తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

చారిత్రక స్పృహే సంస్కృతికి శ్రీరామ రక్ష

  • 811 Views
  • 1Likes
  • Like
  • Article Share

    సి.నాగరాజు

  • హైదరాబాదు,
  • 8008004558

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పురావస్తు పరిశోధనల్లో డీఎన్‌ఏ ఆధారిత అధ్యయనం జరుగుతోంది. ఆదిమకాలం నాటి మానవ వలసలకు సంబంధించి కొత్త సమచారాన్ని అందించే ఈ ప్రయోగ ఫలితాల కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే యునెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపు కోసం మన రామప్ప దేవాలయం బరిలో నిలిచింది. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...

తెలుగునాట చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, కట్టడాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కదానికీ యునెస్కో గుర్తింపు రాలేదు...?
ఆ గుర్తింపు కోసం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు జరగలేదు. గతంలో ఒకసారి కుతుబ్‌షాహీ సమాధులను ప్రతిపాదించాం. కానీ కొన్ని.... సాంకేతిక కారణాలతో అది యునెస్కో ప్రొవిజనల్‌ జాబితాకే పరిమితమైంది. ఇప్పుడక్కడ పునరుద్ధరణ పనులు  జరుగుతున్నాయి. మరోసారి ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014లో కాకతీయ దేవాలయాలూ ప్రొవిజనల్‌ జాబితాలో చేరాయి. ఇప్పుడు వాటిలో రామప్ప దేవాలయం పారిస్‌ వరకూ వెళ్లింది. అన్ని అంశాలకూ సంబంధించిన పరీక్షలు పూర్తయితే దానికి యునెస్కో గుర్తింపు వస్తుంది. రామప్ప దేవాలయం తర్వాత వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణాలు జాబితాలోకి చేరతాయి. అలాగే కుతుబ్‌షాహీ సమాధులకు గుర్తింపు వచ్చిన తర్వాత గోల్కొండ, చార్మినార్‌ కట్టడాలు యునెస్కో బరిలో నిలుస్తాయి. వీటి ప్రతిపాదనకు ముందు కొన్ని సాంకేతిక, యాజమాన్య హక్కుల సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది.
రామప్పగుడి పునాదుల్లోని ఇసుకను చీమలు తోడేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి...?
రామప్పగుడి కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. చీమల సమస్య గతంలో ఉన్నా, ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇప్పుడు మళ్లీ అది తలెత్తినట్టు మా దృష్టికి రాలేదు. అయితే ఘన్‌పూర్‌ కోటగుళ్ల పునాదుల్లో మట్టిని పటిష్ఠం చేసేందుకు లైమ్‌ను పెట్టినప్పుడు పందికొక్కులు వాటిని తీసేశాయి. ఎండ, వాన, చలికాలాల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించాలి. వానా కాలంలో పునాదుల్లోకి నీళ్లు వస్తున్నాయి. అలాగే వదిలేస్తే మరో 50 ఏళ్లలో అవి కూలిపోతాయి. మూడు కాలాల్లో పరిస్థితి చూసి, పునాదులను పూర్తిగా రాతితో ఫ్లోరింగ్‌ చేయాలని నిర్ణయించాం. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రణాళిక సిద్ధంచేశాం.
ఆక్రమణల బారిన పడుతున్న రక్షిత కట్టడాల పరిరక్షణకు ఏం చేస్తున్నారు?
పురావస్తుశాఖ పరిధిలో ప్రభుత్వ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. వాటితో ఎంత బాగా పనులు చేయగలమో? ఆమేరకు చేస్తున్నాం. ఈ ఏడాది పురానాపూల్‌ గేట్‌వే, ఖైరతాబాద్‌ మసీదు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. మైనార్టీశాఖ నిధులతో మక్కామసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. భూగర్భంలోకి కూరుకుపోయిన కలవగూరు ప్రాచీన దేవాలయాన్ని ప్రదక్షిణ పథం వరకు వెలికితీసి పునరుద్ధరించాం. నిజామాబాదు ప్రదర్శనశాల మరమ్మతు జరుగుతోంది. పర్యటకశాఖ నుంచి జాఫర్‌గఢ్‌, ఖిలార్‌షా, భువనగిరి కోటలకు నిధులు వచ్చాయి.
చారిత్రక ప్రదేశాలను ఎందుకు కాపాడుకోవాలి?
భాష, సంస్కృతులు ఏ ఒక్క మనిషో సాధించిన ప్రగతి కాదు. సమాజం మొత్తం కలిసి సాధించినవి. రామప్ప దేవాలయాన్ని చూస్తే అక్కడ ఒక శిల్పిని చూడలేం. ఆనాటి ప్రజలు కనిపిస్తారు. వారి కళాపోషణ అర్థమవుతుంది. తరాలుగా మాట్లాడితేనే భాష అభివృద్ధి చెందింది. ఒక సామెతను మరిచిపోతే వందలాది జీవితాలను మరిచినట్లే. వారసత్వ ఆస్తులను పోగొట్టుకోం కదా. అలాగే... భాష, సంస్కృతి, చరిత్రలు కూడా పూర్వికులు మనకి ఇచ్చిన వెలకట్టలేని ఆస్తులు.
‘‘చరిత్రను పునర్నిర్మించుకునే దిశగా తెలంగాణ అడుగులేస్తోంది’’ అని ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి చందూలాల్‌ చెప్పారు. ఈ క్రతువులో పురావస్తుశాఖదే కీలకపాత్ర. దీనికి సంబంధించి ఏమి చేస్తున్నారు?
చరిత్ర అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. దీనిమీద ప్రతిసారీ సమీక్ష చేయాలి. అప్పుడే కొత్త ఆధారాలు వెలుగుచూస్తాయి. దీనికి పరిశోధనలు చాలా ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే ఆ సదస్సు నిర్వహించాం. పురావస్తుశాఖను వివిధ విభాగాలతో బలోపేతం చేయాలి. జెనిటిక్స్‌, ఆంత్రోపాలజీ, కెమికల్‌, మెటీరియల్‌ ఆస్ట్రానమీ, జియాలజిస్టులు, చారిత్రక పరిశోధకులు అవసరం. వాళ్లతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు చేస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ కోణంలో సీసీఎంబీతో జెనిటిక్స్‌ పరిశోధనల కోసం ఒప్పందం చేసుకున్నాం. తవ్వకాల్లో సాయం కోసం డెక్కన్‌ కాలేజీ సహకారం తీసుకుంటున్నాం. తవ్వకాలప్పుడు మట్టిని తీసి పడేస్తుంటాం. కానీ ఆ మట్టి చాలా ముఖ్యం. మట్టిని చదివితే చరిత్ర మరింత లోతుగా తెలుస్తుంది. అక్కడ వరదలు వచ్చాయా? అగ్నిప్రమాదాలు జరిగాయా? ఆహార అలవాట్లు, సంచరించిన జంతువులు తదితర విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్‌ హెరిటేజ్‌ ప్రాజెక్టు కింద గుహల్లోని చిత్రాలను స్కాన్‌చేసి, సంచార ప్రదర్శన నిమిత్తం కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖకు ఒక ప్రతిపాదన చేయనున్నాం. ఇందులో పురావస్తుశాఖ, హైదరాబాదు ఐఐటీ, బెంగళూరు ఐఐఎస్‌సీ కలిసి పనిచేస్తాయి.
ఆదిమానవుడి అడుగుజాడలను వెల్లడించే అనేక అవశేషాలు తెలంగాణలో బయటపడుతున్నాయి కదా...?
దక్షిణభారతదేశంలో ప్రాచీన, నవీన శిలాయుగాలకు సంబంధించిన చాలా ఆధారాలున్నాయి. గోదావరి, కృష్ణా తీరాల్లో తొలి వేదకాలానికి చెందిన ప్రజలు ఆవాసం ఏర్పరుచుకున్నారని ఆంత్రోపాలజిస్టులు చెబుతున్నారు. ఇప్పుటి ప్రజలను ‘మెలనో ఇండియన్లు’గా పిలుస్తారు. అయితే దక్షిణాది ప్రజల మూలాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రీయ పరిశోధన చేయాలి. ఈ విషయాలన్నీ జెనిటిక్‌ విశ్లేషణతో తెలుస్తాయి. జనాభా వలసల చరిత్రను మ్యాప్‌ చేస్తే దక్షిణాది ప్రాంతాల చరిత్ర తెలుసుకునేందుకు మరిన్ని ఆధారాలు లభిస్తాయి. చరిత్రకు సంబంధించి ఎవరైనా కొత్త విషయాలు కనుగొంటే, వాటిని పురావస్తుశాఖ దృష్టికి తీసుకురావచ్చు. అలా వచ్చిన వాటిని వార్షిక నివేదికలో ప్రచురిస్తాం. ఇప్పటికే మా దృష్టికి వచ్చిన ప్రాంతాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
డీఎన్‌ఏ ఆధారిత పరిశోధనల్లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి?
ఈ పరిశోధన ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ ఫలితాల కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. రెండు, మూడేళ్లలో పూర్తివివరాలు అందుబాటులోకి వస్తాయి. ఆదిమానవుల సమాధుల నుంచి 60 ఏళ్ల కిందట తవ్వితీసిన ఎముకలకు ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షలు చేశాం. రెండు ప్రాంతాల నుంచి నమూనాలు తీసుకోగా ఎం-3,4,5, యూ-4గా తేలాయి. ఇవి భారతీయుల డీఎన్‌ఏల్లో ఎక్కువగా లేవు. యూ-4 అనేది ఆసియాలోనే లేదు. యూరప్‌లో కనిపిస్తుంది. పూర్తిస్థాయి ఫలితాలు వస్తే ఆదిమకాలం నాటి వలసల పరిశోధనలు మరింత ముందుకు వెళ్తాయి. ఇక ప్రాచీన శిలాయుగానికి చెందిన సమాధులు ప్రపంచంలోని మిగతా సమాధుల్లానే ఉన్నాయి. కళేబరాన్ని పూడ్చిపెట్టేందుకు రెండు పద్ధతులు అనుసరించారు. శరీరాన్ని జంతువులు తినేందుకు పెట్టి, ఆ తర్వాత ఎముకలను సమాధి చేయడం ఒక పద్ధతి, రెండోది చనిపోయిన మృతదేహంపై మాంసాన్ని వేరుచేసి కేవలం ఎముకలను సమాధి చేయడం. ఈ సమాధుల్లోని నలుపు, ఎరుపు కుండలను కాల్చిన విధానం ఒకేలా ఉంది. సమాధుల్లో జంతు కళేబరాలు ముఖ్యంగా గుర్రం, ఎముకలు, పుర్రెలు ఎక్కువగా ఉన్నాయి. ఇనుప వస్తువులు, ఆయుధాలూ కనిపిస్తాయి. దక్షిణాదికే ఈ సంస్కృతి పరిమితమైతే... ప్రపంచమంతా దగ్గరదగ్గరగా ఇలాగే ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి కారణాలు ఏంటి? వలసలు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగాయి? తిరోగమన వలసలు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ తెలియాలంటే, తవ్వకాల్లో లభ్యమైన వస్తువులు స్టోర్‌రూమ్‌లకు పరిమితం కాకూడదు. మరిన్ని పరిశోధనలు జరగాలి. అప్పుడే కొత్త విషయాలు వెలుగుచూస్తాయి.
కానీ, ప్రాచీన చారిత్రక పత్రాలు, నాణేలు, శాసనాలు పరిశోధకులకు అందుబాటులో ఉండట్లేదన్న విమర్శలున్నాయి?
అది అవాస్తవం. తవ్వకాల్లో లభ్యమైన వస్తువులను పరిశోధకులు, సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రపంచ పురావస్తు సదస్సులో సమర్పించిన మూడు పరిశోధన పత్రాలు ఇక్కడి ప్రదర్శనశాల నుంచి తీసుకున్న నాణేల మీద చేసినవే. మ్యూజియంలో నాణేలను ప్రదర్శనకు పెట్టేందుకు ఆకృతి ఖరారు అయింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఉన్న నాణేలన్నీ ప్రదర్శనకు పెడతాం.
శాతవాహనుల కాలానికి సంబంధించిన ఆధారాల కోసం కరీంనగర్‌ జిల్లా కర్ణమామిడిలో తవ్వకాలు జరపబోతున్నారు కదా. మరి మెదక్‌జిల్లా కొండాపూర్‌లో కూడా శాతవాహనుల నగరం ఉందని అంటున్నారు...?
కొండాపూర్‌ ప్రాంతం కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంది. ఇక కర్ణమామిడిలో ఈ ఏడాది తవ్వకాలు చేపడతాం. కోటిలింగాల దగ్గర తవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతి కోరాం. కోట చుట్టూ తవ్వకాలు చేపట్టాలి. మన చరిత్రకు మొదటి పునాది ఇక్కడే ఉంది. శాతవాహన మొదటిరాజు చిముఖుడి నాణెం ఇక్కడే దొరికింది. కోటిలింగాలకు క్రీ.పూ.200 నాటి చరిత్ర ఉందంటారు. ఈ ప్రాంతానికి హరప్పా, మొహంజదారోలతో సంబంధముందా అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పరిశోధన అవసరం. నాణేల మీద శాస్త్రీయ పరిశోధన పూర్తయితే, ఆ ముడి ఖనిజం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం మీద స్పష్టత వస్తుంది.
విదేశాల్లో చిన్న ప్రాచీన కట్టడం బయటపడినా ఎక్కువ ప్రచారం ఉంటుంది. మనదగ్గర వేల ఏళ్ల నిర్మాణాలున్నా ఆ మేరకు పర్యటకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాం. కారణమేంటి?
ఒక్కో సమాజానికి ఒక్కోరకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న మన సమాజంలో ఏడుతరాల పేర్లు తెలియాలి అంటారు. ముత్తాతల పేర్లు ఎంతమందికి తెలుసు? మన విద్యావ్యవస్థలోనే చారిత్రక స్పృహ చాలా తక్కువ. ముందుగా మన విధానం మారాలి. ఈ దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు అప్పట్లో రాసిన డైరీలు, కాగితాలన్నీ జాగ్రత్తగా దాచిపెట్టారు. అందుకే ఇప్పుడు బ్రిటిష్‌ ఇండియాలోని ప్రతి ప్రాంతం గురించి క్షుణ్ణంగా ఆధారాలతో రాయగలుగుతున్నాం. అలాగే మన పెద్దలు రాసిపెట్టిన కాగితాలను మనం దాచిపెట్టుకోవాలి. ఈ చారిత్రక స్పృహ వస్తేనే సంస్కృతిని పరిరక్షించుకోగలం.
చరిత్ర విద్యార్థులు పెద్దగా కనిపించడం లేదు. చరిత్ర, పురావస్తు పరిశోధనలకు సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఈ అంశాల మీద సమాజంలో సరైన అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక ఆర్టిస్టారియన్‌ ఒక చిత్రాన్ని చూసి, అది నిజమైందా? కాదా? ఎన్నేళ్ల కిందటిదన్న విషయాలు చెప్పడానికి రూ.కోటి వరకు తీసుకుంటున్నారు. ఈ సబ్జెక్టులు ఒక్కరోజుల్లో జీతం తెచ్చిపెట్టేవి కావు. పరిశోధనలో మంచి నిపుణుడిగా పేరుతెచ్చుకుంటే అధిక వేతనం ఇచ్చే ఉద్యోగాలుగా మారతాయి.
ప్రాచీన లిపులను చదవగలిగే నిపుణుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ సమస్య పురావస్తు పరిశోధనలపై ప్రభావం చూపిస్తుంది కదా?
దీనికీ విద్యావ్యవస్థలో లోపాలే కారణం. మన దగ్గర మాదిరిగానే గ్రీస్‌, ఇటలీల్లోనూ ప్రాచీన, ఆధునిక లిపులున్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇవన్నీ నేర్పిస్తున్నారు. అక్కడి విద్యార్థులు వాటిని నేరుగా చదివేస్తున్నారు. ఆ లిపులు అక్కడి తప్పనిసరి పాఠ్యాంశాలు. మన దగ్గర కూడా ఉపయోగ స్థాయి అనే విషయాన్ని పక్కపెట్టి, విద్యావ్యవస్థలో ప్రాచీన లిపుల అధ్యయనాన్ని ప్రవేశపెట్టాలి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాచీన సంపద పంపకాలు పూర్తయ్యాయా?
నాణేల పంపిణీకి భారత పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ అధ్యక్షుడిగా ఓ కమిటీ వేశారు. కానీ ఈ కమిటీ సమావేశాల్లో తాను పాల్గొనలేనని ఆయన చెప్పారు. దీంతో తృతీయపక్షం కోసం మరోసారి ప్రభుత్వానికి లేఖరాశాం. కేంద్ర సాంస్కృతికశాఖ నుంచి ఎవరైనా వస్తే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది.
పురావస్తు పరిశోధనల్లో మహిళలు ఎక్కువగా కనిపించరు. మీరు ఈ రంగంలోకి...?
చరిత్ర పరిశోధన, పర్యటక ప్రదేశాల మీద మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. నేను చదివిందీ చరిత్రే. ఈ రంగంలోకి రావడానికి ఇవన్నీ ప్రాథమిక కారణాలు. ఇక్కడ మహిళల భాగస్వామ్యం తక్కువ కాదు. సమాజం మొత్తానికి పురావస్తు పరిశోధనల మీద ఆసక్తి తక్కువే. ప్రస్తుత యువత ఎక్కువగా గణితం, సామాన్య శాస్త్రాల వైపు వెళ్తొంది. అయితే మా శాఖలోని సాంకేతిక సహాయకుల్లో నలుగురూ మహిళలే.
ఉద్యోగ జీవితంలో మధుర జ్ఞాపకాలు?
ముఖ్యంగా భాష విషయంలోనే ఓ వింత అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రాంతానికి రావడానికి ముందు కర్ణాటకలో పనిచేశాను. అక్కడ ‘నీవు’ అంటే మంచి మర్యాద ఇచ్చినట్లు. ఇక్కడ ‘నీవు’ అంటే ఏకవచన సంబోధనం. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ‘నీవు’ అని మాట్లాడితే అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు భాష మీద పట్టువస్తోంది. ప్రభుత్వం తరఫున నిర్దేశించుకునే ఏ లక్ష్యమూ ఒక్కరితో పూర్తికాదు. బృందంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలి. ఇప్పటివరకు ఆ బృంద నాయకత్వం సంతృప్తినిచ్చింది. మంగళూరు సబ్‌సూపరింటెండ్‌ పోస్టుమాస్టర్‌గా తొలిసారి విధుల్లో చేరాను. అక్కడ అతితక్కువ కాలంలో కంప్యూటరీకరణ పూర్తిచేశాను. ఆ తర్వాత ఏడాదికి లాభాల్లోకి తీసుకువచ్చాను.
తమిళనాడుకు చెందిన మీరు తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?
ఎక్కడి నుంచి వచ్చినా మనమంతా భారతీయులమే కదా. ఇప్పుడంటే ప్రాంతాల మధ్య విభజన ఉంది కానీ, మనుషుల మధ్య మాత్రం వేల ఏళ్ల నుంచే అనుబంధం ఉంది. దక్షిణాదిలో మనం ద్రావిడ భాషలు మాట్లాడతాం. ఎక్కడో పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోనూ ద్రవిడ భాష మాట్లాడుతున్నారు. ఇక్కడి వాళ్ల మధ్య సాంస్కృతిక సంభాషణ నిరంతరం జరిగేది. భాషాభివృద్ధి మానవజాతి గొప్పదనం. మనం ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంత భాష నేర్చుకోవాలి. అప్పుడే ఆ సమాజంతో మాట్లాడగలం. స్థానిక చరిత్ర తెలుసుకునేందుకు కూడా అప్పుడే వీలవుతుంది. మా మాతృభాష తమిళానికి, తెలుగుకు కూడా సంగం కాలం నుంచే అనుసంధానం ఉంది. తమిళంలో పులం అంటారు. తెలుగులో పొలం అంటారు. భాష పలికేతీరు ఒకేలా ఉంటుంది. ద్రావిడ భాషల్లో ఒకటి వస్తే మరో భాష నేర్చుకోవడానికి పెద్దగా సమయం పట్టదు.

***


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి