తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

గీత సంగీతం

  • 389 Views
  • 8Likes
  • Like
  • Article Share

    గుడిమెళ్ల మాధురి

  • mathureekrishna@gmail.com

పాట విన్నప్పుడు, కీర్తనని ఆస్వాదించినప్పుడు మన మనసులో మెదిలే భావనలను బొమ్మలో చూపిస్తే... ఆ గానం చిత్రంతో కలిస్తే అది ‘చిత్రగానం’. నాలుగు నిమిషాల్లో పూర్తయ్యే పాట పరమార్థాన్ని శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా అప్పటికప్పుడు బొమ్మ వేయగలగడం అపురూపమైన విషయం. తెలుగునాట ఈ కళను వ్యాప్తిలోకి తెచ్చిన చిత్రకారుడు కూచి సాయిశంకర్‌. తన చిత్రకళా ప్రస్థానం గురించి ‘తెలుగు వెలుగు’తో ఆయన పంచుకున్న అనుభూతులివి... 
మాది
అమలాపురం. 1973 జులై 13న పుట్టాన్నేను. మా కుటుంబం సంగీత, సాహిత్య ప్రపంచం. అమ్మానాన్నలు వర్ధనమ్మ, వీరభద్రశర్మ. నాన్న హరికథకులు, సంస్కృత పండితులు. మా ఇలవేల్పు శివుడు. దాంతో నాన్న రోజూ ‘నాద తనుమనిశం’ అన్న త్యాగరాయ కీర్తన పాడేవారు. నాకు ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు. నాన్న మా చిన్నప్పటినుంచే ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్య అంశాల్ని కథలుగా చెప్పేవారు. అలా సంగీత సాహిత్యాలతో నాకు పరిచయం మొదలైంది. మా అన్నయ్యలతో కలిసి సైకిల్‌ మీద మా అమ్మమ్మ వాళ్లూరు వానపల్లి, నాన్న సొంతూరు అయినాపురం వెళ్లేవాణ్ని. ఆ ఊళ్లలో గోదావరి నది, చెట్లు, పక్షులు, నీలకాశం, వాన, వెన్నెల పదేపదే చూసి పరవశించి పోయేవాణ్ని. నా చిత్రాలకు నేపథ్యం ఈ దృశ్యాలే. 
      చిత్రకళ విషయానికి వస్తే, అమలాపురం మున్సిపల్‌ పాఠశాలలో ఏడో తరగతి నుంచే నా ప్రస్థానం మొదలైంది. గోదారిగట్టు, జనం పడవలు దిగి కూరగాయలు కొనుక్కుని వెళ్లడం చూసి, ఇంటికి రాగానే వాటిని కాగితం మీద దించేసేవాణ్ని. అలా అవుట్‌డోర్‌ స్కెచింగ్‌ అలవాటైంది. చిత్రకారుడికి వెన్నెముక స్కెచింగే. తొమ్మిదిలో ఉన్నప్పుడు మా మూడో అన్నయ్య నాతో నోరి నరసింహశాస్త్రి రాసిన ‘నారాయణభట్టు’ చదివించాడు. అప్పటినుంచి సాహిత్యమంటే ఇష్టం పెరిగింది. తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ నాకు భగవద్గీతతో సమానం. చిత్రకళతో పాటు కవిత్వమన్నా ఇష్టమే. నేను కవిని కూడా. అమలాపురంలోనే ఎస్కేబీఆర్‌ కళాశాలలో ఇంటర్లో ఉన్నప్పుడు నన్నయ్య సహస్రాబ్ది ఉత్సవాలు జరిగాయి. అప్పుడు వేసిన చిత్రాలు నాకింకా గుర్తే.
బొమ్మలు గీయడమే దినచర్య
శకుంతల, సరస్వతి తదితర చిత్రాల ద్వారా రవివర్మ, ‘చందమామ’ ద్వారా వడ్డాది పాపయ్య అంటే చిన్నతనంలోనే అభిమానం ఏర్పడింది. నిజం చెప్పాలంటే అలా చూస్తూనే వాళ్ల కళని చదివాను. అంతేగానీ చిత్రకళకు ప్రత్యేకంగా గురువులు లేరు. అయితే, మనం ఏ పనిచేసినా పెద్దవాళ్ల మార్గదర్శనం అవసరం. ఇంటరైపోయాక ఓ సారి చెన్నై వెళ్లాను. అప్పుడు సినీ సంగీత రంగంలో ఉన్న మా దీక్షిత్‌ అన్నయ్య బాపుగారికి ‘మీ భక్తుడు’ అంటూ నన్ను పరిచయం చేశాడు. ఫైనార్ట్స్‌ చదవాలనుకుంటున్నట్టు చెప్పాడు. నా బొమ్మలు చూసి బాపుగారు ‘నీకు కోర్స్‌ చేయడం అవసరమా?’ అన్నారు. మొత్తానికి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఫైనార్ట్స్‌లో పట్టా అందుకున్నాను. అక్కడే మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఎరుకలసాని బొమ్మ వేసి జానపద చిత్రకళలో అఖిలభారత స్థాయిలో బంగారు పతకం గెలుచుకున్నాను. భోపాల్‌ విషవాయువు ప్రమాదం మీద వేసిన లితోగ్రఫీ (చెక్కమీద చేసినపని) నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
      విశాఖలో ఉన్న ఆ నాలుగేళ్లూ రోజూ సాయంత్రం ఆర్కే బీచ్‌కెళ్లేవాణ్ని. వేయడమేగానీ తుడపడం అలవాటు లేకపోవడంతో ప్రతిరోజూ ఎన్ని పేజీలు స్కెచ్‌ వేసేవాణ్నో తెలిసేదే కాదు. అలాగే ఏదైనా కచేరీకి వెళ్లినప్పుడు అక్కడ కూడా బొమ్మలు వేసేవాణ్ని. గదికి వెళ్లాక వాటిలో మంచివి ఎంచడం, రాత్రి పన్నెండు గంటలలోపు వాటికి రంగులేయడం, పొద్దున్నే మా ప్రొఫెసర్లకు చూపించడం... ఇదంతా అదనంగా చేసిన పనే... ఇదీ నా దినచర్య. ఆ అనుభవమే నాకు పాటలకు చిత్రాలు వేయడానికి పునాదిగా నిలిచింది. అంటే నాకు స్ఫూర్తినిచ్చింది కోనసీమైతే... విశాఖ ఎదుగుదలనిచ్చింది.
పుస్తకాలతోనే మెరుగులు
మాది మధ్యతరగతి, అందులోనూ పెద్ద కుటుంబం. కనుక నా దగ్గర ఉన్నదాంట్లో కాగితాలు, రంగులు కొన్నాకే మిగతా అవసరాలు తీర్చుకునేవాణ్ని. ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో నన్నయ, శ్రీనాథుడు, అల్లసాని తదితర కవుల సాహిత్యాన్ని బాగా చదివాను. అంతేకాదు వాటిలోని ఆయా ఘట్టాలకు కవులతో సహా బొమ్మలు వేశాను. ఇంకా వివేకానంద, రమణ మహర్షి వ్యాసాలు, యోగశాస్త్రం, భగవద్గీతల మీద కూడా చిత్రాలు గీశాను. అయితే నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మాత్రం ప్రకృతి మీద గీసిన మోడ్రన్‌ ఆర్ట్‌. ప్రాచీన సాహిత్యంలోని ఓ ప్రేమకథ స్ఫూర్తితో లవ్‌ సిరీస్‌ చిత్రాలు గీశాను. చాలా క్లే మోడల్స్‌ తీర్చాను.
      పుస్తకాల నుంచి ఇంకా చాలా నేర్చుకున్నాను. సప్తస్వరాల వర్ణన అమరకోశం నుంచి గ్రహించాను. వేద పురుషుల వర్ణనకు సంబంధించిన పుస్తకం కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో దొరికింది. శిల్పశాస్త్రంలో వివరించిన పురాతన వాద్యాలకు ప్రతిరూపాలు గీశాను. దేవాలయాలకు తగిలే దిష్టి పోవడానికి రకరకాల జంతువులను కలిపి శిల్పాలు చెక్కుతారు. దాన్ని కూడా చిత్రలేఖనంలోకి తీసుకున్నాను. శిల్పశాస్త్రంలోని ఆంత్రపోమార్ఫిక్‌ ప్రకియనూ సొంతం చేసుకున్నాను. వాత్సాయన కామసూత్రాల ఆధారంగా 64 కళల గురించి తెలుసుకున్నాను. నా చిత్రాల్లో భారతీయ ఆత్మను ఆవిష్కరించడానికి తాపత్రయపడతాను. భారతీయతలోని ‘ప్రకృతీ పురుషులు’ ప్రధానాంశంగా అధివాస్తవిక చిత్రాలు గీయడం నా ఆశయం. 
      సంగీతం, నృత్యం, శిల్పకళ, కవిత్వం, చిత్రకళ ఆస్థానకళలు. చిత్రకళ మిగతా అన్నిటి సమాహారం. సాహిత్యాన్ని సాహితీవేత్తలు చూసే కోణం ఒకటి. సంగీత విద్వాంసులు గమనించేది మరొకటి. చిత్రకారులు గ్రహించేది ఇంకోటి. సాహిత్యాన్ని ఒక కవి వివరించినా నా బొమ్మకి ‘విజన్‌’ నాదే అయ్యుండాలి. సంగీతం, నాట్యం కవిత్వం, వచనం.... ఏదైనాసరే అందుకు సంబంధించినవన్నీ నాకు తెలియాలి. ఉదాహరణకు నృత్య కళాకారులు కృష్ణుడు ‘త్రిభంగ ముద్ర’లో చంద్ర ముద్రతో కావాలి అంటే అవన్నీ నాకు తెలిసుండాలి. ఈ జ్ఞానం సముపార్జించుకున్నానంటే అంతా గ్రంథాలయాల పుణ్యమే.
      డిగ్రీలో ఉన్నప్పుడే ఆచార్య ఎస్వీ జోగారావు ఎవరైనా సాహిత్యం మీద బొమ్మలు వేసేవాణ్ని పంపించమని మా గురువుగారిని అడిగారు. అప్పుడు నన్ను పంపించారు. కాళిదాసు అభిజ్ఞాన శాకున్తలమ్‌ నాటకానికి వేసిన రెండు పెన్సిల్‌ డ్రాయింగులు, మనుచరిత్ర పెయింటింగ్‌ ఆయనకి చూపించాను. అప్పుడాయన చిత్రకళ గురించి మాట్లాడుతూ ‘ఇదో తెల్ల ఏనుగు. ఇందులోకెందుకు దిగావు?’ అని అడిగారు. ‘అది నా దారికే వస్తుంది’ అని జవాబిచ్చాను. మనుచరిత్ర చిత్రాన్ని వివరించమన్నారు. అందులో వరూధిని చిత్రవీణ వాయిస్తూ మీటే వేలుని పైకి చూపిస్తుంది. అక్కడ చెట్టుమీద రెండు చిలుకలు దగ్గరగా ఉంటాయి. అది చూసిన ప్రవరాఖ్యుడు చెవులు మూసుకుంటాడు. ఇలా చెప్పగానే జోగారావుగారు ‘పెద్దవాడివవుతావు పో’ అన్నారు.
      సంగీత మూర్తిత్రయంలో త్యాగరాజస్వామి అంటే ఇష్టం ఎక్కువ. కల్లూరి వీరభద్రశాస్త్రి ఆయన మీద రాసిన పుస్తకం ముందుమాటలో ‘సంగీతం పాడితే బొమ్మ కట్టినట్టుండాలి’ అని రాశారు. గాత్రంతో కాకుండా కుంచెతో బొమ్మ కట్టాలని నేను వాగ్గేయకార సాహిత్యం వైపు తిరిగాను. మొదట త్యాగరాజస్వామి పదకొండు కీర్తనలకు బొమ్మలు వేశాను. ఇవి సరైన భావాన్ని తెలుపుతున్నాయో లేదో చెప్పేందుకు ఓ విద్వాంసుడు కావాల్సి వచ్చింది. అప్పుడే చిట్టిబాబు గారి వీణ కచేరి జరిగింది. అది చూసి, ఆస్వాదించి ఆయన మీద కూడా ఒక బొమ్మ వేసి మరుసటిరోజు ఆయన బసకెళ్లాను. నేనిచ్చిన బొమ్మ చూసి సంతోషించారు. త్యాగరాజ కీర్తనల పటాలనూ చూపించాను. ఆయన ఆశీర్వచనంతో నూటా ఎనిమిది త్యాగరాజ కీర్తనలకు చిత్రాలు పూర్తిచేశాను. ఆ తర్వాత అన్నమయ్య పాటల మీద దృష్టిపెట్టాను. ఆ కీర్తనలకు తాళపత్రాల మీద ఒడిశా ‘పటచిత్ర’ శైలిలో బొమ్మలు గీస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాను. బాలకృష్ణప్రసాద్‌ గారు అన్నమాచార్య జ్ఞానయజ్ఞం చేసినప్పుడు రోజూ వెళ్లి బొమ్మలు గీశాను. చివర్లో అది ఆయనకు బహూకరించాను. 
చిత్రకారుడికీ వేదిక కావాలి
సాధారణంగా కళాకారులకు సన్మానం అన్నప్పుడు అందరినీ వేదిక మీదికి ఆహ్వానిస్తుంటారు. కానీ చిత్రకారుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. ఇది తలుచుకున్నప్పుడు మాకూ వేదిక మీద చోటు కల్పిస్తే బాగుంటుందనిపించింది. అలా అనుకుంటున్నప్పుడే 2002లో ఓ అవకాశం వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం ‘ఉక్కునగరం గానసభ’ వాళ్లు అన్నమయ్య కీర్తనల కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. ఆ రోజు మూడు గంటల్లో ఇరవయ్యారు కీర్తనలకి బొమ్మలువేశాను. మధ్యమధ్యలో పాడేవాళ్లు శ్రుతులు చూసుకునే సమయంలో కొంచెం కొంచెంగా వేస్తూ... కచేరీ ముగిసేప్పటికి పెద్ద వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని గీశాను. అప్పుడు హిచ్‌కాక్‌ సినిమా చూసినంత టెన్షన్‌ పడ్డామని నిర్వాహకులు అనడం ఎప్పటికీ మరచిపోలేను. దీంతో తానా సభలకూ ఆహ్వానం వచ్చింది. 2005లో తానాలోనే గరికిపాటి అష్టావధానాన్ని నవావధానంగా మార్చేసి నన్ను తొమ్మిదో పృచ్ఛకుడిగా తీసుకున్నారు. నా అంశానికి ‘చిత్రకవిత్వం’ అని పేరుపెట్టారు.
ఇతిహాసాలకు గీస్తేనే...
భారత రామాయణాల చిత్రాలు గీయడంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉంది. దూరదర్శన్‌ కోరిక మేరకు రామాయణం ఆధారంగా ‘వందే వాల్మీకి కోకిలం’ టెలీ ఫిల్మ్‌ రూపొందించాను. దీనికి రచన, స్క్రీన్‌ ప్లే, 48 చరణాల రామాయణం, 82 చిత్రాలు నావే. ‘బెస్ట్‌ గ్రాఫిక్స్‌’ విభాగంలో ఈ కార్యక్రమానికి ‘నంది’ పురస్కారం అందుకున్నాను. గణపతి బొమ్మలు వేయడం నా ప్రత్యేకత. ఇప్పటికి నాలుగైదు వేలు వేసుంటాను. వాటిలో సిందూర, యోగ, త్యాగరాజ, ఆదిత్య, వేంకటేశ, కృష్ణ గణపతి మచ్చుకి కొన్ని. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు విమాన గణపతి బొమ్మ వేసి పైలట్‌కి ఆటోగ్రాఫ్‌ కోసం పంపించాను. అతను దాన్ని తన దగ్గరే దాచుకుని, నాకు చాక్లెట్లు పంపించడం మరచిపోలేని జ్ఞాపకాల్లో ఒకటి.
      ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పాట పాడుతున్నప్పుడే అందర్నీ మెప్పించేలా, తగిన చిత్రం గీయడం అంటే మాటలు కాదు. ఓసారి పూణేలో ‘చిన్మయ మిషన్‌’లో ‘నాదబిందు’ కార్యక్రమం చేశాను. అప్పుడు ఆశ్రమ అధిపతి తేజోమయానంద, ‘తపస్సంటే ఎలా ఉంటుందో చూడండి’ అని శిష్యులతో అన్నారు. ఓపక్క గీతం, ఇంకో వైపునుంచి చప్పట్లు, మరో వైపు కాలపరిమితి మధ్య కూడా ఏకాగ్రతతో నేను పాటకు తగిన బొమ్మలు వేయడంతో ఆ మాటలన్నారాయన. ఇక పిల్లలకు నేర్పడం విషయానికి వస్తే... వాళ్లకు ఇలా వెయ్యాలి, అలా వెయ్యాలి అంటూ ప్రతిదీ నేర్పించక్కరలేదు. కొన్ని మెలకువలు చెబితే చాలు. నా కళకు సార్థకత ఉందా అంటే... అనాథ పిల్లలకోసం వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నాను. టీవీలో నా చిత్రగానాన్ని చూసి వాళ్ల పిల్లలు కూడా పాటలు పెట్టుకొని బొమ్మలేస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. కళాకారుడికి ఇంతకు మించిన మన్నన ఏముంటుంది?


వెనక్కి ...

మీ అభిప్రాయం