తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

వారి సాంగత్యం నుంచే నా సాహిత్యాభిలాష

  • 621 Views
  • 8Likes
  • Like
  • Article Share

    ఎస్‌.వి.సూర్యప్రకాశరావు

  • అనుభవజ్ఞులైన పాత్రికేయులు
  • చెన్నై.
  • 988482137

నా పాట నీ నోట పలకాల సిలక/ నీ బుగ్గలో సిగ్గు లొలకాల సిలక...  ‘మూగమనసులు’ చిత్రంలోని ఈ అజరామర గీతం అంత వినసొంపుగా రూపుదిద్దుకోవడానికి ఓ సహాయ దర్శకుడి సూచన కారణమైంది. ఈ పాటలో ‘చిలక’కు బదులు ‘సిలక’ అంటే చాలా బాగుంటుందన్న ఆ సూచనను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పరమానంగా స్వీకరించారు. ఆనాటి దర్శక దిగ్గజం ఆదుర్తికి ప్రియశిష్యుడు, ఆత్మబంధువు అయిన ఆ సహాయ దర్శకుడేే కాశీనాథుని విశ్వనాథ్‌. తర్వాతి కాలంలో  ‘కళాతపస్వి’గా తెలుగు సినీ వినీలంలో మెరిసిన కృష్ణ తరంగాల సారంగరాగం. ‘శంకరాభరణం’ చిత్రంతో విశ్వఖ్యాతి గాంచిన తెలుగు జాతి కీర్తి తటాకంలో విరిసిన ‘స్వర్ణకమలం’. సంగీత సాహిత్య సమలంకృతంగా తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.:చలన చిత్రరంగంలోకి మీ ప్రవేశం..?

విశ్వనాథ్‌: యాదృచ్ఛికంగానే జరిగింది. పొట్ట పోసుకోవడమే ప్రేరణ. చదువుకున్నాను కాబట్టి, ఉద్యోగం చేయాలి కాబట్టి, సినిమాల్లో శబ్దగ్రాహకుడిగా అవకాశం లభించి ఆ ఉద్యోగంలో చేరాను. మా నాన్నగారు కాశీనాథుని సుబ్రహ్మణ్యం అప్పట్లో వాహినీ సంస్థ మేనేజర్‌. నా చదువు పూర్తయ్యేప్పటికి వాహినీలో యువ సాంకేతిక నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని తెలిసింది. అలా శబ్దగ్రాహకుడిగా వాహినీలో చేరాను. నా మొదటి చిత్రం ‘గుణసుందరి కథ’. నిజానికి నాకు ఈ సినీ రంగం పట్ల ఎలాంటి కలలు, ఆశయాలు, ఆశలు లేవు. పెద్ద   భవంతిలో ఏసీ గదిలో కూర్చుని ఫైళ్ల మీద సంతకాలు పెట్టడం, పక్కనే నౌకరు కారు డోరు తెరిచిపట్టుకుంటే అందులో ఎక్కడం... ఇలాంటి ఉద్యోగం చేయాలనే కలలు ఉండేవి. నా చిత్ర రంగ ప్రవేశం నా అభిమతానికి భిన్నంగానే జరిగింది. 
శబ్దగ్రాహకుడిగా మీరు ప్రవేశించినప్పుడు సినీ సంగీతంలో స్వర్ణయుగం నడుస్తోంది. ఆనాటి అనుభవాలు..
వాహినీ సంస్థ తరపున గుణసుందరి కథ మొదలుకుని లైలామజ్నూ, మాంగల్యబలం.. ఇలా ఎన్నో చిత్రాలకు శబ్దగ్రాహకుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఎందరో సుప్రసిద్ధ దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులతో పరిచయం, డైలాగ్‌ మాడ్యులేషన్‌ విషయంలో నేను వృత్తిపరంగా చేసిన సూచనలు, వివిధ శాఖలు పనిచేయడాన్ని గమనించిన తీరు భావిలో నేను దర్శకుడు కావడానికి నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి. ఇదీ యాదృచ్ఛికమే. 
దర్శకత్వ శాఖలోకి ఎలా వచ్చారు?
శబ్దగ్రాహకుడిగా ఉన్నప్పటి నుంచి ఆదుర్తి సుబ్బారావుగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయన నా సూచనలను, అభిప్రాయాలను గౌరవించి ప్రోత్సహించేవారు. దర్శకత్వ శాఖలో ప్రవేశించడానికి ఇది కారణమైంది. సహాయ దర్శకుడిగా చేస్తున్నప్పుడు, ఆయన ఓ సీన్‌ పేపర్‌ను రెండు ముక్కలుగా చించి మొదటి భాగం ఇచ్చి తీయమనేవారు. ఆ సగం భాగం సన్నివేశంలో పాత్రలు, సంభాషణలను జాగ్రత్తగా గమనించి దానికి అనుగుణంగా సన్నివేశాన్ని, సంభాషణలను మార్చి తీసేవాణ్ని. ఆయన నాకు ఇచ్చిన స్వాతంత్య్రం ఎంతటిదంటే ఆయన కూర్చుని అంతా నాతోనే చేయిస్తున్నారని బయటవారు అనుకునేలా ఉండేది. వాస్తవం అది కాదు. ఆయన చెప్పినట్లు, ఆయన రూపకల్పన చేసిన సన్నివేశాన్ని కార్యాచరణకు అనుకూలంగా మార్చడమే నేను చేసిన పని. దర్శకుడుగా మారిన తర్వాత కూడా ఆయన కోరిక మేరకు ‘తేనె మనసులు, సుడిగుండాలు, మరోప్రపంచం’ చిత్రాలకు స్క్రిప్ట్‌ విషయంలోను, ఇతరత్రానూ పని చేశాను. ‘తేనెమనసులు’ కోసం నటీనటుల ఎంపిక, వారికి శిక్షణ వంటి బాధ్యతలనూ ఆదుర్తిగారు నాకు అప్పగించారు. ‘మూగమనసులు’లో జమునకు సంభాషణలు పలకడంలో శిక్షణ ఇచ్చాను. 
సంగీత సాహిత్యాల పట్ల మీ చిత్రాల్లో ప్రత్యేక శ్రద్ధ, ప్రాముఖ్యం కనిపిస్తాయి. ఈ అభిరుచి మీలో ఏర్పడడానికి పునాది ఏంటి?
పునాది అని చెప్పనుగాని మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన సాహిత్య సంగీతాల పట్ల నాకు గల భక్తి, గౌరవం. వాటిని కాపాడుకోవాలనే తపన. మహోన్నతమైన మన కళల గొప్పతనాన్ని పామరులకు సైతం తెలియజెప్పాలనే కోరిక ఇందుకు కారణం. ఇక విద్యార్థిగా నేను బడిలో వ్యాసాలు రాసేటప్పుడు నీతి వాక్యాలు రాయమనేవారు. ఆ నీతి వాక్యాలను గమ్మత్తుగా ద్విపదలో కవితగా రాసేవాణ్ని. ఇది బహుశా నాలో సాహిత్యాభిలాష పెంపొందడానికి కారణమై ఉండవచ్చు.
కవులు, సాహితీవేత్తలతో మీ పరిచయాలు, వారితో అనుబంధం..?
వాహినీలో శబ్దగ్రాహకుడిగా పనిచేస్తున్నప్పుడు ‘మల్లీశ్వరి’ చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను తన పెద్దకుమారుడిగా అభిమానించి ఆదరించేవారు. వారి సాంగత్యంలో సహజంగానే నాలో సాహిత్యాభిలాష పెంపొందింది. తర్వాత ఆత్రేయగారు. సహాయ దర్శకుడిగా నేను ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రంలో ఓ పాటకు ‘పాడమని నన్నడగవలెనా’ అనే పల్లవిని సూచించాను. తర్వాత సన్నివేశంలో ‘పాడమని నన్నడగతగునా’ అనే పల్లవినీ నేనే సూచించాను. నా సినిమాల్లోనూ నేను రూపకల్పన చేసుకున్న సన్నివేశాలకు అనుగుణంగా పాటలకు పల్లవులు నేను అనుకుని కవులకు సూచించడం, వారు సహృదయతతో ఆమోదించడం నా అదృష్టం. ఒకసారి ఆత్రేయగారు తన పారితోషికంలో అప్పట్లో రూ. పది వేలు నాకు ఇచ్చారు. ఎందుకండీ అంటే ‘పాట నాదైనా మాటలు నీవే కదా’ అన్నారు. ఆత్రేయగారి ద్వారా శ్రీశ్రీ, అన్నపూర్ణ సంస్థ ద్వారా దాశరథి, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఇలా మహాకవులెందరితో కలిసి పనిచేసే భాగ్యం కలిగింది.
మీరు సూచించిన ఆ పల్లవులు ఏంటి?
ఆత్మగౌరవంలో ‘మారాజులొచ్చారు’, ‘అందెను నేడే అందని జాబిల్లి’, శ్రుతిలయలులో ‘తెలవారదేమో స్వామి’, స్వరాభిషేకంలో ‘కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన’, ఉండమ్మా బొట్టుపెడతాలో ‘రావమ్మా మహాలక్ష్మీ’... ఈ పల్లవులన్నీ నేను సూచించినవే. ఇంకా చాలా ఉన్నాయి. దాశరథిగారు రాసిన ఒక పూలబాణం, ఆరుద్రగారు రాసిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ తర్వాత నేను తీసిన శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, సప్తపది, స్వాతికిరణం తదితర చిత్రాలన్నింటిలోను జనాదరణ పొందిన గీతాలన్నీ నేను సాహిత్యం మీద అభిలాషతో, అనురక్తితో రాయించుకున్నవే. చెల్లెలి కాపురం పతాక సన్నివేశంలో ‘చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన’ పాట డాక్టర్‌ సి.నారాయణరెడ్డిగారితో ఆ సన్నివేశానికి తగిన రీతిలో రాయించుకున్నాను. సాహిత్యం పట్ల అభిమానం, భక్తి లేకపోతే ఇంత మంచి పాటలను అందించే అవకాశం ఉండేది కాదు కదా. నారాయణరెడ్డి గారి కలానికి రెండు వైపులా పదునే. ‘విశ్వంభర’ వంటి మహా కావ్యాన్ని రాసిన ఆ సాహితీ స్రష్ట నా చిత్రాలకు పాటలు రాయడం వల్ల నాకు, నా సినిమాలకు ప్రతిష్ఠ మరింత పెరిగింది.
వేటూరి, ‘సిరివెన్నెల’లను పరిచయం చేసిన ఘనత మీదే కదా!
సినీరంగానికి రాకముందే వాళ్లు గొప్ప  సాహితీవేత్తలు. వాళ్ల ప్రతిభను నాకు కావాల్సిన రీతిలో ఉపయోగించు కున్నానంతే. వేటూరి గారితో ఓ సీత కథలో ‘భారత నారీచరితము’ అనే పల్లవితో హరికథ రాయించాను. తర్వాత సిరిసిరిమువ్వతో ఆయన ఎంత మహోన్నత ప్రతిభాశాలో లోకానికి వెల్లడైంది. ఆ తర్వాత శంకరాభరణం, సప్తపది... ఇదంతా మనందరికీ తెలిసిన చరిత్ర. అలాగే ఓసారి సీతారామశాస్త్రిగారు రాసిన ‘గంగావతరణం’ ఘట్టాన్ని ఎవరో ప్రదర్శిస్తే చూశాను. ఆయనలోని కవితా ప్రవాహం నన్నెంతో ముగ్ధుణ్ని చేసింది. సిరివెన్నెల చిత్ర సమయంలో ‘విరించినై విరచించితిని’ పాట చూసి అన్ని గీతాలూ ఆయనతోనే రాయించాను. అందులో శబ్ద సౌందర్యం నన్ను ఆకట్టుకుంది. ‘ప్రాగ్దిశవీణియపైనా, దినకర మయూఖ తంత్రులపైనా’ అనే అందమైన పదాలు నన్నెంతో ఆకర్షించాయి. ఈ అభిరుచితోనే సంస్కృత పదాలైనప్పటికీ వాటిని అలాగే ఉంచాను. జనం ఆదరించారు. కారణం శబ్ద సౌందర్యాన్ని పామరులు సైతం ఆదరిస్తారన్న నా నమ్మకం. సినిమాల ద్వారా వినోదంతోపాటు, భాషా వికాసాన్ని, విజ్ఞానాన్ని సందర్భానుసారంగా అందించాలనేది నా నిశ్చితాభిప్రాయం.
ప్రస్తుతం తెలుగు సినిమాలు, సంగీత సాహిత్యాలు ఆరోగ్యకర వాతావరణంలో ఉన్నాయా?
కాలమాన పరిస్థితుల వల్ల ఎన్నో రంగాలలో కాలుష్యం వచ్చి చేరింది. దాంతో అనర్థాలు ఎదురవుతున్నాయన్న స్పృహ పెరిగాక ఆరోగ్యకర వాతావరణం కోసం మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.   సేంద్రియ ఆహారం వంటి పద్ధతులు వస్తున్నాయి. సినిమా రంగంలో కూడా మంచి సంగీతం, సాహిత్యం కథలు వచ్చే అవకాశం ఉందనే నమ్ముతాను. అయితే మన ఆచార వ్యవహారాలు, భాష, కట్టుబాట్లను చూపిస్తూ ఎన్నో చిత్రాలు వచ్చాయి. ‘ఉండమ్మా బొట్టుపెడతా’లో ధూళిపాళ ద్వారా మన గ్రామాల్లో హరికథలు చెప్పుకునే వారి కట్టుబాట్లు, బతుకులు ఎలా ఉంటాయో చెప్పాను. మా గురువు కూడా మూగమనసులు, వెలుగునీడలు లాంటి చిత్రాల్లో మన ప్రాంతీయతను ప్రతిబింబించే సన్నివేశాలను చిత్రించారు. ఆ తర్వాత కూడా ఈ కోవలో చిత్రాలు కొన్ని వచ్చాయి. కళలను ఆదిరించేవారు, ఔత్సాహికులను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే, ప్రజలకు వాటిని ఆదరించే రీతిలో వాటిని వాళ్ల దగ్గరకు తీసుకువెళ్లగలిగితే ఇవి కనుమరుగవ్వవు.
ఇప్పుడు తెలుగు భాష స్థితిగతుల పట్ల మీ పరిశీలన?
మాతృభాష మాతృమూర్తితో అంటే దైవంతో సమానం. కానీ, మారుతున్న నాగరికతకు, సంస్కృతికి అనుకూలంగా మారుతున్న భాషకు ఎలా అడ్డుకట్ట వేస్తాం? రైలు లాంటి పదాలు మన జీవన స్రవంతిలో భాగాలైపోయాయి. చిన్నప్పుడు మేం ఇడ్లీలు, దోశలు ఇష్టపడుతున్న కాలంలో చల్దన్నం, తరవాణి తినమని మా బామ్మలు అనేవారు. ఇప్పుడు పిల్లలు పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మార్పు అనేది సహజం. ఆ క్రమంలో చాలా ఆంగ్ల పదాలు తెలుగు వాడుక భాషలో వచ్చి కలిసిపోతున్నాయి. అయితే, అమ్మానాన్నలను మమ్మీ డాడీ అంటుంటే మాత్రం మనసు చివుక్కుమంటుంది. ఈ విషయంలో మాత్రం పిల్లలకు మన సంస్కృతిని నేర్పించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధికి అనుగుణంగా స్థానికేతర భాషలను ముఖ్యంగా ఆంగ్లాన్ని నేర్చుకోవడం తప్పనిసరి అయింది. అయితే, మన భాషను మరిచిపోకుండా ఇతర భాషల్ని అభివృద్ధికి ఆలంబనగా ఉపయోగించుకోవాలి. 
ఇక్కడి వారికంటే ప్రవాసులే భాషాసాహిత్యాలను కాపాడుకుంటున్నట్లున్నారు కదా?
ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో మన తెలుగు భాషకూ, సంగీత సాహిత్యాలకూ ఎంతో ఆదరణ లభిస్తోంది. అక్కడి తెలుగు నవతరం మన భాషను, కళలను బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. కాశీలో ఉంటున్న వాళ్లంతా రోజూ అన్నపూర్ణను దర్శించరు కదా. అలాగే, విజయవాడలో ఉంటూ కృష్ణమ్మను దర్శించని వాళ్లు, పుష్కరాల్లో స్నానం చేయని వాళ్లు ఉండవచ్చు. స్వస్థలంలో భాష పట్ల ఒకింత ఉపేక్ష భావం, ప్రవాసంలో మాతృభూమికి దూరమైపోతున్నామేమో అనే చింతతో భాష పట్ల ఒకింత ఎక్కువ శ్రద్ధ, అభిమానం సహజం.
ఇన్నేళ్ల మీ ప్రస్థానం గురించి...
నా సినిమా కథలకు సంబంధించి, నా అభిరుచికి ఆలోచనలకు తగ్గట్టుగా మహాకవులు, రచయితలతో రాయించుకోవడం, అవి జనాదరణ పొందడం జరుగుతోంది. ఈ కీర్తి నా ఒక్కడిదే అని నేను ఏనాడూ అనుకోను. ఇక సాధించిన దానితో సంతృప్తి చెంది అదే భాగ్యమనుకుంటే పొరపాటోయి అని శ్రీశ్రీ చెప్పినట్లు సృజనాత్మక కళారాధనలో ఏ కళాకారుడికీ సంతృప్తి ఉండదు. దీనికి అంతులేదు.


"మాతృభాష మాతృమూర్తితో అంటే దైవంతో సమానం. అమ్మానాన్నలను మమ్మీ డాడీ అంటుంటే మనసు చివుక్కుమంటుంది. ఈ విషయంలో పిల్లలకు మన సంస్కృతిని నేర్పించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధికి అనుగుణంగా స్థానికేతర భాషలను ముఖ్యంగా ఆంగ్లాన్ని నేర్చుకోవడం తప్పనిసరి అయింది. అయితే, మన భాషను మర్చిపోకుండా ఇతర భాషల్ని అభివృద్ధికి ఆలంబనగా ఉపయోగించుకోవాలి. "


విలువలే ప్రాణం
తెలుగుదనం నిండిన కళాత్మక చిత్రాలకు ప్రాణం పోసిన కె.విశ్వనాథ్‌ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పెద్దపులివర్రు. ప్రాథమిక విద్య అక్కడే చదువుకున్న ఆయన, హైస్కూల్‌ విద్యను విజయవాడలో పూర్తిచేశారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్, ఏసీ కళాశాలలో బీఎస్సీ చేశారు. పందొమ్మిదో ఏట సినీ రంగంలో ప్రవేశించారు. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శృతిలయలు, స్వరాభిషేకం చిత్రా0లు జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాయి. సప్తపది అయితే ‘నర్గీస్‌దత్‌ జాతీయ సమైక్యతా చిత్రం’గా ఎంపికైంది. విశ్వనాథ్‌ కళాసేవకు గుర్తింపుగా రఘుుపతి వెంకయ్య, పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి