తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సమాజాన్ని చదివి రాయండి!

  • 168 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। బచ్చలి రజితకుమారి

  • ఉపాధ్యాయురాలు, వరంగల్లు.
  • 9491821807

వైవిధ్యం... జీవితం పట్ల పరిశీలనా దృష్టి... చిన్న చిన్న పాత్రల మానసిక స్థితిని సైతం పట్టివ్వగల రచనా నైపుణ్యం... భాషను పొదుపుగా వాడుతూ, భావాన్ని పదునుగా చెప్పే లక్షణం... ‘అంపశయ్య’ నవీన్‌ కథలు, నవలల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ‘అంపశయ్య’ నవలతో తెలుగు సాహిత్యంలో ఓ కొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన ఆయన, ‘కాలరేఖలు’ నవలతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమూ అందుకున్నారు. ఈ సాహితీ శ్రామికుడితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 
తె.వె.: ‘అంపశయ్య’ రచనకు ప్రేరణ? 

నవీన్‌: నా సొంత అనుభవాలే. ఇందులో కల్పన చాలా తక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మే చదువుతున్న రోజుల్లో (1962-64) ‘ఏ’ హాస్టల్లో ఉండేవాళ్లం. అక్కడ కలిగిన అనేక అనుభవాలను ‘అంపశయ్య’లో చిత్రించాను. చదువు కోసం పల్లెటూరు నుంచి మహానగరానికి వచ్చిన ఓ పేద విద్యార్థి, అక్కడ హాస్టల్లో డబ్బున్న స్నేహితులతో కలిసి ఉండటంతో అనుభవించిన మానసిక సంఘర్షణ, అభద్రతాభావం, ఆత్మన్యూనతాభావం అన్నీ కలిసి ఈ నవలగా రూపొందాయి. స్నేహితుల ప్రభావంతో ఆ విద్యార్థి కూడా విలాస జీవితానికి అలవాటు పడి, తల్లిదండ్రులను పదేపదే డబ్బులు అడగలేక, విలాసాలకు దూరం కాలేక మానసికంగా కుంగిపోతాడు. విశ్వవిద్యాలయంలో కనీస రుసుములు కూడా కట్టలేక, మెస్‌లో భోజనం బంద్‌ కావడం వల్ల చాలా ఇబ్బందులు పడతాడు. ఇలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగా ‘అంపశయ్య’ రాశాను. 
‘అంపశయ్య’ రాసినప్పుడు మీరో విద్యార్థి. ఇప్పుడు ఆ నవలను ఎలా చూస్తారు?
ఆ నవల ప్రాసంగిత ఈనాటికీ ఉంది. ఆనాటి పరిస్థితుల్నే నేటి విద్యార్థులూ ఎదుర్కొంటున్నారు. ‘అంపశయ్య’ను చదివిన యువత ఇందులోని పాత్రలతో తాదాత్మ్యం చెందారు. ఈ నవల తమ జీవితానుభావాల సమాహారమేనని భావిస్తున్నారు. ఆనాటి పాఠకులు ఎలా స్పందించారో ఈనాటి పాఠకులూ అలాగే స్పందిస్తున్నారు. త్వరలో ‘అంపశయ్య’కు పన్నెండో ముద్రణ రాబోతోంది. 
రచనలో సమకాలీన వాతావరణాన్ని చిత్రిస్తూనే దానికి సార్వజనీనత కల్పించడం ఎలా సాధ్యం?
ఏ రచయితకైనా సార్వజనీనత, సమకాలీనత ముఖ్యమైనవి. ఈ రెండూ నా రచనల్లో ఉన్నాయి. నా కథలు ప్రజల మనస్తత్వాలకు, మానవ సంబంధాలకు చెందినవి. మానవులు- ప్రకృతికి సంబంధించినవి. అందరి హృదయాలను చేరేలా, మనో విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఉత్తమ రచన పాఠకుణ్ని ఆలోచింప చెయ్యాలి. తనను తాను అర్థం చేసుకుని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడాలి. మంచిని పెంచాలి. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన స్వచ్ఛమైన మానవత్వాన్ని ఉద్భోదించాలి. ముఖ్యంగా కథకు సామాజిక వాస్తవికత ప్రాణం. ఓ కథ చదివినప్పుడు ఇది వాస్తవ ప్రపంచంలో జరగడానికి అవకాశం ఉందని అనిపించాలి. కథల్లో తప్ప బయట ఇలా జరగటానికి వీల్లేదని పాఠకుడు అనుకుంటే ఆ కథకు ప్రయోజనం లేనట్లే. అభూతకల్పనలకు కథల్లో చోటులేదు. 
మీ మీద చలం, శ్రీశ్రీ, బుచ్చిబాబుల ప్రభావం ఉన్నట్లుంది కదా?
అవును, ఆ ముగ్గురి రచనల ప్రభావం నా మీద, నా రచనల మీద చాలా ఉంది. చలం సాహిత్యాన్ని చదవడం వల్ల వేగవంతమైన, స్పష్టమైన వచనం రాయడం నేర్చుకున్నాను. అలాగే స్త్రీల అణిచివేత గురించీ, ప్రకృతిలో మమేకం కావడం గురించీ తెలుసుకున్నాను. బుచ్చిబాబు మీద ఫ్రాయిడ్‌ ప్రభావం ఉంది. ఆయన రచనలు చదివి, ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ సూత్రాల గురించి తెలుసుకున్నాను. పాత్రల అంతరంగాలను శోధించడం, ఆ అంతరంగాల్లో ఏం జరుగుతోందో చిత్రించటం బుచ్చిబాబు నుంచే నేర్చుకున్నాను. శ్రీశ్రీ కవిత్వం ద్వారా కష్టజీవుల పట్ల, సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల ఓ బలమైన సానుభూతిని అలవర్చుకున్నాను. 
కాళోజీ ‘మిత్రమండలి’కి కన్వీనర్‌గా చేశారు... రచయితగా మీ ఎదుగుదలలో దాని పాత్ర? 
కాళోజీ, పొట్లపల్లి, దాశరథిలతో నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. నేను రాసే ప్రతి రచననూ వాళ్లందరికీ చూపించేవాణ్ని. కాళోజీ సోదరులు రామేశ్వరరావుగారు 1957లో వరంగల్లులో ‘మిత్రమండలి’ అనే సాహిత్య సంస్థను ఏర్పాటు చేశారు. సాహిత్యాసక్తి ఉన్న పాఠకులు, రచయితలు అందరూ ‘మిత్రమండలి’ తరఫున ఓచోట సమావేశమయ్యేవారు. సాయంత్రం ఆరింటికి మొదలయ్యే ఆ చర్చలు అర్ధరాత్రి పన్నెండింటి వరకూ సాగేవి. ఈ ‘మిత్రమండలి’కి వరవరరావు మొదటి కన్వీనర్‌. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు ఆ బాధ్యతలో కొనసాగాను. అది చాలా గొప్ప అవకాశం. మేం ఈ ‘మిత్రమండలి’కి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, తిలక్, అవంత్స సోమసుందర్, అద్దేపల్లి రామమోహన్‌రావు లాంటి గొప్ప రచయితలందర్నీ ఆహ్వానించేవాళ్లం. మేం రాసిన కథల్ని ‘మిత్రమండలి’లో చదివేవాళ్లం. వాటిని విన్న వాళ్లు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా సాహిత్యానికి సంబంధించిన ఎన్నో మెలకువల్ని తెలుసుకునేవాళ్లం. ఓ రచయితగా ఎదగడానికి ఆనాటి ఆ రోజులు చాలా తోడ్పడ్డాయి. ఆనాటి ఆ ‘మిత్రమండలి’, ఈనాడు ‘కాళోజీ మిత్రమండలి’గా కొనసాగుతోంది. 
తెలంగాణ చరిత్రను అక్షరబద్ధం చేసిన మీ నవలాత్రయానికి స్ఫూర్తి?
‘కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు’... ఇవి ఆ మూడు నవలలు. ‘కాలరేఖలు’ చదువుతుంటే మా చిన్నప్పటి సంఘటనలెన్నో నా కళ్ల ముందు మెదులుతాయి. మా ఊరు పాలకుర్తి మండలంలోని వావిలాల. 1944లో పదకొండో ‘ఆంధ్ర మహాసభ’ రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భోనగిరిలో జరిగింది. ఈ సందర్భంగా మా ఊళ్లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డిలను పదకొండు జతల ఎడ్ల బండిలో కూర్చొబెట్టి గొప్పగా ఊరేగించారు. చాలా చిన్న వయసులో చూసిన ఆ దృశ్యమే నా మొదటి జ్ఞాపకం. ఈ నేపథ్యాన్నే ఎత్తుగడగా తీసుకొని ‘రావి నారాయణరెడ్డికి జై’ అనే నినాదంతో ‘కాలరేఖలు’ ప్రారంభించాను. ఇందులో 1944- 56 మధ్య కాలం నాటి తెలంగాణ చరిత్ర, ఆనాటి సాయుధ పోరాటం చిత్రితమయ్యాయి. 1957 నుంచి 1971 వరకు జరిగిన ఉద్యమాల చరిత్రే ‘చెదిరిన స్వప్నాలు’. ఆ తర్వాత ఇరవై ఏళ్లలో... అంటే 1991 వరకూ జరిగిన సంఘటనలకు ‘బాంధవ్యాలు’ అద్దంపడుతుంది. ఈ నవలలో ఉద్యమాలతోపాటు కుటుంబ నేపథ్యాలూ కనిపిస్తాయి. ఈ మూడు నవలలూ కలిపి పదిహేను వందల పేజీలు... దాదాపు యాభై సంవత్సరాల తెలంగాణ చరిత్రతో పాటు దేశ చరిత్రనూ తెలియజేస్తాయి. 


ఉద్యమాలను కథలకు నేపథ్యంగా తీసుకోవచ్చు. ఒక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులను పాత్రలుగా తీసుకుని, ఆ ఉద్యమ నిర్మాణంలో ఆ వ్యక్తులు నిర్వహించిన పాత్రను, ఎదుర్కొన్న సమస్యలను చిత్రించవచ్చు. ఆ ఉద్యమ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని, ఆ ఉద్యమం పట్ల ప్రజల స్పందనని చిత్రించవచ్చు. ఉద్యమాల నేపథ్యంగా వెలువడిన కథల్ని చదివినప్పుడు ఆ ఉద్యమ స్వరూపం పాఠకుల కళ్లముందు కనిపించాలి. ఉద్యమాల పట్ల సంపూర్ణ అవగాహనను కలిగినవాళ్లు మాత్రమే 
ఇలాంటి కథల్ని రాయగలరు’’


ప్రస్తుతం తెలుగులో నవలలు అంతగా రావట్లేదు కదా?
నిజమే, తొంభైల నుంచి నవల వెనకబడిపోయింది. దీనికి కారణం టీవీ సీరియళ్లు. రోజూ వచ్చే వాటిని చూడటానికి మధ్యతరగతి గృహిణులు ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఈ మధ్యతరగతి గృహిణులే నవలా సాహిత్యాన్ని బాగా చదివేవారు. ఇప్పుడు వీళ్లు పత్రికల్లో వచ్చే నవలల్ని పట్టించుకోట్లేదు. సాధారణంగా పాఠకుల్లో రెండు రకాల వాళ్లుంటారు. నవలా సాహిత్యాన్ని కళాత్మక ప్రక్రియగా భావించి చదివేవారు, కాలక్షేపం కోసం మాత్రమే చదివేవారు. మొదటి రకం పాఠకులు ఇప్పటికీ ఓ మంచి నవల వచ్చిందంటే చదువుతున్నారు. రెండో రకం పాఠకులు టీవీ సీరియళ్లకు అంకితమైపోయారు. కళాత్మక ప్రక్రియగా భావించి నవలా సాహిత్యాన్ని సృష్టించే వాళ్లని ప్రోత్సహించటానికి ఏటా రెండు మంచి నవలలకు పురస్కారాలిస్తున్నాను. అలాగే నేనూ ప్రతి సంవత్సరమూ ఓ నవలను రాసి ప్రచురిస్తున్నాను. నా నవలల ప్రతులు వెయ్యి నుంచి రెండు వేల వరకూ అమ్ముడుపోతున్నాయి. కాబట్టి ఈనాటికీ మంచి నవలల్ని చదివేవారున్నారని అనుకుంటున్నాను. 
మరి కథాసాహిత్యం ఎలా ఉంటోంది?
బాగుంది. ముఖ్యంగా తెలంగాణ భాషను ఇక్కడి కథకులు తమ కథల్లో బాగా వినిపిస్తున్నారు. ఒకప్పుడు ఓ సామాజికవర్గం వాళ్ల రచనలే ఎక్కువగా వచ్చేవి. దాంతో ఆ సామాజికవర్గం వాళ్ల సమస్యలే కథల్లో చిత్రితమవుతుండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని వర్గాల నుంచి కథకులు ముందుకొస్తున్నారు. ప్రధానంగా దళిత, వెనుకబడిన వర్గాల వాళ్ల కథారచనతో ఆయా వర్గాల ప్రజల సమస్యలూ నేటి సాహిత్యంలో చిత్రితమవుతున్నాయి. 
మాండలికాన్ని సంభాషణల వరకే వాడాలన్నారు మీరు గతంలో... 
ఏ రచన అయినా అన్ని ప్రాంతాల పాఠకులకూ అర్థమయ్యే రీతిలో ఉండాలి. అప్పుడే దాన్ని అందరూ ఇష్టంగా చదవగలుగుతారు. మాండలికం అనేది ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంది. అందువల్ల రచన మొత్తం మాండలికంలో సాగితే వేరే ప్రాంతం వారికి అర్థం కాకపోవచ్చు. అలాగని అసలు మాండలికమే లేకుండా రాయాలని కాదు.. ఆయా ప్రాంతాల వాతావరణాన్ని చిత్రించటానికి... ఆ ప్రాంతపు పాత్రలు మాట్లాడే మాటల్ని ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయాలి. పాత్రోచిత సంభాషణ అంటే ఇదే. ఇలా ఉన్నప్పుడు అది మంచి సాహిత్యం అవుతుంది. మన తెలుగులోనే కాదు, ఇతర భాషా సాహిత్యాల్లోనూ ఇలాగే జరుగుతోంది. 
సరైన అధ్యయనం లేకుండా రాస్తున్నారని నేటితరం రచయితల మీద ఓ విమర్శ..?
రచయితలు అనేవారు మొదటగా ఇదివరకటి సాహిత్యాన్ని చదివి, చర్చించగలగాలి. అప్పుడే సమర్థమైన సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. కానీ, నేటి రచయితలు పూర్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయట్లేదు. సాధన అనే విషయాన్ని పక్కనపెట్టి మనసులోకి ఏది వస్తే అదే రాస్తున్నారు. ఇది చాలా తప్పు. మా రోజుల్లో రచయితలు ఎన్నో రచనల్ని చదివి... కవిత కావచ్చు, కథ కావచ్చు, దాన్ని ఎలా రాయాలో నేర్చుకునేవారు. రాసేవాళ్లు ఎవరైనా సరే, ఎక్కువగా సమాజాన్ని చదివి, పూర్తిగా అర్థం చేసుకుని, లోతైన అధ్యయనం చేసి రచనలు చేయాలి. ఫలానా వ్యక్తి ఇలా రాశాడు; నేనూ రాస్తా.. అందులో తప్పేంటి? అనే ధోరణి మార్చుకోవాలి. సమర్థమైన రచనలే సమాజానికి అందివ్వాలి. 
ఓ విశ్రాంత అధ్యాపకుడిగా చెప్పండి... ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది?
అస్సలు బాగాలేదు. మాతృభాషను పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఓ దౌర్భాగ్య ధోరణి కనపడుతోంది. ‘కేజీ నుంచి పీజీ’ విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తామంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్నది ప్రైవేటు సంస్థలు సృష్టించిన భ్రమ. దీనివల్ల పల్లెల్లోని పేద తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడానికి సంసిద్ధులవుతున్నారు. అలా కాకుండా ప్రతి విద్యార్థి కనీసం పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకోవాలనే విధానం వస్తే బాగుంటుంది. విద్యార్థులకు మాతృభాష తెలుగు సరిగ్గా రావట్లేేదు. అటు ఇంగ్లీషూ రావట్లేదు. ఈతరం పిల్లలైతే తెలుగు మాట్లాడటం నామోషీ అనుకుంటున్నారు. వీళ్లకి కనీసం ఇంట్లో మాట్లాడుకునే తెలుగు పదాలు కూడా తెలియవు. నీళ్లను ‘వాటర్‌’ అనీ, పదిని ‘టెన్‌’ అనీ.. ఇలా ప్రతి తెలుగు పదం బదులు ఆంగ్ల పదాన్ని వాడటానికి ఇష్టపడుతున్నారు. పచ్చళ్లను ‘పికిల్‌’ అనీ అనేవారికి ‘మత్తడి’ లాంటివి ఎలా రుచిస్తాయి? ఇలాంటి పరిస్థితుల వల్ల తెలుగు సంకర భాషగా తయారైంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. దీని గురించి పెద్ద పోరాటం జరగాలి. ఇటీవల నిజామాబాదులో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు కవిత గారితో, కరీంనగర్‌లో స్పీకర్‌ మధుసూదనాచారి, ఎంపీ వినోద్‌ కుమార్లతో ఈ విషయం మీద చర్చించాం. కనీసం పదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని వాళ్లూ అంగీకరించారు. 
ఆంగ్ల మాధ్యమ చదువులు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయా? 
చేయవు. నేను 1945-46లో చదువుకోవడం ఉర్దూ మాధ్యమంలోనే. మొదటగా ఉర్దూ ఓనమాలు నేర్పించేవారు. వాటిని నేర్చుకోవడం కష్టంగా ఉండేది. 1948లో ఆ మాధ్యమాన్ని తొలగించి, తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు చాలా హాయిగా నేర్చుకున్నాను. ప్రతి వ్యక్తికీ మాతృభాష అనేది చాలా తొందరగా, సులభంగా సొంతమవుతుంది. మాతృభాషను నేర్చుకోలేని వాళ్లు ఏ ఇతర భాషనూ నేర్చుకోలేరని భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మాతృభాష కన్నతల్లి వంటిది. పరాయి భాష ఎప్పటికీ పరాయిదే. దాని మోజులో పడి మనం మాట్లాడే వచ్చీరాని ఇంగ్లీషును విని విదేశీయులు... ముఖ్యంగా ఇంగ్లాండు వాళ్లు నవ్వుకుంటున్నారు. 
ప్రస్తుతం తెలుగునాట కళలకూ అంత ఆదరణ కనపడట్లేదు కదా..
లలిత కళలు వ్యక్తి సంస్కారాన్ని పెంచుతాయని గురజాడవారన్నారు. మంచి సంస్కారం అనేది మంచి కళల ద్వారానే వస్తుంది. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం లాంటివి ఓ సమాజాన్ని నాగరిక సమాజంగా మారుస్తాయి. పికాసో తన చిత్రాల ద్వారా ఎందరినో ప్రభావితం చేశాడు. బీథొవిన్‌ అనే యూరోపియన్‌ సంగీతకారుడు, మన త్యాగరాజు, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు లక్షల మందిని అలరించి, వాళ్ల సంస్కారాన్ని ఉన్నతీకరించారు. ఆనాటి లలిత కళలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. ఇది చాలా బాధాకరం. నేడు ప్రజలకు సినిమాలు, రాజకీయాలు మాత్రమే ముఖ్యమైనవిగా కనబడుతున్నాయి. మరే విషయాలనూ పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితి మారాలి. ముఖ్యంగా యువత తన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా... కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో తలమునకలై ఉన్నారు. వాటి నుంచి బయటపడి సమాజాన్ని అవగాహన చేసుకోవాలి. దానికోసం సాహిత్యాన్ని చదవాలి. అప్పుడే తమ వ్యక్తిత్వాలను చక్కగా రూపుదిద్దుకోగలుగుతారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి