ఎలాంటి చికిత్సలు పొందారో తెలియజెప్పని చరిత్రకు విలువ లేదు. జనం గురించి మాట్లాడకుండా చరిత్ర చెబితే అది నేల విడిచి సాము చేయడమే అవుతుంది. పూర్వ చరిత్రలను బట్టి ఆయా ప్రాంతాలకు స్థిరపడిన నామధేయాలను విశ్లేషిస్తే మనముందు అద్భుతమైన ప్రాంతీయ చరిత్రలు సాక్షాత్కరిస్తాయి. పునాది స్థాయిలో వెల్లివిరిసిన ఈ స్థానిక చరిత్రలన్నింటినీ గుదిగుచ్చితే అఖండ భారత చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ‘కోలు’ అనే బ్రిటిష్‌ అధికారి పనిచేశాడు కాబట్టి ‘కొల్లూరు’ అనే గ్రామం పేరు ఏర్పడిందని; రేవు పక్కన (సముద్రం) ఉంటుంది కాబట్టి ‘రేపల్లె’ అనే ఊరిపేరు స్థిరపడిందని; తామ్ర యుగంలో ఆవుల మందలను రేవు పక్కన మేపుకొనేవారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ‘ఆలేరు’ అని పిలిచారని ఎంతమందికి తెలుసు? ఇదే విధంగా పల్లెల్లో ఉపయోగించే వివిధ పరికరాలకు ఆ పేర్లు ఎలా స్థిరపడ్డాయి, తినే తిండిని, పండించే ధాన్యాన్ని విభిన్నమైన పేర్లతో ఎందుకు పిలుస్తున్నారు వంటి విశేషాలను తవ్వితీస్తే తెలుగుజాతి అఖండ సామాజిక చరిత్ర మనముందు నిలుస్తుంది. మూల చరిత్రలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించిన సంపూర్ణ స్వరూపం కళ్లకు కడుతుంది. తెలుగు భాషలోని అనేక పదాల మీద సమగ్ర వ్యుత్పత్తి పదకోశం తీసుకురావాలి. ఉదాహరణకు ‘ముంగిలి’, ‘లోగిలి’, ‘వాకిలి’ వంటి పదాల్లో ‘గిలి’ అంటే ఇల్లు అని అర్థం. దానికి ముందు ఒక అక్షరాన్ని చేర్చడం ద్వారా అర్థం మారుతోంది. ఇలాంటి పదాలు తెలుగులో కోకొల్లలు. ముందు తరాలకు వీటన్నింటి గురించి విడమరచి చెప్పాలి. విస్తృతమైన వ్యుత్పత్తి పదకోశంతోనే అది సాధ్యం!
మూలాలకు వెళ్లి ఎంతో లోతున పూడిపోయిన మన సామాజిక చరిత్రను తవ్వి తీయడం మామూలు విషయం కాదు. అందుకు నిరంతర పరిశోధన కావాలి. వేల సంఖ్యలో ఉన్న మన శాసనాలు, నాణేలు ఈ పరిశోధనకు ఎంతవరకు ఉపకరిస్తాయి; వాటిని చదివి మీ తరహాలో ముందు తరాలకు అర్థం చెప్పగలవాళ్లు ఎంతమంది ఉంటారు?
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగువాళ్లలో చరిత్ర, సంస్కృతి పట్ల పరిశోధనాసక్తి బాగా తక్కువ. శాసనాలను చదివి అర్థం చేసుకోగలవాళ్లు మన దగ్గర నిజానికి వేళ్లమీద లెక్కపెట్టగల సంఖ్యలోనే ఉన్నారు. వీరి సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కృషి జరగాలి. చారిత్రక స్పృహ కోల్పోవడంవల్ల సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కొరవడుతోంది. దానివల్ల మన నిత్యజీవనం సంక్షోభంలో పడుతోంది. పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు వంటి ఆధునిక వ్యవస్థలు లేని రోజుల్లో సామాజిక క్రమశిక్షణ ఎలా సాధ్యపడింది? అబద్ధం చెప్పరాదు, దొంగతనం చేయరాదు, స్త్రీలను గౌరవించాలి వంటి అలిఖిత నిబంధనలను ఆ కాలంలో ప్రజలు తుచ తప్పకుండా పాటించేవారు. ‘తాంబూలం’ తీసుకుని ఒప్పందాలు ఖరారు చేసుకోవడం ఆనాటి పద్ధతి. వివాహాది శుభ కార్యాలు సహా భూ తగాదాల పరిష్కారం, క్రయ విక్రయాలన్నీ ‘ఆకు వక్క’ పుచ్చుకోవడంతోనే పూర్తయ్యేవి. పెద్దమనుషుల సమక్షంలో కుదిరిన ‘తాంబూలం కట్టుబాటు’ను అప్పట్లో ఉల్లంఘించినవారు దాదాపుగా లేరు. తాంబూలం తీసుకోవడమన్నది తెలుగువాళ్ల నమ్మికగా, సంస్కృతిగా శతాబ్దాలపాటు కొనసాగింది. వరంగల్‌ జిల్లాలోని కొండపర్తి శాసనంలో ‘తంబుల శ్రవంబు చేసిన భూమి’ (తాంబూలం స్వీకరించడం ద్వారా కొనుగోలు ఒప్పందం పూర్తయిన భూమి) అని స్పష్టంగా ప్రస్తావించారు. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని, నైతిక ఔన్నత్యాన్ని చాటిన ఇలాంటి శాసనాలను విస్మరించడమంటే... మన చరిత్రను మనం వదిలేసుకోవడమే! ఆ ఘన సంప్రదాయాలను విస్మరించాం కాబట్టే ఒకప్పుడు తాంబూలంతో పూర్తయిన విషయాలను ఇప్పుడు కోర్టులదాకా లాగి వాటి చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితిలో పడిపోయాం.
ప్రాచీన కాలంనుంచీ ప్రజల పలుకుబడిలోనే తెలుగు సజీవంగా ఉంటోందన్నది నిజం. అయితే భాషా పరిరక్షణకు అధికార స్థాయిలో కృషి జరిగిన దాఖలాలేవైనా మన చరిత్రలో ఉన్నాయా?
తెలుగు భాషను కాపాడేందుకు నిజానికి శాతవాహనులు, కాకతీయులు వంటి రాజవంశాలు పెద్దగా చేసిందేమీ లేదు. అధికారంలో ఉన్నవారి అండదండలతో కాకుండా జనసామాన్యానికి దగ్గరైన, వారి హృదయాలకు హత్తుకున్న భాషగానే తెలుగు శతాబ్దాలుగా మనగలుగుతోంది. పాలన భాషగా ప్రజల భాషను ప్రోత్సహించిన రాజులు బాగా తక్కువ. ఎంతటివారినైనా కట్టిపడేసే జీవ లక్షణం మన భాషకు ఉంది. కాబట్టే ఏ రాజులూ పనిగట్టుకుని ప్రోత్సహించకపోయినా అది ప్రవహిస్తోంది. అయితే రాజరాజ నరేంద్రుడు మాత్రమే తెలుగు భాషకు పట్టం కట్టేందుకు గట్టిగా పూనుకొని కృషిచేశారు. ఆ తర్వాత విజయనగర రాజులు తెలుగుకు మంచి ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు.
భాషా సంస్కృతుల చరిత్రను వెలికితీసే క్రమంలో ప్రాంతీయాభిమానాల వంటి రాగ విద్వేషాలు చొరపడితే చారిత్రక వాస్తవాల వక్రీకరణ జరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి?
భాష, సంస్కృతి, చరిత్ర పరిరక్షణలో తెలుగువాళ్లు మిగిలినవాళ్లతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నారు. సంస్కృతి, భాషల మీద మనదగ్గర పరిశోధన బాగా తక్కువ. తమిళ, బెంగాలీ, హిందీ, గుజరాతీ భాషల్లో ప్రథమశ్రేణికి చెందిన వందలాది పరిశోధకులు ఉన్నారు. వీరు తమ భాషా ప్రాంతాల రాజకీయ, సాంఘిక, సాహిత్య చరిత్రల మీద విశేష పరిశోధనలు చేశారు. వందల సంఖ్యలో ఉద్గ్రంథాలను రచించి, ప్రచురించారు. అందువల్ల ఆయా ప్రాంతాలను గురించి సమగ్ర పరిజ్ఞానం మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నవారికీ ఏర్పడింది. తెలుగు ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. మన చరిత్ర గురించి మనకే సరైన అవగాహన లేనప్పుడు... ఇక బయటివాళ్లకేం చెబుతాం? గతాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకుని, వర్తమానానికి అన్వయించి చెప్పగల చరిత్రకారులు, పరిశోధకులు అంతకంతకూ తగ్గిపోతున్నారు. నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటివారు హేతుబద్ధంగా, ప్రామాణికంగా చరిత్రను అధ్యయనం చేసి ఎన్నో సంక్లిష్టతల ముడివిప్పి మనముందు ఉంచారు. అలాంటి వారి వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. కల్నల్‌ మెకంజీ వంటివాళ్లు తెలుగు ప్రాంతాలన్నీ కలియదిరిగి వందల శాసనాలను వెలికితీశారు. తెలుగు చరిత్ర, భాషా ప్రాచీనతను ప్రపంచానికి చాటారు. ఆ మహానుభావులు పరచిన శాస్త్రీయ బాటలో ముందడుగు వేస్తే తప్ప మన చరిత్ర మనకు మిగలదు.
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల సహేతుక అవగాహనకు ఉపకరించే ఆధారాలను మనం ఎంతమేరకు పరిరక్షించుకోగలిగాం?
అమరావతి అపురూప శిల్పకశా సంపద ఇప్పటికే విదేశాలకు తరలిపోయింది. మన ఘన వారసత్వానికి అద్దంపట్టే ఎన్నో రుజువులను వదిలేసుకున్నాం. మద్రాసు మ్యూజియంలో మన తామ్రశాసనాలు రెండొందల వరకూ మూలుగుతున్నాయి. వాటిని తిరిగి తెచ్చుకోవాలన్న స్పృహే ఎవరికీ లేదు. మన జాతి భాషా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆ శాసనాలను తెలుగు నేలకు తరలించాలని మాలాంటి పరిశోధకులు కొంతమంది కోరుతున్నా ఏనాడూ ప్రభుత్వాలకు ఆ ఊసు పట్టలేదు. మన చరిత్రకు పూర్ణ రూపమిచ్చే క్రమంలో ఇలాంటి ఎన్నో ఆధారాలు సేకరించాల్సి ఉంది. మరీ ముఖ్యంగా మన దగ్గర ప్రాచీన భాండాగారాల్లో అత్యంత విలువైన చారిత్రక పత్రాలను, నాణేలను, శాసనాలను మ్యూజియంలోని ‘స్ట్రాంగ్‌ రూం’లో భద్రపరచి తాళమేస్తుంటారు. ఔత్సాహికులకుగానీ, పరిశోధకులకుగానీ వాటిని అందుబాటులో ఉంచరు. ప్రాచీన శాసనాలను లోతుగా అధ్యయనం చేసినకొద్దీ కొత్త కోణాలు బయటపడతాయి. భాషా సంస్కృతులకు సంబంధించిన నూతన కోణాలు వెలికివస్తుంటాయి. ప్రాచీన శాసనాలు, నాణేలను ఇలా ఎవరికంటా పడకుండా ‘స్ట్రాంగ్‌ రూం’లో తాళమేసి పెడితే, ఇక వాటి మీద తదుపరి అధ్యయనాలకు అవకాశం ఎక్కడుంటుంది? మ్యూజియాల్లో నిక్షిప్తమైన ఈ ప్రాచీన సంపద మీద పరిశోధన నిరంతరంగా కొనసాగాలి. అందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాచీన భాండాగారాల్లో నిక్షిప్తమైన పుస్తకాలను, శాసనాలు, నాణేలనూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంచుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాంతానికి సంబంధించిన శాసనాలు, నాణేలను ఆ ప్రాంతానికి తరలించి- ప్రత్యేకంగా భద్రపరచాలి. మన ప్రాచీన ప్రతీకలపట్ల సహేతుక అవగాహన కలిగినవారిని ఈ పనికి నియమించాలి.
స్థానిక చరిత్రలను సేకరించే క్రమంలో కల్నల్‌ మెకంజీ వంటివాళ్లు చేసిన కృషి ఎనలేనిది. అయితే ఊరికో కథ కింద పోగుబడిన ఈ కథలను సహేతుకంగా విడమరచి తెలుగువారి విశాల చరిత్రను నిర్మించేదెలా?
అసలు చరిత్ర గ్రామాల్లో, అక్కడి జీవన విధానంలోనే ఉంది. అజ్ఞాతంగా ఉన్న వీరి చరిత్రను అర్థం చేసుకోవాలంటే కైఫీయత్తు (స్థానిక చరిత్రలు)లన్నింటినీ ఉన్నవి ఉన్నట్లుగా ముద్రించాలి. పల్లెపట్టుల పలుకుబడిలో స్థిరపడిన ఈ చరిత్రల్లో కొన్ని అతిశయోక్తులు, ప్రక్షిప్తాలు సహజంగానే ఉంటాయి. వీటిని జల్లెడ పట్టాలి. ‘కైఫీయత్తులు’ చారిత్రక కాలక్రమణిక పట్ల స్థూలమైన అవగాహన కల్పిస్తాయి. ప్రక్షిప్తాలను పరిహరించి లోతైన, నికార్సయిన చరిత్రను ప్రజలముందు ఉంచే బాధ్యత పరిశోధకులది.
దేశంలో పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం వంటి వాటి గురించి విన్నాం. భాషా సంస్కృతుల పరిరక్షణకూ అలాంటి విప్లవం ఒకటి ప్రారంభం కావాల్సి ఉందంటారా?
శతాబ్దాల పరిణామక్రమంలో తెలుగు భాష, సంస్కృతి ప్రస్తుత రూపం సంతరించుకున్నాయి. భాషా సంస్కృతుల పూర్వ రూపాలను వేగంగా విస్మరిస్తుండటం తెలుగు జాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఇప్పటికే ఎంతో చరిత్రను కోల్పోయాం. ఎంత చరిత్రను కాలగర్భంలో కలిపేశామన్న అవగాహన కూడా మనవారికి లేదు. ఆ విషయం తెలియజెప్పే వారూ ఇప్పుడు మనముందు లేరు. మూలాలను పదిలంగా కాపాడుకుని ఆ పునాదుల మీద భవ్యమైన భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. కూచిపూడి భాగవతుల నాటకాలు ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వారు అప్పట్లో విస్తృతంగా ప్రదర్శించిన ప్రహ్లాద నాటకాలు, రుక్మాంగద వంటి వాటిని తరచి చూస్తే విస్మరించిన సాంస్కృతిక భాషా చరిత్ర కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ‘సురభి’ నాటకాలకు మళ్ళీ ప్రాణం పోయాలి. ఈ నాటకాలను రవీంద్ర భారతి వంటి చోట్ల కాకుండా జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో సామాన్య ప్రజలముందు ప్రదర్శించాలి. అప్పుడే తెలుగు భాషా సంస్కృతులు పునాది స్థాయిలో వికసించి, విస్తరిస్తాయి.


సత్యాన్వేషి 
నానా ఇక్కట్లూ అనుభవించి ఎవరో ఆధారాలు సేకరిస్తే, వాటి సాయంతో చరిత్ర రచనా పాండితీ గరిమను ప్రదర్శిస్తున్నవారు కొందరున్నారు. కానీ కాయకష్టం చేసి పంటవేసి, దాన్ని కోసి, ఆ ధాన్యంతో వంట కూడా చేసి, తెలుగువారికి కమ్మని భోజనం వడ్డించిన కౌశలం పీబీ శాస్త్రి సొంతం! బురదలోకి దిగి రాతి శకలాలను వెలికితీసి, వాటి మరకల్ని కడిగిపోసి- రాతి పలకలమీద చెక్కిన అక్షరాల్లో నిక్షిప్తమైన జాతి ఆత్మగౌరవ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పారాయన.


చరిత్ర దారితప్పుతున్న దశలో సంకుచిత దృష్టికి, రాగద్వేషాలకు ఆమడదూరంలో సవ్యమైన శాస్త్రీయ పద్ధతులతో పీబీ శాస్త్రి సత్యాన్వేషణ చేశారు. సుమారు వెయ్యికిపైగా శిలా, తామ్ర శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చారాయన. చరిత్ర, నాణేలు, శాసనాల మీద వందకుపైగా పరిశోధన పత్రాలు సమర్పించిన పీబీ శాస్త్రి- 18 గ్రంథాలనూ రచించారు.


పీబీ శాస్త్రి ఆరున్నర దశాబ్దాల పురావస్తు పరిశోధనా ముక్తాఫలాల్లో శాతవాహనుల నిజ అస్తిత్వ నిర్ధారణ కీలకం. శాతవాహనులు మహారాష్ట్రీయులని, కన్నడిగులని భిన్నాభిప్రాయాలతో చరిత్రకారులు సతమతమవుతున్న తరుణంలో సత్యాన్ని ఆవిష్కరించారాయన. కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన నాణేలను ఆసాంతం అధ్యయనం చేసి శాతవాహన చక్రవర్తులు తెలుగువారు అని, వారి తొలి రాజధాని కోటిలింగాల అని తొలిసారిగా శాస్త్రీయ నిర్ధారణ చేశారు. పీబీ శాస్త్రి జనవరి 10, 1922న గుంటూరు జిల్లా పెదకొండూరులో జన్మించారు. 1981లో ఎపిగ్రఫి శాఖలో ఉపసంచాలకులుగా పదవీవిరమణ చేశారు.  


సాక్ష్యం లేని సత్యం చెల్లదు. చరిత్రకు కావాల్సింది రుజువులు. ‘రుజు’మార్గమే జీవితంగా మార్చుకున్న పరబ్రహ్మశాస్త్రి- హైదరాబాదులోని చైతన్యపురిలో లభ్యమైన క్రీ.శ. నాలుగో శతాబ్ది నాటి ప్రాకృత శాసనాన్ని పరిశీలించి, పరిష్కరించి విష్ణుకుండినుల ప్రాభవ విస్తరణ మూలాలను లోకానికి చాటిచెప్పారు. ప్రకాశం జిల్లాలోని బబ్బేపల్లి రాగి రేకు శాసనాల ద్వారా తొలి పల్లవుల వంశవృక్షాన్ని పునర్నిర్మించి స్థిరీకరించిన ఘనతా పీబీవారి సొంతం!


తెలుగు నేల నలుచెరగులా ఎక్కడ శాసనం దొరికితే అక్కడికి రెక్కలు కట్టుకు వాలిపోయిన పరబ్రహ్మశాస్త్రి మొత్తంగా 2000 శాసనాలను ఆమూలాగ్రం చదివారు. రాతి పలకల్లో నిక్షిప్తమైన ఆనాటి తెలుగు జాతి గ్రామీణ జీవితాన్ని విశ్లేషిస్తూ ‘ప్రాచీనాంధ్ర గ్రామీణ జీవనం’ పుస్తకం రాసి, సామాజిక శాస్త్రకారుడిగా పేరెన్నికగన్నారు.


సత్యాన్వేషణే జీవితంగా, తర్కానికి కట్టుబాటు చాటినవారంతా మేధావులే! తెలుగువారి అస్తిత్వ వికాసాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆద్యంతమూ సహేతుకకు కట్టుబడిన పరబ్రహ్మ శాస్త్రి... మేధావుల్లో అగ్రగణ్యులు. ఖమ్మం జిల్లా బయ్యారం చెరువులో లభ్యమైన శాసనం ఆలంబనగా ఆయన ఏకంగా కాకతీయుల వంశవృక్షాన్నే పునర్లిఖించారు. నల్లగొండ జిల్లాలోని చందుపట్ల శాసనం సాయంతో రాణి రుద్రమదేవి క్రీ.శ.1290లో చనిపోయారని తేల్చడంతోపాటు, ‘రాయగజకేసరి’ బిరుదు సైతం ఆ వీరనారీమణిదేదని స్పష్టం చేశారు. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి