తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

జాతీయ భావాల జాతి క‌వి

  • 181 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। వోలేటి పార్వతీశం

  • విశ్రాంత కార్యనిర్వహణ అధికారి దూరదర్శన్,
  • హైదరాబాదు.
  • 9440031213

తెలుగువాళ్లంతా ఆనాడు గర్వపడేలా, ఆస్థానకవిగా అటు ప్రభుత్వ, ఇటు ప్రజల గౌరవాలందుకున్న మహాకవి దాశరథి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆ గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, ఆయన పేరిట ఓ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాన్ని డాక్టర్‌ బాపురెడ్డికి బహూకరించింది. ఆయనలోని సాహితీమూర్తికి ప్రభుత్వ పక్షాన ఇదో సమున్నత గుర్తింపు. ఐఏఎస్‌ అధికారిగా అనేక ముఖ్యపదవులు నిర్వహించిన బాపురెడ్డిని సాహిత్యాభిమానులకు చేరువచేసింది ఆయన రచనలే.  
అన్నీ మన
కళ్ల ముందర ఉండేవే. అందరమూ చూస్తూ ఉండేవే. అయితే, చాలామంది ఒకేలా చూసేవాటిని, కొంతమంది మరోలా చూస్తారు. ఇలా, మరోలా చూసే విద్య పట్టుబడితే, బహుశా అతడు కవి అవుతాడు. విషయాన్ని విశేషంగా చెప్పేవాడు, వివరాల్ని ఆసక్తికరంగా ఆవిష్కరించేవాడు కవికాక, మరేమవుతాడు? ప్రకృతి అంటే పరమాత్మ స్వరూపమని, అది ఆయన ప్రసాదమేననే భావన మనకి కొత్తదేం కాదు. ఇక్కడ మనం చూసే కొండా, నదీ, పురుగూ, పుట్రా, వెలుగు- చీకటి, పువ్వు- నవ్వు.. అన్నీ ఆయన సృజించినవే అనే విశ్వాసం ఈ లోకంలో బలంగా ఉన్నదే. ప్రకృతిని, పరమాత్మను అవిభాజ్యంగా చూసే మనకి, ఇంకొకరెవరైనా, కొంచెం కొత్తగా చూపిస్తే... ‘‘పూల విలువను తెలిసిన పూర్ణ స్త్రీ సత్యభామ/ పరమాత్మను కాలదన్ని పారిజాతాలను వరించింది’’ అని! ఈ రెండు పంక్తులు చదవగానే ఒళ్లు ఝల్లుమనిపిస్తుంది. మనమెందుకు ఇలా అనలేకపోయాం అనిపిస్తుంది. అలా అన్నారు కాబట్టే, అందరిలోంచి వేరుపడి ఆయన కవి అయ్యారు. ఆ కవి పేరు డాక్టర్‌ జె.బాపురెడ్డి.
      ప్రాచీన పునాదుల మీద అర్వాచీనమనే సౌధంగా తనను తాను నిర్మించుకున్న సారస్వత శ్రామికుడు బాపురెడ్డి. ఆయనకు పద్యం కైవశమైంది. గేయం లోబడిపోయింది. వచనం కరతలామలకమయ్యింది. వ్యాసం అభ్యాసమైంది. కాబట్టే చేపట్టిన ప్రతి ప్రక్రియకూ రాణింపు తేగలిగారు బాపురెడ్డి. కాలం మారుతున్న కొద్దీ, అభిరుచులు మారిపోతాయి. తదనుగుణంగా కొన్ని ప్రక్రియలు కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. అలాంటి ఓ సందర్భాన్ని ఆయన గమనించి ‘పద్యానికి ప్రమాదం లేదు’ అని ప్రకటించారు. ఒకానొక సన్నివేశాన్ని ఆ ప్రకటనకు బలమిచ్చే రీతిలో మలచుకున్నారు.
పద్యపు కాలు చేతులను పాశవికమ్ముగ త్రుంచినట్టి, ద్వే
షోద్యమ కర్తలందరు, మహోజ్జ్వల ఛందము, విందుసేయు, స
విద్యను తూలనాడి, వెలసిన దుర్మతులందరిప్డు, నీ
పద్య సరస్వతీ చరణ పద్మములంగని మోకరిల్లరే

      పద్యం కాళ్లు విరవాలనే ఉన్మాదస్థితిని, ఆ పద్యం పాదాలు పట్టుకునే సమున్నత స్థితికి చేర్చడమే బాపురెడ్డి ప్రతిభా వైదుష్యం. విశ్వనాథ సంన్తుతిని, పద్యాన్ని ఏకసూత్రంగా ముడివేసి, జెండా ఎగరేసినట్టుగా, పద్యగౌరవాన్ని ఎగరేశారు ఆయన. మరో సందర్భంలో అఖిల భారతావనికి ఒకే ఒక్క విశ్వకవి రవీంద్రుడు. ఆ కవీంద్రుని సన్నుతి చేస్తూ ‘‘శీతాద్రివై నీవు గీతాంజలి ఘటించి/ ప్రకృతిలో లీనమై పాడునపుడు,/ విశ్వభారతి వాణి వినిపించెనొక క్రొత్త/ శ్రుతి, నవజీవన రుతి; రవీంద్ర’’ అన్నారు. విశ్వసాహితీ వేదిక మీద ప్రకాశించిన భారత భారతి రవీంద్రుడు. అందుకే ‘శీతాద్రి’గా ఆయన్ను సంభావించడం చాలా ఔచితీమంతంగా ఉంది. అంతేనా, ప్రకృతిలో లీనమైపోయి ఆ విశ్వకవి గీతాంజలి ఆలపిస్తూ ఉంటే, అది కొత్త శ్రుతిలో నినదించడం, కొంగొత్త జీవన రుతిగా వినిపించడం బాపురే! అనిపిస్తుంది. శ్రుతిని, రుతిని అనుసంధించడం భాష మీద బాపురెడ్డికి సాధికారతను సూచిస్తుంది.
కవిత్వమంటే ఇది
పద్యం సంగతి అలా ఉంచితే, పరిపూర్ణ మానవుడి గురించి ఆయన ఓ పాట రాశారు. ‘‘పరిపూర్ణ మానవుడే పరమేశ్వరుడు శివకేశవుడు’’ ఈ పల్లవి సామాన్యంగా వినిపిస్తుంది. అయితే చరణంలోనికి ప్రవేశించేటప్పటికి ఈ సామాన్యత్వం, ధీమాన్యతగా విస్తరించి ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘‘తనువు లేనివాడే/ తనువులోని వాడు/ పేరు లేని వాడే/ ప్రతి పేరులోనివాడు’’... పరిపూర్ణత్వానికి ఇక్కడ మకుటం పెట్టినట్లయింది. నిజానికి పాటకు పల్లవి ప్రాణమనేది నానుడి. అయితే దీనికి భిన్నంగా ప్రాణాన్ని చరణంలోకి విస్తరింపచేశారు బాపురెడ్డి.
      ‘‘అంత్యప్రాసల కోసం/ అరిచే అజీర్ణ కవిత/ అనుభూతికి తావులేని/ అక్షరాల మూట కవిత/ కాదని, రసధునీ కవిత వ్రాస్తున్నాను; కథ పోతే పోయెగాని/ కల్పన పోయిన కవిత/ ఆలోచన పోతే పోయె/ అర్థం పోయిన కవిత/ కాదని, రసధునీ కవిత వ్రాస్తున్నాను’’- అంత్యప్రాసల కోసం కవులు కసరత్తులు చేస్తున్న తరుణంలో ఏది కవిత కాదో, కాలేదో తెలియచెప్పేలా పాట రాశారు. కొత్తగా రాస్తున్న వాళ్లకి కవిత్వం ఎలా ఉండాలో జిజ్ఞాస కలిగించే దారి దీపంలా ఉంటుందీ పాట. 
మామూలు మాటలతోనే...
బాపురెడ్డి వచన కవిగా కూడా సారస్వత లోకంలో ఓ సమున్నత స్థానాన్నే నమోదు చేశారు. వస్తువును ఎంపిక చేసుకోవడంలో, ఆ కవితను నిర్వహించడంలో,  పదబంధాలను ప్రయోగించడంలో, అన్నింటికీ మించి కవిత, పాఠకుడి హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించడంలో బాపురెడ్డి అనేక ప్రత్యేకతలు ప్రదర్శించారు. ‘‘మట్టిని చెట్టు చేస్తుంది కాలం/ చెట్టును మట్టి చేస్తుంది కాలం/ శూన్యంలో నుంచి అన్నీ సృష్టిస్తుంది/ శూన్యంలోనికి అన్నిటినీ నెట్టేస్తుంది’’... మామూలు మాటలు వాడుతూనే, ఈ ప్రకృతి తత్త్వ మూలాలను దర్శింపచేయడం అందరూ చేయగలిగింది కాదు. ఒకటీ, రెండూ మాటల్నే అటూ, ఇటూగా తిప్పుతూ అనల్పార్థ ప్రకటితంగా పాట రాయడం ఆత్రేయ నేర్చిన విద్య. సమాంతరంగా వచనంలో కూడా, బాపురెడ్డి అలాంటి ప్రతిభ ప్రదర్శించారు. భాష, భావం ఈ రెండూ సమతూకంగా ఉన్నప్పుడే, కవిత మిసమిసలాడుతుందనే భావం సంపూర్ణంగా కలిగిన కవి ఆయన.
      ‘‘గాడిద మీద మూటలు మోయించినట్లు/ కవితతో మాటలు మోయించకు/ బాల పల్లవ వాగ్దేవితో/ బస్కీలు తీయించకు, కుస్తీలు పట్టించకు’’... ఈ పంక్తులు చదివినప్పుడు, సృజన శీలంగానూ, సూచన ప్రాయంగానూ, కాస్తంత దిశానిర్దేశం చేసినట్లనిపిస్తుంది. భావచిత్రాల పేరుతో, భావస్ఫోరకమైన, రసరమ్యమైన పంక్తులతో కొన్ని లఘు కవితలు అల్లారు. పాట ధర్మం తెలిసిన బాపురెడ్డి, అస్తవ్యస్తంగా ప్రవహిస్తున్న పాటల పల్లవులను గమనించి ‘‘పల్లవి భారం మోయలేక/ పాట కూలిపోతుంది/ కూలే పాటల నెత్తలేక/ గొంతు మూగబోతుంది’’ అన్నారు. అప్పుడెప్పుడో కృష్ణశాస్త్రి అన్నారు ‘పాట పక్షి వంటిది’ అని. అందుకే అది లలితంగా ఉండాలి. హాయిగా విహంగంలా ఎగిరిపోవాలి. అలా లేని పక్షాన్ని ‘పాట కూలిపోతుంది’ అన్న మాటతో వర్తమాన స్థితిని, కరుణార్ద్రంగా మార్చి, మన కళ్లముందు నిలబెట్టేశారు బాపురెడ్డి.
పిల్లలకోసం ప్రత్యేకంగా...
బాల సాహిత్యం కూడా ఓ ప్రత్యేక శాఖ. పిల్లలకోసం రాయడం, అదెంతపని? అనుకుంటారు. కానీ పిల్లలకోసం రాయడమే మరింత కష్టం. బాపురెడ్డి అనే కవికోకిల, ఈ శాఖ మీద నుంచి కూడా బాలవాణి పలికించింది. ‘‘బాల్యం ఒక మర్రి మొలక/ మహా వృక్షమందులోన/ ముడుచుకుని వున్నది’’... బీజంలోనే, భూజముంటుందనే సృష్టి నైజాన్ని, బాల్యానికి అనుసంధిస్తూ, ఎంత  రమ్యంగా అన్నారో. పిల్లలకు చెప్పే  పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లకు అర్థమయ్యే మాటల్ని వాళ్ల మనసులకి హత్తుకునే అంశాల్ని ఎత్తుకోవాలి. బాల్యంలో ఉండే  మనఃస్థితికి కవి చేరాలి. చెట్టును గురించి పిల్లలకి చెబుతూ, బాపురెడ్డి అన్న పంక్తులు ఇవి... ‘‘చెట్టే పూలకు మేడరా/ చెట్టే పక్షికి గూడురా/ చెట్టే అన్నం పెట్టేది/ చెట్టే ఇంటిని నిలబెట్టేది’’.
      చిన్నపిల్లవాడి మనఃస్థితికి ఇంతగా ఒదిగిపోయి, చెట్టు గురించి ఆ వయసు వాళ్లకు హత్తుకునేలా చెప్పడం అంత సులువేం కాదు. చెట్టును పూల మేడగా సంభావించడం, ఒక వంక, చిన్నారుల ముందు వర్ణచిత్రాన్ని నిలబెడుతుంది. మరొక వంక, భావుకులైన ఇతర పాఠకుల మనసుల్ని రసప్లావితం చేస్తుంది. ఒకే ఒక్క ప్రయోగంతో, ఇటు పిన్నలనీ, అటు పెద్దలనీ, తన భావనామిల సూత్రంతో, ఒక్కచోట బంధించారు. అలాగే పిల్లలకి ప్రేమతత్త్వాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ‘‘ప్రేమతత్త్వమేమొ చందమామ వంటిది/ పెరుగుతుంటె రోజురోజు/ పెరుగుతుంటది/ కరుగుతుంటె తరిగి తరిగి కరిగిపోతది’’ అంటారు. చందమామ లక్షణాన్ని ప్రేమతత్త్వం మీద ఆపాదించిన వైనం పసివాళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. బహుళ అంతస్థుల భవనాల్లోపడి, ఇవాళ పిల్లలకు ఆకాశమూ, చందమామ బొత్తిగా తెలీదేమో! కానీ, కాస్తో కూస్తో చందమామ తెలిసిన  వాళ్లకో, పున్నమి వైపు, అమావాస్య వైపు అతడి పరుగులు గుర్తుకొచ్చి,  ప్రేమతత్త్వపు సూక్ష్మమేంటో బోధపడిపోతుంది.
వ్యాసాల్లో విస్పష్టంగా...
వ్యాసరచన కూడా బాపురెడ్డి రచనల్లో వన్నెకెక్కిన ప్రక్రియ. ఎన్నెన్నో అంశాలపైన ఆలోచనాత్మకమైన వ్యాసాలు రాశారు. ముఖ్యంగా తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం భారతావని సంస్కృతిలో మూల సూత్రం. సమైక్యతా భావావిష్కరణం, ప్రతి పౌరుని బాధ్యత. సమైక్యతను పెంచి పోషించడానికి, తెలుగు సాహిత్యమూ, కవులూ, విస్తృతమైన సేవచేశారన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. జాతీయ సమైక్యతాసాధనకు సంబంధించి, తెలుగు భాష నిర్వహించిన పాత్ర గురించి ఒక వ్యాసంలో ఇలా చెప్పారు... 
      ‘‘భారతీయుల మధ్య అనుబంధం పెంపొందించడం విషయంలో తెలుగు భాషా, సాహిత్యాలు, ప్రశంసనీయమైన పాత్ర వహించాయి. ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోవడంలో జాతీయభావాలను ప్రసారం చేయడంలో, ప్రజల హృదయాలలో దేశభక్తిని ఉద్దీపింపచేయడంలో తెలుగువారు చేసిన కృషి, ఎవరికీ తీసిపోదు. ఇందుకు ప్రబలమైన చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి. రాజారామ్మోహనరాయ్, వివేకానంద, రవీంద్రనాధ్‌ టాగోర్, అరవిందులు, మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ వంటి మహనీయుల సందేశాలను తెలుగువారికి చక్కటి సాహిత్య ప్రక్రియల ద్వారా అందించిన కీర్తి తెలుగు భాష దక్కించుకున్నది’’
భాషా ప్రతిబంధకాలను దాటి, భావ పరివ్యాపనలో తెలుగు సాహిత్యం చేసిన ప్రయత్నం గణనీయమని ఆయన ప్రశంసించారు. మరొక సందర్భంలో సాహిత్యకారునిగా తన మార్గమేమిటో ఆయన సుస్పష్టం చేశారు. సర్వసమత సత్యవాదం నాది. సాహిత్య సామ్యవాదం నాది. హేతువాద నినాదాలను, ఇతర శాస్త్రాలకు వదిలేసి, హృదయవాద నాదాలను కదిలించాలనే సంకల్పం నాది. ప్రభాదృష్టి నాది. ప్రగతి దృష్టి నాది అని తన మూర్తిమత్వాన్ని తానే ప్రకటించారు.
      మొత్తంమీద బాపురెడ్డిలోని సారస్వతాంశను సాకల్యంగా అవలోకిస్తే, ప్రక్రియ ఏది చేపట్టినా, సమాజ హితమే ప్రధానంగా కోరుకున్నట్టు అర్థమవుతుంది. అందుకు తన సాహిత్యాన్ని ఉపకరణంగా వాడుకున్నట్టు బోధపడుతుంది. కర్ణపేయమైన పదబంధాలను కల్పన చేయడంలో బాపురెడ్డి కలం అగ్రగణ్య. అంతర్జాతీయ కవి అని పేరు తెచ్చుకున్న బాపురెడ్డి, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కవి కూటమి ఏర్పడినప్పుడు, తెలుగు గొంతును, భారతీయ ఆత్మను వినిపించిన మాన్యకవి.
      జీవనది ఏదైనా సరే, సముద్రంలో కలసిన తర్వాత, తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. దీనికి కొంత భిన్నంగా ప్రపంచమంతా నిండిన మానవకోటిలో, సాటిమానవుడిగా సంచరిస్తున్నా, భారతీయుడిగా తన అస్థిత్వాన్ని కోల్పోకూడదన్న తపన ఆయనలో ప్రగాఢంగా కనిపిస్తుంది. అందుకే అనిపిస్తుంది ‘జాతీయ భావాల జాతికవి’ బాపురెడ్డి అని.


సాహితీ తపస్వి
కరీంనగర్‌ జిల్లా సిరికొండలో జులై 21, 1936న జన్మించారు బాపురెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మే చేశారు. మెదక్, వరంగల్లు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత కాలంలో ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పనిచేశారు. మొదటి తెలుగు ప్రపంచ మహాసభలకు కార్యదర్శిగా వ్యవహరించారు. ‘పొయెట్రీ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ జీవితకాల సభ్యులు. వివిధ సాహితీ సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘చైతన్యరేఖలు, శ్రీకర శిఖరం, అనంత సత్యాలు, ప్రేమారామం, రంగురంగుల చీకట్లు, సాహితీ వైవిధ్యం, బాలహేల’... ఇలా ముప్ఫయికి పైగా పుస్తకాలను వెలువరించారు. ‘బాపురెడ్డి గేయ నాటికలు’ మైసూరు విశ్వవిద్యాలయ పాఠ్యపుస్తకం. 36 దేశాల్లో పర్యటించిన బాపురెడ్డి, ఆంగ్లంలోనూ విరివిగా రచనలు చేశారు. ‘గాడ్‌ ఇన్‌ మ్యాన్‌’ అనే ఆయన రచన రాజస్తాన్‌లో పదకొండో తరగతి పాఠ్యాంశం. ఆయన రచనలు జర్మన్, స్పానిష్, రొమేనియన్, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టిస్తూనే... ఆంగ్లం, భారతీయ భాషల్లోంచి తెలుగులోకి అనువాదాలు చేశారు బాపురెడ్డి. ‘వ్యవధి లేదు, ప్రకృతిలో పవిత్రత, విశాల భారతి’ తదితరాలు అనువాదంలో ఆయన కృషికి అద్దంపడతాయి. అలాగే ‘భావిజీవులు, సాగరసౌథం’ తదితర ఆయన రూపకాలు దూరదర్శన్‌లో ప్రదర్శితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలతో సహా బాపురెడ్డి అనేక గౌరవాలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ సాహితీ సభల్లో పాల్గొన్నారు. ‘బాపురెడ్డి కవితా దృక్పథం’ మీద పరిశోధన చేసిన సీహెచ్‌ మల్లికార్జునాచారి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. 


మంచిని ప్రబోధించేదే సాహిత్యం
దాశరథి పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇవి యువ రచయితలకు స్ఫూర్తినిస్తాయి. దాశరథి అంటే సాధారణ కవి కాదు. దేశభక్తి పూరితమైన రచనలతో నాటి యువతను ఉత్తేజం నింపిన కవి. నిజాం రాజ్యంలోని అమానుష పరిస్థితులకు వ్యతిరేకంగా గొంతెత్తిపాడారు. రాజకీయ పరిస్థితుల మీద స్పందిస్తూనే గొప్ప సాహితీవిలువలతో కూడిన రచనలు చేశారు. కొత్తదనంతో కూడిన సందేశాత్మక కవిత్వాన్ని సృష్టించారు. ఆయన పేరిట పురస్కారాన్ని ఏర్పాటుచేయడం ఆనందదాయకం. మా నాన్నగారికి సాహితీదృష్టి ఉంది. ఆయన ద్వారా నాలో ఆ ఆసక్తి పెరిగింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అది ఇనుమడించింది. ఆర్థిక, రాజనీతిశాస్త్రాలను చదువుకున్నా, తెలుగు భాషాసాహిత్యాలకు దూరం కాలేదు. నాకు నేనుగా, ఓ కవిగా ఉంటూనే నా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాను. సాహిత్యంతో నాకున్న అనుబంధం నా విధినిర్వహణలో బాగా ఉపయోగపడింది. ప్రజలతో సన్నిహితంగా మెలగడం, మానవీయ కోణంలో నిస్వార్థంగా విధులు నిర్వర్తించడానికి స్ఫూర్తినిచ్చింది. మన దేశానికి, సమాజానికి అవసరమైన విలువలు, ఆదర్శాలను చెప్పడానికి సాహిత్యం ఉపకరిస్తుంది. రామాయణ మహాభారతాల నుంచి ప్రబంధాల వరకూ అన్నిచోట్లా మన పూర్వకవులు అలాంటి సందేశాత్మకమైన సాహిత్యాన్నే సృజించారు. నేనూ అలాంటి నిర్మాణాత్మకమైన దృష్టితోనే రచనలు చేశాను. మనుషుల పట్ల ప్రేమాభిమానాలు పెంచే, మానవత్వాన్ని ప్రబోధించే విషయాలనే రాశాను. కవి, రచయిత ఎవరైనా సరే, అందరికీ మంచి చేసేదే చెప్పాలి. అన్ని కళలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. మన తెలుగు గొప్ప భాష. విదేశీ భాషలో రాణించాలంటే మన భాషను వదులుకోవాలనుకోవడం తప్పు. మనలో జీర్ణించుకుపోయిన మాతృభాష సాయంతోనే మరో భాషను సులువుగా నేర్చుకోగలం. నేను అలాగే ఆంగ్లం నేర్చుకున్నాను. అందులో రచనలూ చేశాను. ఉద్యోగ జీవితంలో కూడా ఆంగ్లం అవసరమైన చోట మాత్రమే అందులో మాట్లాడాను అంతే! రోజువారీ వ్యవహారాలకు తెలుగునే వినియోగించాను. 

- డాక్టర్‌ జె.బాపురెడ్డి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం