తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

కాలక్షేపం కథలన్నీ కాలగర్భంలోకే!

  • 112 Views
  • 3Likes
  • Like
  • Article Share

    ఆకారపు మల్లేశం

  • హైదరాబాదు.
  • 8008771051

తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్‌ తొలి అధ్యక్షులు బేతి శ్రీరాములు. బీఎస్‌ రాములుగా సాహితీలోకానికి సుపరిచితులు. అనేక కథలు, నవలలతో పాటు సామాజిక రచనలనూ సృజించారు. లోతైన అధ్యయనం, విభిన్న కోణాల నిశిత పరిశీలన, ప్రత్యక్ష జీవితానుభవం, నిర్దిష్టావగాహన సూత్రాలకు రచనా సామర్థ్యం కలగలసిన సాహితీవేత్త ఆయన. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను... సమకాలీన సమాజంలో విజ్ఞానశాస్త్రం తెచ్చిన మార్పులను సృజిస్తూ విమర్శకుల మన్ననలనూ పొందారు. అలాంటి విశిష్ట రచయిత, ఆ సామాజిక ఉద్యమకారుడు ఇప్పుడు కీలక పదవిలోకి వచ్చారు. సమాజంలో యాభైశాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి కృషిచేసే గురుతర బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 
తె.వె.: మీ ప్రస్థానంలో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు?

బీఎస్‌: పాఠశాలలోనే సోషలిస్టు సమాజాన్ని చూశాను. పేదాగొప్ప తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలం ఒకే చోట చదువుకున్నాం. కలిసిమెలిసి ఉన్నాం. మా అమ్మే నాన్నయి నన్ను పెంచింది. ఎన్నో కథలు చెప్పింది. ఆమె పెంపకమే నాకు వరం. తల్లిచాటు బిడ్డనని గర్వంగా చెప్పుకుంటాను. మరోవైపు నా జీవితంలో నిలువెల్లా గాయాలే. అన్నింటినీ అధిగమించాను. నా స్నేహితులుగా చెప్పుకునే వారు హఠాత్తుగా మారిపోవడం, శత్రువుల కన్నా క్రూరంగా వ్యవహరించడం నా మనసును తీవ్రంగా గాయపరిచింది. 
సాహిత్యంతో మీ అనుబంధం ఎలా ప్రారంభమైంది? 
ఎనిమిదో తరగతి నుంచే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదివేవాణ్ని. అమ్మ చెప్పిన కథలు, గ్రామీణ కళాకారులు మా ఇంటి ముందు చేసిన ఆటపాటలు, పద్యాలు, బుర్రకథలు విని ఎంతో నేర్చుకున్నాను. తొమ్మిదో తరగతిలోనే పద్యం రాశాను. ఆనాటి తెలుగు పత్రికల్లో తెలంగాణ ప్రస్తావనే ఉండేది కాదు. అందుకే నా రచనల ద్వారా ప్రజల ఆకాంక్షలను చాటాను.
ఇప్పుడు సాహితీవేత్తలు ఎలాంటి పాత్ర పోషించాలని అభిలషిస్తున్నారు?
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం పోషించిన పాత్ర మహోన్నతం. హిమాలయాలతో పోల్చదగింది. తెలంగాణ పాట, ధూమ్‌ధామ్‌ ప్రదర్శనలు, ప్రసంగాలు, వచన కవిత్యం, కథలు, నవలలు, వ్యాసాలు... ఇలా అన్నీ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉపకరించాయి. గతించిన వాటి చిత్రీకరణ కాదు, భవిష్యత్తును చిత్రించి... ఆశలను, స్వప్నాలను సృజించి ప్రజలను చైతన్యవంతం చేశాయి. రాష్ట్ర ప్రజలు బంగారు తెలంగాణ వైపు నడవాలి. కేజీ నుంచి పీజీ ఉచిత విద్యాపథకం లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. అన్నింటా నవీన పంథా, ఉదాత్త లక్ష్యాలు ఉండాలి. తెలంగాణ సాహితీవేత్తలు సార్వజనీన విలువలను ప్రతిబింబించే రచనలు చేయాలి. 
మీకు ఇష్టమైన సాహితీవేత్తలు?
చిన్ననాటి నుంచి సినారె రాసిన ‘అక్షర గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం’ అంటే ఇష్టం. విశ్వనాథ సత్యనారాయణ, కొడవగంటి కుటుంబరావు, దాశరథి సోదరులు, శ్రీశ్రీ, ఆళ్వార్‌స్వామి, ప్రేమ్‌చంద్, ఉన్నవ లక్ష్మీనారాయణ, కాళీపట్నం రామారావుల సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందాను. చందమామ, బాలమిత్ర కథలూ ఇష్టమే. రావిశాస్త్రి, కాళీపట్నం చేతుల మీదుగా 1984లో నా కథాసంపుటి ‘అడవిలో వెన్నెల’ను ఆవిష్కరించడం ఎప్పటికీ మరచిపోలేను.
మీరు  మొదటి నుంచీ తెలంగాణ మాండలికంలో రచనలు చేస్తున్నారు. మాండలికంలో రచనల వల్ల కలిగే మేలు? 
గ్రాంథికం కృత్రిమమైంది. మాండలికం సహజమైంది. సజీవమైంది. మనం మాట్లాడుకునే భాష అక్షరీకరణ అద్భుతంగా ఉంటుంది. దానిని తమ ఆత్మగౌరవంగా ప్రజలు భావిస్తుంటారు. 
సాహిత్యానికి సామాజిక ప్రయోజనాన్ని ఎలా నిర్దేశిస్తారు?
సాహిత్యం మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. విప్లవం అవసరం లేకుండా పరివర్తన తెచ్చే గొప్ప శక్తి దానికి ఉంది. సాహిత్యం సామాజిక పరిణామాలను విశ్లేషించేదిగా ఉండాలి. సమాజానికి సరైన మార్గనిర్దేశం చేయాలి. ప్రచార సాహిత్యం వేరు. విలువలతో కూడిన సాహిత్యం వేరు. సామాజిక, మానవ సంబంధాలను విశ్లేషిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ‘మాలపల్లి’ వంటి నవలలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఎలా ఉన్నారో చెప్పడమే కాదు ఎలా ఉండాలో చెప్పడమే సాహిత్యానికి పరమార్థం. ఓటమి గురించే కాదు... గెలవాల్సిన జీవితాన్ని చెప్పాలి. సింద్‌బాద్‌ కథలు గెలుపు స్ఫూర్తిని చాటుతాయి. కాలక్షేపం కోసం రాసే కథలు కాలగర్భంలో కలుస్తాయి. స్ఫూర్తిని కలిగించేవి కలకాలం నిలిచిపోతాయి. 
అసలు కథకు మీరిచ్చే నిర్వచనమేంటి?  
కథలు కాలక్షేపానికి కాదు. సమాజ పరిణామాలను ప్రపంచానికి తెలియజెప్పేలా ఉండాలి. సామ్యవాద కోణాలను సృజించాలి. ఉజ్వల భవిష్యత్తును చిత్రీకరించాలి. పంచతంత్రంలో మనుషుల ప్రస్తావన లేకుండా జంతువులు, పక్షుల ద్వారా చక్కటి నీతి కథలను చెప్పారు. ఏది రాసినా పఠనీయత ఉండాలి. ప్రజల జీవితం కనిపించాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరగాలి అనే సూత్రాలుండాలి. అలాగే, తెలుగులో పేదల గురించి, కార్మికుల గురించి సరైన రచనలు రాలేదు. వారి కష్టాలు, కన్నీళ్లను చిత్రీకరించలేదు. వారి ఆశలను వెల్లడించే ప్రయత్నాలు జరగలేదు. అంతరాలను తొలగించి, ప్రజలపట్ల గౌరవాన్ని పెంచడానికి ఇకనైనా కృషి చేయాలి. 


ఉద్యమాలే ఊపిరి
మట్టిమనుషుల జీవితాలే ఇతివృత్తాలుగా, మానవీయ విలువలతో రచనలు చేసిన బీఎస్‌ రాములు... ఆగస్టు 23, 1949న జగిత్యాలలో జన్మించారు. చేనేత కార్మికుడైన తండ్రి మిట్టపెల్లి నారాయణను తన ఆరో ఏటే కోల్పోయారు. తల్లి బేతి లక్ష్మీరాజు బీడీలు చుడుతూ ఆయన్ను పెంచి పెద్దచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పూర్తిచేశారు రాములు. 175 కథలు, ఆరు నవలలు రచించారు. తత్వశాస్త్రం నుంచి సాహిత్య విశ్లేషణ వరకూ వివిధ ప్రక్రియల్లో 89కి పైగా పుస్తకాలు రచించారు. తెలంగాణ ఉద్యమానికి గొంతుకనందిస్తూ 40కిపైగా సాహిత్య, సామాజిక పొత్తాలను ప్రచురించారు. ‘బీసీలు ఏం చేయాలి? బీసీలకు ఏం చేయాలి’ తదితర రచనలతో వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం గళమెత్తారు. ‘కథా రచనకు కథకుడి పాఠాలు’ తదితరాల ద్వారా వర్ధమాన కథారచయితలకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అనేక సంస్థలు, ఉద్యమాల నిర్మాణం ద్వారా ప్రజాచైతన్యానికి ఊపిరిలూదారు. రాములు రచనల మీద పరిశోధనలు చేసి ఆరుగురు ఎంఫిల్, ఒకరు పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.


తెలుగు నవలల భవిష్యత్తేంటి? 
ప్రజాదరణ ఉన్నంతకాలం నవలకు ఢోకా లేదు. ఇందుకు నవతరం కృషి చేయాలి. విలువలను ప్రతిబింబించాలి.
ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితులు ఎలా ఉన్నాయి?
తెలుగు బాగా విస్తరిస్తోంది. మన భాషకు ముప్పు వాటిల్లుతుందనే వాదన సరికాదు. అంతర్జాలం ద్వారా తెలుగుకు మేలు జరిగింది. గూగుల్‌ లాంటి సంస్థలు సైతం తెలుగులో సేవలందిస్తున్నాయంటే మన భాష విశ్వవ్యాప్తమైందనే గుర్తించాలి. తెలుగులో 40 లక్షల దినపత్రికలు అమ్ముడుపోతున్నాయి. దాదాపు నాలుగు కోట్ల మంది వాటిని చదువుతున్నారు. భాషకు విజ్ఞానశాస్త్రం తోడైతే అది మరింతగా విస్తరిస్తుంది. ఇంగ్లీషు వాళ్లు గుర్రాలతో వ్యవసాయం చేస్తారు కాబట్టి హార్స్‌పవర్‌ అనే పదం పుట్టింది. మన దేశంలో ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నాం. అదే పదం ఇక్కడ పుడితే దాన్ని ఆక్స్‌పవర్‌ అనేవాళ్లు. పరిపాలన వ్యవస్థ కూడా భాషాభివృద్ధికి దోహదం చేస్తుంది.
యువతరం అమ్మభాషకు దూరమవుతోంది కదా..?
విద్యార్థులు మాతృభాషను సమయానుకూలంగా మార్చుకుంటే తప్పులేదు. గిరిజనులు జీవనం కోసం ఇతర భాషలు నేర్చుకుంటున్నారు. విదేశీయులు సైతం మన భాషను నేర్చుకుంటున్నారు. మార్కుల కోసం సంస్కృతం, ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటుంటే దాన్ని స్వాగతించాల్సిందే. అయితే, వాటి మీద పట్టు సాధించేలా నేర్చుకోవాలి. ఎన్ని నేర్చినా తెలుగును వదిలిపెట్టకూడదు. గతంలో బతుకమ్మ ఆట ఆడాలంటే నామోషీ అనుకునే వారు. ఇప్పుడు పోటీ పడి ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో బతుకమ్మ ఆడుతున్నారు. భాష విషయంలోనూ అంతే. సానుకూల దృక్పథం అవసరం. 
బీసీ కమిషన్‌ అధ్యక్షులుగా మీ పదవీ స్వీకారం... సమాజ పోకడలను నిశితంగా పరిశీలించి, వ్యాఖ్యానించే మీలోని రచయిత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నన్ను ఎంపిక చేసి, బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఆయన్ను కలిసినప్పుడు ఒకే మాట చెప్పారు. ‘ఇన్ని రోజులు మీరు కథలు, నవలలు, తాత్విక గ్రంథాలు, ప్రసంగాల్లో చెప్పిన వాటిని ఇప్పుడు ఆచరణలో చూపండి’ అన్నారు. ఇది నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ప్రధానంగా బీసీలను కులవృత్తుల నుంచి విముక్తం చేయడమే మా లక్ష్యం. ఇతర దేశాల్లో కులవృత్తులు లేవు. స్వేచ్ఛగా ఏ వృత్తినైనా చేయవచ్చు. ఆధునిక వృత్తులను చేపట్టవచ్చు. నైపుణ్యాలను పెంపొందించుకుని ముందడుగు వేయాలి. సంక్షేమమే పరమార్థంగా, ముఖ్యమంత్రి పథ నిర్దేశంలో సాగుతాం. 
మీ సారథ్యంలో బీసీ కమిషన్‌ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
బీసీలు అన్నింటా ఎదగాలి. కష్టాలను ఎదిరించి ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో జీవించాలనేది మా సంకల్పం. దీని సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా బీసీలకు కొత్త దిశ, దశను చూపుతాం. కులవృత్తుల్లో ఉన్న వాళ్లకి అదే వృత్తిలో కాకుండా కొత్త పనుల్లో శిక్షణ ఇస్తాం. తెలంగాణ బీసీల్లో ఏయే కులాల వారు ఏయే వృత్తుల్లో ఉన్నారో సమగ్ర పరిశీలన చేస్తాం. వాళ్లందరి బాగు కోసం కృషిచేస్తాం. అన్ని కులాలు వాళ్లూ సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. హస్తకళలు తదితర అంశాల్లో నైపుణ్యాలను మరింత పెంచి, ఆ కళల అభివృద్ధికి తోడ్పడతాం.

(బి.ఎస్‌.రాములు: 83319 66987)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి