తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

చేతులు కలపాలి... చేవ చూపాలి

  • 173 Views
  • 0Likes
  • Like
  • Article Share

రాజకీయం కానిదంటూ రాజ్యంలో వుండనే వుండదు
రాజకీయం లేకుంటా మనిషి వుండనే వుండడు

      - రాజకీయాన్ని అర్థం చేసుకున్నాడు కవి. 

                 

                         * * * 

సుమతి శతకం వేమన పద్యం
రామప్ప తటాకం మా మానేరు ఉదకం
ఎర్రనేల కొమ్మురుమాలు
హాహాకారాల తెగిపోతున్న తల్లివేరు

      - పునాదుల్లేని సమాజానికి భుజాలడ్డుపెట్టాడు.
 

                      * * *

ఇప్పుడు అకశేరుకాల జాబితాలో
గుర్తించిన కొత్తప్రాణి పేరు భారత పౌరుడు

      - రోషానికైనా లేస్తారేమోనని అక్షరాంకుశంతో పొడిచాడు.
 

అద్దాన్నీ ఆకారాన్నీ విభజించలేనట్లే జీవితాన్ని, కవిత్వాన్నీ వేరు వేరుగా దర్శించలేకపోతున్నానని చెప్పుకున్న ఆ కవి... అన్నట్లుగానే జీవితాన్నే కవిత్వంగా రాశాడు. ముఖ్యంగా పేదోడి జీవితాన్ని కవితా వస్తువు చేశాడు. అ అంటే అర్ధాకలి... ఆ అంటే ఆక్రందన... ఇ అంటే ఇంకట... ఈ అంటే ఈతిబాధలు... ఉ అంటే ఉరి... ఊ అంటే ఊరు... తండ్లాడే తోటివాళ్లను ఊరడించడానికి ఇలా తనదైన వర్ణమాలను సృష్టించుకున్నాడు. సమాజ క్షయాన్ని తప్ప క్షేమాన్ని కోరని రాబందుల రెక్కలు కోసేందుకు అక్షరఖడ్గాలకు పదునుపెట్టాడు. ప్రపంచీకరణ నుంచి తెలంగాణ వరకూ... రాజకీయ అవినీతి నుంచి సామాజిక అనిశ్చితి వరకూ అనేకాంశాలపై అనేకానేక కవితలల్లిన ఆ కవి... జూకంటి జగన్నాథం. కథకుడు కూడా అయిన ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: సాహిత్యంతో ఎప్పుడు పరిచయమైంది?

జూకంటి: పేదరికం వల్ల పదో తరగతితో చదువు ఆగిపోయింది. తర్వాత ఊళ్లోని అన్ని పనులూ... వరికోతలు, బావులు తవ్వడం, చెరువు కాల్వలు తీయడం వంటివి చేశా. రోజుకు రూపాయి పావలా కూలీ. అయితే, పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాస మాత్రం అప్పటి నుంచే ఉండేది. పొద్దంతా కూలికి పోయి వచ్చి సాయంత్రం సిరిసిల్ల గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకునే వాణ్ని. అప్పట్లో నాకుంది ఒక్క జత బట్టలే. లుంగీ మీదే సిరిసిల్ల పోయేవాణ్ని. పుస్తకం తీసుకుని మానేరు ఒడ్డున రాత్రంతా కూర్చుని చదివి తెల్లారి తెచ్చిచ్చేవాణ్ని. ‘చిన్నపిల్లవాడివి... ఇంత తొందరగా పుస్తకాలేం చదువుతున్నావ్‌... ఇక నీకు పుస్తకాలివ్వడం కుదరదని’ గ్రంథాలయాధికారి చెప్పారు. అయినా నిరాశపడలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పుస్తకాలు సంపాదించి చదువుకునే వాణ్ని. అలా దాదాపు ఆ గ్రంథాలయం మొత్తం చదివేశా. రావిశాస్త్రి నుంచి శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్, కుందుర్తి, సోమసుందర్‌ల వరకూ అందరి కవిత్వాలు, కథలూ చదివా. శార్వరి సంపాదకత్వంలో అప్పట్లో ‘కథలు రాయడమెలా?’ అనే పుస్తకం వచ్చింది. దాన్ని చదివి... అందులో ఉదాహరించిన గొప్ప కథల కోసం ఎక్కడెక్కడో సైకిల్‌ మీద తిరిగి తెచ్చుకుని చదివా.
మరి ఉద్యోగంలోకి...
పనులు చేసుకుంటున్నప్పుడే, 76లో ‘చదువుకున్నోడివి నీకీ పనులెందుకు... చిన్నపిల్లలకు చదువుచెప్పుకుంటే సరిపోతుంది కదా’ అని ఊళ్లో పెద్దమనుషులు సలహా ఇచ్చారు. దాంతో ఓ బడి ప్రారంభించా. శిశు నుంచి ఏడో తరగతి వరకూ 150 మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులనూ ఒక్కణ్నే చెప్పేవాణ్ని. నెలకు ఒకటో తరగతికి ఒక్క రూపాయి... రెండో తరగతికి రెండు రూపాయలు... ఇలా తీసుకునే వాణ్ని. నా సాహిత్య అభిరుచిని గుర్తించిన మిత్రులు, ఉపాధ్యాయులు ఫీజు కట్టడంతో 78లో ఇంటర్‌ పాసయ్యా. తర్వాత ఉద్యోగమొచ్చింది. 
రాయడం ఎప్పుడు ప్రారంభించారు?
మొదట్లో లలితగీతాలు, చలనచిత్ర సాహిత్యం లాంటి కవితలు రాసేవాణ్ని. 77లో వచ్చిన ఆత్యయిక పరిస్థితితో మొత్తం తలకిందులైంది. దేశంలోని కవులు, మేధావులు, పత్రికా సంపాదకులు, విలేకరులను అది ఓ కుదుపు కుదిపింది. కొత్తగా ఆలోచించడం నేర్పింది. ఏది రాయాలి, ఎవరికోసం రాయాలి, ఎందుకు రాయాలి, కవిగా నా లక్ష్యమేంటి అన్న విషయాల్లో అదే స్పష్టతనిచ్చింది. ఆ ప్రభావంతో నాదైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నా. అప్పటి వరకూ రాసిన కవితలు అయిదారొందలు ఉంటాయి. వాటిని ఉనకపొయ్యిలో పెట్టుకోమని అమ్మకు ఇచ్చేశా. 1969 శ్రీకాకుళం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నక్సలైట్‌ ఉద్యమం ప్రారంభమైంది. ఇలా నా చుట్టూ జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో పేదప్రజల కోసం రాయాలని నిర్ణయించుకున్నా. పేదరికం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నా. ఎవరు పీడితులు, ఎవరు పీడకులో స్పష్టంగా తెలుసుకున్నా. కవిత్వంలో ఇమడని అంశాలను కథలుగా రాశా. 
మీ కవిత్వానికి స్ఫూర్తి? 
జీవితం... చదివిన పుస్తకాలు... చుట్టూ జరుగుతున్న పోరాటాలే స్ఫూర్తి. ప్రజలు - ప్రజల భాషే స్ఫూర్తి. ముందుతరంలోని రావిశాస్త్రి నుంచి సమకాలీనులైన కాళీపట్నం రామారావు వరకూ అందరూ స్ఫూర్తే. ప్రపంచీకరణ తర్వాత గ్రామాలు చాలా విధ్వంసమయ్యాయి. దాని గురించి రాశా. సిమెంట్‌ సంతతి ఉత్పత్తి అవుతున్న వేళ మానవ సంబంధాలు విధ్వంసం కాక ఏమవుతాయని రాశా. జీవితంలోని అన్ని కోణాలూ రాశా. మనిషి పరివేదన మొత్తాన్ని రాశా. 
ప్రస్తుత తెలుగు సాహితీ వాతావరణం ఎలా ఉంది?
ఇప్పుడు సన్నివేశం అద్భుతంగా ఉంది. ఎవరికి వాళ్లు వాళ్ల గురించి రాసుకుంటున్నారు. అంతకు ముందు తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ ఈ వాతావరణం లేదు. దళితులు దళిత సాహిత్యం, మైనార్టీలు మైనార్టీ సాహిత్యం, స్త్రీలు తమ సొంత సాహిత్యాన్ని రాస్తున్నారు. ప్రపంచ మార్పులకు అనుగుణంగా రాస్తున్నారు. నక్సలైట్లు... లోపల పని చేసేవాళ్లు. వాళ్లూ కథలు రాస్తున్నారు. వాళ్లది దండకారణ్య కథల పుస్తకమూ వచ్చింది. అన్ని వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి కవులు, రచయితలు ఎదిగి వాళ్ల వాళ్ల జీవితాలను ఆవిష్కరిస్తున్నారు. అయితే... ఈతరం రచయితల్లో... ముఖ్యంగా 1950-60 మధ్య జన్మించిన వాళ్లు, ఆ తర్వాత జన్మించిన వాళ్ల మధ్య ఓ భేదం ఉంది. 
ఏంటది?
అప్పట్లో కళాశాలల్లో విద్యార్థి సంఘాలుండేవి. ఎవరి భావజాలాన్ని వాళ్లు చెప్పేవాళ్లు. దాంతో ప్రతి విద్యార్థికీ ఏదో ఒక భావజాలానికి అనుగుణంగా తనకంటూ ఓ స్పష్టత వచ్చేది. ఎప్పుడైతే విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధించారో అప్పుడే అభిప్రాయాలు చెప్పేందుకు వేదికలంటూ లేకుండా పోయాయి. ఇప్పుడంతా చదువు చదువే! అందుకే 60 తర్వాత పుట్టినవాళ్లు, 90 తర్వాత రాస్తున్నవాళ్లకు ఓ దృక్పథం లేదు. ఏది రాయాలి, ఎందుకు రాయాలి, రచయితగా కవిగా మనం దేని గురించి మాట్లాడాలన్న దానిపై వాళ్లకు స్పష్టత లేదు. ఇంతకు ముందు కథల్లో మూలాల వెతుకులాట ఉండేది. రావిశాస్త్రి, చాసో తదితరులు మూలాల్లోకి వెళ్లి ఏం జరుగుతోందో చెప్పేవాళ్లు. తర్వాత బీనాదేవి కూడా ఆ పని చేశారు... ‘పుణ్యభూమీ కళ్లుతెరు’ నవల ద్వారా. ఇప్పటి వాళ్లు జీవితాన్ని చెబుతున్నారు. అద్భుతంగా చెబుతున్నారు. వాళ్ల కథనం బాగుంటుంది. విశ్లేషణ బాగుంటుంది. కానీ, దృక్ఫథం ఉండదు. ఆ జీవితం ఎందుకు ఇట్లా ఉందో కారణాలు చెప్పట్లేదు. సమాజం పట్ల, దృక్పథం పట్ల వారికి అవగాహన ఉంటే... ఏదో ఒక చోట, ఏదో ఒక పాత్ర ద్వారా వాటిని చెప్పిస్తారు. ఆ అవగాహన లేకపోవడం వల్ల జీవితాన్ని ఉన్నదున్నట్లు రాస్తున్నారు. 
ఆ దృక్పథాన్ని అలవరచుకోవాలంటే...? 
కథ, వ్యాసం శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. వాటికి వెళ్లాలి. పెద్దవాళ్లను అడగాలి. గత సాహిత్యం చదవాలి. తాత్విక చింతనాత్మక సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. మార్క్సిజం నుంచి బుద్ధిజం వరకూ, వివేకానందుడి రచనల వరకూ అన్నీ చదవాలి. సర్వేపల్లి రాధాకృష్ణ భారతీయ తాత్విక చింతనపై ఆరు పుస్తకాలు రాశారు. అలాంటి వాటిని చదవాలి. తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. రచయిత, కవి ఈ వ్యవస్థకు మార్గదర్శకులు కదా... వాళ్లు నేర్చుకుంటే సమాజానికే మంచిది.
తెలుగు గురించి...
ఉత్తరాంధ్రలో ఓ భాష... కృష్ణా, గుంటూరులకు ఓ భాష... హైదరాబాద్‌లో ఉర్దూ కలిసిన భాష... మహబూబ్‌నగర్, నల్గొండ ఓ భాష... ఇక ఉత్తర తెలంగాణ అంతా దాదాపు ఒకే భాష... కానీ, అదంతా తెలుగే. ఇల్లు ఊడవడాన్ని నల్గొండలో ‘ఊకడం’ అంటారు. ఆ సంగతి ఆమధ్యదాకా నాకు తెలియదు. చూడండి... ఎక్కడికెక్కడ తెలుగు ఎంత సమృద్ధిగా ఉందో. ఇక జాతీయాలు... ‘గుండె చెరువైంది’ అంటారు. దీని మీద ఎన్ని పేజీలు రాసినా పూర్తిగా చెప్పలేం. కానీ, ఇప్పుడు రెండో తరగతి చదువుతున్న పిల్లలకు ఆరు వేలు అంటే అర్థంకాదు. ఆంగ్లంలో చెప్పమంటారు. సిక్స్‌ థౌజండ్‌ అంటే ఓ... అదా అంటారు! అంటే, వేరే భాష ద్వారా వాళ్లు మాతృభాషను అర్థం చేసుకుంటున్నారు. ఎంత బాధాకరం! మానసికంగా పిల్లలపై ఎంత ఒత్తిడి! అదే మాతృభాషలో చదివితే ఆంగ్లం త్వరగా, బాగా వస్తుంది కదా. 
ఆంగ్లంపై వ్యామోహానికి కారణమేంటి?
ఎన్ని పైసలైనా కడతాం కానీ, ఆంగ్ల బడులకే పంపిస్తామంటున్నారు జనాలు. డ్రెస్, టై, బూటు... పిల్లాణ్ని బస్సు ఎక్కించి బడికి పంపాలి! ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఆపాలి. కానీ అదేం చేస్తోంది! పాఠశాలల తనిఖీ లేదు. ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నాయి. ఒక పట్టణంలో ఒక ప్రైవేటు బడికి అనుమతిస్తే... ఆ పట్టణంలోంచే పిల్లలను చేర్చుకునేలా అనుమతినివ్వాలి. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా చేర్చుకోనివ్వడం వల్ల పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలు బంద్‌ అవుతున్నాయి. 
ప్రభుత్వ పాఠశాలలు పోతే జరిగే నష్టమేంటి?
రోజూ ఎన్నో తెలుగు బడులు పోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఈ విధ్వంసం జరుగుతోంది. ఇంగ్లిష్‌ పిచ్చిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఆటస్థలాలుంటాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. అక్కడ చదువుకున్న వాళ్లు బండ మీద పావుశేరు పుట్టిస్తారు. అదే ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఉండదు. ఇంటర్‌ తప్పిన, డిగ్రీ మధ్యలో ఆపేసిన వాళ్లే ఎక్కువ మంది. వాళ్లకే ఆంగ్లం రాదు. వాళ్లేం చెబుతారు? అలాంటి వాళ్ల దగ్గర నేర్చిన ఆంగ్ల చదువుల వల్ల సార్థకత రాదు. వాటిని నేర్చుకున్నోడు తల్లిదండ్రులకు అక్కరరాడు. ఇంటికి అక్కరరాడు. సమాజానికి అక్కరరాడు.
పాఠశాలస్థాయిలో తెలుగు బోధన ఎలా సాగుతోంది? 
అప్పట్లో అన్ని బడుల్లోనూ తెలుగు పండితులు ఉండేవాళ్లు. వాళ్లకు అద్భుత భాషా నైపుణ్యాలు ఉండేవి. వాళ్లు పద్యం చదువుతుంటే రోడ్డు మీద పోయేవాళ్లు కూడా ఆగి వినేవాళ్లు. తరగతి గది వరకూ వచ్చి ఆలకించేవాళ్లు కొందరు. ఇప్పడూ తెలుగు పండితులున్నారు కానీ, వాళ్లకు భాషా పరిజ్ఞానం లేదు. విశ్వవిద్యాల యంలో ఏ సీటూ దొరక్కపోతే ఎమ్మే తెలుగు చేస్తున్నారు. ఉపాధ్యాయు లవుతున్నారు. పాఠాలు చెబుతున్నారు. ఇంకెట్లా భాషకు మేలు జరుగుతుంది?
ఈ పరిస్థితుల్లో అమ్మభాషపై నవతరానికి ఆసక్తి పెంచాలంటే...?
మూలాల లోపల భాషా సాహిత్యాలు అభివృద్ధి చెందాలంటే చెప్పేవాళ్లు ఉండాలి. పాఠ్యపుస్తకాల్లో ఉండే విషయాన్ని చెప్పే, విశ్లేషించే ఉపాధ్యాయవర్గం ఉండాలి. తెలంగాణ పాఠ్యప్రణాళికలో వచ్చేసారి సాహిత్యాన్ని సృజనాత్మకంగా ఎలా రాయాలన్న అంశం మీద పాఠం పెట్టబోతున్నారట. అది మంచిది. రెండు వైపులా ఇలాంటివి జరగాలి. బాలల పత్రికలు చదివిస్తే భాషపై, సాహిత్యంపై అభిరుచి పెరుగుతుంది. అలాగే, వాచకాల్లోకి ప్రజల భాష రావాలి. 
అన్యభాషను అందలమెక్కించడంలో ప్రధాన పాత్రధారులెవరు?
అసలు ఈ ఆంగ్లం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటీష్‌ వాళ్ల నుంచి. మొదట కార్యాలయాల్లోకి వచ్చింది. ప్రజలను పీల్చి పిప్పిచేసింది. ఆంగ్ల పాఠశాలల ద్వారా ఇప్పుడు ఆ భాషను ఎవరు రక్షిస్తున్నారు? ప్రభుత్వం! ప్రభుత్వ విధానాల్లోపల భాషను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాష విషయంలో దొంగనిద్ర పోతున్న ప్రభుత్వాన్ని లేపాలి. నిరసన తెలపాలి. తెలంగాణలోకన్నా ఆంగ్లం ఎక్కువగా దాడి చేసింది సీమాంధ్ర ప్రాంతంలోనే. బ్రిటీష్‌ పాలనలో ఉంది కదా. కానీ, అక్కడ తెలుగు బతికింది. అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణలో మొదట జరిగిందీ సాంస్కృతిక పునరుజ్జీవనమే. కవులు, కళాకారులు, ఆచార్యులు ఊరూరా తిరిగారు. భాష, సంస్కృతులను తట్టిలేపారు. తర్వాతే రాజకీయ పార్టీ వచ్చింది. అయినా అందరం ఒక్కటే. ముఖ్యంగా సాహిత్యంలో... తెలుగు మాట్లాడే వాళ్లందరూ ఒక్కటే. తెలుగు కోసం గుండెలు బాదుకుంటే పని కాదు. ఉద్యమం తేవాలి. తెలుగుకోసం అల్లాడేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరితో కలిసి బలమైన భాషోద్యమ్యాన్ని నిలబెట్టాలి. అప్పుడే పునర్నిర్మాణం జరుగుతుంది.
భాషోద్యమం ఎలా ఉండాలి?
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే ఉద్యమ లక్ష్యం అని స్పష్టం చేయాలి. భాషా పరిరక్షణ కోసం కవిత్వమూ, పాటలూ రాయవచ్చు. సామాజిక రుగ్మతలపై రాసేవాళ్లూ భాష గురించి రాయవచ్చు. రుద్దుడు చదువుల గురించి నేను ‘కొత్త పంట’ రాశా. పాటనే ఆయుధంగా చేసుకుని ఉద్యమాన్ని నిర్మించుకోవచ్చు. గిచ్చితే లేవనోడు తంతే లేత్తడా అన్నట్లు అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విద్య, భాష, సంస్కృతుల కోసం మనవంతుగా ఏదో ఒక రూపంలో నిరసన తెలపాలి. కవిత్వం రాసేవాళ్లు కవిత్వం, వ్యాసం రాసేవాళ్లు వ్యాసం రాయాలి. భాషకోసం తండ్లాడే వాళ్లందరూ ... అన్ని ప్రాంతాల వాళ్లూ చేయిచేయి కలిపి సాగాలి. అప్పుడే భాషకు మేలు జరుగుతుంది. సుసంపన్నమూ అవుతుంది.  
ప్రభుత్వ యంత్రాంగంలో పని చేశారు, అధికారభాషగా తెలుగు అమలుపై...?
చాలామంది ఉద్యోగులకు తెలుగులో నోట్‌ ఎట్లా రాయాలో తెలియదు. ఉద్యోగం చేశాను కాబట్టి చెబుతున్నా. అయితే, పదిహేనేళ్ల నుంచి నేను తెలుగులోనే రాశా. అధికారులు అడిగేవాళ్లు... తెలుగులో రాస్తున్నావ్‌ కష్టం కాదా అని! ఏం కష్టం కాదు సార్‌ అని చెప్పేవాణ్ని. మన భాషలో మనం బాగా రాయగలం కాబట్టి మన రాతతో, వాదనలతో అధికారులను ఒప్పించవచ్చు. అదే ఆంగ్లంలో అయితే... పాతవాడు ఏం రాశాడో దాన్ని తేదీలు, పేర్లు మార్చి ఎత్తిరాయడమే. మరోవైపు... ప్రజలకు తెలియని భాషలో పాలన మంచిది కాదు. జనాన్ని మాయ చేసి లంచాలు తీసుకునేందుకు కూడా ఆంగ్లం ఉపయోగపడుతోంది. అందుకే తెలుగు ప్రభుత్వ కార్యాలయాల్లోకి రావాలి. నోట్‌ఫైళ్ల నుంచి నోటీస్‌బోర్డుల్లో అంటించే కాగితాల వరకూ అన్నీ తెలుగులోకి రావాలి. అయితే, ప్రభుత్వోద్యోగులకు తగిన సూచనలందించే పుస్తకాలు రావాలి. భాషా సంఘాలు వీటిని ప్రచురించాలి. 
తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు... రెండు ప్రభుత్వాలు... భాషకు అవేం చేయాలి?
ముఖ్యంగా వాటికి చిత్తశుద్ధి ఉండాలి. కార్యనిర్వహణ రంగంలో తెలుగును తప్పనిసరి చేయాలి. తెలుగును వాడకుంటే శిక్షించాలి. కర్ణాటకలో మాధ్యమాలకు అతీతంగా కన్నడ బోధన తప్పనిసరి. ఇక్కడా అలాగే ఉండాలి. ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి రావాలంటే అందరం ఐక్యం కావాలి. నిరసన తెలపాలి. ఇప్పటికే తన సంకల్పంతో ‘రామోజీ ఫౌండేషన్‌’ పెట్టి ‘తెలుగువెలుగు’ ద్వారా రామోజీరావు గారు ఆ పని చేస్తున్నారు. అలాంటి కృషి విస్తృతి పెరగాలి. (జూకంటి: 94410 78095)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి