తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నేను తెలుగు పిచ్చివాణ్ని...!

  • 3566 Views
  • 29Likes
  • Like
  • Article Share

    కె.కృష్ణకుమారి

ప్రతినాయకుడిగా భయపెట్టినా... హాస్యనటుడిగా నవ్వించినా జయప్రకాష్‌రెడ్డి మాటల్లో మనదైన మట్టివాసన గుబాళిస్తుంది. తెలుగునాట ఏ యాసనైనా, మరే మాండలికాన్నైనా తన గొంతులో అవలీలగా పలికించగల సామర్థ్యం ఆయన సొంతం. నాటకాల నుంచి ఎదిగివచ్చిన ఆయన, ఇప్పటికీ ఆ రంగస్థలాన్ని మర్చిపోలేదు. ఓ నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి మరీ విరివిగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘‘నేను తెలుగు పిచ్చివాణ్ని’’ అని సగర్వంగా చెప్పుకునే జయప్రకాష్‌రెడ్డితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...  
తె.వె.: తెలుగునాట మూడు ప్రాంతాలతోనూ అనుబంధం ఉన్నట్లుంది కదా? 

జయప్రకాశ్‌:  మాది కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె. నాన్న పోలీసు. నెల్లూరు జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. నాకు ఊహ తెలిసినప్పుడు అక్కడే ఉన్నాం. ఓనమాలు అక్కడే దిద్దా. అప్పుడే నెల్లూరు యాసనూ ఒంటపట్టించుకున్నా. బళ్లో స్నేహితులూ, ఉపాధ్యాయులతో మాట్లాడటం, వాళ్ల మాటలు వినడం వల్ల ఆ యాస త్వరగా వచ్చింది. నాకు పరిశీలన, గ్రహణ శక్తులు ఎక్కువ. ఏదైనా ఇలా విన్నానంటే పట్టేస్తా. సెలవులు వచ్చాయంటే మా ఊళ్లోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్లేవాణ్ని. దాంతో రాయలసీమ యాసా వచ్చేసింది. నిజానికి సీమ భాషలో ఓ లయ ఉంటుంది. ‘ఏమ్‌... రా... ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్‌..’ ఇలా మాట్లాడుతుంటే గమ్మత్తయిన రాగం ఉంటుంది. అది నన్ను బాగా ఆకర్షించింది. పైగా మా నాన్న బదిలీలతో అనంతపురం, కర్నూలు, కడప, ప్రొద్దుటూరులలో చదువుకున్నా. దాంతో ఆ మాండలికం ఇంకా బాగా అలవడింది. తర్వాత పై చదువులకు గుంటూరు ఏసీ కళాశాలకు వెళ్లా. అక్కడి యాస మీదా పట్టు పెరిగింది. బీఈడీ కూడా అక్కడే చదివా. కొన్నాళ్లకి నాన్న డీ…ఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యారు. అక్కడే తాతయ్య కోసం పొలం కొని, అందులోనే ఇల్లు కట్టారు. అప్పటికే నాకు పెళ్లయింది. గుంటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తుండేవాణ్ని. నాన్నకోసం నల్లగొండ వచ్చిపోతుండేవాణ్ని. నాకు కొడుకు పుట్టాక, వాణ్ని నాన్న తనతోనే ఉంచేసుకున్నారు. దాంతో తరచూ నల్లగొండ వస్తుండేవాణ్ని. అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటంతో తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. ఆ భాషలో మాట్లాడుతుంటే... అది అవతలి వారికి మనల్ని దగ్గర చేస్తుంది అనిపిస్తుంది. ఓ అనుబంధం కనిపిస్తుంది. నేను ఇప్పుడు వెళ్లినా అక్కడ నా స్నేహితులతో ఆ యాసలోనే మాట్లాడుతుంటా. నాన్న కూడా అక్కడే కాలం చేశారు. ఇలా మూడు ప్రాంతాలతో నా అనుబంధం అంతా ఇంతా కాదు. 
నాటకాలంటే చిన్నప్పటి నుంచే ఇష్టమా?
అనంతపురం శ్రీసాయిబాబా నేషనల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో చదువుకున్నా. అక్కడ బాగా చదువు చెప్పేవారు. కళలకీ, సంస్కృతికీ విలువ ఇచ్చేవారు. మాకు సైన్సు చెప్పే గుండాచారి గారు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇన్‌ఛార్జి. నాటకాలు వేయించేవారు. ఒకసారి నాకూ, నా స్నేహితుడికీ నాటకం వేయాలనిపించింది. తెలుగు వాచకంలోని ‘దుర్యోధన గర్వభంగం’ పాఠాన్ని బట్టీ పట్టాం. నేను భీముడు, వాడు దుర్యోధనుడు. గుండాచారి మాస్టారు ముందుకు వెళ్లి, మేం బట్టీ పట్టిన పాఠాన్ని ఎవరి వర్షన్‌లో వాళ్లం అప్పచెప్పాం. అంతా అయ్యాక కిందకీ పైకి చూసి.. ‘ఇంకో తూరి నాటకం అని వస్తే కాళ్లు విరక్కొడతా’ అన్నారు. దెబ్బకు అక్కడి నుంచి పారిపోయాం. అవమానంగా అనిపించింది. మూడు రోజుల వరకూ ఏడుస్తూనే ఉన్నా. ఆయన ఎందుకు కాదన్నాడు అనే రోషం పుట్టుకొచ్చింది. ఎలాగైనా నాటకాలు వేయాలనీ, పదిమంది మెప్పు పొందాలనే పట్టుదల పెరిగింది. 
మరి ఆ కల ఎప్పటికి నెరవేరింది?
గుంటూరు ఏసీ కళాశాలలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ ‘నాటకంలో వేషం ఉంది.. వేస్తావా’ అన్నాడు. వెంటనే తలూపా. ఆడవేషం అన్నాడు. అయినా ఒప్పేసుకున్నా. పాటలూ, ఆటలూ అన్నీ నేర్పించాడు. నాటకం పేరు ‘స్టేజీ రాచరికం’. రాజూ, రాణీ, సేవకీ, సేవకుడు మాత్రమే పాత్రధారులు. నాది సేవకి పాత్ర. నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత నోటీసు బోర్డు చూసి అవాక్కయ్యాను. యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ‘ఉత్తమ నటి జయప్రకాష్‌రెడ్డి’ అని రాసి ఉంది. ఆ రోజు నా ఆనందం అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే పని. కాలేజీలో ఏదైనా కార్యక్రమం ఉందంటే చాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు నన్ను చూసుకోమనేవారు. మూడేళ్లలో కాలేజీ స్టార్‌ని అయిపోయా. నాటకాల్లో హాస్యపాత్రలు ఎక్కువగా చేసేవాణ్ని. రమణారెడ్డిలా పొడవుగా సన్నగా ఉండటంతో హాస్యం బాగా పండేది. మా నాటకాల్లో అన్ని రకాల యాసల్నీ చొప్పించేవాణ్ని. ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు. ఉన్నతాధికారులూ బాగా ప్రోత్సహించేవారు. పలు పరిషత్తులూ, సమాజాలతో కలిసి పనిచేసేవాణ్ని. సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని వదల్లేదు. ఇప్పుడు నేనే ‘జేపీ’స్‌ నెలనెలా నాటక సభ’ పేరిట ఓ సమాజాన్ని స్థాపించా. 
సినిమాల్లోకి ఎలా వచ్చారు?
అప్పట్లో మా నాటకాలకు ఆదరణ ఎక్కువ ఉండేది. ఎక్కడెక్కడికో వెళ్లి ప్రదర్శించేవాళ్లం. స్థానిక ఉన్నతాధికారులూ, రాజకీయ నాయకులూ వచ్చి చూసేవారు. ఓసారి నల్లగొండలో దివాకర్‌బాబు రాసిన ‘గప్‌చుప్‌’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. దానికి దాసరి నారాయణరావుగారిని ఆహ్వానించాం. ఆయన వచ్చారు కానీ, పని ఒత్తిడితో ప్రదర్శన ప్రారంభం కాకముందే వెళ్లిపోబోయారు. ‘నాటకాల నుంచి వచ్చిన మీరు ఈ నాటకం చూడకుండా వెళ్తారని అనుకోవట్లేదు’ అని నేను అనగానే ఆగిపోయారు. ‘భలేగా ముందరకాళ్లకు బంధం వేశావయ్యా’ అంటూ కూర్చున్నారు. నాటకం మొత్తం చూసి మమ్మల్ని అభినందించారు. అంతేకాదు... నన్ను రామానాయుడిగారికి పరిచయం చేశారు. హైదరాబాదులో నాయుడుగారు, వాళ్ల కుటుంబసభ్యుల ముందు మా నాటకాన్ని ప్రదర్శించాం. అలా ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా, ఆదాయం తక్కువ. అప్పులు పెరిగాయి. అలానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ఇలాగైతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనని మళ్లీ వచ్చి, ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టాను. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు... ఇలా మూడేళ్లు చేయడంతో కొంత వరకూ అప్పులు తీరాయి. ఆ తర్వాత అనుకోకుండా ఓసారి హైదరాబాదు వచ్చినప్పుడు రామానాయుడు గారు కలిశారు. అప్పుడే ‘ప్రేమించుకుందాం రా’లో ప్రతినాయకుడి పాత్రకు ఎంపికయ్యా. తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 
ఆ చిత్రంతోనే వెండితెరకు సీమ భాషను పరిచయం చేశారు కదా?
నిజమే! అందుకోసం ఎంత కష్టపడ్డానో.. ఎన్ని నోట్సులు రాసుకున్నానో నాకు తెలుసు. అది ప్రతినాయక పాత్ర. ఎక్కడా నవ్వు ఉండకూడదు. సినిమా ఆసాంతం గంభీరంగా ఉండాలి. ఆ పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటి వరకూ ఎవరూ సినిమాల్లో వాడలేదు. అదే విషయం పరుచూరి సోదరులకు చెప్పాను. వాళ్లు పెడతాం అన్నారు. దాంతో నేను కాస్త సమయం తీసుకుని కర్నూలు, నంద్యాల వైపు వెళ్లాను. ఓ టేపురికార్డరు జేబులో పెట్టుకుని అక్కడ తిరిగేవాణ్ని. టీకొట్టు, ఎరువుల దుకాణం, బస్టాండ్‌... ఇలా వివిధ ప్రాంతాల్లో, సందర్భాల్లో వాళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో.. నోట్స్‌ రాసుకునేవాణ్ని. అలా రాసుకున్నదంతా పరుచూరి సోదరులకు చూపించాను. అప్పట్లో వాళ్లు తీరిక లేకుండా ఉన్నారు. కానీ నా కోరిక మేరకు ముందురోజు సాయంత్రం సంభాషణలు రాసిచ్చేవారు. రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని సాధన చేసేవాణ్ని. అందుకే ఆ పాత్రకు అంత పేరు వచ్చింది. ఇప్పుడు అలా లేరు. సెట్‌కు వెళ్లేవరకూ పాత్ర తెలియదు. అప్పటికప్పుడు సాధన చేయడం... నటించడం... యాంత్రికమై పోయింది. నాకు భాష మీద ఉన్న పట్టు, ఇష్టం వల్ల నేనింకా నా వంతు కృషి చేస్తున్నా. ఇప్పటికీ కొత్త పదాలు తెలిస్తే రాసుకుంటా. మంచి కవితలు, సామెతలు ఎక్కడ కనిపించినా ఓ దగ్గర పెట్టుకుంటా. నా నాటకాల్లో కొత్తమాటలూ, కొత్త పదాలు పడేలా చూసుకుంటా. ఖాళీ సమయం దొరికితే చాలు తెల్ల కాగితాలు ముందేసుకుని రాసుకోవడం నాకు అలవాటు. పుస్తకాలే నా నేస్తాలు.
ఎలాంటి పుస్తకాలు చదువుతుంటారు?
నేను తెలుగు పిచ్చివాణ్ని. ఈ పుస్తకం, ఆ పుస్తకం అని ఉండదు. అన్నీ చదివేస్తా. సమయం దొరికితే పద ప్రహేళికలు నింపుతుంటా. పాలగుమ్మి పద్మరాజు రచనలు హృదయానికి హత్తుకుంటాయి. ఆయన రచనల్లో కాల్పనికత తక్కువ. బయటి సంఘటనల్లోంచే కథలు పుట్టిస్తారు. దర్శకుడు వంశీ రచనలు, శైలి ఇష్టం. ‘మా పసలపూడి కథలు’ పుస్తకం నచ్చుతుంది. అందులో గోదావరి గురించి వర్ణిస్తాడు... అది చదువుతుంటే మనమే ఆ గోదావరి పరవళ్ల దగ్గరకు వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. వంశీ రచనల్లో పాత్రలకు ఇంటి పేర్లు, పొట్టిపేర్లు, ముద్దుపేర్లు పెడుతుంటాడు. నారా సుబ్బిగాడు, పాతాళం వెంకయ్య ఇలా... భలే ఉంటాయి అవి. డాక్టర్‌ నక్కా విజయరామరాజు ‘భట్టిప్రోలు కథలు’ కూడా బాగుంటాయి. 
సినీ నటుడిగా ఉంటూనే నాటకాలు వేస్తున్నట్లున్నారు?
ఇప్పటి వరకూ రకరకాల నాటకాలూ, వేషాలూ వేశా. వేలల్లోనే ప్రదర్శనలు ఇచ్చా. ఇస్తూనే ఉన్నా. సినిమా రంగం అన్నం పెట్టింది. దాన్ని గౌరవిస్తా. అలానే నాటకాలు వేయడం నా అభిరుచి. వాటిలో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలని కోరుకుంటా. ఈ విషయంలో నిత్య విద్యార్థిని. రంగస్థలాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతోనే నాటకాలు వేస్తున్నా. దానివల్ల నాకు ఆదాయం ఉండదు. కానీ, నాటకాలను ప్రజలకు మళ్లీ దగ్గర చేయాలి, వీలైనన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాలని అనుకుంటా. ఒకప్పుడు సినీ నటులూ నాటకాల్లోనూ విరివిగా కనిపించేవారు. నాగభూషణంగారు ‘రక్తకన్నీరు’ వేస్తే జనం కిటకిటలాడేవారు. ఆయన తీరిక దొరకని నటుడు. అయినా నెలలో ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ నాటకాలకే డేట్లు ఇచ్చేవారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ భాష, రాజకీయాలు, ప్రముఖ వ్యక్తుల గురించి అధ్యయనం చేసేవారు. నాటకాల్లో ఆ విశేషాలను చొప్పించేవారు. అలా ప్రజలకు దగ్గరయ్యారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. 
ప్రస్తుతం తెలుగు నాటకరంగం పరిస్థితి?
ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. కొత్తదనం కావాలి. సాంకేతికంగా మార్పులు రావాలి. బయట ప్రాంతాల వాళ్లు ఆ కొత్తదనం చూపిస్తున్నారు కాబట్టే అక్కడింకా నాటకాలకు ఆదరణ ఉంది. నేనోసారి లాస్‌ఏంజలస్‌ వెళ్లా. అక్కడ ఓ నాటకం చూడటానికి టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తే తొమ్మిది రోజులకు దొరికింది. అందులో సన్నివేశాన్నిబట్టి వెనక నేపథ్యం మారుతోంది. పెద్దపెద్ద వంతెనలు, భవనాలు వస్తున్నాయి. అలానే లండన్‌లో ‘మౌస్‌ట్రాప్‌’ అనే నాటకాన్ని దశాబ్దాల నుంచి ప్రదర్శిస్తున్నారు. నాటకం ఒకటే... మూడు తరాల పాత్రధారులు మారారంటే నమ్ముతారా! ‘కింగ్‌’ చిత్రీకరణ కోసం బెంగళూరు వెళ్లా. అక్కడా నాటకాలకు ప్రాధాన్యమిస్తారు. చిత్రీకరణ అవ్వగానే వాటిని చూడటానికి వెళ్లేవాణ్ని. చెన్నై, ముంబయిల్లోనూ అంతే. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే నాటకాల పరిస్థితి ఇలా ఉంది. టికెట్టు అంటే రావడానికి వెనకాడతారు. ఈ విషయంలో నేను ప్రతిసారీ తెలుగువారిని బతిమాలుతున్నా... భంగపడుతున్నా. టికెట్టు తీసుకుని చూడండి.. నాటకం చూశామని సంతృప్తి పడండి అని చెబుతుంటా. సెట్, కళాకారులు, మేకప్, సంగీతం, లైటింగ్, వేదిక.. ఇలా చాలానే ఖర్చులు అవుతున్నాయి. నా సమాజాన్ని సొంత ఖర్చులతోనే నడిపిస్తున్నా. ఇప్పుడు సినిమాలు చేస్తున్నా కాబట్టి డబ్బులు వస్తున్నాయి. వాటిని ఇటు పెట్టగలుగుతున్నా. మరి ఇక ముందూ నడిపించాలంటే కష్టమే కదా. అందుకే ఎక్కడికెళ్లినా ఒకటే చెబుతుంటా... టికెట్టు పెట్టుకుని చూడండి... పరిషత్తులకు చేతనైనంత విరాళాలు ఇవ్వండని.
మీ ‘అలెగ్జాండర్‌’ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది కదా!
అవును... దాని ప్రేక్షకులు దానికి ఉన్నారు. ఈతరం వారిని అనుసంధానిస్తూ స్వర్గీయ పూసలు రాసిన నాటకం అది. వంద నిమిషాలు ఒక్కణ్నే చేసిన నాటకం అదే. అందులో నాది విశ్రాంత అధికారి పాత్ర. రకరకాల సమస్యలతో జనాలు ఫోన్‌ చేస్తుంటే, దానికి పరిష్కారం చూపిస్తుంటాను. ఆ సమస్యలు చాలామంది జీవితాల్లో ఉండేవే. అరే! ఇది మా ఇంట్లో ఉంది... నా చుట్టూ ఉంది అనిపిస్తుంది. దీనివల్ల అందరూ ఆ నాటకానికి వెంటనే అనుసంధానమవుతారు. ఈ నాటకంలో ఓచోట నాకు గుండెపోటు వస్తుంది. ఓసారి అలాగే నటిస్తుంటే, ఎదురుగా కూర్చున్న ఆవిడ[ ఏడుస్తూ అరవడం మొదలుపెట్టింది. ప్రేక్షకులు అంతగా లీనమైపోతారు. ఇలాంటి నాటకాల వల్ల తప్పకుండా నాటక రంగాన్ని బతికించుకోవచ్చు. కళాకారులూ కడుపునిండా తినడమూ సాధ్యమవుతుంది.
ఓ ఉపాధ్యాయుడిగా ఇప్పటి విద్యావిధానం మీద మీ అభిప్రాయం?
మా రోజుల్లో మేం విద్యార్థినులకు ఆత్మవిశ్వాస పాఠాలు చెప్పేవాళ్లం. ఇప్పుడు కొంతమంది గురువులే కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. చాలా విలువలు కోల్పోయాం. విద్యార్థులు కూడా జీవం లేకుండా తయారవుతున్నారు. చాలా కృత్రిమంగా నేర్చుకుంటున్నారు. చదువు అంటేనే ర్యాంకుల జపంగా మారింది. ప్రాక్టికల్‌గా చదువులు చెప్పే సంస్కృతి ఎప్పుడో పోయింది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి చూపించట్లేదు. అప్పట్లో నేను మా విద్యార్థుల్ని పోటీలకు తీసుకెళ్లేవాణ్ని. సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్లను భాగస్వాములను చేసేవాణ్ని. వాళ్లు పోటీల్లో నెగ్గకపోయినా విజేతల్ని గమనించమని చెబుతుండేవాణ్ని. దాని వల్ల వాళ్లకూ గెలుపు రుచి చూడాలన్న కాంక్ష పెరుగుతుంది కదా. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చేర్పించాలని చూస్తున్నారు. తెలుగు వాడకం నెమ్మదిగా తగ్గిపోతోంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉన్న మాట నిజమే కానీ, ఆంగ్లాన్ని అవసరానికి మించి వాడితే తెలుగు కనుమరుగవుతుంది.
మొత్తంగా తెలుగు స్థితిగతులు...?
ఇతర భాషలు నేర్చుకోవడం మంచిదే. తప్పనప్పుడు పరాయి భాష మాట్లాడటంలోనూ తప్పులేదు. కానీ, మనం మన భాష తప్ప అన్నీ మాట్లాడతాం. అమెరికాలోని యూనివర్సల్‌ స్టూడియోకి వెళ్తే, అక్కడ గుజరాతీ వాళ్లు తమ భాషలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. పంజాబీలు, మలయాళీలూ అంతే! తెలుగువాళ్లు మాత్రం ఆంగ్లంలో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. కనీసం మీ కుటుంబసభ్యులతోనైనా తెలుగులో మాట్లాడండి... పిల్లలకు మన భాష నేర్పించండని అలాంటివాళ్లకి చెబుతుంటా. 
మరి చలనచిత్రాల్లో మన భాష పరిస్థితి?
ఏవేవో సినిమాలు వస్తున్నాయి. కనీసం పేర్లయినా చక్కగా తెలుగులో పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సినిమాల్లో తెలుగు తగ్గడానికి మరో కారణం... పరభాషా నటులకు మన దగ్గర ఆదరణ బాగుంది. మన నటుల్ని ఇక్కడి దర్శకులు గుర్తించట్లేదు అనిపిస్తోంది. పరభాషా నటుల ఉచ్చారణ కోసం సంభాషణల్లో ఆంగ్ల పదాలు పడక తప్పవు. అదే అచ్చమైన తెలుగులో సంభాషణలు రాయించి, తెలుగువారితో చెప్పిస్తే బ్రహ్మాండంగా చెబుతారు. అచ్చ తెలుగు వాతావరణం కనిపించేలా సినిమా తీస్తే తప్పకుండా తెలుగు పరిస్థితి బాగుంటుంది. నాకో విషయంలో బాధ అనిపిస్తుంది. సినిమాలకు సంబంధించి వివిధ పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వాళ్లకోసం మనవాళ్లు ఆయా భాషల్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే మనవాళ్లు వేరే చోట పని చేయడానికి వెళ్తే, మన భాష మాట్లాడటానికి అక్కడ ఎవరూ ప్రయత్నించరు. అందుకే సెట్‌లో అందరికీ చెబుతుంటా... మీకు చేతనైతే వాళ్లకి నాలుగు తెలుగు ముక్కలు నేర్పండి అని! 
నవతరానికి మన భాషను దగ్గర చేయాలంటే?
తల్లిదండ్రులు ర్యాంకుల కోసం ఆరాటపడుతున్నారు. ఆటలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో పిల్లలను భాగస్వాములను చేయట్లేదు. వాళ్ల మనోవికాసానికి అవకాశమివ్వట్లేదు. ఫలితంగా చిన్నారులు మన భాషకు దూరమైపోతున్నారు. పిల్లలను తరగతి గదిలో కూర్చోబెట్టి పుస్తకాల్లో ఉన్నదే చెప్పడం కాదు... వాళ్లకి బయటి ప్రపంచాన్ని కూడా తరగతి గది కిటికీలోంచే చూపించాలి. మన భాషా సంస్కృతులను వాళ్ల కళ్లకు కట్టాలి. అయితే, ఇలాంటివి చెప్పి వదిలేస్తే మర్చిపోతారు. చెప్పాక క్విజ్‌ లాంటిది పెట్టి ప్రశ్నలు అడిగితే గుర్తుంచుకుంటారు. తెలుగులో మార్కులకూ ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే మన భాష నిలుస్తుంది. అలాగే, యువతరం బాధ్యత కూడా కొంత ఉంది. తెలుగువాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ఇబ్బందేంటి? బయట నన్ను కలిసే యువతరం.. ‘హలో సర్, హాయ్‌ సర్, ఎక్స్‌క్యూజ్‌మీ సర్, కెన్‌ ఐ హావ్‌ సెల్ఫీ విత్‌యూ’ ఇలా ఆడుగుతుంటే కోపం వస్తుంది. అలా మాట్లాడొద్దని గట్టిగానే చెబుతుంటా. ఇలాంటి అలవాట్లకు అడ్డుకట్ట పడితేనే మన భాష నాలుగు కాలాల పాటు నిలుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి