తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ధిక్కరణతోనే భాష బతుకుద్ది!

  • 565 Views
  • 10Likes
  • Like
  • Article Share

కన్నీరు పెడుతున్న పల్లె రూపాన్ని కళ్లకు కట్టినా... మందెంట పోతున్న యలమంద గురించి చెప్పినా... తెలంగాణ గుండె గోసకు తన గొంతుక అరువిచ్చినా... పైరూ పిట్టా, చెట్టూ పుట్టా, వాగూ వంకా దేనిమీద పాడినా... ఆ పాటలో గోరటి వెంకన్న ముద్ర స్పష్టంగా కనపడుతుంది. వస్తువు ఏదైనా సరే, గుండెను తడిమేలా రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రకృతి ఒడిలో ఓనమాలు దిద్దుకుని, ఓ వాగ్గేయకారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న ఈ పాటల బాటసారిని ఇటీవల ‘కాళోజీ పురస్కారం’తో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 
తె.వె.: కాళోజీ పురస్కారం అందుకోవడం ఎలా అనిపిస్తోంది?

గోరటి: కాళోజీ, దాశరథులు ఈ ధరణి కావ్యరుచులని చెప్పిన నేను ఓచోట. కాళోజీని ప్రస్తావిస్తూ చాలా రాసిన. ఆయన పీడిత ప్రజల కవి. సమాజంలోని అసమానతలను ఎలుగెత్తి ప్రశ్నించిన కవి. కాళోజీగారి చాలా సభలు చూసిన, ఆయన సమక్షంలో చాలా పాటలు పాడిన. ఖమ్మంలో ఒకసారి 1994లోనో 95లోనో తెలంగాణ సదస్సు పెట్టారు. అందులో కాళోజీగారు, నేను ఇద్దరం వక్తలం. పాట పాడుతూ ఉపన్యాసం ఇచ్చిన. నేను మాట్లాడినంత సేపు వారున్నారు. చాలా సంతోషపడ్డరు. అలాంటి మహాకవి పేరిట ఏర్పాటుచేసిన పురస్కారానికి ప్రభుత్వం నన్ను ఎంపికచేసినందుకు సంతోషపడుతున్న. 
మీ పాటకు... మీలోని కవికి ప్రేరణ ఏంటి?
ఊర్కపోయి ఏం తోయక రాయడం! తోయకపోవడం అనేది ఓ శూన్యం. మనసులో ఓ ఖాళీ ఉంటది. భౌతికంగా పని ఉంటది. అన్నీ ఉంటయి. కానీ మనసులో ఆ ఖాళీ అలాగే ఉంటది. లేమిలో సౌఖ్యాన్ని అనుభవించిన కుటుంబం మాది. నాన్నగారు గొప్ప పండితుడు. భాగవత పద్యాలు, నాలుగైదు శతకాలు, వందల కొద్దీ యక్షగానాలు, వెయ్యి కీర్తనలు పాడేవారు. ఆయనకు అంత ధారణ ఉండేది. ఆయన యక్షగానాలు వేసేవారు. నేనూ వేశాను. ఆరో తరగతిలో పాటలు రాసుకునేది. ‘‘ఏమి జాము పొద్దు ఎన్నెల పొడిసితే... ఎరువు బండి కట్టి ఎద్దులను కట్టి... పేటగడ్డ నుంచి పడమర దుక్కెరిగి... రాళ్లపాక మీద రాగాలు తీస్తుంటే... ఆ కంచుగొంతుకు... ఆకసాన పోయే కాకి’’... ఆ వయసులో ఇది పాటని కూడా తెల్వదు. ఒకాయన చెప్పాడు. ఇప్పటికీ నాకు అంత్యప్రాసలు, అలంకారాలు తెలియవు. తెలిసీతెలియని వెర్రితనం ఉంటే వాటంతటకవే వచ్చేస్తాయి. ఆ వెర్రితనం కాపాడుకున్నంతవరకూ రాస్తం. అది కాపాడుకోవాలంటే పెద్ద నరకయాతన ఉంటది. రచయితలంటే గొప్పవారు కాదు. అలా నడుస్తుంటది ఏదో రసాయనిక చర్యలా. మనసున ఏదో ఒకటి ఇష్టమవుతది. నవ్వో, దుఃఖమో, బాధో, సుఖమో! అది పేలిపోతుంది. 
మీకు ప్రత్యేకంగా ప్రకృతి అంటే ఇష్టం కదా? 
‘‘ఓ పుల్లా, ఓ పుడుకా, ఎండుగడ్డీ, చిన్నకొమ్మా, చిట్టిగూడూ, పిట్ట బతుకే ఎంతహాయీ...’’ అని పాడా. నా ఖాళీతనాన్ని, వెర్రితనాన్ని ఆ పిట్టలో చూసుకున్న. మనలను మనం సంతృప్తి పరుచుకోవడానికి ఇట్లాంటి వస్తువు ఎన్నుకోవడం ఉంటది. ఆ పిట్ట ఎట్లా బతుకుద్దో అట్లా బతికితే ఏమవుతదని నన్ను నేను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తా. అట్లా ప్రకృతిని చూస్తూ ఏది కనపడితే అది రాయడం మొదలుపెడతా. సాయంపూట ఆకాశం పూసినప్పుడో, చిరునవ్వు వర్ణంబులు సాంతులత గంధములు... విరిసిన గన్నేరు వగరు వాసన... వీటిని ఆరాధించినప్పుడు పాట పుడుతుంది. ఎందుకంటే రాగం రావాలంటే మూడ్‌ ఉండాలె. రిషభం షడ్జమం అవన్నీ ప్రకృతే నేర్పుతుంది. అలాంటి సమయంలో విశ్వ ప్రకృతి గురించి ‘‘విశ్వరమణీయాల వింతజలచక్రమూ... అవని సుట్టు అల్లుకున్న అందమైన చక్రమూ’’ అని మైమరిచి పాడతా. కానీ, ఇది మా ఊళ్లో పాడితే ఎక్కదు కదా. అందుకే ‘‘వానొచ్చేనమ్మా వరదొచ్చెనెమ్మా... వానతోపాటుగా వణుకొచ్చెనమ్మా... చెట్లకురుల మీద బొట్లుబొట్లు రాలి గట్ల బండల మీద గంధమై పారింది... కొట్టాముపై వాలి మట్టంత కడిగింది కోడిపుంజు జుట్టు కొంటెగా తాకింది...’’ అని అందుకుంటా. 
స్ఫూర్తినిచ్చే కవులు? 
విశ్వనాథ, పుట్టపర్తి, ఆరుద్ర, దాశరథి, కృష్ణశాస్త్రి... ఇలా అనేకమంది మహాకవులు. నాకు బాగా ఇష్టమైన కవి కృష్ణశాస్త్రి. ఆ తర్వాత దువ్వూరి రామిరెడ్డి, నాజరు, గద్దరు... వీళ్ల ప్రభావంతో వారంతా నడిచిన దారిలో వెళ్తున్నా. యక్షగాన సాహిత్య ప్రభావమూ ఉంది. ఏ కవిత్వం రాసినాగానీ ఒక మైకం ఆవరించకుండా రాయవద్దనేది నా మాట. ఆ మైకంలో పదాలు కొట్టుకురావాలె. అట్లా వస్తేనే కవిత్వం. ఈ విషయంలో పుట్టపర్తివారిని ఎప్పుడూ అనుసరిస్త. ఆయన ‘శివతాండవం’... ‘ఆడెనమ్మా! శివుడు పాడెనమ్మా! భవుడు’.... చదివితే ఇది అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా అల్లాడి తల్లాడి రాయడం ఒక పద్ధతి. కానీ ఒక ఫ్లోలో నిన్నునువ్వు తగ్గించుకుని, నువ్వు తప్పించుకుని నీలోని కవిత్వాన్ని పైకి తెచ్చే పద్ధతి ఇంకోటి ఉంది. అది తాత్విక విన్యాసమా, వెర్రిబాగులతనమా, నీకెవరూ కనబడని ఒక అభిజాత్యమా... ఏదైనా కానీ, అది ఆవహించినప్పుడే పాటలు రాస్త. అలా అని ఊరికే చెప్పడమన్నది కవిత్వం కాదు కదా! కవిత్వంలో సౌందర్యం ఉండాలె. అందుకే నాకు ప్రబంధ సాహిత్యమన్నా చాలా ఇష్టం. పింగళి సూరన, అల్లసాని పెద్దన ఇష్టం. కాళిదాసు రచనలు బాగా ఇష్టంగా చదువుకున్న. ఆటవెలది, కందాల్లో చిన్నచిన్న పద్యాలూ రాస్తున్న.
రాయలసీమ రచయితలతో మంచి అనుబంధం ఉన్నట్లుంది?
మా మహబూబ్‌నగర్‌ జిల్లా భాష, సంస్కృతి సీమకు దగ్గరగా ఉంటాయి. అట్లాగే గిద్దలూరు, మార్కాపురం, కంభం ప్రాంతాలతోనూ కొంచెం సారూప్యత ఉంటది. అదీగాక రాయలసీమలో బాగా తిరిగా. మా ఊరు సత్రాల్లో మాదిరిగానే సాధువులు, బైరాగి తత్వాలు సీమ ఊరూరునా మారుమోగుతుండె. అక్కడ చూసిందంతా ‘‘ననుగన్న తల్లి నా రాయలసీమ రతనాలసీమ’’ పాటలో రాశా. రాయలసీమ రచయితలు నాకు బాగా ఇష్టం. కేశవరెడ్డి, మధురాంతకం రాజారాం, నరేంద్ర, సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి... చాలామంది ఉన్నారు. రాచపాళెం మొదలుకుని ఎందుకో సీమ రచయితలతో నాకు అంత సాన్నిహిత్యం ఉంటది. అక్కడ నాకు మిత్రులూ ఉన్నరు. రాయలసీమలో కొంచెం ప్రశాంతత ఉంటది. ఇక్కడంత వేగం ఉండదు. వేగంలేని చోటు నాకిష్టం. వేగం అంటే ఆలోచనల వేగం... వెంపర్లాడటం. ఉత్తరాంధ్ర మీదా నేను పాట రాసిన.
ఓ కవిగా మీరు ఎదిగిన క్రమం?
మహాత్ములు, మాన్యులు, ప్రజలు, వాళ్ల మౌఖిక సాహిత్యం, ప్రకృతిలోంచే నేను నేర్చుకున్న. బాల్యంలో శతకాలు, కృష్ణశాస్త్రి గేయాలు, యక్షగానాలు... అంతా వాటి గొప్పతనం. ఇక మార్క్సిజం, నాకు నేను అంగీకరించినది. దుఃఖం గురించి వాల్మీకి ఎప్పుడో చెప్పాడు. దుఃఖితులు, దీనులకు కొంచెం దగ్గరగా ఉంటే మంచి సాహిత్యం వస్తది. రావిశాస్త్రి మొదలుకుని కారా మాస్టారు వరకు అందరూ దీన్ని చెప్పినవారే. దైవంలా దండం పెట్టుకునే కేశవరెడ్డిగారు ఉన్నారు. ఆయన స్ఫూర్తి ఉంది. నేను రాసింది మిత్రులు విశ్లేషించి చెప్పడం నాకు పెద్ద బలం. ఇక రాసింది ఎప్పటికప్పుడు మర్చిపోవడం మా నాన్నగారి నుంచే వచ్చింది. మర్చిపోకపోతే ‘‘పల్లె కన్నీరు పెడుతుందో’’ దగ్గరే ఉండిపోయేవాణ్ని. 
కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం ఉన్న మీరు పౌరాణిక నాటకాలు వేస్తుంటారు? 
చిన్నప్పటి నుంచే నాకు కళల పట్ల ఆసక్తి. ఆర్థిక అంశాలు, చారిత్రక భౌతికవాదం వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఇష్టపడతా. కానీ, మానసిక, తాత్విక చింతనలకైతే కాదు. అయినా పౌరాణిక నాటకాల్లో ఏముంటుంది? కళ... కళాకారులు. మనసుకు ఆనందం కలిగించేది కళ. నాటకాలకోసం చిన్నప్పుడే కర్నూలు, తెనాలి అన్నీ తిరిగిన. నాకు మార్క్సిజం, అంబేద్కరిజం, ఏ సిద్ధాంతమైనా ఒక్కటే. మార్క్సిజాన్ని కాదని నేను బయటికి రాలేను. అలా  అని దానిపేరుతో మిగతా కళావాదాలను వ్యతిరేకించను. కళలోని మజా అనుభవిస్త... మంచిని తీసుకుంట.
‘పల్లె కన్నీరుపెడుతుందో...’ పాట ఎలా పుట్టింది?
అప్పట్లో ఉద్యోగ బదిలీ మీద భువనగిరి వచ్చినాను. ఊరు యాదికొస్తంది. అంతా పరేషాన్‌ అవుతుంది. సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల గ్రామ రూపురేఖలు మారి కొత్త విధానాలు వస్తున్నాయి. అంతా సంక్షోభం. మొత్తం ఊరూరే వలసలబొయ్యింది. అది నా ఆలోచనలో ఉంది. 1996లో శ్రీరాములయ్య సినిమాకోసం రైల్లో పోతున్న. చీరాల దాటాక వేటపాలెం దగ్గర నీళ్లు తళతళ మెరుస్తన్నయ్‌. ఒకప్పుడు మా ఊళ్లోనూ ఇట్లాగే నీళ్లుండె. అవి యాదికొచ్చి నా చేతిల ఉన్న ‘కృష్ణపక్షం’ పుస్తకంలో ఇట్లా రాసుకున్న.. ‘‘ఇట్లా నీరుండెను కదా! నేలవాయి కుంటలో నీళ్లుండె, భద్రయ్య బావి కాడ నీళ్లుండె, మల్లికార్జున బండకాడ నీళ్లుండె’’! మా ఊరు పేరు పెట్టుకుని ఈ నీళ్ల గురించి ‘‘మడుగులన్ని అడుగంటి పోయినవి.. బావులు సావుకు దగ్గరయినవి’ అని మొదట రాసుకున్న. మా దోస్తు జావీదుగాడు ఉండేవాడు. ఎటో పోయిండు. వాణ్ని యాదికి తెచ్చుకుంట ‘‘పరక శాపలకు గేలాలేసే తురక పోరలు యాడికోయిరి లారీలల్లా క్లీనరులయ్యిరా’ అని చరణం రాసుకున్న. అప్పటికి నాకు ఈ ప్రపంచీకరణ, సరళీకరణ అవేవీ తెలియవు. నేను చదివింది లేదు. ఏమీ లేదు. నిజంగా చదవకుండా రాసిన. పాటలో అనుకోకుండా మా జీవితాన్ని రాసిన. అలాగే మా వడ్ల బ్రహ్మయ్యను గుర్తుకు తెచ్చుకుంటూ ‘‘అరుకల పనికి ఆకలి దీరక...’’ రాసిన. ఇలా అందులో ప్రతి చరణం ఒక్కో మనిషి జీవితం. వాళ్లు పంచిన ప్రేమ, అందులోని నిర్మలత్వం అన్నీ అద్భుతాలు. ఎప్పుడైనా వెళ్తే ‘ఎట్టున్నవ్‌ బిడ్డ, అమ్మ బాగుందా, నాయన బాగున్నడా’ ఇలా ప్రేమగా, ఆప్యాయతగా పలకరించేవారు. పంచవర్ష ప్రణాళికలు, గాంధీ, సర్వోదయ ఆదర్శాలు... వీటితో గ్రామాల్లో కొత్తగా వెలుగు వచ్చినప్పుడు 1964లో పుట్టి అలాంటి అనుభూతుల్లో పెరిగిన. కాబట్టి భూస్వామ్య పెత్తనాలు, పీడన తెలియవు నాకు. ఊళ్లో ఆప్యాయతలే తెలుసు. ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ... ప్రతి మనిషి పాత్రతో మొదలయ్యేవి. వాటిని ఎక్కడా చెప్పలేక, గోనె సంచిలో పడేసి కట్టేసినట్లు ఊపిరి మసలని తరుణంలో ప్రతి వాక్యమూ ఏడుస్తూ రాసిన. ఏడుస్తూనే పాడేది. ఇప్పటికీ ఆ పాట పాడుతుంటే గుండెలు మెలేసినట్లయితది. 
మీ పాటల్లో స్థానికత ఎక్కువ ఉంటుంది కదా?  
‘మోర్‌ లోకల్‌ ఈజ్‌ మోర్‌ క్రియేటివ్స్‌’ అనే పెద్దపెద్ద మాటలు రావు కానీ, నేను రాసేవన్నీ మన చుట్టూ ఉన్నవే. రావిశాస్త్రి, కేశవరెడ్డి తదితరులందరూ తాము చూసిన జీవితాల్నే రాశారు. స్థానికత నాకిష్టం. మా ఊళ్లోంచి పారే దుందుభి వాగుండే. దాని పక్కన రాములోరి కొండుండె. ఆ కొండన వెలిసిన వాగు, పొలాల వైవిధ్యం... ప్రకృతిలో ప్రతిదీ నాకు అపురూపంగా కనపడేది. మా ఊరే నాకో డిస్కవరీ ఛానెల్‌. దాని గురించి రాయడం నాకిష్టం. అట్లాగే రాసిన. ఆ తర్వాత పట్నానికి వచ్చిన. ఆధునికత వైపరీత్యాన్ని అనుభవించిన. దాని గురించీ రాసిన. తెలుగు సాహిత్యం నాకిష్టం. దాదాపు ప్రతి కవి గురించీ రాసిన. ఉత్తరాంధ్ర పాటలో చాలామంది పేర్లు ఉంటాయి. ‘పూసిన పున్నమి వెన్నెల’ అంటూ మూడు ప్రాంతాలపైనా రాసిన. గుక్కతిప్పుకోకుండా పాడాల్సిన తెలంగాణ పాటలో తెలుగు సాహిత్యంలోని తెలంగాణ ప్రముఖుల గురించి... ‘తల్లీతెలంగాణమా’లో పోతన నుంచి దాశరథి వరకూ ఉంటది. సందర్భం వచ్చినప్పుడు ఎక్కడో ఓచోట మన కవుల పేర్లు చెబుతుంట. తెలుగు సాహిత్యంలోని ప్రముఖ కవులందరినీ కలిపి ఓ కావ్యంగా రాయాలని ఉంది. విశ్వనాథ మొదలుకుని ప్రతి ఒక్కరి గురించి ఒక వాక్యం/ చరణంలోనైనా ప్రస్తావిస్తూ రాయాలనుకుంటున్నా. వస్తువుతో వాళ్ల సామ్యం అంగీకరించపోయినా శిల్పం రీత్యా వాళ్లంటే ఇష్టం. 
కానీ, నేటితరానికి మన భాషే రావట్లేదు కదా?
కుండ అనే పదానికి మట్టి, దుత్త, గరిగి, పట్టువ... ఒక్క సంయుక్తాక్షరం లేకుండా వెయ్యి రకాల తెలుగు పదాలు ఉన్నయి. ప్లాస్టిక్‌ వచ్చాక ఆ సొగసును మనం మరిచిపోయాం. ప్రపంచీకరణ మొట్టమొదట దాడి చేసిందంటే భాష మీదే. వాళ్ల వస్తువులు అమ్ముకోవాలంటే మనవి ధ్వంసం కావాలె. కాబట్టే చేశారు. భాషను కాపాడుకోవడం అనేది ఆత్మగౌరవ సమస్య. సంపద్వంతంగా ఉండి, స్వాభిమానం, స్వావలంబన ఉన్నవాళ్లు సొంత మాటలే మాట్లాడతరు. ఇప్పుడు చైనా, క్యూబా... వాళ్లకు ఇంగ్లీషు రాదు. క్యూబా చిన్న దేశమే కానీ, అక్కడ గొప్ప వైద్యులున్నరు. వాళ్లందరూ ఎలా ఎదిగారు? భాషను కాపాడుకోవాలంటే వ్యాపార సంస్కృతిని అడ్డుకోవాల. దేశీయ పద్ధతిలో మనదైన స్వావలంబన సాధించాల. మనలోని స్థానికతను కాపాడుకోవాల. అలా అయితే భాష బతుకుద్ది. ఎందుకంటే వాడు పిజ్జాలు, బర్గర్లు అమ్ముకోవాలంటే మన మురమురాలు, గారెలు వంటివి పోవాల. మన పిల్లలకు అవి తెలియనివ్వకూడదు. శ్రీనాథుడు కాశీఖండంలో ప్రస్తావించిన 150 రకాల కూరలు మొత్తం నాశనం కావాల! ఆ విధానాలను ధిక్కరిస్తేనే భాష అభివృద్ధి చెందుతుంది. మనదైన స్థానికతను నిలుపుకునే క్రమంలో భాష బతుకుద్ది. అట్ల బతికిన భాషల్లో తమిళం ఒకటి. ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలోనే భాష సజీవంగా ఉంటది. నీ మీద పెత్తనం చేస్తున్న జీవన విధానాన్ని తిరస్కరించడం ద్వారా భాషను బతికించుకోవచ్చు. సరే, ఆధునికతను అందిపుచ్చుకోకూడదా అంటరు కొంతమంది. నేను ఆధునికతకు వ్యతిరేకిని కాను. ఆధునికత పేరుతో వచ్చిన వైపరీత్యం మనిషిని ఆగం చేస్తుంది. దేన్నయినా మనదైన పద్ధతిలో మనం సృష్టించాల. మన తిండి, అలవాట్లు, మన వేషభాషలు, మన ఖద్దరు కœట్టటం, మన నేత బట్టలు, మన నాగలి, మన పండ్లు, మన పొలాలు... ఇలా ఉండాల. అప్పుడే భాష బతుకుద్ది. భాషా సంరక్షణ ఓ ప్రజా ఉద్యమంగా రావాల. 
తెలుగులో చదువుకు విలువ లేదంటున్నారు?
ఏం మేమంతా తెలుగు మాధ్యమంలో చదవలేదా? అప్పుడూ వైద్యులు, వివిధ రంగాల నిపుణులూ వచ్చారు కదా. మరెందుకు తెలుగు వద్దు? వాళ్ల వస్తువులు అమ్ముకోవాలంటే మన భాష, సంస్కృతి, సంగీతం అన్నింటి మీదా దాడి చేయాలి. ఆ పని తీవ్రంగా జరుగుతోంది. వైపరీత్యం మనం అనుభవిస్తున్నాం... యాసిడ్‌ దాడులు మొదలుకుని అన్నీ! తెలుగులో చదువుకుంటే ఉపాధి ఉండదంటారు. ఎందుకుండదు? క్యూబాలో లేదా? స్పెయిన్‌లో లేదా? అక్కడ వాళ్లు సొంత భాషల్లోనే చదువుకుంటున్నరు కదా. ఒక భాషగా ఇంగ్లీషును నేర్చుకుంటే బాగుంటుంది కానీ, తెలుగు తగ్గించి అంటేనే తప్పు. అట్లాగే ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో వేర్వేరు విధానాలు ఉండకూడదు. ఏక విద్యా విధానం ఉండాల. అట్లయితే ఈ బాధ రాకుండా ఉంటది. 
నవతరం తెలుగు సాహిత్యం ఎలా ఉంటోంది? 
ఒక్కోసారి చదవకుంటే బాగుంటది. ఎందుకంటే పుట్టపర్తి, కృష్ణశాస్త్రిలవి చదివాక కొత్తతరానివి చదవాలంటే... ఏమో! వీళ్లవీ బాగుండవచ్చు. కానీ, ఏది చదవాలన్నా అందులో పరిపూర్ణత ఉండాలి. అజంతా ‘స్వప్నలిపి’ ఒక్కటే రాసిండు. కానీ ఆ ఒక్క పుస్తకానికి మించింది ఇవాళ్టికీ రాలేదు. నగ్నముని ‘కొయ్యగుర్రం’ మించిందీ రాలేదు. కొత్త తరానికి జీవితంలో ఏ సంక్షోభం ఉందని వాళ్లంత గొప్పగా రాస్తరు! అది వాళ్ల తప్పు కాదు. ప్రతిభా వ్యుత్పత్తులు అందరికీ సమానం కావొచ్చు గానీ రచనల్లో వాళ్ల జీవితానుభవాలు, అనుభూతులు ఉండట్లేదు. ఎక్కడైతే నొప్పి, ఒత్తిడి, బాధ ఉంటుందో అక్కడ మంచి రచన వస్తది. రచయిత అన్నవాడు తనకు తాను ఎన్నిసార్లు ఫినిక్స్‌ పక్షిలా దహనమిచ్చు కోవాలో! ఎన్నిసార్లు పరకాయ ప్రవేశం చేయాలో! అమ్మగా మారాలి. అన్నగా మారాలి. వానగా, వంపుగా, అన్ని రకాల దీనుల దుఃఖాన్ని, పసిపిల్లల దుఃఖాన్ని, ఆడపిల్లల దుఃఖాన్ని, కరుణను, జాలిని వశం చేసుకోవాలంటే ఎన్ని మరిచిపోవాలి! హాయిగా ఉండే కొత్త తరానికి అంత బాధ ఎక్కడుంది? ఉపవాసం తెలియదు. ఉప్పిడి తెలియదు. బాధ తెల్వదు.. కష్టం తెల్వదు. ఆధునిక జీవితం వచ్చాక వాళ్లు గొప్ప కవిత్వం ఎలా రాస్తరు? ఏదైనా రాశాక రచయితకి చెమటపట్టాల. నేను రాశాను అనుకోవాల. సినారెను, శ్రీనాథుణ్ని, విశ్వనాథను అందరినీ కలిపి పదాలు పేర్చడమైతే ఆ పని చేయవద్దు. రచన అనేది నీకు తెలియకుండా మైకంలో రాసేయాలి. నీ కవిత్వంతో ప్రేరణ పొంది నిన్ను నువ్వు ధ్వంసం చేసుకోవాల. ఆ చేసుకునే క్రమంలో చలించిపోవాల. చాలా అరాచకంగా ఆలోచించాల. చాలా వెర్రిగా, అభిజాత్యంతో ఉండాల. పొగరు, ధిక్కారం, అమాయకత్వం, నిస్పృహ ఉంటేనే మంచి కవిత్వం రాయగలరు. 
యువరచయితలకు నాలుగు మాటలు...? 
ఎందుకు రాసినా పేరుకోసం రాయొద్దు. ప్రతిష్ఠ కోసం రాయొద్దు. బాధ అయితే, ఆనందమైతే, సంతోషమైతే రాయి. లేకపోతే వద్దు. బాగా చదవాల. ఇతరుల కవిత్వాన్ని, శిల్పాన్ని, భావాన్ని బాగా అధ్యయనం చేయండి. అంకితభావంతో చదవండి. రాయడమే నేను మహాకవిని అని మొదలు పెడితే మాత్రం కాదు. మన పని మనం చేసినం అన్నట్లు ఉండాల. ప్రపంచం తీసుకుంటుందో లేదో దాని ఖర్మ. కొంత నిర్వికార స్థితిని సాధిస్తే మంచిది. అది అన్నంత సులువు కాదు. నేను మాట్లాడుతున్న కదా... చాలా బాగా మాట్లాడుతున్ననని లోపల ఉంటది. దాన్ని కూడా అధిగమించే స్థితి రావాల. అట్లుంటే ప్రపంచంలో మనమెంత? 
స్వరాష్ట్రంలో తెలంగాణ కవులు, రచయితలు పోషించబోతున్న పాత్ర?
రష్యన్‌ విప్లవంలో కవులు ఉద్యమించినట్లు తెలంగాణ ఉద్యమంలో మేం పాల్గొన్నాం. అక్కడికంటే మించిన త్యాగాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని రచయితలు కొంత సమయమిస్తారు. దీన్ని సంధికాలమంటారు. కొత్త మార్పులు ఏమొస్తాయో చూస్తున్నరు. ఇంతకాలం గాయపడినందుకు తెలంగాణ కొత్తగా మారాల. ఈలోపు భ్రమలొచ్చి, మాకు కూడా పదవులు గిదవులు ఇచ్చారనుకో, రచయితలుగా చచ్చిపోతాం. పదవుల సెలబ్రెటీలుగా మిగిలిపోతాం. 


పాలమూరు ‘అల సెంద్రవంక’
కల్లాకపటం తెలియని పల్లె మనిషి భోళాతనం... వాన చినుకును సైతం అబ్బురంగా చూసే పసివాడి అమాయకత్వం...    ఉద్యమకారుడి నిరసన స్వరం... విప్లవకారుడి ధిక్కారం... బైరాగి వైరాగ్యం... అన్నీ కలిస్తే గోరటి వెంకన్న! పాటనే శ్వాసగా మార్చుకున్న ఆయన స్వస్థలం పాలమూరు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం. తల్లిదండ్రులు ఈరమ్మ, నర్సింహ్మ. రఘుపతిపేట, కల్వకుర్తి, జడ్చర్లలో చదువుకున్నారు. హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాలలో ఎమ్మే తెలుగు రెండో ఏడాదిలో ఉండగా సహకార శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా ఎమ్మే తెలుగు పట్టా అందుకున్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూలు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌. ప్రపంచీకరణతో తెలుగు పల్లెలో జరిగిన విధ్వంసాన్ని చిత్రిస్తూ ఆయన పాడిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ ఓ సంచలనం. ఆ తర్వాత కూడా ఎన్నో పాటలు... అన్నీ జనంతో మమేకమైనవే. పల్లె నుంచి పాలస్తీనా దాకా ప్రతి అంశం మీదా ఆయన పాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటల సంకలనాలతో ‘ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక’ పుస్తకాలు వెలువడ్డాయి. త్వరలో మరో నాలుగు పొత్తాలు రాబోతున్నాయి. 

గోరటి వెంకన్న, 94413 66515


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి