తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఈ జీవితం... దీనికో తోడూ...రెండూ తెలుగు పుణ్యమే!

  • 747 Views
  • 5Likes
  • Like
  • Article Share

    రామకృష్ణ కంటిపూడి

సుమ... తెలుగు అమ్మాయి కాదంటే ఎవరూ నమ్మరేమో! మాతృభాష మలయాళం అయినా సరే, ఈ తెలుగింటి కోడలి పిల్ల మాటల్లో మాత్రం అంతా తెలుగుదనమే! సందర్భాన్ని బట్టి ఆమె పేల్చే మాటల తూటాలను ఆస్వాదించని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తనది కాని భాషలో (ఈ మాట అంటే సుమ ఒప్పుకోరు!) గలగలా మాట్లాడేస్తూ బుల్లితెర మీద నవ్వుల పువ్వులు పూయిస్తూ... రెండు దశాబ్దాలుగా తెలుగు ఇళ్లలో సందడి చేస్తున్న సుమతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: తెలుగుతో మీ అనుబంధం ఎలా మొదలైంది?

సుమ: చిన్నప్పుడు ఇంట్లో మలయాళంలోనే మాట్లాడుకునే వాళ్లం. బళ్లో కూడా ఆంగ్ల మాధ్యమం. ఏదో బయట స్నేహితులతో రెండు మూడు మాటలు మాట్లాడేంత తెలుగు మాత్రమే వచ్చేది. బడిలోనే తెలుగు చదువుకున్నా. నాలుగో తరగతిలో మాకు రెండో భాషగా తెలుగును పరిచయం చేశారు. అయితే దానికి బదులు ‘ప్రత్యేక ఆంగ్లం’ (స్పెషల్‌ ఇంగ్లిష్‌) తీసుకునే అవకాశమూ ఉండేది. అమ్మ మాత్రం తెలుగే తీసుకోమని చెప్పింది. ఆంగ్లం ఎలాగూ వస్తుంది... మనం ఇక ఇక్కడే ఉంటాం కాబట్టి తెలుగు తీసుకుంటే మంచిది అంది. సరే అన్నా. తర్వాత ఇదే నాకు చాలా సాయపడింది. ఎంత మాట్లాడటం వచ్చినా.. తెలుగు చదవడం, రాయడం రాకపోయి ఉంటే మాత్రం ఇవాళ ఈ స్థితిలో ఉండే దాన్ని కాదు. అయితే... ఇంట్లో మాట్లాడుతుంటేనో, పెద్దవాళ్లు నేర్పితేనో భాష వస్తుంది. ఇక్కడ నాకు తెలుగు రాదు. అమ్మకీ రాదు. ఆవిడ నాకోసమే ఏదో అరకొరగా తెలుగు నేర్చుకుంది. ఈ పరిస్థితిలో మార్కులకోసం సరిపోయేంత తెలుగు మాత్రమే నేర్చుకోగలిగా! పాఠాలు బట్టీకొట్టీ రాసేదాన్ని. దాంతో మార్కులు బాగా వచ్చేవి. చూశారా... తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగులో ఎంత బాగా మార్కులు తెచ్చుకుంటోందో అనే వాళ్లు ఉపాధ్యాయులు. 
మరి భాష మీద పట్టు ఎలా పెరిగింది?
ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ప్రదీప్‌ గారి ద్వారా దూరదర్శన్‌లో అవకాశం వచ్చింది. కొత్త అమ్మాయినైనా నాతోనే డబ్బింగ్‌ చెప్పించారు. తెలుగు మీద పట్టు సాధించడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఎందుకంటే డబ్బింగ్‌ అప్పుడు ఎడిటర్లు, సహదర్శకులు భాష మీద బాగా శ్రద్ధపెడతారు. ఈ పదాన్ని ఇలా పలకాలమ్మా... ఇక్కడ ఒత్తు పెట్టాలి... అని చెబుతుండేవాళ్లు. దాంతో ఉచ్చారణ మీద పట్టు వచ్చింది. అదీగాక నాకు కొంచెం జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక్కసారి వింటే ఏదైనా గుర్తుండిపోతుంది. ‘భార్య’ అనాలని ఎవరైనా ఒకసారి చెబితే చాలు... ఇక అదెప్పటికీ భార్యే... ఎప్పటికీ ‘బార్య’ రాదు నోట్లోంచి! ఇలా చాలా ధారావాహికలకు డబ్బింగ్‌ చెబుతూ తెలుగు నేర్చుకున్నా. కానీ, ఎప్పుడూ నిఘంటువులు చూడలేదు. నా రచయితలే నా నిఘంటువులు. కలిసి పనిచేసిన ప్రతి రచయిత, దర్శకుడూ  నాకు గురువే. వాళ్లందరూ కలిసి నాకు భాష నేర్పారు. ముఖ్యంగా బ్నిం గారు చాలా సాయపడ్డారు. నేను తెలుగు అమ్మాయిని కాదు. ఇంట్లో నేర్చుకోలేదు. భాషాపరంగా వేరే శిక్షణ ఏమీ తీసుకోలేదు. ఇక్కడి సామెతలు, పొడుపు కథలు తెలియదు. అయినా... వింటూ, కొత్తవాటిని తెలుసుకుంటూ నేర్చుకున్నా. తెలుగు బాగా మాట్లాడుతున్నావంటూ ఎవరైనా పొగిడితే పొంగిపోయేదాన్ని. బాగుంది అంటున్నారు కాబట్టి ఇంకా బాగా పట్టు సాధించాలనే ఆసక్తి వచ్చేది. 
తెలుగు మీద మీ అభిప్రాయం? 
ఆంగ్లంలో ఏం చెబుతామో అది రాయం. తెలుగులో అయితే ఏం చెబుతామో అది అక్షరాలా రాస్తాం. వేరే భాషల్లో లేని మహాప్రాణాక్షరాలు కొన్ని మనకు ఉన్నాయి. అవి భాషకు పెద్ద బలం. ఇప్పుడు తెలుగు నా ప్రాథమిక భాష అయిపోయింది. మలయాళం ద్వితీయ భాషగా మారింది! ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడుకుంటాం. మా పిల్లలకూ తెలుగు చదవడం, రాయడం వచ్చు. మలయాళం మాట్లాడగలరు కానీ రాయలేరు. నాకు కూడా ఎప్పుడో కేరళకు వెళ్తే తప్ప మలయాళంలో మాట్లాడే అవకాశం రావట్లేదు. ఈ రెండు భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల మీద పట్టు ఉంది. మాట్లాడటం నుంచి రాయడం వరకూ! తమిళం మాట్లాడగలను.
మాతృభాషను మర్చిపోతేనే మరో భాష వస్తుంది అంటుంటారు చాలా మంది...?
ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లడానికి అమ్మను వదిలేసినట్టుంటుంది! ఎప్పటికీ అమ్మ అమ్మే. ‘స్టార్‌ మహిళ’కు వచ్చేవాళ్లలో చాలామంది నాతో ఆంగ్లంలో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. వద్దమ్మా... తెలుగులో మాట్లాడండి అని చెబుతుంటాను. మనకు జన్మనిచ్చిన భాష మనకు ముఖ్యం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. పాశ్చాత్య ధోరణులకు పోయి ఆంగ్లం మాట్లాడాలనుకోవడం సరికాదు. అలా మాట్లాడటం కూడా మనకోసం కాదు. పక్కవాళ్లు మన గురించి గొప్పగా అనుకోవాలని! ఇలా చేయడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనకి మనం నిజాయితీగా ఉంటేనే మన భాషతో మనం సంతోషంగా సహజీవనం చేయగలుగుతాం. స్పానిష్, ఫ్రెంచ్‌ దేశాల వారిని చూడండి.. వాళ్లసలు వేరే భాష మాట్లాడరు. ఈమధ్య స్విట్జర్లాండ్‌ వెళ్లాను. వాళ్లకు ఆంగ్లం రాదు. వాళ్ల భాష తప్ప మరొకటి తెలియదు. జర్మనీ, ఇటలీల్లోనూ అంతే. వీళ్లెవరూ అనవసరంగా ఇతర భాషల జోలికి వెళ్లరు. ఉద్యోగం కోసం ఇంకో దేశానికి వెళ్తుంటే మాత్రం అక్కడి భాష నేర్చుకుంటారు. అంతేతప్ప, స్థానికంగా అన్ని పనులూ వాళ్ల భాషలోనే చేసుకుంటారు. అయినా వాళ్లు ఆనందంగా ఉండట్లేదా? వాళ్లలానే మనమూ మన భాషను గౌరవించుకోవాలి. తెలుగును తక్కువ చేసి మాట్లాడితే నేను భరించలేను. నా మాతృభాష మలయాళానికీ అంతే ప్రాధాన్యమిస్తా. మలయాళం నాకు జన్మనిస్తే, తెలుగు జీవితాన్నిచ్చింది. మావారి రూపంలో నాకో తోడునిచ్చిందీ తెలుగే. 
కూచిపూడి, వీణ నేర్చుకున్నట్టున్నారు...?
తన ఆసక్తులను నా మీద రుద్దింది అమ్మ! మొదట్లో తిట్టుకున్నా. కానీ, తర్వాత అవే నాకు బలమయ్యాయి. యాంకరింగ్‌ చేసేటప్పుడు సందర్భం వస్తే కూచిపూడి గురించి చెప్పడానికి, రెండు అడుగులు వేయడానికి ప్రాథమిక పరిజ్ఞానం అబ్బింది.  వీణ నేర్చుకోవడం వల్ల ‘స్వరాభిషేకం’ చేసేటప్పుడు రెండు కూనిరాగాలు అయినా తీయడానికి వీలైంది. అన్నింట్లోనూ కాస్త వేళ్లు పెట్టాను. అయితే కూచిపూడి మాత్రం ఏడేళ్లు నేర్చుకున్నా. మొదటి ఏడాది ‘వేళ్లు తెగాయి’. వాటిని బాగుచేసుకోవడానికి రెండో ఏడాది పట్టింది. మూడో సంవత్సరం నాటికి కాస్త నేర్చుకున్నా. మన సంప్రదాయానికి దగ్గరవ్వడానికి కూచిపూడి ఉపయోగపడుతుంది. ఏదో కాళ్లు, చేతులతో చేసే నృత్యం కాదు అది. హావభావాలు ప్రధానం. నటిగా రాణించడానికి అవే నాకు సాయపడ్డాయి. ఇక తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే కూచిపూడి పాటల వల్ల భాష మీద ఆసక్తి పెరిగింది. 
పుస్తకాలు చదువుతుంటారా?
ఒకప్పుడు నవలలు బాగా చదివేదాన్ని. ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు, జీవిత చరిత్రలు చదువుతున్నా. ‘పరుసవేది’ (‘ది అల్కెమిస్ట్‌’  తెలుగు అనువాదం) అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు తెలుగు చదవాలంటే.. అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ బాగా కష్టపడేదాన్ని. అలా చదువుతూనే పట్టు సంపాదించుకున్నా. 
ఇప్పటి తరంలో పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది కదా?
నిజానికి పుస్తక పఠనం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు పిల్లల్లో అదే లోపిస్తోంది. ఒకప్పుడు కథల పుస్తకం చదువుతుంటే... అందులో రాజులు, రాజ్యాలు... వాటితో సృజనాత్మకత, ఊహాశక్తి పెరిగేవి. బొమ్మలు ఉండేవి కాదు కాబట్టి... ఆ రాజుగారు ఇలా ఉండేవారు అని ఊహించుకుంటూ ఉండేవాళ్లం. దాంతో మెదడుకు పనిపడి, చురుగ్గా మారేది. చదివేదాంట్లోంచి రకరకాల కొత్త ఆలోచనలు వచ్చేవి. పుస్తక పఠనం వల్ల జరిగే పెద్ద మేలు ఇదే. మెదడు పనితీరు మెరుగై, సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కేవలం కళ్లకే పని. మన ప్రమేయం ఏమీ లేకుండా స్క్రీన్‌ మీద అన్నీ కనపడుతుంటే... ఇక మెదడు స్తబ్ధంగా మారిపోతోంది. పుస్తకాలు చదవడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. ఒకచోట కుదురుగా కూర్చొని చేయాల్సిన పనుల మీద పట్టు చిక్కుతుంది. ఆ నైపుణ్యాలన్నీ ఇప్పుడు పోతున్నాయి. అన్నట్టు, పుస్తకాల వల్ల కొత్త కొత్త పదాలు తెలుస్తాయి. వాటిని అర్థం చేసుకునే క్రమంలో భాషా నైపుణ్యం అలవడుతుంది. 
సినీ సాహిత్యంలో మీకు ఇష్టమైనవి...?
వేటూరి, సిరివెన్నెల గార్ల సాహిత్యం అంటే ఇష్టం. వాళ్ల పాటలు వింటూ పెరిగాను. ఇళయరాజా గారి సంగీతానికి వీరాభిమానిని. బాలూ గారూ, చిత్రమ్మ గళాల నుంచి వచ్చిన ప్రతి పాటకీ అభిమానినే. ‘ప్రేమ’ చిత్రంలోని ‘ఈనాడే ఏదో అయింది’ పాట అంటే ప్రాణం. కాలేజీ రోజుల్లో ఆ పాట నన్ను చాలా ప్రభావితం చేసింది. విశ్వనాథ్, బాపూ, మణిరత్నంగార్ల సినిమాలూ, వాటిల్లోని పాటలూ బాగుంటాయి. సాహిత్యం పరంగా ఆపద్బాంధవుడు చిత్రంలోని ‘ఔరా అమ్మకుచెల్లా’ ఇష్టం.. ఆ పాట వింటుంటే మనతో మాట్లాడినట్టు ఉంటుంది. నాకు రాముడు అంటే చాలా ఇష్టం. ‘శ్రీ రామ నీ నామమెంతో రుచిరా..’ పాట పాడుకుంటూ ఉంటా. 


ఉత్సాహానికి మారుపేరు 
సుమ స్వస్థలం కేరళ. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో సికింద్రాబాదులో స్థిరపడ్డారు.  సుమ నటించిన మొదటి ధారావాహిక పెళ్లిచూపులు. ఆ తర్వాత మేఘమాల, మందాకిని, సమత, ఆరాధన, అన్వేషిత, జీవనరాగం తదితర యాభై ధారావాహికల్లో నటించారు. ప్రముఖ నటుడు దేవ్‌దాస్‌ కనకాల కుమారుడు రాజీవ్‌ కనకాలతో వివాహమయ్యాకా వ్యాఖ్యాతగా కొనసాగుతూనే ఉన్నారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా, కోడలిగా, భార్యగా బహుముఖ పాత్రలు పోషిస్తూ... చిన్నతెర ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా ముద్ర వేసుకున్నారు. యావత్‌ తెలుగు మహిళల మనసు దోచుకున్న ఈటీవీ స్టార్‌ మహిళ వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడమే కాదు.. అన్ని ధారావాహికలకు వ్యాఖ్యాతగా పనిచేసినందుకు లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం కూడా దక్కింది. 


యాంకరింగ్‌ అంటే పూర్తిగా భాషతోనే పని. దీనికోసం చేసే కసరత్తు?
ఎప్పటికప్పుడు కొత్త పదాలు, మాటలు, వ్యక్తీకరణలు తెలుసుకుంటూ ఉంటా. వాటన్నింటినీ నా బుర్ర అనే ఏటీఎంలో నిక్షిప్తం చేసుకుంటా. సమయం సందర్భాలను బట్టి వాటిని బయటకు తీస్తుంటా. వ్యాఖ్యాతగా నేను రాణించాలంటే.. ప్రేక్షకులకు నేను బోర్‌ కొట్టకుండా ఉండాలి. దానికి ముందు నాకు నేను బోర్‌ కొట్టకూడదు. నేను చేసేది నాకే రోతగా అనిపించకూడదు. దానికోసం  ఎప్పటికప్పుడు నన్ను నేను అప్‌డేట్‌ చేసుకుంటా. ఒక్క ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమమే ఇప్పటికి రెండున్నర వేల ధారావాహికలు పూర్తయింది. సాధారణంగా అయితే చూసేవాళ్లతో పాటు చేసేవాళ్లకీ విసుగ్గా అనిపిస్తుంది. నేను మాత్రం ఎప్పటికప్పుడు షోని ఇంకా కొత్తగా చేయాలనుకుంటా. ఏ రోజుకారోజు జరిగే సంఘటనలను నా షోకి అనుసంధానించుకోవడానికి ప్రయత్నిస్తుంటా. ఈ ప్రయాణంలో రోజుకో మధురానుభూతి! ముఖ్యంగా చిన్నపిల్లలు వచ్చి హత్తుకునే సందర్భాలుంటాయి. రెండు మూడేళ్ల వాళ్లూ నన్ను ‘సుమ’ అంటారు. వాళ్లతో మాట్లాడటం.. అమాయకమైన వాళ్ల కళ్లలోకి చూడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. 
వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన చాలామందిని కలిశారు కదా. వాళ్ల వాళ్ల తెలుగును వింటుంటే ఏమనిపిస్తుంది?
ఒక్క ‘స్టార్‌ మహిళ’ ద్వారానే వేల మంది మహిళల్ని కలిశా. అన్ని యాసలూ విన్నాను. ప్రతిదీ బాగుంటుంది. నన్ను కలిసిన వాళ్లు... వాళ్ల యాసలో మాట్లాడటానికి మొహమాటపడతారు. అదో ఇబ్బందిగా భావిస్తారు. అందుకు నేను ఒప్పుకోను. మీ యాస... మీ మాండలికంతోనే మీకు గుర్తు, గుర్తింపు. దాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు.... అందులోనే మాట్లాడండి అని ప్రోత్సహిస్తుంటా. అంతేకదా.. ఎవరి యాస వారికి గొప్ప. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గు పడాల్సిన అవసరం లేదు. మాండలికం అనేది పూర్వీకుల నుంచి మనకు వచ్చిన నిధి. దాన్ని మనం కాపాడుకోవాలి. తెలుగునాట రాయలసీమ భాష గొప్పదనం దానిదే. గోదావరి జిల్లాల యాస ఉయ్యాలలో ఊగుతున్నట్టు హాయిగా ఉంటుంది. ఉత్తరాంధ్ర యాస తియ్యగా ఉంటుంది. తెలంగాణ భాష  హైదరాబాద్‌ బిర్యానీ తిన్నంత బాగుంటుంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల తెలుగులో మరో ప్రత్యేకత! నాకన్నీ నచ్చుతాయి. సందర్భాన్ని బట్టి నేను అన్ని యాసలూ మాట్లాడుతుంటా.
నేటితరం కథానాయికల్లోనూ చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు కదా?
వాళ్ల పట్టుదల చూస్తే భలే ముచ్చట వేస్తుంది. ఒకప్పుడు తెలుగు అమ్మాయిలే నాయికలుగా వచ్చారు. తర్వాత ముంబయి వాళ్లు వచ్చారు. భాషపరంగా చాలా ఇబ్బంది పడినా... నటించి వెళ్లిపోయేవారు. ఇప్పుడు బాగా చదువుకున్న అమ్మాయిలు నాయికలుగా వస్తున్నారు. వృత్తి పట్ల చాలా నిబద్ధత, అంకితభావాలతో ఉంటున్నారు. నటనతోపాటూ భాష మీద దృష్టి పెడుతున్నారు. తెలుగు నేర్చుకుంటున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్, నిత్యామేనన్, తమన్నా, రెజీనా, సమంత.. అందరూ ఎంచక్కా తెలుగు మాట్లాడుతున్నారు. నిత్యామేనన్‌ అయితే ఏకంగా పాటలూ పాడుతోంది. బాలీవుడ్‌ తర్వాత అంత మార్కెట్‌ ఉన్న సినీ పరిశ్రమ మనదే. ఇక్కడ నెగ్గాలంటే ఎన్నో నైపుణ్యాలు అవసరం. అందులో భాష ముఖ్యమైందని వాళ్లు తెలుసుకున్నారు. ఆ మేరకు పోటీ పడుతున్నారు. రెండో సినిమాకే సొంతంగా డబ్బింగ్‌ చెప్పేంతగా తెలుగు నేర్చుకుంటున్నారు. అందుకు వాళ్లను అభినందించాల్సిందే.
మరి ఇక్కడి వాళ్లే అమ్మభాషను మర్చిపోతున్నారు?
ఇక్కడ చాలామంది పిల్లలకి తెలుగు చదవడం, రాయడం రాదు. మాట్లాడటం రాని వాళ్లూ ఉన్నారు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆంగ్లం మీద తల్లిదండ్రులకు ఉన్న అమిత వ్యామోహం వల్లే ఇలా జరుగుతోంది. రోజూ ‘యూ టాక్‌ ఇన్‌ ఇంగ్లిష్‌’ అని చిన్నారులకు చెబుతుంటే... వాళ్ల టాకూ, వాకూ రెండింట్లోనూ తెలుగుదనం కనిపించదు. ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్లకు తెలుగు నేర్పాలన్నా సాధ్యం కాదు. భాషను వదిలేస్తుండటం వల్ల బంధాలూ, బంధుత్వాలనూ మరిచిపోయే పరిస్థితి వస్తోంది. దాన్ని నిలువరించాలంటే ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. తర్వాత విద్యావ్యవస్థలోనూ మార్పులు రావాలి.  తెలుగును చదవడం తప్పనిసరి చేయాలి. అప్పుడే తెలుగుకు మంచి రోజులు వస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం